పాలకుల కర్తవ్యం ఇదేనా?

9 Sep, 2022 00:49 IST|Sakshi

కాలానికీ, అవసరాలకూ తగ్గట్టుగా అన్నీ మారతాయి... మారాల్సిందే. అయితే, ఆ మార్పుల వెనుక ఉద్దేశాల పట్ల అనుమానాలు తలెత్తినప్పుడే అభ్యంతరాలు వస్తాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశ రాజధానిలో చేపట్టిన ‘సెంట్రల్‌ విస్టా’ ఆధునికీకరణ ప్రాజెక్ట్‌ తొలి దశ గురువారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైన తీరు, ‘రాజ్‌పథ్‌’కు ‘కర్తవ్యపథ్‌’గా పేరు మార్చడం చర్చకు తావిచ్చింది అందుకే! కేవలం 19 నెలల్లో ఇండియా గేట్‌ పరిసరాలు కళ్ళు చెదిరేలా మారిపోయాయి. కనువిందు చేస్తూ, గర్వకారణమనిపించే ఈ ఆధునిక మార్పులను ఆహ్వానించాల్సిందే. ఇండియాగేట్‌ సమీపాన బ్రిటీష్‌ కాలంలో కింగ్‌ అయిదో జార్జ్‌ విగ్రహమున్నచోట నేతాజీ ప్రతిమ పెట్టడమూ స్ఫూర్తిదాయ కమే. కానీ, భారీ విగ్రహాలు పెట్టి, రోడ్లకు పేర్లు మార్చి, దేశం సుభిక్షమని నమ్మింపజూస్తేనే చిక్కు. బానిసత్వాన్ని వదిలించుకోవాలని నోటితో చెబుతూ, తాము ప్రభువులమన్నట్టు ప్రవర్తిస్తేనే కష్టం.

కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్, కొత్త పార్లమెంట్‌పై 4 సింహాల చిహ్నం, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్, సెంట్రల్‌ విస్టా... ఇలా ప్రతి కొత్త ప్రారంభోత్సవం ఇవాళ ఒక జాతీయవాద ప్రచార ఆర్భాటం. ప్రజల్లోకి చొచ్చుకుపోయేందుకు ఓ సరికొత్త రాజకీయ నేరేటివ్‌. గత నెలరోజుల్లోనే దేశవ్యాప్తంగా 30 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనో, ప్రారంభమో చేశారు. అలా దీన్ని 2024 ఎన్నికలకు ముందస్తు సన్నాహంగా మార్చడం పాలకుల గడుసుతనం. ఈ క్రమంలో వలసవాద అవశేషాలను తొలగిస్తున్నామంటూ... సామాన్యులు సైతం స్వేచ్ఛగా తిరిగిన ఇండియాగేట్‌ ప్రాంతాన్ని ‘కర్తవ్య పథ్‌’గా వారికి దూరం చేయడమే విరోధాభాస. ఈ ఏడాది స్వాతంత్య్ర దిన ప్రసంగంలోనే ప్రధాని ఈ ‘కర్తవ్యపథ’ నిర్దేశం చేసేశారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాల్ని నిలబెట్టుకోవాలన్న డిమాండ్లను పక్కన బెట్టి, పౌరుల కర్తవ్యాన్ని నొక్కిచెప్పారు. ప్రజలే ప్రభువులని గుర్తు చేస్తున్న రాజ్‌పథ్‌ను, ప్రజలకు వారి కర్తవ్యాన్ని గుర్తుచేసే కర్తవ్యపథ్‌గా మార్చారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం లాంటి సమస్యల పరిష్కారం పాలకుల కర్తవ్యం. అది వదిలేసి ‘నామ్‌కే వాస్తే’ మార్పులపై దృష్టిపెడితే ఎలా? 

కాన్వాయ్‌ల మొదలు అనేక అంశాల్లో నేటికీ వలస పాలన అవశేషాలనే అనుసరిస్తున్న మన పాలకులు ముందుగా వారు వదులుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నిజానికి, రాష్ట్రపతి భవన్‌ నుంచి విజయ్‌ చౌక్, ఇండియా గేట్‌ మీదుగా పురానా ఖిల్లా దాకా సాగే మార్గం రాజ్‌పథ్‌. రైజీనా హిల్‌పై నుంచి పురానా ఖిల్లా దాకా ఆ మార్గాన్ని పరికిస్తున్నట్టుగా కట్టిన అప్పటి వైస్రాయ్‌ భవనమే నేటి రాష్ట్రపతి భవన్‌. ఆ మాటకొస్తే న్యూఢిల్లీ, అక్కడి భవనాలు, ఇండియా గేట్‌ లాంటి చారిత్రక కట్టడాలు బ్రిటీష్‌ హయాంలో నిర్మాణమైనవే. వాటన్నిటినీ బానిస చిహ్నాలుగా తృణీకరిస్తామా? చక్రవర్తి అయిదో జార్జ్‌ 1911లో భారత సందర్శనకు వచ్చినప్పుడు ‘ఢిల్లీ దర్బార్‌’ జరిగింది. కలకత్తా నుంచి ఢిల్లీకి దేశ రాజధానిని మార్చారు. ఆ జ్ఞాపకంగా బ్రిటీషర్లు ఈ మార్గానికి ‘కింగ్స్‌ వే’ అని పేరు పెట్టారు. దాని మీదుగా వెళ్ళే మరో రోడ్‌ను ‘క్వీన్స్‌ వే’ అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ‘కింగ్స్‌ వే’ను ‘రాజ్‌పథ్‌’ అనీ, ‘క్వీన్స్‌ వే’ను ‘జన్‌పథ్‌’ అనీ నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్చింది.

