తూతూ మంత్రమేనా?

19 Oct, 2021 00:43 IST|Sakshi

దేశంలోని గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ. దశాబ్దాలు దేశాన్ని ఏలిన పార్టీ. వరుస పరాజయాల వల్ల ప్రస్తుతం ప్రభుత్వానికి ప్రతిపక్షమైన పార్టీ. ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక సంఘ ప్రతినిధులందరూ సమావేశమైతే? అదీ ఏకంగా రెండేళ్ళ పైచిలుకు తర్వాత భేటీ అయితే? పార్టీ సభ్యులే కాదు... పరిశీలకులూ అనేక కీలక నిర్ణయాల కోసం చూస్తారు. అలా చూసినప్పుడు శని వారం నాటి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నిరాశపరిచింది. కీలకమైన నిర్ణయాలేమీ జరగలేదు. ఏడాది తరువాతెప్పుడో, వచ్చే ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 20 మధ్య పార్టీ సంస్థాగత ఎన్నికలుంటాయని మాత్రం చాలా ఉదారంగా ప్రకటించింది.

పార్టీలోని అనేక లోపాలను లేవనెత్తుతూ, ఫుల్‌ టైమ్‌ అధ్యక్షుడు కావాలంటున్న 23 మంది సీనియర్‌ నేతల అసమ్మతి బృందం ‘జీ–23’కి కూడా పరోక్ష సమాధానాలతోనే సోనియా గాంధీ సరిపెట్టారు. వెరసి, కీలకమైన సీడబ్ల్యూసీ సైతం పార్టీ కన్నా సోనియా పరివారానికే ప్రాధాన్యమిస్తూ, పార్టీ పగ్గాలు మళ్ళీ రాహులే అందుకోవాలన్న వినతులు చేస్తూ తూతూమంత్రంగా ముగియడం ఓ విషాదం. ఆత్మ పరిశీలన అవకాశాన్ని కాంగ్రెస్‌ చేతులారా వదులుకొని, ‘పరివార్‌ బచావో వర్కింగ్‌ కమిటీ’ అనే బీజేపీ విమర్శకు తావిచ్చింది.

పార్టీకి అత్యున్నతమైన సీడబ్ల్యూసీ 2019 ఆగస్టు తర్వాత సమావేశమవడం ఇదే తొలిసారి. ఇన్ని రోజుల తరువాతి ఈ సమావేశం సాధించినదేమిటంటే చెప్పడం కష్టం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరాజయం పాలైనప్పుడే యువనేత రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని వదులుకున్నారు. అప్పటి నుంచి సోనియాయే పార్టీకి ఆపద్ధర్మ సారథి. అంటే, దేశంలోని అతి పెద్ద వయసు పార్టీకి, దాదాపు రెండున్నరేళ్ళుగా ఆపద్ధర్మ అధ్యక్షురాలే ఉన్నట్టు! ఇదో విచిత్ర పరిస్థితి. సోనియా మాత్రం ‘నేను ఫుల్‌టైమ్‌ ప్రెసిడెంట్‌ని’ అంటూ మొన్న సీడబ్ల్యూసీలో హూంకరించారు. ‘అందరికీ అందు

బాటులో ఉండే ప్రెసిడెంట్‌ని’ గనక ఏదైనా మీడియాకు ఎక్కకుండా, తనకే నేరుగా చెప్పవచ్చంటూ జీ–23కి పరోక్షంగా చురకలేశారు. కానీ, అధ్యక్ష పీఠంలో లేకున్నా, కీలక నిర్ణయాలు తీసుకుంటూ తప్పులు చేస్తున్న సొంత కొడుకుపైనా, పంజాబ్‌లో సీఎం మార్పు లాంటి అనాలోచిత నిర్ణయం తీసుకున్న కూతురిపైనా విమర్శలు చెబితే, వినేంత సహనం సోనియాకుంటుందా అన్నది ప్రశ్న. 

