-

చైనా చట్టం... దేని కోసం?

29 Oct, 2021 00:20 IST|Sakshi

వారం రోజుల క్రితం... గత శనివారం చైనా చేసిన కొత్త చట్టం అది. ఈ ఏడాది మార్చిలో ప్రతిపాదించి, ఏడు నెలల్లో ఆమోదమే పొందిన ఆ సరిహద్దు చట్టం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీజింగ్‌ ‘సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రత సమున్నతం. వాటిని ఉల్లంఘించడానికి వీల్లేదు’ అని 62 క్లాజులతో కూడిన ఈ 7 అధ్యాయాల కొత్త ‘భూ సరిహద్దు చట్టం’ పేర్కొంటోంది. భారత్‌ కోసమే ఈ చట్టం చేసినట్టు పైకి కనిపించకపోయినా, దీని పర్యవసానాలపై అనేక అనుమానాలు రేగుతున్నాయి. అక్టోబర్‌ 23న చైనా జాతీయ చట్టసభ ‘నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌’ అంగీకరించిన ఈ చట్టానికి, ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అదే రోజు ఆమోదముద్ర వేశారు.

ఆ చట్టం పూర్తిగా ‘ఏకపక్ష చర్య’ అనీ, ప్రస్తుతం ఇరుదేశాల మధ్య సరిహద్దుల నిర్వహణలో ఉన్న ద్వైపాక్షిక ఏర్పాట్లపై ఇది దుష్ప్రభావం చూపుతుందనీ భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చైనా మాత్రం ‘ఇప్పుడున్న సరిహద్దు ఒప్పందాల అమలులో ఈ చట్టం ప్రభావమేమీ ఉండదు’ అంటూ కొట్టిపారేస్తోంది. ఇప్పటికే 17 నెలలుగా రెండు దేశాల సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభన నెలకొంది. కొత్త చట్టం పరిష్కారానికి మరిన్ని అడ్డంకులు సృష్టిస్తుందన్నది పెద్ద భయం. 

భారత్‌తో సరిహద్దు వివాదాల పరిష్కారంలో చైనా ఇటీవల అనుసరిస్తున్న మొండి వైఖరి ఈ భయాలకు మరింత ఆజ్యం పోస్తోంది. భారత్‌ సహా మొత్తం 14 దేశాలతో... 22,457 కి.మీ. మేర చైనాకు భూ సరిహద్దు ఉంది. ఆ దేశానికి మంగోలియా, రష్యాల తర్వాత మూడో సుదీర్ఘమైన సరిహద్దు భారత్‌తోనే నెలకొంది. ఆ రెండు దేశాలతో చైనాకు సరిహద్దు సమస్యలేమీ లేవు. భారత్‌ తర్వాత చైనాకు భూ సరిహద్దు తగాదాలున్నది 477 కి.మీ. మేర హద్దులు పంచుకుంటున్న భూటాన్‌తోనే. సరిహద్దు చర్చలను వేగిరం చేయడానికి భూటాన్‌ ఈ నెలలోనే చైనాతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.

అదీ మనకు కొంత దెబ్బే. ఇక, మిగిలిందల్లా మనమే. ‘వాస్తవాధీన రేఖ’ (ఎల్‌ఏసీ) వెంట 3,488 కిలోమీటర్ల పొడవునా చైనాతో భారత్‌కు సరిహద్దు వివాదం ఉంది. తూర్పు లద్దాఖ్‌లో గత ఏడాది మే 5 నాటి ఘటనలు, వెంటనే జూన్‌ 15న గాల్వన్‌ లోయ పరిణామాలతో పీటముడి బిగిసింది. భారత భూభాగంపై చైనా తిష్ఠ వేసింది. పరిష్కారానికి సైనిక, దౌత్యస్థాయి చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఏదీ తేలకుండానే చైనా కొత్త చట్టం తెచ్చింది. 

భారత, చైనాల సరిహద్దు సమస్య సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక ప్రతినిధుల స్థాయిలో ఇప్పటికి 20 విడతలుగా చర్చలు జరిగాయి. తుది పరిష్కారం మాటెలా ఉన్నా, ముందుగా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి కొనసాగించడం అవసరమని ఇరుపక్షాలూ అంగీకరించాయి. కానీ, ఇప్పుడీ చట్టం కింద చైనా తప్పుకు తిరుగుతుంది. వివాదాస్పద ప్రాంతాలను సైతం ఈ చట్టం కింద చైనా తన భూభాగమనే అంటుంది. ఆ మాట మనం అంగీకరించం. 1963 నాటి ఒప్పందం కింద అక్సాయ్‌చిన్‌ ప్రాంతంలోని షక్స్‌గమ్‌ లోయను సైతం చైనాకు పాక్‌ అప్పగించింది.

