మళ్లీ సరికొత్తగా ‘క్వాడ్‌’

22 Oct, 2020 00:56 IST|Sakshi

పదమూడేళ్లనాటి జపాన్‌ ప్రతిపాదన అనేకానేక మలుపులు తిరిగి చివరకు సాకారం కాబోతోంది. చతుర్భుజ కూటమి (క్వాడ్‌) దేశాల ఆధ్వర్యంలో బంగాళాఖాతంలోని మలబార్‌ సాగర జలాల్లో వచ్చే నెలలో నిర్వహించబోయే నావికా దళ విన్యాసాలకు మన దేశం ఆస్ట్రేలియాను సోమవారం ఆహ్వానించింది. చైనాకు సహజంగానే ఇది ఆగ్రహం కలిగించే చర్య. క్వాడ్‌ పురుటి నొప్పులు అన్నీ ఇన్నీ కాదు. 2007లో మొదట ఈ ప్రతిపాదన మొగ్గతొడిగి భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు సమావేశమైనప్పుడే చైనా ఉరిమింది. తనకు వ్యతిరేకంగానే కూటమి కడుతున్నారంటూ నాలుగు దేశాలకూ దౌత్యపరమైన నిరసనలు తెలియజేసింది. అయితే చైనా భయాందోళనలు వాస్తవం కాదని, కేవలం పరస్పరం ప్రయోజనం వున్న అంశాలపై పనిచేయడమే కూటమి ఆంతర్యమని జపాన్‌ చెప్పింది. మన దేశం కూడా ఆ మాటే అంది. జపాన్‌తో తమకున్న వాణిజ్య ఒప్పందానికి అనుబంధంగా ఈ భద్రతా ఒప్పందం అవసరం గనుకే ఇందులో చేరామని తెలిపింది.

కూటమి ఆధ్వర్యంలో టోక్యోలో 2007 మే నెలలో తొలి నావికాదళ విన్యాసాలు జరిగాయి. దానికి కొనసా గింపుగా బంగాళాఖాతంలోనూ విన్యాసాలు నిర్వహించారు. తీరా జపాన్‌లో షింజో అబే అధికారం కోల్పోయి ఆయన స్థానంలో టారో అసో వచ్చాక క్వాడ్‌లో కొనసాగదల్చుకోలేదని ప్రకటించారు. అటు ఆస్ట్రేలియాలో కూడా 2008లో జాన్‌ హోవార్డ్‌ నిష్క్రమించి కెవిన్‌ రుడ్‌ రావడంతో ఆ దేశం కూడా క్వాడ్‌కు మొహం చాటేసింది. అదే ఏడాది అప్పటి చైనా అధినేతలు మన దేశంలో పర్యటించబోతుండగా నాటి మన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా ‘చైనాను కట్టడి చేసే ఎలాంటి కూట మిలోనూ భారత్‌ భాగస్వామ్యం కాబోద’ని ప్రకటించారు. అలా ముగిసిన ముచ్చట కాస్తా అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్‌ ట్రంప్‌ వచ్చాక మళ్లీ కదలబారింది. ఆయన మళ్లీ అందరితో మాట్లాడి ఒప్పిం చాక 2017లో క్వాడ్‌ చర్చలు మొదలయ్యాయి. అప్పటికి దక్షిణ చైనా సముద్ర జలాల్లో చైనా కార్య కలాపాలు పెరిగాయి. అక్కడ పగడాల దిబ్బలు, ఇసుకమేటలు తమవేనని చైనా ప్రకటించి, స్ప్రాట్లీ దీవుల చుట్టూ ఏడు కృత్రిమ దీవుల నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇది జపాన్‌ను చికాకు పర్చడం, ఆ దేశానికి అమెరికా అండగా నిలవడంతో క్వాడ్‌ మళ్లీ ప్రాణం పోసుకుంది. 

అయితే మునుపటిలా కాదు... క్వాడ్‌ ఈసారి గట్టిగా పనిచేయదల్చుకున్నట్టే కనబడుతోంది. ఎప్పుడూ ఏదో ఒక శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా తప్ప ప్రత్యేకించి కూటమి కోసమే సమా వేశాలు జరిగిన చరిత్ర క్వాడ్‌కు లేదు. కలిసేది నాలుగు దేశాలైనా ‘ఆసియాన్‌’ సమావేశాల సమ యాల్లో లేదా ఐక్యరాజ్యసమితి సమావేశాల సమయాల్లో మాత్రమే నేతలు కలిసేవారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా జరిగింది. గత నెలాఖరులో క్వాడ్‌ దేశాల సీనియర్‌ అధికారుల సమావేశం జరి గింది.  ఆ వెనకే ఈ నెల మొదట్లో విదేశాంగమంత్రులు సమావేశమయ్యారు. మలబార్‌ విన్యాసాలపై ఆ సమావేశంలో అంగీకారం కూడా కుదిరింది. కానీ ఆస్ట్రేలియా అందులో పాల్గొనడం విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడింది.  కానీ వారం రోజుల అనంతరం చివరకు ఆస్ట్రేలియాను ఆహ్వానిం చడానికే మన దేశం నిర్ణయించింది.