పార్టీ పగ్గాలు చేతిలో లేకుంటేనేం... కాంగ్రెస్‌ పార్టీకి కిరీటంతో పాటు బాధ్యత కూడా లేని రాకుమారుడిగా రాహుల్‌ చలామణీ అవుతున్నారు. నిజానికి, 2014 నుంచి ఇప్పటి దాకా పార్టీకి జరిగిన అనేక నష్టాలకు కుదురులేని ఈ కుర్ర నేత బాధ్యత కూడా చాలానే ఉందనేది స్వపక్షీయుల్లోనే కొందరి భావన. రాహుల్‌ బరిలోకి దిగినప్పటి నుంచి ఇప్పటి దాకా వరుసగా రెండుసార్లు లోక్‌సభలో కనీసం ప్రతిపక్ష హోదాకు కావాల్సినన్ని స్థానాలనైనా కాంగ్రెస్‌ గెలవనేలేదు. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పార్టీ గెలవనైతే గెలిచింది కానీ, పార్టీ పెద్ద అప్రయోజకత్వం కారణంగా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో అధికారానికి దూరమైంది. ఇక, 2019 లోక్‌సభ ఎన్నికల్లో స్వయంగా రాహుల్‌ తమ కుటుంబానికీ, పార్టీకీ కంచుకోట లాంటి అమేథీ నుంచే ఓడిపోయారు. 

కనీసం ఈ ఏడాది మేలో అస్సామ్, పశ్చిమ బెంగాల్, కేరళ ఎన్నికలలోనూ రాహుల్‌ తన సమర్థతను చూపలేకపోయారు. పార్టీలో ‘సమూలమైన మార్పులు’ తేవాలని జీ–23 బృందం గత ఏడాది ఆగస్టులోనే సోనియాకు తొలి లేఖాస్త్రం సంధించింది అందుకే! పార్టీకి కంచుకోటగా మిగిలిన పంజాబ్‌లో సైతం సీఎం మార్పుతో సంక్షోభం తెచ్చింది – తల్లి చాటు బిడ్డలే. జీ–23 మరో లేఖాస్త్రం విసిరి, పత్రికా సమావేశం పెట్టి మరీ తమది ‘జీ హుజూర్‌’ బృందం కాదని తొడగొట్టారంటే పరిస్థితి ఎంతదాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఈ పరిస్థితుల్లో తప్పనిసరై భేటీ అయిన సీడబ్ల్యూసీ కాంగ్రెస్‌ పతనావస్థకు కారణాలు విశ్లేషించుకొని, దిద్దుబాటు చర్యలు చేపడితే బాగుండేది. ఆ పని చేయలేదు. పూర్తికాలం అధ్యక్షురాలినని చెప్పుకోవడానికి సోనియాకు ఇంత కాలం ఎందుకు పట్టిందో అర్థం కాదు. పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో సమస్యలు తలెత్తినప్పుడల్లా కన్నబిడ్డల్ని పరిష్కారం కోసం పంపి, పార్టీలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారనే ప్రశ్నలు తలెత్తేలా చేశారామె. ఇప్పుడిక తప్పక తానే అధినేత్రినని ఆమె నోరు విప్పాల్సి వచ్చింది. ఆ మేరకు అస్మదీయులకు మేళం కొట్టి, అసమ్మతీయుల నోటికి తాళం వేశారు.            

సంస్థాగతంగానూ, నిర్ణయాలు తీసుకోవడంలోనూ ప్రజాస్వామ్యం కాంగ్రెస్‌ ప్రత్యేకత. వారసుల మోజులో పడి పోగొట్టుకున్న ఆ పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికీ, పార్టీలో పునరుత్తేజం తేవడానికీ ఇది కీలక సందర్భం. ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించాలంటే, చురుకైన ప్రతిపక్షం అవసరం. పైపెచ్చు, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్‌లలో వచ్చే ఏడాదే ఎన్నికలున్నాయి.

మరి, కాంగ్రెస్, దానికి వారసులమని భావిస్తున్న గాంధీ పరివారం ఇప్పటికైనా మారతాయా? స్తబ్ధతను పోగొట్టుకొని, సరైన కార్యాచరణలోకి దిగుతాయా? కరోనాలో వైఫల్యం, రైతుల ఆందోళన, లఖింపూర్‌ ఖేడీ లాంటి ఘటనలు అనుకూలించినా, బీజేపీకి బలమైన ప్రత్యర్థిననే నమ్మకం జనంలో తేగలిగితేనే కాంగ్రెస్‌కు ఓట్లు వస్తాయని మర్చిపోకూడదు.

అధినేత్రిని తానే అన్న సోనియా ప్రకటన రాహుల్, ప్రియాంకలకు రిలీఫ్‌. యూపీ, పంజాబ్‌ లాంటి చోట్ల ఫలితాలెలా ఉన్నా ఆ భారం వారు మోయక్కరలేదు. అయితే పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా అధికారం చేతిలో ఉండాలనుకోవడంలో తప్పు లేదు. బాధ్యతల బాదరబందీ లేని అధికారాన్ని ఆశిస్తేనే పెద్ద చిక్కు!

మరిన్ని వార్తలు