ఖేల్‌ ఖతం!

28 Aug, 2022 00:54 IST|Sakshi

ఆగస్టు 6, న్యూఢిల్లీ
సీనియర్‌ మోస్ట్‌ రాజకీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధానికి చేరుకున్నారు. ఆజాదీ అమృత్‌ మహోత్సవాల నిర్వహణ కోసం గతంలో కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ కమిటీ వేసింది. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రంగాల ప్రముఖులతోపాటు సీనియర్‌ రాజకీయ నాయకులు కూడా ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆ కోటాలో చంద్రబాబు కూడా ఉన్నారు. ఆరోజు సమావేశం.  ప్రధానమంత్రి తప్పనిసరిగా వస్తారు. గడిచిన కొంతకాలంగా ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్‌ కోసం చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేశారు. కుదర్లేదు. అమిత్‌ షాతో భేటీకోసం కూడా తహతహలాడారు. అదీ కుదర్లేదు.

ఎన్నాళ్లో వేచిన హృదయం ఎగసి ఎగసి పడుతుంటే... అన్నట్లుగా ప్రధానమంత్రికి ఎదురుపడే క్షణాలకోసం బాబు ఎదురుచూస్తున్నారు. అతిథులందర్నీ ఒక్కొక్కర్నీ పలకరిస్తూ వస్తున్న ప్రధానమంత్రి అదే వరసలో చంద్రబాబు దగ్గరి కొచ్చారు. అప్పుడేం జరిగిందనే అంశంపై ముందుగా ఎల్లో మీడియా రిపోర్టింగ్‌ పరిశీలిద్దాము. ‘‘కొద్దిసేపు పక్కకు జరిగి ఇద్దరూ 5 నిమిషాలు మాట్లాడుకున్నట్టు’’ ఈనాడు రాసింది. ‘మీరీ మధ్య ఢిల్లీకి రావడం లేదు. అప్పుడప్పుడూ వస్తూ ఉండండి’ అని ప్రధాని అన్నారట! ‘ఈసారి వచ్చినప్పుడు ప్రత్యేకంగా కలుస్తాన’ని చంద్రబాబు చెప్పారట! ‘తప్పకుండా రండి. ఇది మీ ఇల్లు అనుకోండి. రావాలనుకున్నప్పుడు ముందుగా మా ఆఫీసుకు చెప్పండని’ ప్రధాని అన్నట్టుగా ఈనాడు రాసింది. వారు మాట్లాడుకున్నది రాష్ట్రపతి భవన్‌లో కనుక ఆ భవనాన్నే మీ ఇల్లు అనుకోమన్నాడా లేక ప్రధానమంత్రి ఇంటిని అనుకోమన్నాడా అనే విషయాన్ని ఈనాడు విడమర్చి చెప్పలేదు. ప్రధానమంత్రే చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ అడిగినట్లుగా, మరోసారి ఢిల్లీ వచ్చినప్పుడు పరిశీలిస్తానని చంద్రబాబు చెప్పినట్టుగా ఈ రిపోర్ట్‌ ద్వారా మనకు అర్థమవుతుంది.

యెల్లో మీడియా అగ్రపత్రిక రాసినట్టుగానే దాని ఉగ్ర పత్రిక కూడా రాసింది. సహజంగానే కొంచెం ఉగ్రంగా కూడా రాసింది. సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబును మోదీ పక్కకు తీసుకుపోయారట. ఆయన ఆరోగ్యం, కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారట. ‘బాబుగారూ ఎలా ఉన్నారు. మనం చాలా రోజులయింది కలుసుకుని. మీరు ఢిల్లీకి తరచుగా ఎందుకు రావడం లేదు. మీతో చాలా విషయాలు మాట్లాడవలసి ఉంద’ని ఏకబిగిన మాట్లాడేశారట! ఇక్కడ కూడా చంద్రబాబుతో భేటీకోసం మోదీ తహతహ లాడుతున్న తాత్పర్యమే ధ్వనించింది. కానీ అక్కడ జరిగింది వేరు. బిల్డప్‌ బాబాయ్‌ అనే క్యారెక్టర్‌ తెలుగు వారికి చిరపరిచితమే. కాకపోతే బాబాయ్‌ తన బిల్డప్‌ బాధ్యతను తానే మోస్తాడు. ఇక్కడ యెల్లో మీడియా మోస్తుంటుంది. అంతే తేడా!

ఈ సంఘటన జరిగినప్పుడు చుట్టూ చాలామందే ఉన్నారు. కొందరు వారి మాటలు విన్నారు. ఏం మాట్లాడుకున్నారనేది ఇప్పుడు ఢిల్లీ మీడియా సర్కిల్స్‌లో, పొలిటికల్‌ సర్కిల్స్‌లో చాలామందికి తెలుసు. యెల్లో మీడియా కథనాలు వారు చదివి వుంటే పడిపడి నవ్వేవాళ్లు. భాష తెలియకపోవడం వల్ల బతికి పోయాం. ఒక్కొక్కర్నీ పలకరిస్తూ వస్తున్న ప్రధాని తన చెంతకు రాగానే ఒక్క నిమిషం సార్‌ అంటూ వంగి నమస్కరిస్తూ చంద్రబాబు ఒక మూడడుగులు పక్కకు వేశారట. ప్రధాని కూడా పక్కకు జరిగి ఆయన ఎదురుగా నిలబడ్డారు. ‘సారీ, పొరపాటయింది. మన్నించండి. ఎన్నికల ముందు మిమ్మల్ని విమర్శించడం తప్పే. ఇకముందు అలా జరగదు’ అంటూ సాగిలబడినంత పని చేశారట చంద్రబాబు. ఆ కొద్దిసేపట్లోనే చంద్రబాబు నోటి వెంట సారీ అనే మాట ఆరుసార్లు వచ్చిందట! ప్రధాని తల పంకించి నవ్వి ఊరుకున్నారట. ఒక పది నిమిషాలు ఇంకోసారి టైమిప్పిస్తే వచ్చి కలుస్తానని బాబు అడగడంతో పీఎంఓతో టచ్‌లో ఉండండి అని చెబుతూ మోదీ వెళ్లిపోయారట. ఇదీ జరిగిన కథాక్రమం.

ఆగస్టు 21, హైదరాబాద్‌
మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన రాజకీయ సభకు అమిత్‌షా హాజరయ్యారు. పనిలో పనిగా హైదరాబాద్‌లో ఇద్దరు ప్రముఖులను ఆయన కలుసుకున్నారు. మనకున్న సమాచారం ప్రకారం రామోజీరావుతో భేటీ ఆయన కోరిక మేరకే జరిగింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ను మాత్రం అమిత్‌షా పిలిపించుకున్నారు. రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సందర్భాల్లో మీడియా యాజమాన్యాలను కలుసుకోవడం అమిత్‌షాకు రివాజే. పైగా స్వయంగా మీడియా అధిపతే పిలవడం, ఆయన వయోధికుడు కూడా కావడం, సభాస్థలి నుంచి నగరానికి వచ్చే దారిలోనే ఉండడంతో అమిత్‌షా ఫిలిం సిటీలో రామోజీని కలుసుకున్నారు.

వాళ్లిద్దరే ముఖాముఖి కాస్సేపు మాట్లాడుకున్నట్టు వార్తలొచ్చాయి. బల్లకిందనో, బాత్‌రూమ్‌లోనో నక్కి ముఖాముఖి సంభాషణల్ని సైతం రిపోర్టు చేయగల యెల్లో మీడియాలో కూడా ఎటువంటి వివరాలు రాయలేదు. కనుక ఈ సమావేశంలో ఏం జరిగి ఉంటుందనేది ఎవరి ఊహాగానాలు వారికి వదిలేయడమే ఉచితం. చంద్రబాబుకు రాజగురువు లాంటివాడు కనుక ఆయన తరఫున ఏమైనా రాయబారం చేసి ఉండొచ్చు. లేదా తనకు సంబంధించిన అంశాలు ఏమైనా మాట్లాడి ఉండొచ్చు. మాటలు ఏవైనా గానీ, మీడియాకు విడుదల చేసిన ఫోటోలు మాత్రం ఆకర్షించాయి. అక్కడి కుర్చీలు, తలుపులు, దర్వాజాలు బంగారం తాపడం చేసినట్టుగా కాంతులీనుతూ కనిపించాయి. ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసొచ్చింది. పెద్దవారిగా చలామణి అయ్యేవారి ఇళ్లలో బాత్‌రూమ్‌లో బంగారం తాపడం చేసినా అభిరుచి కిందకే వస్తుంది. గాలివారి ఇళ్లలో కుర్చీకి తాపడం చేసినా గలీజు వ్యవహారం అవుతుంది.

రామోజీరావును కలిసిన రాత్రే నోవోటెల్‌ హోటల్‌లో అమిత్‌షా ఎన్టీఆర్‌ను కూడా కలిశారు. ఇద్దరి మధ్యన జరిగిన సినిమారంగ సంభాషణలు మాత్రం వెంటనే బయటకొచ్చాయి. రాజకీయాంశాలు వెంటనే బయటకు రాలేదు కానీ రాజకీయ చర్చ మాత్రం జరిగిందని తెలిసింది. ఈ విషయాన్ని బీజేపీ నేతలు అధికారికంగానే ధృవీకరించారు. ఎన్టీఆర్‌ తన సన్నిహితులతో పంచుకున్నంత మేరకు, అమిత్‌షా పార్టీ ముఖ్యులకు చెప్పినంత మేరకు ఒక్కొక్కటిగా విషయాలు బయటకొస్తున్నాయి. 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ప్రచారంలో పాల్గొన్న విషయాన్ని అమిత్‌షా గుర్తుచేశారట! ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తి ఉందా అని అడిగారట! నాదింకా చిన్న వయసే, ఇంకా సినిమాలు చేయవలసి ఉందని ఎన్టీఆర్‌ బదులిచ్చారట! మన టైమ్‌ ప్రకారం అవకాశాలు రావు. అవి వచ్చే టైమ్‌కు మనం సన్నద్ధంగా ఉండాలని అమిత్‌షా సలహా ఇచ్చారట. ఇంకోసారి ఢిల్లీలో కలిసి మాట్లాడుకుందామని ఆయన సూచించినట్టు తెలుస్తున్నది.

ఆగస్టు 24–26, కుప్పం
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మూడు రోజులపాటు కుప్పంలో చూపించిన విపరీత ప్రవర్తన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. 33 సంవత్సరాల నుంచి తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పర్యటనకోసం పక్క నియోజకవర్గాల నుంచి వందలాదిమందిని సమీకరించుకున్నారు. వాళ్లు కర్రలు, రాళ్లతో వీధుల్లో వీరంగం వేశారు. తాను రౌడీలకే రౌడీనంటూ చంద్ర బాబు స్వయంగా హెచ్చరికలు జారీ చేశారు. పలుచోట్ల ఘర్షణలకు కవ్వించారు. వైఎస్సార్‌సీపీ తరఫున స్థానిక సంస్థలకు ఎన్నికైన వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి ప్రయత్నించారు. ఆయనే రోడ్ల మీద బైఠాయించి మూకల్ని ఉసిగొల్పారు. వేలాదిమందితో వచ్చి దాడులు చేస్తామని పోలీసుల్ని బెదిరించారు. పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల్లో ఆయనకు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితులు యధాతథంగా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలవడం కష్టం. పోనీ నియోజకవర్గం మారాలి అంటే తాను పుట్టి పెరిగిన సొంత నియోజకవర్గం చంద్రగిరికి వెళ్లాలి. అక్కడ తన స్వగ్రామం నారావారిపల్లి ఎంపీటీసీగా కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థే గెలిచారు. అక్కడికి వెళ్లడం దుస్సాహసమే అవుతుంది. కచ్చితంగా సేఫ్‌ అని చెప్పగల మరో నియోజకవర్గం కనిపించడం లేదు. కనుక ఇక్కడే తేల్చుకోవాలి. గట్టెక్కడానికి భయోత్పాతం సృష్టించడం ఒక్కటే మార్గంగా బాబు నిర్ధారణకు వచ్చినట్టు కనిపిస్తున్నది.

గేమ్‌ ప్లాన్‌: ఆంధ్రప్రదేశ్‌
జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రాజకీయ స్టేక్‌ హోల్డర్లందరు ఎవరి గేమ్‌ ప్లాన్‌తో వారు ముందుకు వెళ్లే సన్నాహాల్లో ఉన్నట్టు స్పష్టమవుతున్నది. అధికారంలో వున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన యాభైశాతం ఓట్లపై గట్టి ధీమాతో ఉన్నది. మిగిలిన పార్టీలన్నీ ఏకమై పోటీచేసినా సరే తమను ఓడించలేరని ఆ పార్టీ నేతలు పదేపదే చెబుతున్నారు. మూడేళ్ల పరిపాలనా కాలంలో సింహభాగాన్ని కోవిడ్‌ కబళించినప్పటికీ మిగిలిన సమయాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పూర్తిగా సద్వినియోగం చేసుకొన్నది. ముఖ్యంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవ శంఖారావాలను పూరించారు. ప్రభుత్వం చేపట్టిన పేదల అనుకూల విధానాలు సంక్షేమ మజిలీని దాటి సాధికారతా గమ్యాన్ని ముద్దాడే దిశగా ప్రయాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రగతిశీల ఆలోచనాపరులందరూ ఇప్పుడు అదనపు బలంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి తోడవుతున్నారు. ఏ లెక్కన అంచనా వేసినా కూడా గత ఎన్నికలతో పోలిస్తే అధికార పార్టీ బలం పెరిగింది. విజయంపై అనుమానం లేకపోవడం వల్ల ఆ పార్టీ మీద ఒత్తిడి లేదు. అందుకే రాజకీయ పార్టీలతో పొత్తుకు బదులుగా ఓటర్లతో పొత్తు వ్యూహంతో వెళ్తున్నది.

తెలుగుదేశం పార్టీ పరిస్థితి మాత్రం దినదిన గండం చందంగా తయారైనట్టు కనిపిస్తున్నది. పార్టీ పరిస్థితి బాగాలేదనే అభిప్రాయం కింది స్థాయి కార్యకర్తల నుంచి పొలిట్‌ బ్యూరో స్థాయి వరకు బలపడింది. పార్టీ లేదు బొక్కా లేదు అని గతంలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యానాలే ఇందుకు నిదర్శనం. ఇవి బయటకు వచ్చాయి కనుక ప్రస్తావించడమే తప్ప, జనాం తికంగా ఏ నాయకుడిని కదిలించినా ఇవే మాటలు చెబుతారు. నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లింది. చంద్ర బాబుకు పుష్ప గుచ్ఛం ఇవ్వడానికి కేశినేని నాని నిరాకరించిన దృశ్యం పరిస్థితికి అద్దం పట్టింది. రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్ల బాబు పరిపాలనను, మూడేళ్ల జగన్‌ పాలనతో జనమే కాదు టీడీపీ శ్రేణులు కూడా పోల్చి చూస్తున్నాయి. పెదవి విరుస్తున్నాయి. బాబుపై వయోభారం కూడా కనిపిస్తున్నది. పొంతనలేని ఆయన మాటలు పార్టీ నేతలను కలవరపెడు తున్నాయి. తన వారసునిగా తయారు చేద్దామనుకున్న చినబాబు ఘోరంగా ఫెయిలయ్యారు. కాంగ్రెస్‌ శ్రేణుల్లో రాహుల్‌ గాంధీ ‘సామర్థ్యం’పై ఉన్న నమ్మకంలో సగం కూడా తెలుగుదేశం శ్రేణుల్లో చినబాబుపై లేదు. 

ఇంకొంతకాలం తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టాలంటే వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలగాలి. అందుకు జనసేన సహకారం ఒక్కటే సరిపోదు. గ్రాండ్‌ అలయెన్స్‌ ఏర్పాటు చేయాలని ఎల్లో సిండికేట్‌ తలపోస్తున్నది. బీజేపీ కూడా జతకలవాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బలమైన పార్టీ కావడం వలన దాని అండతో నిలబడాలని సిండికేట్‌ తపిస్తున్నది. అందుకోసం ముక్కు నేలకు రాసైనా సరే వారి స్నేహ హస్తం అందుకోవాలన్నది టీడీపీ గేమ్‌ప్లాన్‌. బీజేపీ పెద్దల మనసుకు నచ్చే ప్రతిపాదనలు చేయడానికి కూడా అది సిద్ధంగా ఉన్నది. పది నిమిషాల అపాయింట్‌మెంట్‌ కోసం బాబు చేసిన రిక్వెస్ట్‌ ఫలిస్తే ఆ ప్రతిపాదన ముందుంచుతారేమో చూడాలి. 

విస్తరణ కోసం బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు ఇప్పుడప్పుడే తమ పార్టీ బలమైన శక్తిగా ఎదగగలుగుతుందన్న భ్రమలేవీ ఆ పార్టీకి లేవు. తమతో పొత్తులో ఉన్న పవన్‌ కల్యాణ్‌ సామర్థ్యంపై కూడా ఆ పార్టీకి పెద్దగా విశ్వాసం లేదు. పవన్‌ పార్టీని స్వయం ప్రకాశంకాని ఉపగ్రహంగానే ఆ పార్టీ భావిస్తున్నది. చంద్రబాబుతో పవన్‌కున్న డీల్‌ గురించి కూడా బీజేపీకి అవగాహన ఉన్నది. రాష్ట్రంలో రాజకీయ శూన్యత కోసం ఆ పార్టీ ఎదురుచూస్తున్నది. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పగుళ్లుబారుతున్న దృశ్యం బీజేపీ ఎక్స్‌రే కళ్లకు కనిపిస్తున్నది. అమిత్‌ షా హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ను పిలిపించు కోవడం వెనుక ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉండవచ్చు. లేదా ఒక సంకేతప్రాయమైన తాత్కాలిక వ్యూహం మాత్రమే కావచ్చు. తాత్కాలిక వ్యూహమే అయితే అది పవన్‌ కల్యాణ్‌కు హెచ్చరిక కావచ్చు. దీర్ఘకాలిక వ్యూహమే అయితే చంద్రబాబు ఆట ముగింపు దశకు చేరినట్టే. మరో ఓటమిని నిభాయించుకొని పార్టీని నిలబెట్టుకోలేడు. కొంతమేరకు నిలబెట్టుకోగలిగినా చీలికను నివారించలేడు. మరో రెండేళ్ల తర్వాత చంద్రబాబు పరిస్థితి ఖేల్‌ ఖతమ్, దుకాణ్‌ బంద్‌.


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు