గీత రాత మారేనా?

4 Apr, 2022 00:26 IST|Sakshi

చిత్రకళ అనాది కళ. చరిత్రకు పూర్వయుగంలోనే మానవాళికి పట్టుబడిన ఆదిమ కళ. మాటలెరుగని తొలి మానవులు ఎరిగిన ఏకైక భావప్రకటన సాధనం చిత్రకళ. గీతల నుంచి పరిణామం చెందిన తర్వాతే రాతలు రాయడం మొదలైంది. గీతలతో చుట్టూ కనిపించే జంతుజాలాన్ని, పరిసరాలను చిత్రించే దశ నుంచి చిత్రలిపి ‘క్యూనిఫామ్‌’ దశకు చేరుకోవడానికి దశాబ్దాలో శతాబ్దాలో కాదు, ఏకంగా సహస్రాబ్దాల కాలం పట్టింది. ఆదిమ చిత్రకళ క్రీస్తుపూర్వం 30 వేల ఏళ్ల నాడే మొదలైతే, క్రీస్తుపూర్వం 3,400 ఏళ్ల నాటికి గాని తొలినాటి లిపి రూపుదిద్దుకోలేదు. దాదాపు అప్పటి నుంచే భాషల పుట్టుక మొదలైంది. నానా భాషలూ, వాటికి రకరకాల లిపులూ వచ్చాయి. మనిషి మాటలూ రాతలూ నేర్చిన నాటి నుంచి నాగరికత పరిణామ క్రమంలో వేగం పెరిగింది. ముందొచ్చిన గీతల కంటే వెనకొచ్చిన రాతలే వాడి అనేంతగా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. నాగరికతల వికాసం మొదలైన నాటి నుంచి పారిశ్రామిక విప్లవ కాలం వరకు, ఆ తర్వాత నేటి అత్యాధునిక కాలం వరకు ప్రపంచవ్యాప్తంగా చిత్రకళలో అనేకానేక మార్పులు వచ్చాయి.

మన దేశంలో ఆదిమ చిత్రకళ క్రీస్తుపూర్వం 5,500 ఏళ్ల నాడే మొదలైంది. మధ్యప్రదేశ్‌లోని భీమ్‌బేట్కా గుహల్లోని చిత్రాలే ఇందుకు నిదర్శనం. సింధులోయ నాగరికత నాటి శిథిలాల్లో నైరూప్య చిత్రకళ ఆనవాళ్లూ ఉన్నాయి. క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నుంచి క్రీస్తుశకం ఒకటో శతాబ్ది కాలానికి చెందిన అజంతా గుహల్లోని చిత్రకళ ఆనాటి బౌద్ధ ప్రాభవానికి అద్దంపడుతుంది. మొఘల్‌ పరిపాలన కాలం వరకు దేశం నలు చెరగులా మధ్యయుగాల చిత్రకళ వివిధ రీతుల్లో అభివృద్ధి చెందింది. మొఘల్‌ పాలన అంతమయ్యాక డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్‌ కంపెనీలు దేశంలోకి అడుగుపెట్టాక మన దేశంలో ఆధునిక చిత్రకళ మొదలైంది. 

బ్రిటిష్‌ హయాంలోనే మన దేశంలో చిత్రకళా అధ్యయన కేంద్రాలు ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో శాస్త్ర సాంకేతిక అధ్యయన కేంద్రాల అభివృద్ధితో పోల్చుకుంటే, కళా అధ్యయన కేంద్రాల అభివృద్ధి నామమాత్రమే! ఇక చిత్రకళపై తెలుగులో వచ్చిన పుస్తకాల సంఖ్యను వేళ్ల మీద లెక్కించవచ్చు. తొలి తెలుగు కార్టూనిస్టు తలిశెట్టి రామారావు ‘చిత్రలేఖనము’ పేరిట 1918లో రాసిన పుస్తకమే బహుశ తెలుగులో వచ్చిన తొలి ఆధునిక చిత్రకళా గ్రంథం. స్వాతంత్య్రా నికి ముందు కళాభిరుచి గల కొందరు బ్రిటిష్‌ దొరలు ఎందరో భారతీయ చిత్రకారులను ప్రోత్సహించారు.

