వీగర్లపై చైనా పంజా

3 Sep, 2022 00:48 IST|Sakshi

చైనా వాయవ్యప్రాంతం షింజియాంగ్‌లో సర్కారీ దౌష్ట్యానికి లోనవుతున్న మైనారిటీ వీగర్‌ ముస్లింల విషయంలో ఐక్యరాజ్యసమితి పట్టనట్టు వ్యవహరిస్తున్నదని కొంతకాలంగా హక్కుల సంస్థలు చేస్తున్న ఆరోపణలకు బ్రేక్‌ పడింది. అక్కడ చైనా ప్రభుత్వం తీవ్ర మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న సంగతి నిజమేనని గురువారం విడుదలైన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ(యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) నివేదిక నిర్ధారించింది.

ఈ నివేదిక బయటకు రాకుండా ఆపడానికి చైనా చేయని ప్రయత్నం లేదు. దీన్ని పూర్తిగా బుట్టదాఖలయ్యేలా చూడాలనీ, కనీసం నివేదిక విడుదలను దీర్ఘకాలం వాయిదాపడేలా చూడాలనీ చైనా అనేక ఎత్తులు వేసింది. ఇప్పుడిక నివేదికను ఖండించే పనిలోపడింది. 48 పేజీల యూఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదికకు 122 పేజీల్లో బదులిచ్చింది. ఆ ప్రాంత శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అణచేస్తున్నాం తప్ప సాధారణ పౌరుల జోలికి పోవటం లేదన్నది దాని సారాంశం. 

నియంతృత్వం, అణచివేత గాల్లోంచి ఊడిపడవు. వాటికి రాజకీయ కారణాలతోపాటు ఆర్థిక, భౌగోళిక, జాతి, మత, భాషాపరమైన కారణాలు కూడా ఉంటాయి. వరమో, శాపమో వీగర్‌ ముస్లింలు అత్యధికంగా ఉండే షింజియాంగ్‌ ప్రాంతం పర్వతాలు, అడవులు, ఎడారులతో నిండి ఉంటుంది. వాటిమధ్య బతకడానికి అనువైన చోటు ఎంచుకోవడం వారికి కష్టమే. అందుకే జనా వాసప్రాంతాలు విసిరేసినట్టు ఎక్కడెక్కడో ఉంటాయి. ఇరుగుపొరుగున రష్యాతోపాటు పలు మధ్య ఆసియా దేశాలుంటాయి. అందుకే దీన్ని నియంత్రించేందుకు ప్రస్తుత చైనా పాలకులు మాత్రమే కాదు... గతంలో పాలించినవారూ ప్రయత్నించారు. ఎందుకంటే ఇక్కడ అపారమైన ప్రకృతి సంపద ఉంది. పైగా వ్యూహాత్మకంగా చూస్తే పశ్చిమ దేశాలకు సమీపంగా, వాటిపై తన ప్రభా వాన్ని పెంచుకునేందుకు వీలుగా ఈ ప్రాంతం ఉంటుంది.

భౌగోళికంగా చిన్నదే అయినా షింజి యాంగ్‌ ఎప్పుడూ బేలగా లేదు. చరిత్రలోకి తొంగిచూస్తే అనేక రాజరిక వ్యవస్థలకు అది కొరకరాని కొయ్యగా నిలిచింది. నియంత్రించడానికి ప్రయత్నించిన ప్రభుత్వాలకు చుక్కలు చూపింది. స్వయంప్రతిపత్తి నిలుపుకోవడమే లక్ష్యంగా పోరాడింది. 1949లో చైనా విప్లవ విజయానికి కాస్త ముందు ఆ ప్రాంతం స్వయంపాలనను రుచిచూసింది కూడా. కానీ జాతుల సమస్య విషయంలో కమ్యూనిస్టులకున్న అవగాహనను గౌరవించి కావొచ్చు... తొలిసారి వారికి తలవంచింది. ఆధిపత్య హాన్‌ జాతి పెత్తనమే ఇక్కడా కనబడటం, 1966–76 మధ్య సాగిన సాంస్కృతిక విప్లవకాలంలో అది మరింత బాహాటం కావడంతో మళ్లీ ఆ ప్రాంతం పోరుబాట పట్టింది. పథకం ప్రకారం వేరే ప్రాంతాలనుంచి హాన్‌ జనాభాను ఇక్కడికి తరలించడం, క్రమేపీ వారి రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం పెంచడంతో వీగర్‌లు రగిలిపోయారు.

90వ దశకం మొదట్లో చెదురుమదురు నిరసనలుగా మొదలైన ఉద్యమం 2009 నాటికి తిరుగుబాటుగా మారింది. హింస చెలరేగి వందలాదిమంది ప్రాణాలు కోల్పోవడంతో 2014 నాటికి అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ పూర్తిస్థాయి అణచివేత చర్యలకు ఆదేశాలిచ్చారు. అప్పటినుంచీ నరకానికి ప్రతీకలుగా ఉండే నిర్బంధ శిబిరాలకు లక్షలాదిమంది వీగర్లను తరలించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఉండే ఆ శిబిరాలు కిక్కిరిసి ఉంటున్నా యని వార్తలొస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఈమధ్యవరకూ చైనా ఎవరినీ అనుమతించక పోవడంతో అనుమానాలు బలపడ్డాయి. సమితిలో కదలికలు రావడం మొదలయ్యాక శిబిరాల్లో పరిస్థితులు కొంత మారాయంటున్నారు. నిర్బంధితుల విడుదల కూడా చోటుచేసుకున్నదని కథనాలు వచ్చాయి. కానీ జరగాల్సినదాంతో పోలిస్తే ఇది చాలా స్వల్పం.   

ఒక దేశ ఆంతరంగిక సమస్యగానో, సంబంధం లేని వ్యవహారమనో భావించి ప్రపంచ ప్రజానీకం ఈ నియంతృత్వ ధోరణులను చూస్తూ ఊరుకుంటే అంతటా ఇలాంటి పాలకులే తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఈమధ్యే యూఎన్‌హెచ్‌ఆర్‌సీ హైకమిషనర్‌గా రిటైరైన మిషెల్‌ బాష్లెట్‌ చిలీలో పినోచెట్‌ పాలనాకాలంలో స్వయంగా నిర్బంధాన్ని అనుభవించినవారు. అందుకే ఆమె హైకమిషనర్‌గా వచ్చినప్పుడు అందరిలో ఆశలు చిగురించాయి. అందుకు తగ్గట్టు చైనా ఎంత మొండికేసినా దాన్ని ఒప్పించడానికి ఆమె ఓపిగ్గా ప్రయత్నించారు. పరిమిత సంఖ్యలోనైనా పాత్రికేయులను అక్కడి ప్రభుత్వం అనుమతించక తప్పని స్థితి ఏర్పడటం బాష్లెట్‌ విజయమే. కానీ ఏళ్లతరబడి నివేదిక వెలుగు చూడకపోవడం, అత్యంత అమానుషమైన ఉదంతాలు నిజమంటూనే వాటిని నరమేథంగా మాత్రం పరిగణించకపోవడం ఆమె పనితీరును ప్రశ్నార్థకం చేసింది.

బక్క దేశాలపై ఆరోపణలు వచ్చినప్పుడు విరుచుకుపడే అగ్రరాజ్యాలు బలమైన దేశాలు కళ్లెదుటే దురాగ తాలకు పాల్పడుతున్నా పట్టించుకోవు. అరబ్‌ దేశాలు వీగర్‌ ముస్లింలకు ఏదో ఒరగబెడ తాయనుకోవడం దండగ. మతాన్ని కించపరిచారన్న ఆరోపణలపై తప్ప సాధారణ ముస్లింలపై జరిగే దాడుల విషయంలో అవి ఎప్పుడూ మౌనమే పాటిస్తాయి. చైనా రాక్షసత్వాన్ని నిగ్గుతేల్చడానికి మరింత లోతైన దర్యాప్తు అవసరమని నివేదిక తెలిపింది. యూఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్య దేశాలు అంగీకరిస్తేనే అది సాధ్యం. చైనా దీన్నెలాగైనా అడ్డుకుంటుంది. మొత్తానికి ఈ నివేదిక చైనా నేర వైఖరిని బయటపెట్టింది. ఉనికి కోసం, కనీస మానవ హక్కుల కోసం పోరాడుతున్న వీగర్‌ ముస్లింలకు నైతిక మద్దతునీయడం దేశదేశాల్లోని ప్రజాస్వామికవాదుల తక్షణ కర్తవ్యం. 

మరిన్ని వార్తలు