మళ్లీ మయన్మార్‌ సూకీదే

19 Nov, 2020 00:33 IST|Sakshi

మయన్మార్‌లో ఈ నెల 8న జరిగిన ఎన్నికల్లో వరసగా రెండోసారి కూడా ఆంగ్‌సాన్‌ సూకీ నాయకత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమాక్రసీ(ఎన్‌ఎల్‌డీ) విజయం సాధించింది. పార్లమెంటులోని మొత్తం 664 స్థానాల్లో ప్రజలు ఎన్నుకోవడానికి కేటాయించినవి 476. అందులో ఎన్‌ఎల్‌డీ 346 గెల్చుకుందంటే సూకీపై ప్రజా విశ్వాసం చెక్కుచెదరలేదని అర్థం. అయిదు దశాబ్దాల సైనిక నియంతృత్వానికి ముగింపు పలుకుతూ అయిదేళ్లక్రితం జరిగిన ఎన్నికల్లో ఆమెకు ఇదే స్థాయిలో సీట్లు లభించాయి.

ప్రభుత్వం ఏర్పర్చడానికి కావలసిన కనీస మెజారిటీ 322. పార్లమెంటులోని మిగిలిన స్థానాలకు సైనిక ప్రతినిధులుంటారు. సైన్యం వత్తాసువున్న యూనియన్‌ సాలిడారిటీ అండ్‌ డెవెలప్‌మెంట్‌ పార్టీ(యూఎస్‌డీపీ)కి 25 స్థానాలు మాత్రమే లభించాయి. ఈసారి దానికి కూడా ప్రభుత్వంలో చోటివ్వబోతున్నారు. పేరుకు మయన్మార్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ వున్నట్టు కనబడు తున్నా అది పూర్తిగా సైన్యంనీడలోనే మనుగడ సాగించాలి. ఏమాత్రం తేడా వున్నట్టు కనబడినా సైన్యం పంజా విసురుతుంది.

ఎన్‌ఎల్‌డీ సాగించిన గత అయిదేళ్ల పాలన అంత సంతృప్తికరంగా ఏమీ లేదు. అందుకు ఆ ప్రభుత్వానికున్న పరిమితులే కారణం. అధ్యక్షుడు విన్‌ మింట్, ఉపాధ్యక్షుడు హెన్రీ వాన్‌ షియోలే చేతుల మీదుగా పాలన సాగినా వారు స్టేట్‌ కౌన్సెలర్‌గా వ్యవహరించే సూకీ మార్గదర్శకత్వంలోనే పనిచేస్తున్నారు. ఆమె పూర్తి స్థాయిలో అధ్యక్షురాలైతే పాలనపై తమ  పట్టు జారుతుందన్న భయంతో సైన్యం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. విదేశీయుల్ని పెళ్లాడినా, విదే శాల్లో పుట్టిన పిల్లలున్నా అలాంటివారు అధ్యక్ష పీఠానికి అనర్హులవుతారంటూ 2008లో రూపొందిం చిన రాజ్యాంగంలో నిబంధన విధించారు. ఆ తర్వాతే 2015లో సైనిక పాలకులు ఎన్నికలకు సిద్ధపడ్డారు.

అలాగే పార్లమెంటు మొదలుకొని కింది స్థాయి చట్టసభల వరకూ 75 శాతం స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగేలా, మిగిలిన 25 శాతం స్థానాల్లో సైన్యం నామినేట్‌ చేసేవారు సభ్యుల య్యేలా మరో నిబంధన పొందుపరిచారు. ఈ 25 శాతం స్థానాలకూ ఎన్నికలు జరగవు. రాజ్యాంగంలో మరో చిత్రమైన నిబంధన కూడా వుంది. హోంమంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, సరిహద్దు వ్యవహారాల మంత్రిత్వ శాఖలపై పూర్తి పెత్తనం సైన్యానిదే. ఈ నిబంధనల చక్ర బంధంలో ఏ ప్రభుత్వమైనా సవ్యంగా పాలన సాగించగలదా? గత అయిదేళ్లుగా ఎన్‌ఎల్‌డీ ప్రభుత్వం ఒకరకంగా అయోమయావస్థను ఎదుర్కొంది. 

