అట్లాంటా విషాదం

20 Mar, 2021 06:32 IST|Sakshi

అమెరికాలో తుపాకి సంస్కృతి కొత్తకాదు. హఠాత్తుగా ఉన్మాదం ఆవహించినట్టు జనంపై విరుచుకు పడి దాడులు చేసిన ఉదంతాలు అక్కడ తరచుగా  చోటు చేసుకుంటున్నాయి. అట్లాంటాలో మొన్న మంగళవారం ఈ తరహాలోనే ఒక దుండగుడు దాడి చేసి 8 మంది ప్రాణాలు తీశాడు. వీరిలో ఆరుగురు ఆసియా సంతతికి చెందిన మహిళలు. మరో ఇద్దరు శ్వేత జాతీయులు.

ఇది జాత్యహంకార దాడా, వేరే కారణాలున్నాయా అన్నది తెలియాల్సివున్నా... గత ఏడాది కాలంగా ఆసియా సంతతి వారిని లక్ష్యంగా చేసుకుని ఏదో రకమైన దాడులకు పాల్పడటం మాత్రం పెరిగిందని జాత్యహంకార దాడుల నిరోధానికి పనిచేస్తున్న సంస్థ చెబుతోంది. వాస్తవానికి దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే అట్లాంటా ప్రశాంతమైన ప్రాంతమని, ఇక్కడ కాల్పుల ఘటనలు ఇంతక్రితం పెద్దగా లేవని స్థానికులు చెబుతున్న మాట. నిరుడు అక్కడ ఒకే ఒక ఘటన జరిగిందని వారంటున్నారు.

మొత్తంగా అమెరికా విధానాలనూ, రాజకీయాలనూ తుపాకులే శాసిస్తున్న వర్తమాన పరిస్థితుల్లో ఇలాంటి విషాద ఘటనలు చోటుచేసుకోవటంలో వింతేమీ లేదు. రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారికన్నా తుపాకులకు బలవుతున్నవారే ఎక్కువగా వున్న సందర్భాలు అమెరికా చరిత్రలో లేకపోలేదని చెబు తారు. అయినా అమెరికా వీటినుంచి నేర్చుకున్నదేమీ లేదు. తుపాకుల వినియోగాన్ని నియంత్రిం చటానికి డెమొక్రాటిక్‌ పార్టీ ఏదోమేరకు ప్రయత్నిస్తుంది. కానీ రిపబ్లికన్లు ఇందుకు ససేమిరా వ్యతిరేకం. మారణాయుధాలు దగ్గరుంచుకోవటం పౌరహక్కుల్లో భాగమని వారి అభిప్రాయం.

తుపాకి ఉత్పత్తిదారుల లాబీ బలంగా వుండటం వల్లనే ఇలా జరుగుతోందన్నది చాలామంది ఆరోపణ. తుపాకులను యధేచ్ఛగా విక్రయించే సంస్కృతి గతంలో బ్రిటన్‌ తదితర దేశాల్లో కూడా వుండేది. కానీ ఆ దేశాలు క్రమేపీ అందుకు దూరమయ్యాయి. తగిన నియంత్రణలు విధించాయి. ఇప్పుడు దాడి చేసిన 21 ఏళ్ల యువకుడు మసాజ్‌ సెంటర్ల ముసుగులో వ్యభిచారాన్ని సాగిస్తున్న వారిపట్ల ఆగ్రహంతో ఇలా చేశాను తప్ప జాతిపరమైన కక్షతో కాదని పోలీసులకు చెప్పాడంటు న్నారు. అయితే ఇందులో నిజానిజాలేమిటో లోతుగా దర్యాప్తు చేస్తే తప్ప వెల్లడికాదని వారు చెబుతున్నారు. 

అమెరికా సమాజంలో అన్నిచోట్లా వున్నట్టే ఆధిపత్య భావజాలం అల్లుకుని వుంది. ఆ భావజాలం పురుషాహంకారం, జాత్యహంకారం రూపాల్లో తరచు బయటపడుతుంటుంది. మూకుమ్మడి మారణకాండ ఉదంతాలు చోటుచేసుకోవటానికి ఇవే ప్రధాన కారణాలు. నాలుగేళ్ల క్రితం కాన్సాస్‌లో తెలుగువాడైన శ్రీనివాస్‌ కూచిభొట్ల ఇలాంటి ఉన్మాది చేతుల్లోనే బలైపోయాడు. ఒకప్పుడు అన్నిటా అగ్రభాగంలోవున్న తమ దేశం ఆఫ్రో అమెరికన్లు, ముస్లింలు, వలసదారుల కారణంగా నాశనమైపోతున్నదని భావించే ఇలా కక్ష తీర్చుకున్నానని దుండగుడు అప్పట్లో చెప్పాడు.

