అదిగో వ్యాక్సిన్‌!

3 Dec, 2020 00:40 IST|Sakshi

మానవాళి అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ శరవేగంతో అందుబాటులో కొస్తోంది. అందరికన్నా ముందు వ్యాక్సిన్‌ తీసుకొచ్చి అగ్రగాములం అనిపించుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫార్మసీ సంస్థలు తహతహలాడగా... చివరకు అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్, జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్‌లు ఉమ్మడిగా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆ వ్యాక్సిన్‌ అన్నివిధాలా సురక్షితమని బ్రిటన్‌ ప్రభుత్వం భావించి అత్యవసర అనుమతులిస్తున్నట్టు బుధవారం ప్రకటిం చింది. ప్రపంచంలో అధికారికంగా అనుమతి పొందిన తొలి వ్యాక్సిన్‌ ఇదే. పాశ్చాత్య దేశాల ప్రజ లకు ఇది సంతోషకరమైన వార్తే. వారికి ఈ నెల కీలకమైనది. క్రిస్మస్‌ పర్వదినం, ఆతర్వాత ఆగమించే నూతన సంవత్సర వేడుకల కోసం వారు ఏడాదంతా ఎదురుచూస్తారు. 

విందులు, వినోదాల్లో మునిగితేలుతారు. అందుకే లాక్‌డౌన్‌లతో, కంపెనీల మూతతో అల్లాడిపోతున్నవారంతా ఈ పండగ సీజన్‌కల్లా వ్యాక్సిన్‌ పుట్టుకురావాలని బలంగా కోరుకున్నారు. అలాగని అది వెంటనే అందరికీ అందుబాటులోకొస్తుందని చెప్పలేం. ఈ నెలాఖరుకల్లా అయిదు కోట్ల డోస్‌లు ఉత్పత్తి చేయగలమని ఫైజర్‌ చెబుతోంది. అందులో సగం అమెరికాకు వెళ్తాయి. ఒక్కొక్కరికి రెండు డోసులు అవసరం కనుక ఆ రెండు దేశాల్లోనూ మొత్తంగా 2.5 కోట్లమందికి చేరతాయి. ఫైజర్‌తో 10 కోట్ల డోసులకు అమెరికా, 20 కోట్ల డోసులకు యూరప్‌ యూనియన్‌(ఈయూ) ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చు కున్నాయి. వెనకబడిన దేశాలకు చేరడం ఆ తర్వాతే.

గతంలో టీకాను రూపొందించే క్రమంపై ఇంత చేటు ప్రచారం వుండేది కాదు. ఆటలమ్మ, పోలియో, ఎయిడ్స్, చికున్‌గున్యా... ఇలా దేనికి సంబంధించిన ఔషధం గురించైనా తుది పరీక్షల అనంతరం వెల్లడించేవారు. ఆ తర్వాత కొన్ని నెలలకో, రోజులకో అది మార్కెట్‌లోకి ప్రవేశించేది. చాలా సందర్భాల్లో దాని అవసరం లేకుండానే వైరస్‌ మటుమాయం కావడమో, బలహీనపడటమో జరిగేది. ఇప్పుడు వ్యాక్సిన్‌ రెడీ అవుతోందన్న ప్రెస్‌నోట్‌ సైతం కంపెనీలకు లాభాల పంట పండి స్తోంది. వాటి షేర్‌ల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అందుకే ఈ హడావుడంతా. 

ఇప్పుడొ చ్చిన కరోనా వైరస్‌ భీతావహమైనది. ఇది ధనిక, బీద దేశాలనే తారతమ్యాలు లేకుండా అన్నిచోట్లా విజృంభించింది. జనజీవితాన్ని తలకిందులు చేసింది. దీనికి సామాజిక, ఆర్థిక అంతరాలు, వయో భేదాలు లేవు. అందరినీ సమానంగానే పీడించింది. ప్రాణాలు బలితీసుకుంది. ఇంతవరకూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6 కోట్ల 44 లక్షలమందికి సోకగా... 15 లక్షలమంది మృత్యువాతపడ్డారు. రష్యా, చైనాలు లోగడే టీకా తయారైందని ప్రకటించాయి. తమ సినోఫార్మ్‌ గ్రూపు సంస్థ రూపొందించిన టీకా సురక్షితమైనదని, ఇంతవరకూ 10లక్షలమంది దాన్ని తీసుకున్నారని గత నెలాఖరున చైనా ప్రకటించింది. రష్యా కూడా అంతే. 

స్పుత్నిక్‌–వీ వ్యాక్సిన్‌ డోస్‌ను ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌ తన కుమార్తెకు ఇప్పించి అందరిలోనూ విశ్వాసం నింపేందుకు ప్రయత్నించారు. అయితే ఆ టీకాలకు సంబంధించిన వివిధ స్థాయిల్లోని డేటా అందుబాటులో వుంచకపోవడం వల్ల, అనేకానేక సందేహా లుండటం వల్ల ఎవరూ వాటిని పట్టించుకోలేదు. తాజాగా బ్రిటన్‌ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే స్పుత్నిక్‌–వీ వాక్సిన్‌కు అనుమతులిస్తున్నట్టు పుతిన్‌ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా పది దేశాల్లో కరోనా టీకాల గురించి పరిశోధనలు, క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. వాటిల్లో మొదటినుంచీ అన్నిటికన్నా ముందున్నది ఫైజరే. ఇంకా మోడెర్నా, ఆస్ట్రాజెనికా, నోవాక్స్, సనోఫి, మెర్క్, జీఎస్‌కే తదితర సంస్థలు జరుపుతున్న పరీక్షలు వివిధ స్థాయిల్లో వున్నాయి. మన దేశంలో కూడా హైదరా బాద్‌లోని భారత్‌ బయోటెక్, పుణేలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్, అహ్మదాబాద్‌లోని జైడస్‌ బయోటెక్‌ పార్క్‌ తదితర సంస్థల ఆధ్వర్యంలో జోరుగా పరీక్షలు సాగుతున్నాయి. 

ఫైజర్‌ వ్యాక్సిన్‌ సాధారణ పౌరుల దగ్గరకు చేరడం అంత సులభమేమీ కాదు. దాన్ని అత్యంత శీతలమైన స్థితిలో... అంటే మైనస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ వుంచాలి. ఆ ఉష్ణోగ్రతలోనే రవాణా, పంపిణీ పూర్తి చేయాలి. అయిదురోజుల్లో రోగికి టీకా ఇవ్వడం కూడా పూర్తయిపోవాలి. లేనట్టయితే దాని సామర్థ్యం క్షీణిస్తుంది. ఉష్ణోగ్రతలు అధికంగా వుండే మన దేశంలో ఈ వ్యాక్సిన్‌ను రోగికి చేరేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. పైగా దాని ఖరీదు కూడా ఎక్కువే. పంపిణీకి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన ఖర్చుతో కూడిన పని. భారత్‌ వరకూ ఎందుకు... బ్రిటన్‌లోనే అదెంతో కష్టం. 

ఒక టీకాకు ఇంత ఆగమేఘాలపై అనుమతులు రావడం అసాధారణమే. బ్రిటన్‌ ఇప్పటికీ ఈయూ భాగస్వామ్య దేశంగా వుంటే ఇలా హడావుడి అనుమతి కుదిరేది కాదు. ఒక టీకాను అనుమతించడంలో ఈయూ పాటించే నిబంధనలు సంక్లిష్టమైనవి. అందువల్లే మరో పక్షం రోజు లకుగానీ అక్కడ అనుమతులు రాకపోవచ్చంటున్నారు. బ్రిటన్‌ అన్నిటినీ పక్కనబెట్టి అను మతినిచ్చింది. అందుకు మరొక కారణం కూడా చెబుతున్నారు. బ్రెగ్జిట్‌తో వచ్చిన ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు ఆ దేశం దీన్నొక అవకాశంగా తీసుకుందన్నదే కొందరి వాదన. దాని ఔషధ నియంత్రణ వ్యవస్థకు ఈ టీకా వల్ల కాసుల వర్షం కురుస్తుందని వారు చెబుతున్నారు. 

మరోపక్క వ్యాక్సిన్‌ల తయారీపై ఫార్మసీ సంస్థలు ఇలా పోటీ పడుతుంటే అసలు వాటి అవసరమే వుండకపోవచ్చని నాలుగైదు రోజులక్రితం ఫైజర్‌ మాజీ చీఫ్‌ సైంటిస్టు మైకేల్‌ ఈడెన్‌ చెప్పిన మాటలు గమనించదగ్గవి. తగినంత సమయం తీసుకుని నిశితంగా పరీక్షించకుండా జనంలోకి వదిలినట్లయితే దుష్పరిణామాలకు దారితీస్తుందని ఆయనంటున్న మాటల్ని కొట్టి పడేయలేం. అందుకే వ్యాక్సిన్‌ కోసం ఆరాటపడటం, దాంతో మంత్రించినట్టు అంతా మాయమవుతుందని ఆశించడం వృధా ప్రయాస. దానికి బదులు ఆ వైరస్‌ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే శ్రేయస్కరం.

మరిన్ని వార్తలు