రోడ్డు ప్రమాదాలు ఆపలేమా! 

2 Dec, 2020 00:41 IST|Sakshi

రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో చట్టం చేయలేని పని కరోనా పర్యవసానంగా విధించిన లాక్‌ డౌన్‌ చేసిందని సుప్రీంకోర్టుకు వివిధ రాష్ట్రాలు సమర్పించిన నివేదికలు చెబుతున్నాయి. నిరుడు జనవరిలో మోటారు వాహనాల చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. దాని ప్రకారం ట్రాఫిక్‌ ఉల్లం ఘనలకు ఇకపై భారీ జరిమానాలు విధించే అవకాశం ఏర్పడిందన్నారు. ఇందువల్ల గణనీయంగా ప్రమాదాలు తగ్గుతాయని చాలామంది అంచనాలు వేశారు. కానీ పరిస్థితి పెద్దగా మెరుగైన దాఖలా లేదు. అయితే లాక్‌డౌన్‌ వల్ల మాత్రం రోడ్డు ప్రమాదాలు తగ్గాయి.

అది ఎత్తేశాక ప్రమాదాలు మళ్లీ యధాప్రకారం పెరిగాయని తాజా నివేదికల సారాంశం. ఈ జనవరినుంచి సెప్టెంబర్‌ వరకూ రోడ్డు ప్రమాద మరణాలు అంతక్రితంతో పోల్చి చూస్తే బాగా తగ్గాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి సంఖ్య 2019 ఏప్రిల్‌–జూన్‌ మధ్య 1,27,157మంది వుండగా, ఈ ఏడాది అదే కాలంలో గాయపడినవారు 57,755మంది మాత్రమే. ఈ కాలంలో అత్యధిక భాగం లాక్‌డౌన్‌లోనే గడిచింది కాబట్టే ఈ తగ్గుదల కనబడింది. లాక్‌డౌన్‌ కాలంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడం, రహదార్లపైకి తక్కువ సంఖ్యలో వాహనాలను అనుమతించడం అందుకు కారణం.  

నిరుడు సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన మోటారు వాహనాల(సవరణ) చట్టాన్ని అమలు చేయడానికే మొదట్లో చాలా ప్రభుత్వాలు సందేహించాయి. అమలు మొదలుపెట్టిన రాష్ట్రాలు కూడా కొన్నిరోజులు గడిచేసరికల్లా పునరాలోచనలో పడ్డాయి. మొదట్లో భారీ జరిమానాలు అమలు కావాల్సిందేనని, ఈ విషయంలో పునరాలోచన వుండబోదని కేంద్ర ప్రభుత్వం చెప్పినా మరికొన్ని రోజులు గడిచేసరికి అది మెత్తబడింది. జరిమానాలు ఎంత వుండాలో రాష్ట్రాలు నిర్ణయించుకోవచ్చని వెసులుబాటునిచ్చింది. గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం చట్టంలోని జరిమానాలతో పోలిస్తే గణ నీయంగా తగ్గించేసింది.

ఒడిశా రాష్ట్రమైతే మొన్న మార్చినుంచి మాత్రమే చట్టాన్ని అమలు చేయడం మొదలుపెట్టింది. వీటన్నిటికీ రాజకీయ ఒత్తిళ్లే కారణమని వేరే చెప్పనవసరంలేదు. ఏటా విడుదలయ్యే జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదికలు చూస్తే భయం కలుగుతుంది. మొన్న అక్టోబర్‌లో విడుదలైన ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం 2019లో మొత్తం 4,37,396 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 1,54,732మంది ఆ ఉదంతాల్లో కన్నుమూశారు. ఇందులో 1,39,000 ఉదం తాలు జరిమానాలు భారీగా పెంచాక జరిగినవే. ఎన్‌సీఆర్‌బీ వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలు ఇచ్చే గణాంకాలపై ఆధారపడి నివేదిక రూపొందిస్తుంది. అయితే ప్రమాదాలన్నీ ఫిర్యాదుల వరకూ రావని, కాబట్టి వాస్తవ ప్రమాదాలు, మరణాల సంఖ్య ఆ నివేదికల్లో చూపే గణాంకాలనుమించి వుంటాయని నిపుణులంటారు.