దేశంలో నివసిస్తున్న అన్ని జాతులు, మతాలు, సంస్కృతులు సమష్టిగా కృషి చేయబట్టే ప్రపంచంలో అగ్రభాగాన నిలబడగలిగామన్న వాస్తవాన్ని ఈ మాదిరి ఆధిపత్య భావజాలంలో పడి కొట్టుకుపోతున్నవారికి అర్థంకాదు. అలాంటివారిని ఏదోమేరకు చక్కదిద్దాల్సిన తరుణంలో డోనాల్డ్‌ ట్రంప్‌ రంగ ప్రవేశం చేసి ఆ ధోరణిని మరింతగా ప్రోత్సహించారు. 2016 అధ్యక్ష అభ్యర్థిత్వంకోసం ప్రయత్నాలు ప్రారంభించినప్పటినుంచి ఆయన శ్వేతజాతి దురహంకారాన్ని ఒక పద్ధతి ప్రకారం రెచ్చగొడుతూ పోయారు. ‘అమెరికాను మళ్లీ అగ్రభాగాన నిలబెడదామంటూ ఆయన ఇచ్చిన నినాదం అప్పటికి పదేళ్లుగా అధికారానికి దూరంగా వున్న రిపబ్లికన్‌ పార్టీకి ఊపిరిపోసి వుండొచ్చు గానీ, అమాయకుల్ని అకారణంగా పొట్టనబెట్టుకునే ఉన్మాదులకు కూడా ఊతం ఇచ్చింది. శ్రీనివాస్‌ కూచిభొట్లను హత్య చేసిన ఏడాదే ఓర్లాండోలోని నైట్‌ క్లబ్‌పై కొందరు దాడి చేసి 50 మందిని కాల్చి చంపారు. ఆ మరుసటి ఏడాది లాస్‌వెగాస్‌లో సంగీత కచేరి చూస్తున్న 60మందిని తుపాకి గుళ్లకు బలిచేశారు. ఆ ఉదంతంలో 500మందికి పైగా గాయపడ్డారు. 

అట్లాంటా దాడిని జాత్యహంకారంనుంచి వేరు చేసి చూడటం సాధ్యం కాదు. ఆసియా సంతతివారిలో కూడా ప్రత్యేకించి మహిళలనే లక్ష్యంగా ఎంచుకుని దాడులు జరుగుతున్నాయన్నది వీటిని అధ్యయనం చేస్తున్న విశ్లేషకులు చెబుతున్న మాట. పురుషులతో పోలిస్తే మహిళలపై జరిగిన దాడులు రెట్టింపు వున్నాయని వారు వివరిస్తున్నారు. డోనాల్డ్‌ ట్రంప్‌ నాలుగేళ్లు అధికారంలోవుండగా అవకాశం చిక్కినప్పుడల్లా వలసవచ్చి స్థిరపడినవారిని ద్వేషిస్తూ మాట్లాడేవారు. వారిని వెళ్లగొడితే తప్ప స్థానికులకు ఉద్యోగావకాశాలుండవని చెప్పేవారు.

శ్రీనివాస్‌ కూచిభొట్ల ఉదంతం జరిగి నప్పుడు కూడా మొదట్లో ఆయన స్పందించటానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత నలుమూలలనుంచీ విమర్శలు రావటంతో సంతాపం వ్యక్తంచేశారు. నేరాలు జరగని సమాజం, ఉన్మాదులు లేని ప్రదేశం ఎక్కడా వుండవన్నది నిజమే. కానీ అలాంటి పెడధోరణుల్ని నియంత్రించటానికి ఏం చేస్తున్నామని వ్యక్తులైనా వ్యవస్థలైనా ప్రశ్నించుకోనట్టయితే, సకాలంలో తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోనట్ట యితే అవి పెరుగుతూ పోతాయి. ఇక అధికారంలో వున్నవారే ఆజ్యం పోస్తే అవి మరింత పెచ్చరిల్లు తాయి. గత నాలుగేళ్లుగా అమెరికాలో జరిగింది అదే. తాజా ఉదంతంపై అధ్యక్షుడు జో బైడెన్‌ వెంటనే స్పందించటం బాగానే వున్నా ఈ తరహా ఉన్మాదాన్ని అరికట్టటానికి అవసరమైన విధానా లను రూపొందించాలి. ముఖ్యంగా తుపాకి సంస్కృతిని రూపుమాపేందుకు కృషి చేయాలి.

మరిన్ని వార్తలు