ఆనాటి సంస్థానాలు సైతం చిత్రకళకు ఊతమిచ్చాయి. ఆధునిక భారతీయ చిత్రకారుల్లో అగ్రగణ్యుడైన రాజా రవివర్మ ట్రావెన్‌కోర్‌ సంస్థానాధీశుని ప్రోత్సాహంతో రాణించాడు. ఇద్దరు తెలుగు గురువుల వద్ద, బ్రిటిష్‌ చిత్రకారుడు థియోడార్‌ జెన్సన్‌ వద్ద రవివర్మ తైలవర్ణ చిత్రకళను నేర్చుకున్నాడు. ఆధునిక భారతీయ చిత్రకారుల్లో రవివర్మ అగ్రగణ్యుడే గానీ, ఆద్యుడు కాదు. ఇప్పటి వరకు దొరుకుతున్న ఆధారాల ప్రకారం తెలుగువాడైన బ్రహ్మస్వామిని తొలి ఆధునిక భారతీయ చిత్రకారుడిగా చెప్పుకోవచ్చు.

పద్దెనిమిదో శతాబ్దికి చెందిన బ్రహ్మయ్య గీసిన చిత్రాలు ఫ్రాన్స్‌ జాతీయ గ్రంథాలయం వెబ్‌సైట్‌లో కనిపిస్తాయి. ఆధునిక కాలానికి చెందిన మన తెలుగు చిత్రకారుల గురించి చెప్పుకుంటే కూల్డ్రే దొర ప్రోత్సాహంతోనే తొలితరం ఆధునిక చిత్రకారుల్లో ఒకరైన దామెర్ల రామారావు రాణించారు. దామెర్ల మిత్రుడు వరదా వెంకటరత్నం కూడా కూల్డ్రే ప్రోత్సాహంతోనే చిత్రకళలో రాణించారు. మశూచి బారినపడి దామెర్ల పిన్నవయసులోనే మరణించ డంతో రాజమండ్రిలో ‘రామారావు ఆర్ట్‌ గ్యాలరీ’ని ఏర్పాటు చేసినది వరదా వెంకటరత్నమే! గడచిన శతాబ్దిలో పలువురు తెలుగు చిత్రకారులు భారతీయ చిత్రకళను సుసంపన్నం చేశారు. 

అప్పట్లో ‘భారతి’ వంటి పత్రికలు చిత్రకళకు కూడా సముచిత ప్రాధాన్యమిచ్చేవి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న చిత్రకళాకారులు తెలుగునాట చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నా, వారి నైపుణ్యాన్ని, ప్రత్యేకతను బేరీజువేసి పాఠకులకు విశదీకరించగల కళావిమర్శకులే మనకు అరుదైపోయారు. తెలుగునాట వివిధ విశ్వవిద్యాలయాల్లో బీఎఫ్‌ఏ, ఎంఎఫ్‌ఏ కోర్సులు నిర్వహి స్తున్నా, ఏటా ఈ డిగ్రీలు తీసుకుని బయటకు వచ్చేవారిలో కనీసం ఒకరిద్దరయినా చిత్రకళా విమర్శ కులుగా తయారు కాలేకపోవడం విచారకరం. ప్రపంచంలోని ఉత్తమ చిత్రకళా విద్యాల యాల్లో తొలి ముప్పయి స్థానాల్లోనైనా మన దేశానికి చెందిన ఏ చిత్రకళా విద్యాలయానికీ చోటులేక పోవడం మరో విషాదం. 

చిత్రకళపై మనదేశంలో ఇంగ్లిష్‌ మ్యాగజైన్లు కొద్ది సంఖ్యలో వస్తున్నాయి. తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో పూర్తిగా చిత్రకళకు పత్రికలేవీ లేవు. ఒకవేళ వచ్చినా, అవి మనుగడ సాగించగల పరిస్థితులూ లేవు. మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏటా ‘చిత్రసంతె’ జరుగుతుంది. ‘కరోనా’ వల్ల దీనికి రెండేళ్లు అంతరాయం కలిగినా, ఈసారి యథావిధిగా జరిగింది.

వారం కిందట జరిగిన ‘చిత్రసంతె’లో దేశం నలుమూలల నుంచి వచ్చిన చిత్రకారులు పాల్గొన్నారు. కర్ణాటక చిత్రకళా పరిషత్‌ నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాన్ని మిగిలిన రాష్ట్రాలూ నిర్వహిస్తే బాగుంటుంది. ఏటా దేశంలోని వివిధ నగరాల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లే, ‘చిత్రసంతె’ వంటి కార్యక్రమాన్ని కనీసం దేశంలోని ముఖ్య నగరాల్లో నిర్వహించేటట్లయితే వర్ధమాన చిత్రకారులకు కొంతైనా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గీత రాత మారుతుంది.

మరిన్ని వార్తలు