ఢిల్లీ ఐఐటీ కొన్నేళ్లక్రితం రూపొందించిన నివేదిక ప్రకారం చూస్తే అధికారిక గణాంకాలకన్నా వాస్తవ మరణాలు 47–63 శాతం ఎక్కువగా వుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా 2016లో ఇదే విధంగా చెప్పింది. భారత్‌లో ప్రభుత్వ గణాంకాల కన్నా రోడ్డు ప్రమాదాల మృతులు కనీసం రెండు రెట్లు ఎక్కువుండొచ్చని అభిప్రాయపడింది. నగరాలు, పట్ట ణాల్లో వెనువెంటనే ఫిర్యాదులందినట్టుగా పల్లెసీమల్లో వుండకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

కొత్త చట్టం అమలు మొదలైనప్పుడు వాహన చోదకుల్లో చాలామంది భయపడ్డారు. ఏమాత్రం తేడా వచ్చినా భారీ వడ్డనలు తప్పవనుకున్నారు. అనేక నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద జీబ్రా క్రాసింగ్‌కు ముందే వాహనాలను ఆపడం కనబడింది. శరవేగంతో పోయే ధోరణి కూడా మారింది.  హెల్మెట్‌ ధరించకపోతే విధించే జరిమానాలు, భారీ శబ్దం చేసే హారన్‌లు మోగిస్తే విధించే జరిమానాలు పెరగడంతో ఎవరికివారు నాగరికంగా వుండటం నేర్చుకున్నారు. కానీ కొన్ని వారాలు గడిచేసరికల్లా పరిస్థితి మొదటికొచ్చింది. ఏ నిబంధననైనా స్థిరంగా అమల్లో వున్నప్పుడే మెరుగైన ఫలితాలొస్తాయి. వాహనచోదకుల్లో చాలామంది ట్రాఫిక్‌ పోలీసులతో తగాదాకు దిగడం చూసి రాజ కీయ పక్షాలు కూడా అలాంటివారికి మద్దతు పలకడంతో ప్రభుత్వాలు కూడా వెనక్కి తగ్గడం మొద లుపెట్టాయి.

మోటారు వాహనాల చట్టం ప్రకారం ఇంతక్రితం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిం చేవారిపై రూ. 100 జరిమానా వుంటే దాన్ని రూ. 500కు పెంచారు. గరిష్ట మొత్తం రూ. 10,000 వరకూ వుంది. కేంద్రం ఇచ్చిన వెసులుబాటుతో కొన్ని రాష్ట్రాలు తర్వాతకాలంలో ఈ జరిమానాల్లో మార్పులు చేసుకున్నాయి.  అయితే ప్రభుత్వాల పరంగా అనేకానేక లోపాలున్నాయి. రహదార్లు ఎలా వున్నాయో, సిగ్నలింగ్‌ వ్యవస్థలెలా పనిచేస్తున్నాయో సక్రమంగా పట్టించుకునేవారు లేకుండా పోవడంతో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడేవారికి అవి వరంగా మారాయి. ప్రభుత్వాల లోటు పాట్లను చూపి, తమనుతాము సమర్థించుకునేవారు అంతకంతకు పెరిగారు.

ఏతావాతా కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల మాత్రమే మన దేశంలో ప్రమా దాల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గాయి. ఈ అంశాన్ని ప్రభుత్వాలన్నీ తీవ్రంగా పట్టించుకోవాలి. ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశం మనదే. ప్రకృతి వైపరీత్యాలు, అంటు వ్యాధులు, ఉగ్రవాద ఉదంతాలు వగైరాల్లో మరణించేవారితో పోలిస్తే రోడ్డు ప్రమాదాల్లో మరణిం చేవారే అధికమని ఏటా నిరూపణవుతోంది. మోటారు వాహనాల చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిందే. అదే సమయంలో దెబ్బతిన్న రహదారులను ఎప్పటికప్పుడు మరమ్మతు చేయడం, రహదార్ల నిర్మాణంలో వున్న లోపాలను సరిచేయడంవంటివి కొనసాగుతుండాలి. అలాగే డ్రైవింగ్‌ లైసెన్సుల మంజూరులో చోటుచేసుకుంటున్న అవకతవకలను సరిదిద్దాలి. తమ వంతుగా చేయాల్సి నవి ప్రభుత్వాలు చేసినప్పుడే వాహనచోదకుల్లో కూడా చట్టాలంటే భయభక్తులుంటాయి. వారు దారికొస్తారు. కేవలం లాక్‌డౌన్‌ వంటివి మాత్రమే భారత్‌లో రోడ్డు ప్రమాదాలను నివారిస్తాయనే అభిప్రాయం అందరిలో కలిగితే అది మన అసమర్థతను పట్టిచూపిస్తుంది.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా