Britain Prime Minister Boris Johnson: అప్రతిష్ఠతో... ఇంటి దారి!

8 Jul, 2022 00:37 IST|Sakshi

కూర్చున్న కుర్చీని వదిలిపెట్టడం ఉన్నత స్థానంలో ఉన్న ఎవరికైనా కష్టమే! ఏకంగా రవి అస్తమించని సామ్రాజ్యంగా వెలిగిన బ్రిటన్‌కు ప్రధానమంత్రిగా ముచ్చటగా మూడేళ్ళయినా పూర్తి చేసుకోని వ్యక్తికి మరీ కష్టం. కానీ విమర్శలు, సొంత పార్టీలో – క్యాబినెట్‌లోనే విపక్షం, రెండురోజుల్లో 59 మంది మంత్రులు, అధికారుల రాజీనామాలు వరదలా ఉక్కిరిబిక్కిరి చేశాక బోరిస్‌ జాన్సన్‌ (బోజో) తలొగ్గక తప్పలేదు. కొద్దిరోజులుగా చూరుపట్టుకు వేలాడిన ఆయన ప్రభుత్వంలో సంక్షోభ తీవ్రతతో గురువారం కన్జర్వేటివ్‌ పార్టీ సారథ్యానికి రాజీనామా చేశారు. అయితే, వారసుడొచ్చే దాకా తాత్కాలిక ప్రధానిగా పాలిస్తానంటూ ఆఖరిక్షణంలోనూ అధికారంపై మమకారమే చూపారు. 

ప్రపంచంలోని అత్యుత్తమ హోదాను వదులుకుంటున్నందుకు బాధగా ఉందని జాన్సన్‌ తన మనసులో మాట చెప్పేశారు. అయితే, ఆ బాధకు కారణం – ఆయన స్వయంకృతాపరాధాలే! 2019 ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ పక్షాన ప్రచారార్భాటానికి జాన్సన్‌ బాగా పనికొచ్చారు. 1987 తర్వాత ఎన్నడూ లేనంత భారీ విజయాన్నీ, 1979 తర్వాత అత్యధిక వోటు శాతాన్నీ పార్టీ సంపాదించింది. కానీ, అధికారంలోకి వచ్చాక జరిగింది వేరు. మాటల మనిషి జాన్సన్‌ పాలనలో పదును చూపించ లేకపోయారు. ద్రవ్యోల్బణం 40 ఏళ్ళ గరిష్ఠానికి చేరింది. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి బ్రిటన్‌ నిష్క్రమణను ఆయన బలంగా సమర్థించడంతో దేశానికి ఆర్థిక కష్టాలు పెరిగాయి. 

బ్రెగ్జిట్‌ లాంటి నిర్ణయాలూ ఘోర తప్పిదాలే. ఫలితంగా అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అయిన ఈయూతో బ్రిటన్‌ వర్తకం సంక్లిష్టంగా తయారైంది. ప్రజల దృష్టి మళ్ళించేందుకు ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు తీవ్ర ప్రతికూల వైఖరి తీసుకున్నారు జాన్సన్‌. ఆర్థిక ఆంక్షలతో రష్యాను దోవకు తేవాలన్న పాశ్చాత్య ప్రపంచ ప్రయత్నంలో పెత్తనం పైన వేసుకొని, ఉక్రెయిన్‌ సేనలకు ఆధునిక ఆయుధాలు సరఫరా చేశారు. కానీ, అవేవీ ఉపకరించకపోగా, జీవనవ్యయం పెరిగింది. ఇక, కరోనా కాలంలో ప్రభుత్వ ఆవాసాల్లో 16 సార్లు విచ్చలవిడి విందు వినోదాల (పార్టీ గేట్‌ వివాదం) నుంచి అనుచిత లైంగిక ప్రవర్తన ఆరోపణలున్న పార్టీ ఎంపీ క్రిస్‌ పించర్‌ను డిప్యూటీ ఛీఫ్‌ విప్‌గా నియమిం చడం (పించర్‌ గేట్‌ వివాదం) దాకా అనేక బలహీనతలు జాన్సన్‌ చాటుకున్నారు. వాటిని నిజా యతీగా ఒప్పుకోకపోగా మొదట బొంకడం, ఆనక మాట మార్చడం అలవాటుగా చేసుకున్నారు. 

కొన్ని నెలలుగా దాదాపు ప్రతి వారం ఏదో ఒక ఆరోపణ, కళంకం బ్రిటన్‌ ప్రభుత్వంపై బయట కొస్తూనే ఉన్నాయి. కానీ, బోజో ఇచ్చకాలు చెబుతూ వచ్చారు. ఒక్కమాటలో పరిపాలనను ఒక రియాలిటీ షో లాగా మార్చేశారని ఆయనపై ప్రత్యర్థుల విమర్శ. కన్నార్పకుండా ఎదుటివారి కళ్ళలోకి చూస్తూనే అసత్యాలు చెప్పడంలో సిద్ధహస్తుడనే అపఖ్యాతినీ మూటగట్టుకున్నారు. ఇతర దేశాల నేతలు సైతం ఆంతరంగిక సమావేశాల్లో ఆయనను ‘అబద్ధాలకోరు’గా అభివర్ణించేవారంటే అర్థం చేసుకోవచ్చు. దిగజారిన ప్రతిష్ఠతో పార్టీ, ప్రజలు కొత్త నాయకుణ్ణి కోరుకోసాగారు. ఈలోగా పార్టీకి నష్టం జరిగిపోయింది. దశాబ్దాలుగా పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనూ అనేక స్థానిక ఎన్నికల్లో కన్జర్వేటివ్స్‌ ఓడిపోయారు. జాతీయ సర్వేలలో విపక్ష లేబర్‌ పార్టీ ముందుకు దూసుకుపోయింది. రెండు రోజుల క్రితమే పదవి చేపట్టిన కీలక మంత్రులిద్దరూ గురువారం రాజీనామాకు సిద్ధమవడం, డిసెంబర్‌లో పార్టీ అవిశ్వాస పరీక్షలో 59 శాతం ఓట్లతో నెగ్గిన జాన్సన్‌పై మరోసారి అవిశ్వాస తీర్మానం పెడతామంటూ స్వపక్షీయుల హెచ్చరిక– అన్నీ కలసి జాన్సన్‌కు ఆఖరి దెబ్బ కొట్టాయి.  

ప్రభుత్వం మీద నమ్మకం పోవడం వేరు... పాలకుడి విశ్వసనీయతతో పాటు ఏకంగా గౌరవమే పోవడం వేరు. ఇదీ జాన్సన్‌ చేతులారా చేసుకున్నదే. ఇంట్లో ఈగల మోత ఇలా ఉన్నా, ఉక్రెయిన్‌ పర్యటన, అంతర్జాతీయ వేదికలపై ఉపన్యాసాలు, భారత్‌ సహా అనేక దేశాలకు ఉచిత సలహాల ఊకదంపుడు ఉపన్యాసాలతో బయట పల్లకీల మోత మోగించాలని ఆయన విఫలయత్నం చేశారు. 1987లో మార్గరెట్‌ థాచర్‌ భారీ విజయం తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో మూడేళ్ళ క్రితం పార్టీని విజయపథంలో నడిపిన జాన్సన్‌ ఇంత త్వరగా, అదీ ఇలా నిష్క్రమించాల్సి రావడం రాజకీయ వైచిత్రి. 1990లో థాచర్, 2018లో థెరెసా మే అసమ్మతి పెట్టిన అవిశ్వాసంలో నెగ్గినా అచిర కాలంలోనే పదవి నుంచి వైదొలగారు. చరిత్ర పునరావృతమై, జాన్సన్‌కూ అదే జరిగింది. 

ఇప్పుడిక కన్జర్వేటివ్‌ పార్టీ కొత్త నేత ఎన్నిక జరగనుంది. అక్టోబర్‌ ప్రథమార్ధంలో పార్టీ వార్షిక సదస్సులో జాన్సన్‌ స్థానాన్ని సదరు కొత్త నేత భర్తీ చేస్తారు. రియాల్టీ షోలతో పేరొందిన మహిళ పెన్నీ మోర్డాన్ట్‌ నుంచి ఈ వారమే మంత్రి పదవికి రాజీనామా చేసిన మన ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి అల్లుడు రుషీ సనక్‌ దాకా చాలామంది పేర్లే ఆ పదవికి వినిపిస్తున్నాయి. వారసుడెవరైనా సహకరిస్తానంటున్న జాన్సన్, ప్రధానిగా పనిచేయడం ఎన్నో పాఠాలు నేర్పిందని చెప్పుకొచ్చారు. ఆయన హయాంలోని వ్యవహారాలు బ్రిటన్‌కూ, కన్జర్వేటివ్‌ పార్టీకే కాదు... ప్రపంచానికీ పాఠాలు నేర్పింది. పరిపాలనంటే టీవీల్లో మైకుల ముందు, సభల్లో జనం ముందు హావభావ విన్యాసం, రోజువారీ రియాల్టీ షో కాదు. మాటల గారడీ కన్నా చేతలే మిన్నని మరోసారి నెమరు వేయించింది.ప్రచారదిట్టలు పరిపాలనలో సమర్థులవుతారన్న హామీ లేదనీ, ఇతరేతర కారణాలతో పైకి వెళితే, శిఖరాగ్రాన నిలదొక్కుకోవడం ఎంత కష్టమో చెప్పడానికి జాన్సన్‌ పయనం మచ్చుతునక. అప్రతిష్ఠ తెచ్చుకొని ఇంటిదారి పట్టడంతో బోజో మార్కు పాపులిస్ట్, నేషనలిస్ట్‌ బ్రాండ్‌ శకానికి తెరపడ్డట్టే! 

మరిన్ని వార్తలు