కానీ, అది చట్ట విరుద్దమనీ, అక్సాయ్‌చిన్‌ సహా జమ్మూ కశ్మీర్‌ మొత్తం మనదేననీ భారత్‌ ప్రకటించింది. ఇప్పుడు అదీ చిక్కు. హోమ్‌ శాఖ, రక్షణ శాఖల్లో సరిహద్దుల నిర్వహణ బాధ్యత ఎవరిదనే స్పష్టత మన దగ్గర కొరవడుతుంటే, చైనా ఈ కొత్త చట్టంతో తమ హద్దుల బాధ్యత పూర్తిగా ఆర్మీ మీద పెడుతుంది. దీంతో, చర్చలు క్లిష్టమైపోతాయి. వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇక చైనా సైనిక ఉపసంహరణ కష్టమే.

వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చే ఈ సరికొత్త ‘చైనా భూ సరిహద్దు చట్టం’ ఆ దేశ  యుద్ధోన్మాదానికీ, ఆక్రమణవాదానికీ సంకేతమని విశ్లేషకుల విమర్శ. ఆ మాటకొస్తే, ఎల్‌ఏసీ వెంట అన్ని సెక్టార్ల ప్రాంతాల్లోనూ చైనా 2016 నుంచి పటిష్ఠమైన సరిహద్దు రక్షణ గ్రామాలను నిర్మిస్తోంది. ఈ ఏడాది జూలైలో అరుణాచల్‌ ప్రదేశ్‌కు దగ్గరలో టిబెట్‌లో కట్టిన ఓ గ్రామాన్ని షీ జిన్‌పింగ్‌ స్వయంగా సందర్శించారు. అసలీ పౌర ఆవాసాల నిర్మాణం, పౌరుల ఉనికి చైనా భారీ వ్యూహం. ఈ సరిహద్దు గ్రామాలను పౌర, సైనిక అవసరాలు రెంటికీ చైనా వాడుకో నుంది. ఈ గ్రామాలు ఆర్మీకి గస్తీ స్థానాలుగా ఉపకరిస్తాయి.

మరోపక్క దెమ్‌చోక్‌ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి ‘కొత్త పౌరులు’ ఎల్‌ఏసీ వెంట భారత భూభాగంలో గుడారాలు వేసుకున్నారు. చైనా జనాభా ఇలా మన ప్రాంతాల్లోకి ఎగబాకితే కష్టమే. భవిష్యత్తులో సరిహద్దుల గురించి భారత్‌ చర్చిం చడం మొదలుపెడితే, ‘ఆ ప్రాంతం మాదే. మా జనాభా అక్కడున్నార’ని చైనా వాదించే ప్రమాదం ఉంది. అంటే, సరిహద్దు వెంట వివాదాస్పద భూభాగాల్లో శాశ్వత వసతి సౌకర్యాలు, నియంత్రణ వ్యవస్థలు నిర్మించి, ఆ భూభాగాలు తమవేనంటూ చైనా చట్టబద్ధం చేయనుందన్న మాట. 

భారత్, భూటాన్‌ల విషయంలో సరిహద్దుల వెంట చట్టబద్ధంగా బలగాలను చైనా వాడే వీలు కల్పిస్తోందీ చట్టం. అలా ఈ చట్టంతో ఇన్నాళ్ళ భారత, చైనా సరిహద్దు చర్చల వ్యవస్థకు దాదాపు తెరపడినట్టే. చైనా మరింత చొచ్చుకురాకుండా అడ్డుకోవడానికి ఎల్‌ఏసీ వెంట దీర్ఘకాలం పాటు, భారీయెత్తున సైనిక బలగాలను భారత్‌ మోహరించాల్సి వస్తుంది. ఇది మరింత శ్రమ, ఖర్చు. అలాగే, సరిహద్దు సమస్యలతో ద్వైపాక్షిక సంబంధాలను ముడిపెడుతున్న భారత్‌ వాదనను ఈ కొత్త చట్టంతో చైనా తోసిపుచ్చినట్టయింది. ఇప్పుడిక జగమొండి చైనాతో తాత్కాలిక ఒప్పందం కుదుర్చు కొనే ఆచరణాత్మక వ్యూహాలను భారత్‌ ఆలోచించక తప్పదు!

మరిన్ని వార్తలు