తెలంగాణ విమోచన దినోత్సవం.. వద్దా ఉత్సవం?

17 Sep, 2021 12:37 IST|Sakshi

సందర్భం

‘సెప్టెంబర్‌ 17’ని ఎలా చూడాలి 

‘మా తెలంగాణలో మేము కనీసం విమోచనో త్సవాలు జరుపుకోవడా నికి కూడా స్వేచ్ఛ లేదా?మేం ఇంకెంత కాలం ఆంధ్రోళ్ళ పాలనలో ఉండాలి? మేమేమైనా బానిసలమా?’ ఇలాంటి మాటలెన్నో మాట్లాడింది ఎవరో కాదు, తెలంగాణ ఉద్యమ నాయకునిగా చెప్పుకునే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. తెలంగాణ వచ్చి ఏడేళ్ళు గడుస్తున్నా– నిధులు, నీళ్లు,  నియామకాలు కాదు కదా... కనీసం స్వేచ్ఛగా తెలంగాణ విమోచన దినోత్సవా లకు కూడా వీలు లేని దుస్థితి దాపురించింది.

ప్రత్యేక తెలంగాణలో అధికారికంగా విమోచ నోత్సవాలు జరపలేక పోవడానికి కారణమేంటి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది కాబట్టి, ఇక విమోచనోత్సవాల అవసరమేంటన్నది కేసీఆర్‌ ఉవాచ. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది కదా, మరి పంద్రాగస్టు వేడుకలు ప్రతి ఏటా జరుపుకోవట్లేదా? మజ్లిస్‌ పార్టీకి తెలంగాణ విమోచనోత్సవాలు జరపడం ఇష్టం లేదు కాబట్టి అధికారంలో ఉన్నా జరుపలేని దుస్థితి మాది. కారు మాత్రమే మాది, స్టీరింగ్‌ ఒవైసీది’అని కేసీఆర్‌ చెప్పివుంటే కొద్దిగా గౌరవం అయినా ఉండేదేమో! 

ఉద్యమ సమయంలో కేసీఆర్‌ చెప్పినవన్నీ వాస్తవాలని నమ్మి, రెండుసార్లు అధికారం కట్ట బెట్టిన తర్వాత కవులు పాడుకుంటున్నట్లుగా ‘ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడబ్బ సొమ్మ యిందిరో తెలంగాణ’ అన్నదానికి వచ్చే సమాధానం: ఒక కుటుంబం పాలైంది. సమైక్య పాలనలో లాగే రైతుల, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు. పైగా బోనస్‌గా ఆర్టీసీ కార్మికుల, ప్రైవేట్‌ ఉపాధ్యాయుల ఆత్మహత్యలు పెరిగాయి. సమైక్య పాలనలో కనీసం నిరసన తెలిపే స్వేచ్ఛ అయినా ఉండేది. ఏ ధర్నా చౌక్‌ కేంద్రంగా తెలంగాణ కోసం ఉద్యమాలు జరిగాయో, ఆ ధర్నాచౌక్‌నే ఎత్తేస్తే కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకోవాల్సిన దుస్థితి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రజలది.

తెలంగాణ విమోచనోత్సవాలు జరపాలని ఒక్క బీజేపీ తప్ప, కాంగ్రెస్‌ సహా ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి గొప్పగా చెప్పే కమ్యూనిస్టులు సైతం చేస్తున్నది ఏమీలేదు. బహుశా తెలంగాణ ప్రజలకు వారు చేసినంతగా అన్యాయం ఇంకెవరూ చేయలేదన్న సత్యాన్ని గ్రహించి కాబోలు. దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వస్తే, తెలంగాణ (హైదరాబాద్‌ సంస్థాన్‌) ప్రజలకు మాత్రం 1948 సెప్టెంబర్‌ 17 దాకా రాకపోడానికి నిరంకుశ నిజాం, రజా కార్లతోపాటు కమ్యూనిస్టులు కూడా కారణం. దేశానికి స్వాతంత్య్రం రానున్న తరుణంలో అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన ఆదేశాలతో ఒక్కసారిగా భారత కమ్యూనిస్టు పార్టీ తన వైఖరిని మార్చుకుంది. 

అప్పటిదాకా కేవలం నిజాం, రజా కార్ల నుంచి బాధలు అనుభవించిన హైదరాబాద్‌ రాష్ట్ర ప్రజలకు కమ్యూనిస్టుల నుంచి మరిన్ని కష్టాలు పెరిగాయి. హైదరాబాద్‌ను భారతదేశంలో కలిపేసుకునే ప్రయత్నాలను వ్యతిరేకించాలి; భారత సైన్యాలు హైదరాబాద్‌లో అడుగు పెట్ట కుండా అడ్డుకోవాలి అంటూ నాటి ఆంధ్ర కమ్యూనిస్టు నేతలైన పుచ్చలపల్లి సుందరయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు తదితరులు ఒక ప్రకటన విడుదల చేయడంతోపాటు, స్వతంత్ర హైదరాబాద్‌ ఏర్పడాలనే నినాదం కూడా ఇచ్చారు. వీరి అండతో రజాకార్లకు వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. హైదరాబాద్‌ సంస్థాన సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు నిజాం ప్రయత్నించాడు. 

కమ్యూనిస్టు పార్టీ వైఖరిని అప్పటి మరో కమ్యూనిస్టు ముఖ్య నాయకుడు రావి నారాయణ రెడ్డి తీవ్రంగా నిర సించారు. ‘ఆంధ్ర నాయకత్వం బాధ్యులుగా ఉన్న అన్ని వేళల్లోకల్లా పోలీసు చర్య తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం, భారత మిలిటరీకి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించాలనేది పెద్ద నేరం. ఈ నేరం హిమాలయ పర్వతం లాంటిదని అంటే తప్పేమీ కాదు’ అని తన ‘తెలంగాణ నగ్న స్వరూపం’ అన్న డాక్యుమెంట్‌లో నిర్మొహమా టంగా స్పష్టం చేశారు.

ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ దృఢచిత్తంతో వ్యవహరించి సైనిక చర్య చేపట్టి ఉండకపోతే ఇటీవటి కాలందాకా కశ్మీర్‌ కొరకరాని కొయ్యగా తయారైనట్లుగానే, హైదరాబాద్‌ సంస్థానం కూడా మారేదేమో! తెలంగాణ విమోచనోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్‌ చేస్తే అదేదో మైనారిటీలకు వ్యతిరేకమైనదిగా, మతతత్వంగా చిత్రీకరించే ప్రయత్నం టీఆర్‌ఎస్‌ చేయడం గర్హనీయం. ఇదే టీఆర్‌ఎస్‌ ఉద్యమ సమయంలో తెలంగాణ విమో చనోత్సవాలు జరపాలని డిమాండ్‌ చేస్తే అడ్డురాని మతతత్వం బీజేపీ డిమాండ్‌ చేస్తే ఎలా అవు తుందో తెలియజేయాలి. మజ్లిస్‌ పార్టీని సంతృప్తి పరచడం పక్కన పెట్టాలి.
-వ్యాసకర్త బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్‌ ఎంపీ
 

మరిన్ని వార్తలు