అమృతోత్సవ భారతం

15 Aug, 2022 00:06 IST|Sakshi

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటికి నిండా డెబ్బయి ఐదేళ్లు. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర అమృతోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రజల్లో దేశభక్తి ప్రజ్వరిల్ల చేయడానికి కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవానికి కొద్ది నెలల ముందుగానే ‘హర్‌ ఘర్‌ తిరంగా’– అంటే, ‘ఇంటింటా మువ్వన్నెలు’ నినాదాన్ని హోరెత్తించడం ప్రారంభించింది. ఎలాగైతేనేం, దేశమంతటా ఊరూవాడా మువ్వన్నెల రెపరెపలతో మెరిసిపోతున్నాయి. డెబ్బయి ఐదేళ్ల కిందట సాధించుకున్న స్వాతంత్య్రం మనకు తేలికగా దక్కలేదు. దశాబ్దాల తరబడి సాగిన పోరాటంలో ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితమే మనకు దక్కిన ఈ స్వాతంత్య్రం. 

ప్రజాపక్షపాతుల బలిదానాల ఫలితంగా దక్కిన స్వాతంత్య్రాన్ని మనం ఎంత పదిలంగా కాపాడుకోవాలి? కష్టనష్టాలకు ఎదురీది, నెత్తురు చిందించి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను అట్టడుగు ప్రజానీకానికి అందేలా చేయడానికి ఎంతటి దీక్షాదక్షతలను చాటుకోవాలి? గడచిన డెబ్బయి ఐదేళ్లలో దేశంలోని సామాన్యుల కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని చెప్పగల పరిస్థితులు లేవు. అలాగని ఇన్నేళ్లలో సాధించినది శూన్యం అని చెప్పడానికీ లేదు. అయితే, మనం సాధించిన పురోగతి కొంతేనని, సాధించాల్సినది ఎంతోనని నిస్సందేహంగా చెప్పవచ్చు.

దేశాన్ని అట్టుడికించిన స్వాతంత్య్ర సమరంలో ఎందరెందరో కవులు, రచయితలు ప్రజల పక్షాన నిలిచారు. బ్రిటిష్‌ దుష్పరిపాలనను ఎదిరించారు. పోలీసుల లాఠీదెబ్బలు తిన్నారు. జైళ్లకు వెళ్లారు. శిక్షలు అనుభవించారు. దుర్భర దారిద్య్ర బాధలను అనుభవించారు. స్వాతంత్య్రం వచ్చాక స్వాతంత్య్రోద్యమంలో త్యాగాలు చేసిన రచయితలు, కవుల్లో చాలామందికి దక్కాల్సినంత గౌరవం దక్కకపోవడమే చారిత్రక విషాదం. ఇందుకు కొందరు తెలుగు ప్రముఖుల ఉదాహరణలనే చెప్పుకుందాం.

స్వాతంత్య్ర సమరం ఉద్ధృతంగా సాగుతున్న కాలంలో ‘మాకొద్దీ తెల్లదొరతనము– దేవ– మాకొద్దీ తెల్లదొరతనము’ అంటూ గరిమెళ్ల సత్యనారాయణ రాసిన ధిక్కారగీతం తెలుగునాట నలుచెరగులా ఊరూవాడా మార్మోగింది. జనంలోకి చొచ్చుకుపోయిన ఆ పాట తెల్లదొరలకు వెన్నులో వణుకు పుట్టించింది. అప్పటి బ్రిటిష్‌ కలెక్టర్‌ బ్రేకన్, గరిమెళ్లను పిలిపించుకుని, ఆ పాటను ఆయన నోటనే విన్నాడు. భాష అర్థం కాకపోయినా, పాటలోని తీవ్రతను గ్రహించి, ఆయనకు ఏడాది జైలుశిక్ష విధించాడు. స్వాతంత్య్రం వచ్చాక మన పాలకులు ఆయనను తగినరీతిలో గౌరవించిన పాపాన పోలేదు. దుర్భర దారిద్య్రంతోనే ఆయన కన్నుమూశారు. ఆయన మరణానంతరం మన పాలకులు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆయన పట్ల భక్తిప్రపత్తులను చాటుకున్నారు అంతే!

