సరైన నిర్ణయం

6 Aug, 2020 03:49 IST|Sakshi

మరణమే విషాదకరమైనదనుకుంటే అది వివాదస్పదమైనప్పుడు మరింత బాధిస్తుంది.  దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మొన్న జూన్‌ 14న చనిపోయాక జరిగింది అదే. ఈ ఉదంతంపై అనేకులు కోరుతున్నట్టు సీబీఐ దర్యాప్తు చేయిస్తామని బుధవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది గనుక అటువంటి వారందరికీ ఉపశమనం దొరుకుతుందని భావించాలి. సుశాంత్‌ సింగ్‌ది ఆత్మహత్య కాదని, అది హత్యని కుటుంబసభ్యులు, మరికొందరు అంటుంటే... బాలీవుడ్‌ను శాసిస్తున్న కొందరు ప్రముఖులు అతన్ని అవమానించి, అతనికి అన్నివిధాలా అవరోధాలు సృష్టించి ఆత్మ హత్యకు ప్రేరేపించారని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబసభ్యులు కోరుకుంటున్నట్టు సీబీఐ దర్యాప్తు జరపడమే సరైన నిర్ణయం అనడంలో సందేహం లేదు. చలనచిత్ర పరిశ్రమతో సంబంధం లేని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి బాలీ వుడ్‌లో నిలదొక్కుకోవడం, విజయం సాధించడం మాటలు కాదు. ప్రతిభాపాటవాలు పుష్కలంగా వుంటే తప్ప ఎంతమాత్రం సాధ్యం కాదు. సినీ పరిశ్రమ కోట్లాది రూపాయల పెట్టుబడితో ముడిపడి వున్న రంగం. దాంతోపాటు బంధుప్రీతి కూడా అక్కడ అధికమే. అలాంటిచోట సుశాంత్‌ తనేమిటో నిరూపించుకున్నాడు. అందరితో శభాష్‌ అనిపించుకున్నాడు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారూ, భిన్న సందర్భాల్లో ఆయన్ను దగ్గరగా చూసినవారూ ఆయన వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైన దని, మానవీయత గుండె నిండా నింపుకున్న వ్యక్తని చెబుతున్నారు. అటువంటి వ్యక్తి తన మరణ కారణం గురించి క్లుప్తంగానైనా చెప్పకుండా నిష్క్రమించాడంటే వారెవరూ సమాధానపడలేక పోతున్నారు.

సుశాంత్‌ మరణంపై ఇన్నిరోజులుగా సాగిన వివాదం అవాంఛనీయమైనది. కుటుంబసభ్యులు, సన్నిహితులు సందేహాలు వ్యక్తం చేసిన వెంటనే వారికి సంతృప్తికలిగే విధంగా తగిన దర్యాప్తునకు ఆదేశించివుంటే ఈ వివాదం ఇలా ముదిరేది కాదు. సుశాంత్‌ది బలవన్మరణమైతే అందుకు కారకు లెవరో నిర్ధారించి, వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది హత్యే అయితే దుండగుల్ని సాధ్యమైనంత త్వరగా పట్టుకుని తగిన శిక్ష పడేలా చూడాలని ఆశి స్తారు. ఆత్మహత్య లేదా అసహజమైన మరణం జరిగినప్పుడు సీఆర్‌పీసీ సెక్షన్‌ 174 కింద ఆకస్మిక మరణంగా నమోదు చేస్తారు. ఆత్మహత్యగా కనబడితే ఎలాంటి లేఖ అయినా వదిలివెళ్లారా లేదా అనేది చూస్తారు. మరణించినవారి సన్నిహితుల్ని, సమీప ప్రాంతాల వారిని పోలీసులు ప్రశ్నిస్తారు. వారు చెప్పిన వివరాలను నమోదు చేస్తారు. పోస్టుమార్టం జరిపించి మృతుల శరీరంపై గాయాలే మైనా వున్నాయా అన్నది పరిశీలిస్తారు. వుంటే ఏ రకమైన వస్తువు లేదా ఆయుధంతో దాడి జరిగి వుంటుందో అంచనాకొస్తారు.