చైనాకు ఆగ్రహం కలిగినంత మాత్రాన క్వాడ్‌ నాటో తరహాలో ఇప్పటికప్పుడు సైనిక కూటమిగా రూపొందుతుందని భావించనవసరం లేదు. అటు అధికారుల సమావేశంలోనూ, ఇటు విదేశాంగమంత్రుల సమావేశంలోనూ ప్రధానంగా చర్చకొచ్చింది కరోనా అనంతర పరిస్థితుల గురించే. అలాగే ఇకపై ప్రపంచ పంపిణీ వ్యవస్థ తీరుతెన్నులెలా వుండాలో, సభ్య దేశాలు సమష్టిగా కదిలి ఆర్థికంగా ఎదగడానికి చేయాల్సిందేమిటో కూడా చర్చించారు. మరో మూడు దేశాలు– న్యూజిలాండ్, దక్షిణ కొరియా, వియత్నాంలు కూడా పాలుపంచుకున్నాయి. కనుక క్వాడ్‌ త్వరలో మరింత విస్తరించడం ఖాయం. అయితే ‘అమెరికా ఫస్ట్‌’ పేరిట మిత్ర దేశాలపై కూడా రకరకాల ఆంక్షలు విధిస్తూ స్వీయ ప్రయోజనాలు తప్ప మరేమీ పట్టని ట్రంప్‌ను నమ్మి ఇందులో దిగడం ఎంతవరకూ సమంజసమన్న సంశయం ఈ దేశాలకు లేకపోలేదు.

ఆసియాన్‌తో మన దేశానికి సంబంధబాంధవ్యాలు ఏర్పడి అర్థ శతాబ్ది దాటుతోంది. చారిత్రకంగా ఆ దేశాలు అమెరి కాతో సన్నిహితంగా మెలిగేవి. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అందుకే వాటితో మన సంబంధాలు అంతంతమాత్రం. ఇప్పుడు ఆ బంధాలు బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియాన్‌ మరిన్ని దేశాలను కలుపుకొని విస్తరించాలనుకుంటోంది. ఇదే సమయంలో తనకు సమాంతరంగా ఈ ప్రాంతంలో క్వాడ్‌లాంటి మరో కూటమి మొగ్గతొడుగుతుండటం, అది సైతం విస్తరించాలనుకోవటం ఆసి యాన్‌కు సమస్యే. ఈ వైరుధ్యాన్ని మన దేశం ఎలా పరిష్కరించుకుంటుందో చూడాలి. 

లద్దాఖ్‌లో చైనాతో మనకు ఏర్పడిన లడాయి, ఆ దేశం అనుసరిస్తున్న మొండివైఖరి మలబార్‌ విన్యాసాలకు ఆస్ట్రేలియాను ఆహ్వానించాలన్న మన నిర్ణయానికి కారణం కావొచ్చు. కానీ క్వాడ్‌ను పరస్పర ఆర్థిక, వాణిజ్య, భద్రతాపరమైన ప్రయోజనాలకు అనువుగా రూపొందించాలి తప్ప అమె రికా కనుసన్నల్లో నడిచే మరో నాటో కూటమిగా దాన్ని మార్చనీయకూడదు. నాటో కూటమివల్ల యూరప్‌ కంటే అమెరికాయే ఎక్కువగా లాభపడింది. ప్రపంచ పోలీస్‌గా వ్యవహరిస్తూ, సమస్యా త్మక ప్రాంతాలకు ఆ కూటమి సైన్యాన్ని తరలిస్తూ ప్రపంచంపై తన పట్టు నిలుపుకోవడంలో అది విజయం సాధించింది. అయితే సైనిక కూటమిగా మారకపోవడం చైనా చర్యలపై కూడా ఆధార పడివుంటుంది. వుహాన్‌ శిఖరాగ్ర సదస్సు అనంతరం క్వాడ్‌ విషయంలో మన దేశం ఆచితూచి వ్యవహరించింది. చైనాకు ఇబ్బంది కలిగించవద్దన్నదే దాని వెనకున్న ఉద్దేశం. కానీ అంతక్రితంనుంచీ దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చూపిస్తున్న దూకుడునే గల్వాన్‌ లోయలో కూడా ప్రదర్శించి తాజా నిర్ణయానికి చైనా ప్రధాన కారణమైంది. ఏదేమైనా క్వాడ్‌ మళ్లీ ప్రాణం పోసుకోవడం ప్రపంచంలో రానున్న కాలంలో సరికొత్త పరిణామాలకు దారితీస్తుందనటంలో సందేహం లేదు. 

మరిన్ని వార్తలు