అయితే ఇందుకు సూకీని కూడా తప్పుబట్టాలి. పరిస్థితులు సక్రమంగా లేవనుకున్నప్పుడు వాటిని మార్చడానికి పోరాడాలి. అందరినీ కూడగట్టి విజయం సాధించాలి. వాస్తవానికి సూకీ నేపథ్యం అటువంటిదే. బ్రిటిష్‌ జాతీయుణ్ణి పెళ్లాడి బ్రిటన్‌లో స్థిరపడిన సూకీ అస్వస్థురాలైన తల్లిని చూసేందుకు 1988లో మయన్మార్‌ వెళ్లినప్పుడు అక్కడి నిర్బంధ పరిస్థితులను నేరుగా చూశారు. పౌరజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్న సైనిక పాలకులపై పోరాడేందుకు సిద్ధపడ్డారు. ఆమె నాయకత్వంలో సాగిన ప్రజాందోళనకు తలొగ్గి 1990లో సైనిక పాలకులు తొలిసారి ఎన్నికలు నిర్వహించారు. వారు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఆమె నాయకత్వంలోని ఎన్‌ఎల్‌డీ 80 శాతం స్థానాలు చేజిక్కించుకుంది.

ఫలితాలు వెలువడిన వెంటనే సైనిక పాలకులు ఎన్నికలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆమెను అరెస్టు చేశారు. మధ్యలో ఒకటి రెండుసార్లు విడుదల చేసినా ఆమెకు వస్తున్న మద్దతు చూసి బెంబేలెత్తి మళ్లీ మళ్లీ అరెస్టు చేసేవారు. అయిదేళ్ల జైలు జీవితం తర్వాత పదిహేనేళ్లపాటు ఆమె గృహ నిర్బంధంలో మగ్గారు. మధ్యలో అస్వస్థుడిగా వున్న తన భర్తను చూడటానికి బ్రిటన్‌ వెళ్తానన్నా ఆమెను అనుమతించలేదు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తున్నదని వార్తలు వెలువడ్డాక అంతర్జాతీయంగా వచ్చిన వత్తిళ్ల పర్యవసానంగా తప్పనిసరై 2010లో ఆమెను విడుదల చేశారు.

ఇలా సైన్యంపై ఇరవైయ్యేళ్లపాటు పోరాడి సైన్యం మెడలు వంచిన సూకీ... అధికారంలో కొచ్చాక మెతకగా వ్యవహరించడం మొదలెట్టారు. మైనారిటీలైన రోహింగ్యాలపై దారుణమైన హింసాకాండ అమలు చేస్తున్నా అదేమని ఖండించలేదు. వారి ఇళ్లు తగలబెట్టి, నరమేథం సాగిస్తున్నా, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా, రోహింగ్యాలు ప్రాణభయంతో దేశం విడిచివెళ్లేలా చేస్తున్నా ఆమె మౌనం వహించారు. పైగా రోహింగ్యాలదే తప్పన్నట్టు మాట్లాడారు.

రోహింగ్యాలు, ఇతర మైనారిటీ వర్గాలు ఎక్కువగా నివసించే ప్రాంతాలైన రఖినే, కచిన్, కయిన్, బగోలను ‘ఘర్షణ ప్రాంతాలు’గా ముద్రేసి ఎన్నికలు నిలిపివేసినా ఆమె ప్రశ్నించలేదు. ఆ సంగతలావుంచి తాను అధ్య క్షురాలు కాకుండా అడ్డుపడుతున్న నిబంధనపైగానీ... కీలకమైన హోంశాఖ, రక్షణ శాఖ తదితరాలు సైన్యం చేతుల్లో ఉండటంపై గానీ ఆమె పోరాడ లేకపోయారు. ఒక్కమాటలో సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్నారు. నోబెల్‌ శాంతి బహుమతి పొందిన ఒకనాటి సూకీలో ఇంత మార్పేమిటని ప్రపంచ ప్రజానీకం విస్తుపోయే రీతిలో ఆమె వ్యవహరిస్తున్నారు. 

మయన్మార్‌ సైన్యం దుర్మార్గాల పర్యవసానంగా దేశం విడిచిన రోహింగ్యాల్లో మన దేశానికి 40,000 మంది, బంగ్లాదేశ్‌కు 10 లక్షలమంది వచ్చారు. ఇప్పటికీ దేశంలో 600 మంది రాజకీయ ఖైదీలున్నారు. పరస్పరం సంఘర్షించుకుంటున్న భిన్న తెగల మధ్య సఖ్యత తీసుకురావడానికి, వెనకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎన్‌ఎల్‌డీ ప్రభుత్వం చెప్పుకోదగ్గ కృషి చేసింది. సైన్యం అకృత్యాలను చూసీచూడనట్టు వదిలేస్తున్నదన్న విమర్శలున్నా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందాయి. అక్కడ మన దేశం పెట్టుబ డులు కూడా గణనీయంగానే వున్నాయి. యధాప్రకారం అక్కడ పాగావేయాలని చైనా చూస్తోంది. ఈ విషయంలో మనం అప్రమత్తంగా వుండక తప్పదు.

మరిన్ని వార్తలు