బైడెన్‌కు అన్నీ సవాళ్లే

10 Nov, 2020 00:21 IST|Sakshi

అమెరికాను పాలించిన నాలుగేళ్లూ ఇంటా, బయటా ప్రశంసలకన్నా విమర్శలే అధికంగా మూట గట్టుకున్న డోనాల్డ్‌ ట్రంప్‌ నిష్క్రమణ ఖాయమైంది. 290 ఓట్లు సాధించి విజయపథంలో వున్న డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుం డగా... 214 దగ్గరే ఆగిపోయిన ట్రంప్‌ తన ఓటమిని ఇంకా అంగీకరించలేదు. బైడెన్‌కు వ్యతిరేకంగా దేశమంతా ర్యాలీలు నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నారు.

రాజకీయాల్లోకి, ఆ వెంటనే అధి కారంలోకి ‘బయటి వ్యక్తి’గా వచ్చిన ట్రంప్‌ చివరివరకూ అలాగే వుండిపోయారు. వ్యక్తిగత దూష ణలు, జాత్యహంకార ధోరణులు, కయ్యానికి కాలుదువ్వే మనస్తత్వం ఆయన వదులుకోలేదు. ఇప్పుడు అదే దూకుడుతో న్యాయస్థానాల ద్వారా జో బైడెన్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జార్జియా, అరిజోనా, నెవెడా, పెన్సిల్వేనియా, మిషిగాన్, టెక్సాస్‌లలో ఇప్పటికే ఆయన న్యాయ వాదులు వ్యాజ్యాలు దాఖలు చేశారు.

పోస్టల్‌ బ్యాలెట్లు అనుమానాస్పదమైనవని, పోలింగ్‌లో తమ పార్టీ పరిశీలకుల్ని అనుమతించలేదని వాటి సారాంశం. ట్రంప్‌ వాదనల మాటెలావున్నా ఆయన్ను 2016లో అధ్యక్ష పీఠం ఎక్కించిన శ్వేతజాతి అమెరికన్లలో విద్యాధికవర్గం ఆయనకు దూరం జరి గింది. దేశంలో అమలవుతున్న ఉదారవాద పెట్టుబడిదారీ విధానాల వల్ల నష్టపోయిన సంప్రదాయ పెట్టుబడిదారీవర్గం, అట్టడుగు శ్వేత జాతీయులు 2016 మాదిరే ఇప్పుడు కూడా ఆయన వెనక దృఢంగా నిలబడ్డారు. అందువల్లే సర్వేలు జోస్యం చెప్పినట్టుగా డెమొక్రాట్ల ప్రభంజనం జాడ కనబడలేదు.  

ఈసారి అధ్యక్ష ఎన్నికల విశ్వసనీయతపై, ప్రత్యేకించి ఎన్నికల ప్రక్రియపై ప్రచారపర్వంలో ఒక పద్ధతి ప్రకారం డోనాల్డ్‌ ట్రంప్‌  సంశయాలు రేకెత్తించారు. ఓటమిని అంగీకరించేలోగా ఆయన ఈ బాణీనే కొనసాగిస్తారు. చేతనైనంతమేరకు వివాదాన్ని సాగదీస్తూనే వుంటారు. కొత్త అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేయాల్సిన జనవరి 20 వరకూ లెక్కేస్తే అధికార మార్పిడికి సంబంధించి వివిధ లాంఛనాలు ముగియడానికి ఇంకా 11 వారాలు గడువుంది. ఈ వ్యవధిని సాధ్యమైనంత మేర వివా దాలమయంగా మారిస్తే ఇప్పుడు అధ్యక్ష పీఠం దక్కకపోయినా, 2024 అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్‌ అభ్యర్థిత్వాన్ని మరోసారి చేజిక్కించుకోవడానికి ట్రంప్‌కు ఛాన్సుంటుంది.

నిజానికి దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన ఇలా రచ్చ చేస్తున్నారని కొందరి అనుమానం. అమెరికా 22వ అధ్యక్షుడిగా విజయం సాధించి 1889 వరకూ పనిచేసి, ఓడిపోయి తిరిగి 1893లో 24వ అధ్యక్షుడిగా ఎన్నికైన గ్రోవర్‌ క్లీవ్‌లాండ్‌ మాదిరే తాను కూడా మరోసారి పాలించవచ్చని ట్రంప్‌ కలలు కంటున్నారని వారి అంచనా. ఆయన మాటెలావున్నా బైడెన్‌ మాత్రం సెనేట్‌లో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొనాల్సి వుంటుంది. సెనేట్‌లో మెజారిటీగా వున్న రిపబ్లికన్ల నాయకుడు మెక్‌ కానెల్‌ సృష్టించే అవాంతరాలను అధిగమించడం ఆయనకంత సులభం కాదు.

ఒబామా పాలించిన ఎనిమిదేళ్లలో ఆరేళ్లపాటు సెనే ట్‌లో ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుతగిలి, అవి అమలు కాకుండా చూడటంలో మెక్‌ కానెల్‌ విజయం సాధించారు. ఆఖరికి తమ పార్టీకి లాభించే నిర్ణయాలను సైతం అడ్డగించి, ఒబామా ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదన్న అభిప్రాయం అందరిలోనూ ఆయన కలగజేశారు. 2016లో డెమొక్రాట్లు ఓడిపోవడానికి గల అనేక కారణాల్లో సెనేట్‌ వైఫల్యాల పాత్ర కూడా గణనీయంగానేవుంది. మెక్‌ కానెల్, ఒబామాల మధ్య మాటలే వుండేవి కాదు. చిత్రమేమంటే అత్యంత కీలకమైన ఆర్థిక బిల్లుల ఆమోదం సమయంలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు ఒబామా దూతగా జో బైడెన్‌ వెళ్లి మెక్‌ కానెల్‌ను ఒప్పించేవారు. కనుకనే డెమొక్రాట్లలో ‘ప్రచ్ఛన్న రిపబ్లికన్‌’గా బైడెన్‌పై ముద్రపడింది.

కానెల్, బైడెన్‌లకు 1985 నుంచి పరిచయం వుంది. కానీ డెమొక్రాటిక్‌ ప్రాధాన్యతలను నెరవేర్చే నిర్ణయాలకు అడ్డుతగలకుండా ఈసారి బైడెన్‌ ఆయనకు నచ్చజెప్పగలరా అన్నది ప్రశ్న. జాతీయ భద్రతా సలహా దారు పదవి మొదలుకొని ఖజానా మంత్రి పదవి వరకూ చాలావాటికి కానెల్‌ ఆమోదం కావాల్సి వుంటుంది. అందుకోసం ఒకటి, రెండు పదవులకు రిపబ్లికన్లను బైడెన్‌ నామినేట్‌ చేయక తప్పక పోవచ్చు. అయితే సెనేట్‌లోని ఒకరిద్దరు రిపబ్లికన్లను పదవుల ఆశ చూపి లోబర్చుకున్నా, వచ్చే జనవరి 5న జార్జియానుంచి జరగబోయే రెండు సెనేట్‌ స్థానాల ఎన్నికల్లో డెమొక్రాట్లు విజయం సాధించినా బైడెన్‌ పని సులభమవుతుంది. క్లింటన్‌ హయాంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు పార్టీలో వామపక్షవాదుల్ని దూరం పెట్టేవారు. ఆ రకంగా రిపబ్లికన్లను బుజ్జగించి పనులు జరిపించుకునేవారు. బైడెన్‌ తీరెలావుంటుందో చూడాలి. 

ఈ నాలుగేళ్లలో ట్రంప్‌ అనేక విషయాల్లో ఇల్లు పీకి పందిరేసిన చందాన నిర్ణయాలు తీసు కున్నారు. వాటిని చక్కదిద్దడం బైడెన్‌కు తలకు మించిన భారం. ప్రస్తుతానికి ప్రతినిధుల సభలో మెజారిటీ వుంది. రెండేళ్ల తర్వాత ఎన్నికలు జరిగేనాటికి సమర్థుడన్న పేరు తెచ్చుకుని ఆ మెజారిటీని ఆయన నిలబెట్టుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు అంతక్రితం ప్రభుత్వాలు తీసుకొచ్చిన 125 నిబంధనలు ట్రంప్‌ ఏలుబడిలో రద్దయ్యాయి. కొన్ని నామమాత్రంగా మిగిలాయి. వాటిని వెనక్కు తీసుకోవాలంటే అదనంగా 1.7 లక్షల కోట్ల నిధులు అవసరం.

పారిస్‌ ఒడంబడిక నుంచి బయటి కొస్తున్నట్టు నిరుడు నవంబర్‌ 4న ట్రంప్‌ ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్టు మళ్లీ ప్రపంచానికి చాటాలి. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థలో కొనసాగుతామని చెప్పాలి. కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి పూర్తి స్థాయిలో కొత్త వ్యూహాన్ని ఖరారు చేసుకోవాలి. ట్రంప్‌ హయాంలో నిరాదరణకు గురైన నాటో మిత్రుల్ని దగ్గర చేసుకోవాలి. చైనాతో సంబంధాలను మరమ్మత్తు చేసుకోవాలి. ఏతావాతా ఓడిన ట్రంప్‌ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటే, బైడెన్‌ అడుగడుగునా అనేక సవాళ్లను ఎదుర్కొనవలసి వుంటుంది.  

మరిన్ని వార్తలు