గరిమెళ్లకు సమకాలికుడైన తొలితరం దళితకవి కుసుమ ధర్మన్న అదేకాలంలో ‘మాకొద్దీ నల్లదొరతనము’ పాట రాశారు. అప్పట్లో కాంగ్రెస్‌లో కొనసాగుతూనే ఆయన ఈ పాట రాశారంటే, స్వాతంత్య్రోద్యమ కాలంలోనే కొందరు ఉద్యమనేతల అవినీతి, ద్వంద్వప్రవృత్తి ఎలా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. కుసుమ ధర్మన్న స్వాతంత్య్రానికి వ్యతిరేకి కాదు గాని, అణగారిన దళిత వర్గాల అభ్యున్నతిపై నిబద్ధత, చిత్తశుద్ధి లేని నాయకుల చేతికి అధికారం దక్కితే జరగబోయే అనర్థాలను ముందుగానే గుర్తించిన దార్శనికుడు ఆయన. స్వాతంత్య్రం వచ్చాక కుసుమ ధర్మన్నకు కూడా ఎలాంటి గౌరవమూ దక్కలేదు. పరాయి పాలనను తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన తెలుగు కవులలో చిలకమర్తి లక్ష్మీనరసింహం అగ్రగణ్యుడు.

ఆయన ‘భరతఖండంబు చక్కని పాడియావు/ హిందువులు లేగదూడలై యేడ్చుచుండ/ తెల్లవారను గడుసరి గొల్లవారు/ పితుకుచున్నారు మూతులు బిగియగట్టి’ పద్యాన్ని రాశారు. ఇక్కడి సంపదను బ్రిటిష్‌వారు దౌర్జన్యంగా కొల్లగొట్టుకుపోతుండటంపై ఆయన సంధించిన పద్యాస్త్రం అప్పట్లో విపరీతంగా ప్రభావం చూపింది. ఇక సహాయ నిరాకరణోద్యమ సమయంలో చీరాల–పేరాల ఉద్యమానికి నేతృత్వం వహించిన ‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆనాడు రగిలించిన స్ఫూర్తి తక్కువేమీ కాదు. సహజ చమత్కారి అయిన దుగ్గిరాల బ్రిటిష్‌ పాలనను మాత్రమే కాదు, నాటి కాంగ్రెస్‌ నేతల సంకుచిత స్వభావాలను ఎండగడుతూ చాటువులు రాయగలిగిన సాహసి. 

సహాయ నిరాకరణోద్యమంలో జైలుపాలై, విడుదలయ్యాక మద్రాసు చేరుకుని అక్కడ ఇచ్చిన ఉపన్యాసంలో ‘న యాచే రిఫారం– నవా స్టీలు ఫ్రేముం/ న కౌన్సిల్‌ న తు ప్రీవి కౌన్సిల్‌ పదం వా/ స్వరాజ్యార్తి హన్తాంగ్లరాజ్యే నియన్తా/ ఫరంగీ ఫిరంగీ దృగంగీ కరోతు’ అంటూ నాటి పరిస్థితులపై చమత్కారాస్త్రాన్ని సంధించగల చతురత దుగ్గిరాలకే చెల్లింది. చిలకమర్తి, దుగ్గిరాల– ఇద్దరూ స్వాతంత్య్రానికి ముందే కన్నుమూశారు. స్వాతంత్య్రానంతర ప్రభుత్వాలు వారికి సముచిత గౌరవం కల్పించే చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. ఈ సందర్భంగా గరిమెళ్ల మాటలను గుర్తు చేసుకోవాలి.

‘కొందరు త్యాగము చేయవలె, కొందరు దారిద్య్రముతో నశించవలె, పూర్తిగా నాశనమైనగాని దేశమునకు స్వరాజ్యము రాదు’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరంలో త్యాగాలు చేసిన ఇలాంటి కవులు, రచయితలు ఎందరో ఉన్నారు. స్వాతంత్య్ర సమరంలో స్ఫూర్తి రగిలించిన కవులు, రచయితల సాహిత్యాన్ని భావితరాలకు అందించేందుకు ఇప్పటికైనా నడుం బిగిస్తే బాగుంటుంది. స్వాతంత్య్ర పోరాటంలో తమ వంతు పాత్ర పోషించినా, గుర్తింపు దక్కించుకోలేకపోయిన కవులు, రచయితల కృషిని వెలుగులోకి తెచ్చేందుకు విశ్వవిద్యాలయాలు, అకాడమీలు ఇప్పటికైనా చిత్తశుద్ధితో కృషి ప్రారంభించినట్లయితే, స్వాతంత్య్ర అమృతోత్సవాలకు సార్థకత దక్కినట్లవుతుంది. 

మరిన్ని వార్తలు