... అయినా మారని ట్రంప్‌!

6 Oct, 2020 00:47 IST|Sakshi

అధ్యక్ష ఎన్నికలు సరిగ్గా నెలరోజుల్లో ఉన్నాయనగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కరోనా వైరస్‌ బారినపడ్డారు. కరోనా విషయంలో ఆయనది మొదటినుంచీ ఉలిపికట్టె వ్యవహారమే. అసలు కరోనా అనేదే లేదని చెప్పడంతో మొదలుపెట్టి ఎప్పటికప్పుడు  ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తూ జనంలో అయోమయం సృష్టించారు. తాను మాస్క్‌ ధరించకపోవడం, ధరించినవారిని ఎద్దేవా చేయడం ఆయనకు అలవాటుగా మారింది. ఓక్లహామాలో జరిగిన ర్యాలీతోసహా అనేక ర్యాలీల్లో మాస్క్‌ ధరించవద్దంటూ పిలుపునిచ్చారు. ఇదంతా చూసి ఆరోగ్యరంగ నిపుణులు కంగారుపడ్డారు.  దాన్ని తేలిగ్గా తీసుకోవద్దని నచ్చజెప్పారు. అయినా ఆయన విన్నదెక్కడ? ఇదంతా సరే...ఇప్పుడు వ్యాధిగ్రస్తుడిగా తేలాక కూడా ఆయన పోతున్న పోకడలు అందరినీ నిర్ఘాంతపరుస్తున్నాయి. ఆరోగ్యం బాగయింది కనుక నేడో రేపో ఆయన ఆసుపత్రి నుంచి విడుదల కావచ్చన్న కథనాలు ఒకపక్క సాగుతుండగానే ఆసుపత్రి వెలుపల అభిమానుల్ని పలకరించే నెపంతో కారులో చక్కర్లు కొట్టి మరోసారి వార్తల్లోకెక్కారు.

ట్రంప్‌ అజాగ్రత్త వల్ల ఆయన భార్య మెలానియా ట్రంప్‌ మాత్రమే కాదు...రిపబ్లిన్‌ పార్టీ నేతలు అనేకులు వ్యాధిగ్రస్తులయ్యారు. అసలు ఫిబ్రవరిలో భారత్‌ పర్యటనకు ఆయన రావడానికి ముందే కరోనా మహమ్మారి నుంచి అమెరికాను రక్షించుకోవడానికి తీసుకోవా ల్సిన చర్యలపై ఆయనతో నిపుణులు చర్చించారు. ఆ తర్వాత కూడా చెప్పారు. కానీ ఈ సలహాలు ఆయనకు రుచించలేదు. కరోనా వైరస్‌ ప్రమాదకరమైనదే కావొచ్చుగానీ... కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అవలీలగా ఎదుర్కొనగలమని వారు చెబుతూనేవున్నారు. అమెరికాలో ఇంతవరకూ 76 లక్షల మందికి కరోనా వ్యాధి సోకింది. 2 లక్షల 14వేలమందికి పైగా చనిపోయారు. కరోనా ప్రభావిత దేశాల జాబితాలో ప్రస్తుతం అమెరికా అగ్రభాగాన ఉండటంలో ట్రంప్‌ మూర్ఖత్వం వాటాయే అధికం. ఆ మహమ్మారిని తేలిగ్గా తీసుకోకపోయి వుంటే, వెనువెంటనే పౌరుల్ని అప్రమత్తం చేసి వుంటే దేశంలో ఇంతమంది వ్యాధిగ్రస్తులు, ఇన్ని మరణాలు ఉండేవికాదని నిపుణులు లెక్కకట్టారు. ఈ వైరస్‌కు ఒకరి నుంచి ఒకరికి పెను వేగంతో వ్యాపించే లక్షణం వుందని వారు మొదట్లోనే చెప్పారు. అలాగే రోగ నిరోధక శక్తి బాగున్నవారిలో వచ్చిపోయినా తెలిసే అవకాశం లేదని, సోకినవారిలో సైతం కొన్నిరోజుల వరకూ దాని లక్షణాలే కనబడకపోవడం వల్ల అలాంటివారి ద్వారా అందరికీ వ్యాపిస్తుందని వారు చెప్పారు.

