ట్రంప్‌ బాధ్యతారాహిత్యం

1 Aug, 2020 04:41 IST|Sakshi

ఊహించని రీతిలో మాట్లాడటం... అందరినీ బెదరగొట్టే నిర్ణయాలు అలవోకగా చేయడం, పెను దుమారం రేపడం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు అలవాటు. మరో నాలుగు నెలల్లో జరగాల్సిన దేశాధ్యక్ష ఎన్నికలను వాయిదా వేస్తే మంచిదంటూ గురువారం ఆయన చేసిన ట్వీట్‌ అమెరికాలో ఆ మాదిరి దుమారాన్నే సృష్టించింది. ఈలోగా తన ఉద్దేశం అదికాదంటూ ఆయన శుక్రవారం మరో ట్వీట్‌ చేశారు. మెయిల్‌ ద్వారా జరిగే ఓటింగ్‌లో అవకతవకలు జరగొచ్చునన్న అనుమానం మాత్రమే వ్యక్తం చేశానని, ఎన్నికలైన మూడు నెలల తర్వాత అవకతవకలు జరిగాయని తెలుసుకుంటే దేశం ఇబ్బందికర పరిస్థితుల్లో పడుతుంది గనుక ముందే దానిపై అప్రమత్తం చేశానని తాజాగా ట్రంప్‌ చెబుతున్నారు. అధ్యక్ష ఎన్నికలను అడ్డుకోవడం ఆయన తరంకాదని ఢంకా బజాయిస్తున్న వారున్నట్టే... ట్రంప్‌ ఏదో ఒకటి చేసి వీటిని ఆపే అవకాశం వుందని భయపడేవారున్నారు. 

కరోనా మహమ్మారి విరుచుకుపడటం మొదలుపెట్టిననాటినుంచి డెమొక్రాట్లలో చాలామంది ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఏదో ఒక సాకు చూపి ఆయన ఎన్నికల వాయిదా వేసే ప్రమాదం లేకపోలేదని వారు చెబుతూ వచ్చారు. అయితే అధ్యక్షుడి ఇష్టాయిష్టాలను అనుసరించి అధ్యక్ష ఎన్నికలు జరగవు. 1788లో తొలి ఎన్నికలు జరిగిననాటినుంచీ అవి క్రమం తప్పకుండా నవంబర్‌ 3నే జరుగుతున్నాయి. కనుకనే ట్రంప్‌ ధోరణి డెమొక్రాట్లకు మాత్రమే కాదు... రిపబ్లికన్లకు కూడా విపరీతమే అనిపించింది. అనేకమంది రిపబ్లికన్లు ఎన్నికల వాయిదాను ఎలా కోరతారంటూ ట్రంప్‌ను నిలదీశారు. ఇందువల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని వారి ఆందోళన.

వివిధ సర్వేల్లో తన డెమొక్రాటిక్‌ ప్రత్యర్థి జో బైడన్‌ కంటే ఆయన బాగా వెనకబడివున్నారు. ఎటూ దాపురించబోయే ఆ ఓటమికి ముందే కొన్ని కారణాలను వెదుక్కుంటే మంచిదన్న నిర్ణయానికి రావడం వల్లే ఆయన ఆ మాట అని వుండొచ్చు. కానీ అది ఆశించిన ఫలితం ఇచ్చే అవకాశం కనబడకపోగా, సొంత పార్టీలోనే బెడిసికొట్టింది. దాంతో ట్రంప్‌ వెనక్కి తగ్గారు. మెయిల్‌ ఇన్‌ ఓటింగ్‌ విధానం ఎందుకు చెడ్డదో, ఆ ప్రక్రియలో అవకతవకలు ఎలా చోటుచేసుకుంటాయని అనుకుంటున్నారో ఆయన సరిగా చెప్పలేదు. కాలిఫోర్నియా, కొలరాడో, హవాయి, ఒరెగాన్, ఉతా, వెర్మాంట్, వాషింగ్టన్‌ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ అమలవుతోంది. 

