అలను ఆపటమా? రేపటమా?

28 Oct, 2021 00:29 IST|Sakshi

భయపడి జాగ్రత్తలు మానేయడమా? జాగ్రత్త పడుతూ భయాన్ని వీడటమా? ఎప్పుడైనా రెండోదే అనుసరణీయం! మనం మరింత జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. కరోనా మూడో అల రాక, ఉధృతి వంటివన్నీ మనం–మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటాయని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలు, హెచ్చరికలను తీవ్రంగా పరిగణించాల్సిన తరుణమిది. సరికొత్త వైవిధ్యాలతో కోవిడ్‌ మళ్లీ కోరలు చాస్తోంది. ఐరోపాలో కేసుల సంఖ్య, మరణాల రేటు రమారమి పెరిగింది.

రష్యాతో పాటు ఉక్రెయిన్, బ్రిటన్, రుమేనియా తదితర దేశాల్లో కరోనా కలత సృష్టిస్తోంది. రష్యాలో 24 గంటల్లో 1100 మందిపైనే మరణించడంతో అన్నీ మూసేసి, పది రోజుల వేతనంతో కూడిన సెలవును ప్రకటించారు. చైనాలో కొత్త కేసులు పెరుగుతున్న తీరుకు ఆందోళన చెందిన ప్రభుత్వం నలభై లక్షల జనాభా కలిగిన వాయవ్య ప్రావిన్స్‌ గన్షు రాజధాని లాన్‌జువో నగరంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించింది. నగరంలోకి రైళ్లు, విమానాలను పూర్తిగా నిలిపివేసింది. కోవిడ్‌–19 వైరస్‌ కొత్త వైవిధ్యం ఏవై.4.2 కేసులు భారత్‌లోనూ బయటపడ్డాయి. కర్ణాటకలో ఈ కేసుల్ని నిర్ధారించి, అధికా రికంగా ప్రకటించారు.

కేసులు పెరుగుతున్నట్టు వైద్యారోగ్య నిపుణులు ప్రకటించారు. ఈ వైరస్‌ బారినపడ్డ వారిని గుర్తించి, ప్రాథమిక, ద్వితీయ ప్రభావితులపై పరిశోధనలకు నమూనాలను ఇప్పటికే ప్రయోగశాలలకు చేర్చారు. ఇది డెల్టా ప్లస్‌ రకానికి చెందిన సరికొత్త్త వైవిధ్యం. దీని ప్రభావంపై జరుగుతున్న పరిశోధన ఫలితాలను బట్టి ఇదెంత ప్రమాదకారి? వైరస్‌ వ్యాప్తి, వ్యాధి విస్తరణ–తీవ్రత! వంటిని నిర్ధారిస్తారు. లోగడ బి.1.617 వైవిధ్యం భారత్‌లో సృష్టించిన అలజడి కోవిడ్‌–19 రెండోఅల ఉధృతిలో మనమంతా కళ్లారా చూశాం! అపార ప్రాణ నష్టం జరిగింది. గత కొంతకాలంగా మొత్తమ్మీద దేశంలో కేసుల సంఖ్య తగ్గినట్టే కనిపిస్తున్నా... అక్కడక్కడ తగ్గక పోవడం, కేరళ వంటి ప్రాంతాల్లో మళ్లీ పెరగటం ఆందోళన కలిగిస్తోంది.

కేరళతో పాటు పొరుగు నున్న కర్ణాటక, తమిళనాడులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే మరింత అప్రమత్తమయ్యాయి. కేంద్రం కూడా తరచూ రాష్ట్రాలను హెచ్చరిస్తోంది. కోవిడ్‌ ప్రభావం తగ్గిందనే తలంపుతో అలక్ష్యం చేయొద్దని, పౌరులు కోవిడ్‌కు తగ్గ ప్రవర్తన (సిఎబి)తో కనీస జాగ్ర త్తలు పాటించాలని సూచిస్తోంది. ఒకటో అల ఉధృతి తగ్గుతున్న క్రమంలో మన నిర్లక్ష్యానికి, సర్కార్ల అలసత్వానికి తగిన మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. రెండో అలలో పెరిగిన ఉధృతి, జరిగిన ప్రాణ నష్టం అనుభవాల్ని గుణపాఠంగా గ్రహించి అప్రమత్తంగా ఉండాల్సిన సంధికాలపు సందర్భమిది. ప్రభుత్వాలు నిర్ణయాల పరంగా, వైద్య విభాగం సన్నద్ధతపరంగా, పౌరసమాజం స్వీయ నియంత్ర ణతో వ్యవహరించాలి. రాగల ప్రమాద ఆస్కారాన్ని తగ్గించాలి. ఇది మనందరి ఉమ్మడి కర్తవ్యం!