కానీ ట్రంప్‌ వినలేదు. ఈ వ్యాధి విషయంలో ఆయన మొదటినుంచీ నిర్లక్ష్యంగా వున్నారు. అందరినీ ఆ బాటే పట్టించారు. గత మే నెలలో ఆయన ఒక ట్వీట్‌ ద్వారా కరోనా దరి చేరకుండా వుండాలంటే వాడాల్సిన మందులు ఏకరువు పెట్టారు. మలే రియా నివారణకు వాడే క్లోరోక్విన్, అజిత్రోమైసిన్‌ టాబ్లెట్లు వారంరోజులపాటు వేసుకుంటే కరోనా దరిదాపుల్లోకి చేరదని చెప్పారు. ఆ వెంటనే ప్రపంచవ్యాప్తంగా వున్న వైద్య నిపుణులు మొత్తు కున్నారు. వైద్య పర్యవేక్షణలో మాత్రమే ఈ మందులు వాడాలని, ఎవరికి వారు వాడితే ప్రమాదం బారిన పడతారని హెచ్చరించాల్సివచ్చింది. లాక్‌డౌన్‌ విధించింది మొదలు దాన్ని ఎప్పుడు ఎత్తేస్తా రంటూ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించడమే ట్రంప్‌కు రివాజైంది. అలా ఎత్తేయని ప్రభుత్వాలపై తిరగ బడాలంటూ ఒక దశలో ఆయన పిలుపునిచ్చారు.  ట్రంప్‌ అసలు వ్యాధిబారిన పడ్డారన్న వార్తనే మొదట్లో ఎవరూ నమ్మలేదు. ఆయనేదో సర్వశక్తి మంతుడని కాదు. ట్రంప్‌ స్థానంలో మరొకరెవరైనా వుంటే ఎవరికీ అసలు ఇలాంటి సందేహం తలెత్తేది కాదు. ఒకవేళ ఎవరైనా అలా అనడానికి సాహసిస్తే అందరూ వారిపై విరుచుకుపడేవారు. కానీ ట్రంప్‌పై అనుమానాలు తలెత్తడానికి కారణాలున్నాయి.

ఆయన ఓటమి ఖాయమని దాదాపు సర్వేలన్నీ చెబుతున్నాయి. అలాగే అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి చర్చావేదికలో ట్రంప్‌ బల హీనత పూర్తిగా బట్టబయలైంది. ప్రత్యర్థి జో బైడెన్‌ అడిగే ప్రశ్నలకు ట్రంప్‌ జవాబు చెప్పలేక దూష ణకు దిగారు. పైగా అంతక్రితం ఎన్నికల వాయిదా గురించి ఆయన ఒకటి రెండుసార్లు ప్రస్తావిం చారు. వీటన్నిటివల్లా ఎన్నికల వాయిదా పడాలన్న ఉద్దేశంతో ఇలా చెబుతున్నారన్న సందేహాలు కలిగాయి. ఏమైతేనేం తనకెవరూ అతీతులు కారని కరోనా తేల్చేసింది. దీన్నుంచి ట్రంప్‌తోపాటు ఆయన సిబ్బంది కూడా గుణపాఠం నేర్చుకున్నట్టు లేదు. ఆయన ఆరోగ్యం గురించిన భిన్నమైన ప్రకటనలే ఇందుకు సాక్ష్యం. ట్రంప్‌ చాలా బాగా కోలుకుంటున్నారని, ఆయన్ను సోమవారమే పంపే స్తామని మిలిటరీ వైద్య కేంద్రంలోని వైద్యులు ప్రకటించగా... ట్రంప్‌ వైద్యుడు సీన్‌ కాన్‌లీ మాత్రం గురువారం ఆయన ఆసుపత్రిలో చేరింది మొదలు ఇంతవరకూ రెండుసార్లు అత్యవసరంగా ఆయ నకు ఆక్సిజెన్‌ అందించాల్సి వచ్చిందని చెప్పారు. అలాగే ఆయన ఉపయోగిస్తున్న స్టెరాయిడ్‌లలో కొన్ని వ్యాధి తీవ్రత ఎక్కువున్నవారికి మాత్రమే ఇచ్చేవని వైద్యులు చెబుతున్న మాట. ట్రంప్‌కు ముందు ఏ అధ్యక్షుడూ ఎన్నికల ముందు ఇలా ప్రమాదకర వ్యాధిబారిన పడలేదు. 

అయితే కరోనాపై గతంతో పోలిస్తే వైద్యులకు ఇప్పుడు మంచి అవగాహన వచ్చింది. దాన్ని నియంత్రించడంలో మెరుగైన విధానాలు తెలుసుకోగలిగారు. అయినా కూడా ఇప్పటికీ దాంతో జాగ్రత్తగా మెలగాల్సివుంటుందని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. దాని బారిన పడకుండా తీసుకునే ముందు జాగ్రత్త చర్యల్లాగే...వచ్చి తగ్గాక పాటించాల్సిన నియమాల విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకోవాల్సివుంటుంది. అందులో ఏమాత్రం తేడా వచ్చినా మళ్లీ తిరగబెట్టే ప్రమాదం వుంటుంది. వ్యాధి నుంచి కోలుకున్న వెంటనే వైరస్‌ శరీరం నుంచి పూర్తిగా నిష్క్రమించిందని చెప్పడానికి లేదు. అందుకు మరికొన్ని రోజుల వ్యవధి పడుతుంది. కనుక అంతవరకూ జాగ్రత్తలు పాటించాల్సివుంటుంది. కనీసం ఇప్పుడైనా నిర్లక్ష్యం పనికిరాదని ట్రంప్‌ గ్రహిస్తే అది ఆయనకే మంచిది. 

మరిన్ని వార్తలు