2000 సంవత్సరంలో ఒరెగాన్‌ తొలిసారి ఈ విధానాన్ని అమలు చేయగా, అనంతరకాలంలో మరో ఆరు రాష్ట్రాలు దాన్ని అనుసరించాయి. ఈ రాష్ట్రాల్లోని రిజిస్టర్డ్‌ ఓటర్లకు ప్రభుత్వాలే బ్యాలెట్‌ పేపరు మెయిల్‌ చేస్తాయి. తమకిష్టమైన అభ్యర్థిని ఎంచుకుంటూ ఓటేశాక, ఆ బ్యాలెట్‌ పేపర్లను ఓటర్లు తిరిగి మెయిల్‌ చేయొచ్చు. లేదా నిర్దేశించిన కేంద్రాలకు స్వయంగా వెళ్లి బ్యాలెట్‌ బాక్సుల్లో వేయొచ్చు. ఒరెగాన్‌ ఉదాహరణే తీసుకుంటే అక్కడ ఇంతవరకూ పదికోట్ల బ్యాలెట్లు మెయిల్‌ చేస్తే అందులో కేవలం 12 సందర్భాల్లో మాత్రమే అక్రమాలు జరిగాయన్న ఆరోపణలొచ్చాయి. గత 20 ఏళ్లలో మొత్తం 25 కోట్ల బ్యాలెట్‌లు మెయిల్‌ చేయగా అందులో 0.00006 శాతం మేర అక్రమమైనవి వున్నాయని తేలింది. రిపబ్లిన్లు సైతం ఎప్పుడూ అక్రమాలకు సంబంధించి ఆరోపణలు చేయలేదు. కనుక ఇప్పుడు హఠాత్తుగా అవకతవకల గురించి ప్రస్తావన తీసుకురావడం వెనక తాను నెగ్గే అవకాశం లేని ఎన్నికలపై అందరిలోనూ ముందుగా అనుమాన బీజాలు నాటడమే ట్రంప్‌ ప్రధాన ధ్యేయంగా కనబడుతోంది. 

అయితే అమెరికా రాజ్యాంగంలో ఎన్నికలను ఆలస్యం చేయడానికి లేదా రద్దు చేయడానికి అధ్యక్షుడికి ఎలాంటి అధికారాలూ లేవు. ఆ నిబంధనను సవరించి, దాన్ని నెగ్గించుకోగల బలం ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు లేదు. సెనేట్‌లో రిపబ్లికన్లకు బలం వున్నమాట వాస్తవమే అయినా, వారిలో చాలామంది ట్రంప్‌ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతికూలతలన్నీ అధిగమించి ఒకవేళ ఎన్నికలు వాయిదా వేయగలిగినా ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ తమ పదవుల్లో కొనసాగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇరవయ్యో రాజ్యాంగ సవరణ ప్రకారం జనవరి 20వ తేదీ మధ్యాహ్నంతో వారి పదవీకాలం ముగుస్తుంది. ఒకవేళ ట్రంప్‌ కోరికే నెరవేరి ఎన్నికలు వాయిదాపడినా, రద్దయినా అధ్యక్ష, ఉపాధ్యక్ష బాధ్యతలు ఎవరు చూస్తారన్నది చెప్పడం కష్టం. అదంతా అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. దానికి సంబంధించిన నిబంధనలున్నా వాటి అవసరం ఇంతవరకూ ఎప్పుడూ రాలేదు. కనుకనే ట్రంప్‌ను నెత్తిన పెట్టుకు మోస్తున్న రిపబ్లికన్లుగానీ, అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ ప్రతినిధులుగానీ ఎన్నికల వాయిదా విషయంలో ట్రంప్‌కు అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడటానికి సిద్ధపడలేకపోయారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఏటికి ఎదురీదుతోంది. 30వ దశకంనాటి మహా మాంద్య పరిస్థితులు ఆ దేశాన్ని ఇప్పుడు చుట్టుముట్టాయి. వినియోగిత బాగా పడిపోయింది. వ్యాపారం దెబ్బతింది. ఇదంతా మళ్లీ నిలబడుతుందని అందరూ ఆశిస్తుండగానే కొత్తగా బయటపడుతున్న కరోనా కేసులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. మొత్తంగా అయిదేళ్ల వృద్ధి తుడిచిపెట్టుకుపోయింది. రెండో దఫా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించండంటూ వైట్‌హౌస్‌ పైనా, కాంగ్రెస్‌పైనా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. జీడీపీ దారుణంగా పడిపోయిందన్న తాజా గణాంకాలకు తోడు ట్రంప్‌ చేసిన ట్వీట్‌ పర్యవసానంగా స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలింది. కరోనా స్వైరవిహారం మొదలయ్యాక ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించిన 3 లక్షల కోట్ల ప్యాకేజీ ద్వారా వేలాది కంపెనీలు తమ ఉద్యోగులకు ఇన్నాళ్లుగా వేతనాలిస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోయినవారికి వారానికోసారి 600 డాలర్ల నిరుద్యోగ భృతి ఇస్తున్నాయి. శనివారంతో ఇది నిలిచిపోయింది. ఈ తరుణంలో దేశాధినేతగా ఎంతో బాధ్యతగా మెలగాల్సిన ట్రంప్‌ మరింత అస్థిరతకు తావిచ్చేలా ప్రవర్తించారు. ఇది ప్రమాదకరమైన ధోరణి.

మరిన్ని వార్తలు