మరణించినవారు ఏ లేఖ వదిలి వెళ్లకపోతే, సన్నిహితులు కూడా ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయకపోతే ఏసీపీ స్థాయి అధికారి ఆ దశలోనే కేసును మూసి వేస్తారు. హత్యగా భావిస్తే ఐపీసీ 302కింద, ఎవరైనా ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలొస్తే ఐపీసీ 306కింద కేసు నమోదు చేస్తారు. ముంబైలో సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి నగరానికి వచ్చిన ఆయన కుటుంబసభ్యులు తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయలేదని ముంబై పోలీసులు చెబుతున్నారు. అయితే బిహార్‌ పోలీసుల కథనం మరోలా వుంది. సుశాంత్‌ సన్నిహితురాలు రియా చక్రవర్తి ఈ ఆత్మహత్యకు పురిగొల్పిందని కుటుం బసభ్యులు ఆరోపించారని వారు చెబుతున్నారు. అందువల్లే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామంటున్నారు. 2013నాటి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం వారు ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ నమోదు చేసి ఉదంతం జరిగిన పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలి. వారలా చేయకుండా దర్యాప్తు కోసం ముంబై వెళ్లారు. అయితే వారిపట్ల ముంబై పోలీసుల ప్రవర్తన కూడా సరిగా లేదు. ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నారని, ఎవరినో కాపాడటమే ధ్యేయంగా అడుగులేస్తున్నారని వస్తున్న ఆరోపణల్ని బలపరిచే రీతిలో వారు అతిగా ప్రవర్తించారు. దర్యాప్తు కోసం వచ్చిన బిహార్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధి కారిని 14 రోజులు క్వారంటైన్‌లో వుండాలని శాసించి దిగ్భ్రాంతిపరిచారు. అంతేకాదు... పోస్టు మార్టం నివేదిక అడిగినా ఇవ్వలేదు.

ఏమైతేనేం మొత్తానికి సుశాంత్‌ మరణంపై సీబీఐ దర్యాప్తు త్వరలో మొదలవుతుంది. అయితే ఈ ఉదంతంలో భిన్న వర్గాలు స్పందించిన తీరు గురించి మాట్లాడుకోవాలి. కొన్ని చానెళ్లు ఈ ఉదం తంపై క్యాంపెయిన్‌ నడిపాయి. కొందర్ని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పులిచ్చాయి. ఇతరులు సరేసరి. సుశాంత్‌ సన్నిహితురాలు రియా చక్రవర్తిపై ఎవరికైనా అనుమానాలుండటం తప్పేమీ కాదు. కానీ ఆమె దోషిగా నిర్ధారణ అయినట్టే భావించి ఆమెను, ఆమె స్వరాష్ట్రమైన బెంగాల్‌ మహిళలను దూషిం చడం... నిజమో కాదో తేలకుండానే కోట్లాది రూపాయలు రియా కైంకర్యం చేసిందని ఆరోపించడం అనాగరికం.  ముంబైలో మానవత చచ్చిపోయిందని, ఇది సురక్షితమైన ప్రాంతం కాదని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ భార్య ట్వీట్‌ చేయడం కూడా పెను వివాదం రేపింది. ముంబై పోలీసుల దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఆగి, వారు తేల్చేదేమిటో చూశాక మాట్లాడితే వేరుగా వుండేది. బిహార్‌కు చెందిన అన్ని పార్టీలూ దీన్ని బిహారీల ఆత్మగౌరవానికి తగిలిన దెబ్బగా చూశాయి. అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి గనుకే ఈ పార్టీలన్నీ ఈ స్థాయిలో స్పందించాయని, ఫిర్యాదు చేయా లంటూ సుశాంత్‌ కుటుంబసభ్యులపైనా ఒత్తిళ్లు వచ్చాయని కొందరి ఆరోపణ. ఏదేమైనా నిరాధా రమైన ఆరోపణలకూ, అనవసర నిందలకూ ప్రభావితం కాకుండా సీబీఐ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయాలి. కారకులెవరో తేలితే వారెంతటివారైనా కఠిన శిక్ష పడేలా చూడాలి.

మరిన్ని వార్తలు