అక్కడక్కడ కోవిడ్‌ కేసులు పెరుగుతూ, కొత్త వైవిధ్యాలు పొడచూపుతున్న ఈ సమయంలోనే ఉపఎన్నికలు, పండుగలు, ఇతర శుభకార్యాలున్నాయి. వాటిల్లో పాల్గొనేవారి సంఖ్యా పరిమితులకు మనవాళ్లెప్పుడో తిలోదకాలిచ్చారు. ఎక్కడ చూసినా, జనం ఏ బెరుకూ–జాగ్రత్తలు లేకుండా పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. జనాభాలో 75 శాతానికి పైబడి మాస్కులు లేకుండానో, నామ మాత్రంగా ధరించో ఉంటున్నారని ఒక అధికారిక సర్వేనే వెల్లడించింది. భౌతిక దూరాలు పాటిం చడం, శానిటైజర్ల వినియోగం కూడా తగ్గింది. ఇప్పుడు దాదాపు ఏ కట్టడీ (లాక్‌డైన్‌) లేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ ఇంకా అమలవుతోంది.

దేశమంతా బడులు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థల్ని తెరిచారు. సినిమాలు, మాల్‌ సెంటర్లు, వాణిజ్యం, వర్తకం వంటి కార్యకలాపాల కేంద్రాల న్నింటినీ తెరచుకొమ్మన్నారు. విధి–నిషేధాలతో జనహితంలో కట్టడి పాటించడం ఒకవైపు, రోజు వారీ కార్యకలాపాల్ని పునరుద్ధరించి, ఆర్థిక వ్యవస్థను పరుగెత్తించడం మరోవైపు... ప్రభుత్వాలకు పరస్పర విరుద్ధ ప్రయోజనాంశాలు! పరిస్థితులు చెయిదాటి మళ్లీ కట్టడి విధించాల్సిన పరిస్థితులే వస్తే... పౌరులు, ముఖ్యంగా పేద–అల్పాదాయ వర్గాలు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా దినకూలీలు! ఇది పునరావృతం కాకుండా పౌరసమాజమే చొరవ తీసుకోవాలి. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, నిరంతర పరిశుభ్రత బాధ్యతగా భావించి, పాటించాలి.

సామూహిక రోగనిరోధకతపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. బూస్టర్‌ డోస్‌ల అవసరం పెరుగు తోంది. వివిధ దేశాల్లో అందుకోసం ప్రత్యేక అనుమతులు ఇస్తున్నారు. వెనుకబడిన పలు దేశాల్లో ఇంకా తొలి విడత టీకా ప్రక్రియ కూడా పూర్తి కాలేదు. ఈ అసమానతలు మంచిది కాదు. మనం వంద కోట్ల టీకాలివ్వడం ఇటీవలే పూర్తిచేసుకున్నాం. మూడో అల వచ్చినా తట్టుకునేలా ఆక్సిజన్‌ సరఫరా, పడకల అందుబాటు, ఇతర వైద్య వ్యవస్థల్ని రాష్ట్ర–కేంద్ర స్థాయిలో సమకూర్చుకుం టున్నాం.

రెండు టీకాలు తీసుకున్న తర్వాత కొన్ని నెలలకు రోగనిరోధకత పడిపోయి వ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఓ అధ్యయన నివేదిక చెబుతోంది. దానికి విరుగుడుగా అందరూ బూస్టర్‌ డోస్‌ తీసుకోవాల్సి ఉంటుందనే ప్రచారం మిన్నంటింది. కోవిడ్‌ని ఎదుర్కొనే క్రమంలో ప్రపంచ జనమంతా ఇలా నిరంతరం టీకాలు, బూస్టర్లు తీసుకుంటూనే ఉండాల్సి వస్తే, ఇదొక ఫార్మా కార్పొరేట్‌–పారిశ్రామిక రంగం దీర్ఘకాలిక కుట్రేమో? అన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. ఇలాంటి అరిష్టాలన్నీ అధిగమించి గట్టెక్కాలంటే పౌరుల అప్రమత్తత, జాగ్రత్తలే ప్రధానం!

మరిన్ని వార్తలు