నిజానికి, ఆ కొత్త పేర్లేమీ పాతవాటికి అనువాదాలు కావు. ‘రాజ్‌ పథ్‌’ అంటే రాజుల మార్గమని కాదు... ‘రాజ్య (ప్రభుత్వ) పథ’మనే అర్థం. ఆ రకంగా అప్పుడే ఆ వలస పాలకుల నామకరణా లను ప్రజాస్వామ్య చిహ్నాలుగా మార్చారు. ఆ పేర్లలో జన్‌సంఘ్‌ సహా ఎవరికీ కనిపించని వలస వాదం, బానిసత్వం తీరా ఇప్పుడు దర్శనమివ్వడమే విడ్డూరం. పేరులో ఏముంది పెన్నిధి అంటారు కానీ, ప్రతి పేరూ భావోద్వేగాలు రేకెత్తించగలదని ఎనిమిదిన్నరేళ్ళుగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి తెలుసు. అధికారంలోకి వచ్చిన ఏడాదికే 2015లోనే వీధులు, నగరాలు, అవార్డుల పేర్లు మార్చే పనిలో పడింది. ఢిల్లీలోని ఔరంగజేబ్‌ రోడ్‌ను అబ్దుల్‌ కలామ్‌ రోడ్‌గా మార్చడంతో మొదలుపెట్టి, ప్రధాని నివాసం ఉండే రేస్‌కోర్స్‌ రోడ్‌ను లోక్‌కల్యాణ్‌ మార్గ్‌గా, నెహ్రూ స్మారక మ్యూజియమ్‌ – లైబ్రరీ ఉన్న ఒకప్పటి నెహ్రూ నివాసం తీన్‌మూర్తి భవన్‌ను ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’గా మార్చేసింది. అక్బర్‌ రోడ్, హుమాయూన్‌ రోడ్‌ పేర్లు తదుపరి అజెండాలో ఉన్నాయట.

ఈ దేశపు సమ్మిశ్రిత సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన పేర్లను తొలగించి, హిందూ పునరుద్ధరణవాద నామకరణాల వల్ల సమాజంలో సామరస్యం కొరవడితే అది పూడ్చలేని నష్టం. ఒక వర్గం కన్నా అధికులమనే భావన మరో వర్గంలో కలిగితే, అది సమాజాన్ని నిలువునా చీలు స్తుంది. 2019 ఎన్నికలకు ముందు ఒక్క యూపీలోనే అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గా, ఫైజాబాద్‌ జిల్లాను అయోధ్య జిల్లాగా, మొఘల్‌ సరాయ్‌ రైల్వే జంక్షన్‌ను జన్‌సంఘ్‌ సిద్ధాంతవేత్త పేరిట దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జంక్షన్‌గా ఏ వలసవాద పాలన అవశేషాలున్నాయని మార్చారు? ఇది దేశ బహుళత్వ గుర్తింపును నిరాకరించడమే. చరిత్రలో మొఘల్‌ చక్రవర్తుల భాగాన్ని కనుమరుగు చేసే ప్రయత్నమే. రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డ్‌ పేరు ధ్యాన్‌చంద్‌ అవార్డుగా మారడం వెనుకా హాకీ దిగ్గజంపై గౌరవం కన్నా రాజకీయంగా తేల్చుకోదలచిన లెక్కలే ఎక్కువ. హైదరాబాద్‌ పేరును ‘భాగ్య నగర్‌’గా మారుస్తామని ఇటీవల బీజేపీ నేతలు ప్రకటించారు. ఏ చారిత్రక ఆధారాలతో ఆ మాట అన్నారో చెప్పలేం. ఇక, ఢిల్లీని ‘ఇంద్రప్రస్థం’గా మారుస్తారనీ ఓ ప్రచారం. వెరసి, ఈ పేర్ల మార్పు ధోరణితో ఎక్కడికెళతాం? వలస పాలకులు పోయారు కానీ, గద్దెపై పెద్దలు ప్రాధాన్యాలు మర్చిపో తేనే ఇబ్బంది. పాలకులు కర్తవ్యం విడిచి, దోవ తప్పితే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కిం కర్తవ్యం?

మరిన్ని వార్తలు