మళ్లీ మహమ్మారి విజృంభణ

20 Nov, 2020 00:26 IST|Sakshi

కరోనా వైరస్‌ మహమ్మారి ఇప్పట్లో విరగడయ్యేలా లేదని తాజాగా దేశ రాజధాని నగరం తల్లడిల్లు తున్న తీరు చూస్తే అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోసహా చాలాచోట్ల ఆ వైరస్‌ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గిన మాట వాస్తవమే. కొత్తగా వస్తున్న కేసుల సంఖ్య, రికవరీ రేటు గమనిస్తే అది శాంతించిన వైనం కనబడుతోంది. కానీ ఏమాత్రం నిర్లక్ష్యంగా వుండటం మంచిది కాదని ఢిల్లీ పరిణామాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో స్వైరవిహారం చేస్తున్న కరోనా వైరస్‌ ఏ దశకు సంబంధించిందో నిర్ధారణగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. అది రెండో దశ అని కొందరూ, మూడో దశ అని కొందరూ అంటున్నారు.

దశ ఏదైనా అది ఇంతకుముందుకన్నా రెచ్చిపోతున్నదని తెలుస్తూనేవుంది. కరోనా ముప్పు తప్పిందని ఢిల్లీ ఆరోగ్యమంత్రి ఈ నెల మొదట్లో ప్రకటించారు. అందులో అసత్యమేమీ లేదు. ఆయన ప్రకటించిననాటికి అక్కడ మరణాల రేటు కేవలం 0.3శాతం. కానీ ఆ తర్వాతినుంచి అంతా తారుమారైంది. గురువారంనాటి గణాంకాలే ఇందుకు సాక్ష్యం. గత 24 గంటల్లో ఆ మహానగరంలో 131మంది మరణిస్తే యాక్టివ్‌ కేసుల సంఖ్య 42,458. ఈ నెల 11న అక్కడ రికార్డు స్థాయిలో 8,593 కేసులు నమోదయ్యాయి. అటు తర్వాత ఆ సంఖ్య పెరుగూనేవుంది. బుధవారం కూడా 7,486 కేసులు బయటికొచ్చాయి. మొత్తంగా పక్షంరోజుల్లో లక్ష కేసులు నమోద య్యాయంటే పరిస్థితి తీవ్రత తెలుస్తుంది.

అత్యవసర కేసుల్ని సైతం చూడలేమని అక్కడి ఆసు పత్రులు చేతులెత్తేస్తున్నాయి. గడ్డుస్థితిలో వున్నవారికి ఐసీయూ సంగతలావుంచి...సాధారణ బెడ్‌ ఇవ్వడం కూడా సాధ్యపడదని చెబుతున్నాయి. రోగుల కోసం వెయిటింగ్‌ లిస్టులు రూపొంది స్తున్నాయి. గుండెపోటు వచ్చి ఆసుపత్రికి వచ్చిన ఒక రోగి గంటల తరబడి కారిడార్‌లోని కుర్చీలో కూలబడి చికిత్స కోసం ఎదురుచూస్తున్న దిగ్భ్రాంతికర దృశ్యం జాతీయ చానెళ్లలో ప్రసారమైంది. రోగికేమైనా జరిగితే వైద్యుల్ని నిందిస్తారు గనుక... వచ్చిన రోగుల్ని వెనక్కు పంపేస్తున్నామని ఒక ఆసుపత్రి సంజాయిషీ ఇస్తోంది. ఢిల్లీలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్‌లలో 90 శాతంమించి ఇప్పటికే నిండిపోయాయి. సాధారణ బెడ్‌లు సైతం 95శాతం పైనే నిండివున్నాయని గణంకాలు చెబుతున్నాయి. రోజుకు దాదాపు 8,000 కేసులు నమోదవుతుంటే...అందులో కనీసం 600మంది వరకూ ఐసీయూలో చేరవలసిన అవసరం కనబడుతోంది. 

నవంబర్‌ నెల వచ్చిందంటే ఢిల్లీకి ఏటా గండమే. అప్పటికల్లా చలిపులి తడాఖా మొదలవు తుంది. సరిగ్గా అప్పుడే  పండగల సీజన్‌ కూడా ప్రవేశిస్తుంది. ప్రార్థనా మందిరాలవద్ద, దుకాణ సముదాయాల్లో జనసందోహం పెరుగుతుంది. దీపావళి వంటి వేడుకల గురించి చెప్పనవసరమే లేదు. పంటవ్యర్థాలను తగలబెట్టడం కూడా అప్పుడే. మరోపక్క ఎప్పుడూ వుండే వాహనాల కాలుష్యం మామూలే. ఇవన్నీ ఒకేసారి విరుచుకుపడి అసలే అంతంతమాత్రంగా వున్న పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. ప్రజలకు నచ్చజెప్పి ఒప్పించాల్సిన నాయకులే అర్ధరహితమైన తర్కా లకు దిగి వారిని రెచ్చగొడుతున్నారు. కరోనా చుట్టుముట్టి కబళించడానికి సిద్ధమైన ఈ తరుణంలో కూడా తమ రాజకీయ స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి వెరవడం లేదు. వీటన్నిటి పర్యవ సానంగానే ఇప్పుడు ఢిల్లీ ప్రమాదంలో పడింది. ఈ కారణాలేవీ ప్రభుత్వాల ఊహకందనివి కాదు.

దేశ రాజధాని కావడం వల్ల అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఢిల్లీ ప్రభుత్వమూ కూడా తమ తమ స్థాయిల్లో పరిస్థితులేమిటన్నది పర్యవేక్షిస్తుంటాయి. కానీ కరోనాను అరికట్టే విషయంలో ఆ రెండూ విఫలమయ్యాయి. ఆ వైరస్‌ చుట్టుముట్టి ఇప్పటికి తొమ్మిది నెలలు దాటుతోంది. అందరికీ అది కావలసినన్ని చేదు అనుభవాలు మిగిల్చింది. పైపెచ్చు ప్రపంచ దేశాలన్నిటా మళ్లీ అది పంజా విసురుతోంది. ఇవి చాలదా అప్రమత్తంగా వుండటానికి, ముందస్తు చర్యలు తీసుకోవడానికి? కానీ ఢిల్లీలో అవి కాస్తయినా కనబడలేదు. మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని చెప్పారే తప్ప, అవి చాలినంతగా లేవని ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు చెబుతున్నాయి.

ముప్పు ముంచుకొచ్చాక కారణం మీరంటే మీరని ఇప్పుడు కేంద్రమూ, ఢిల్లీ ప్రభుత్వమూ పరస్పరం నిందించుకుంటు న్నాయి. ఢిల్లీ ప్రజల్లో కరోనా ప్రమాదం గురించిన అవగాహన ఏమేరకుందో ఈమధ్య జరిగిన సర్వేయే తెలియజెప్పింది. ఇమ్యూనిటీ పెంచుకున్నాం గనుక కరోనా తమనేం చేయదని కొంద రంటే... అది అందరికీ వస్తుంది, భయమెందుకని మరికొందరు చెప్పారు. చాలామందికి అసలు మాస్క్‌ అవసరమే తెలియలేదు. మాస్క్‌ ధరించనివారికి రూ. 2,000 జరిమానా విధిస్తామని వ్యాధి విజృంభణ మొదలయ్యాక ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది.

వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనను దశాబ్దాలుగా పాలకులు నిర్లక్ష్యం చేశారు. అదిప్పుడు  శాపంలా వెంటాడుతోంది. ఎంతటి అనారోగ్య సమస్య ఏర్పడినా పౌరులు ఆర్థికపరమైన చిక్కుల్లో పడకుండా దాన్నుంచి సురక్షితంగా బయటపడాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు నిర్దేశించింది. అందుకోసం 2030నాటికల్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన ‘అందరికీ అన్నిచోట్లా సార్వత్రిక ఆరోగ్య సదుపాయం’ లభించాలని... ఆ దిశగా ప్రభుత్వాలు మౌలిక రంగ సదుపాయా లను మెరుగుపరుచుకోవాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ విషయంలో ప్రక్షాళన ప్రారంభించింది.

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో సమూల మార్పులు తెచ్చి 1.42 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యభరోసా కల్పించాలని సంకల్పించింది. పాఠశాలల మాదిరే ఆరోగ్యరంగంలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దబోతున్నారు. ఇప్పుడు ఢిల్లీ మాత్రమే కాదు...ఉత్తరాదిలోని మరికొన్ని నగరాలకు కూడా కరోనా ముప్పు పొంచివుందని గత నాలుగైదురోజుల పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయంలో మిగిలిన రాష్ట్రాలు కూడా మేల్కొని ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు