బైడెన్‌ది ట్రంప్‌ మార్గమేనా!

21 Nov, 2020 00:23 IST|Sakshi

ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సవ్యంగా పదవినుంచి తప్పుకుంటారా లేదా అన్న ఉత్కంఠ మాదిరే... ఆయన స్థానంలో రాబోయే జో బైడెన్‌ వివిధ అంశాల్లో, మరీ ముఖ్యంగా చైనా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి కూడా ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ వుంది. తాజాగా బైడెన్‌ చైనా గురించి తన అభిప్రాయాలేమిటో కుండబద్దలుకొట్టారు. అది నిబం ధనలు అనుసరించి తీరాలని, అందుకోసం గట్టిగా ప్రయత్నిస్తామని చెప్పారు. చైనాను శిక్షించాలా వద్దా అన్నది ప్రశ్నేకాదని, ఆ దేశం పద్ధతిగా వ్యవహరించేలా చేయడమే ధ్యేయమన్నారు. కనుక ట్రంప్‌కు భిన్నంగా బైడెన్‌ ఉండే అవకాశం లేదన్న అంచనాలే చివరకు నిజమయ్యేలావున్నాయి. కాక పోతే ట్రంప్‌ మాదిరి ఇష్టానుసారం కాక, బైడెన్‌ కాస్త నాగరికంగా మాట్లాడొచ్చు.

ట్రంప్‌ ఏలుబడిలో అడపా దడపా చైనాను బెదిరించడం, ఏవో కొన్ని రాయితీలు సాధించాక చల్లబడి ఆ దేశాన్ని ప్రశంసించడం రివాజుగా సాగింది. ట్రంప్‌ బెదిరింపులు అమెరికాకు ఆర్థికంగా అంతో ఇంతో మేలు చేకూర్చాయన్నది వాస్తవం. చైనానుంచి వచ్చే దిగుమతుల్లో మూడింట రెండువంతుల సరుకుపై ఆయన అధిక టారిఫ్‌లు విధించారు. దాంతో స్థానిక ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. ఈ విజ యవంతమైన ఫార్ములాను ఎవరొచ్చినా మార్చరని అందరూ అనుకునేవారు. బైడెన్‌ తాజా ప్రకటన ఆ అభిప్రా యాన్నే బలపరుస్తోంది. అయితే ట్రంప్‌ ధోరణి వల్ల చైనా చాలా కష్టాలే పడింది.

ఆయన ఎప్పుడేం ఆలోచిస్తారో, ఏం మాట్లాడతారో అంచనా వేయడం అసాధ్యమవుతున్నదని చైనా అధి కారులు వాపోయేవారు. అమెరికా వైఖరేమిటో తెలియక తలలు పట్టుకునేవారు. 1972లో అమెరికా అధ్యక్షుడిగా వున్న రిచర్డ్‌ నిక్సన్‌ తర్వాత ఇంతగా అంచనాలకు దొరకని అధినేత ఎవరూ తమకు తారస పడలేదని చైనా కమ్యూనిస్టు పార్టీకి చెందిన నాయకుడు గతంలో వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్‌ హయాంలో ఛిద్రమైన ఉన్నత స్థాయి సంబంధాలు తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం వుందని, మళ్లీ పరస్పర విశ్వాసం చిగురించడం సాధ్యమేనని చైనా అనుకుంటోంది. అది ఏమను కుంటున్నా ట్రంప్‌ మార్గంనుంచి వైదొలగే సాహసం బైడెన్‌ చేయరు. మొన్నటి అధ్యక్ష ఎన్నికల ఫలితాలు చూశారు గనుక ఆయన ఆ దిశగా ఆలోచించరు. ట్రంప్‌ తన ‘అమెరికా ఫస్ట్‌’ నినాదానికి చైనానే లక్ష్యంగా ఎంచుకున్నారు. ఆయన్ను అధికారం నుంచి దించడం అంత సులభం కాదన్న అభిప్రాయం అందరిలో బలంగా వేళ్లూనుకోవడానికి గల అనేకానేక కారణాల్లో ఆ వ్యూహం కూడా ఒకటి. 

ఆర్థికరంగంలో దూకుడుగా సాగుతున్న చైనాను నిలువరించడానికి తమ అధ్యక్షుడు ప్రయ త్నిస్తున్నారన్న భావన ప్రజల్లో ఏర్పడటంవల్ల ట్రంప్‌కైనా, ఆయన స్థానంలో రాబోయే బైడెన్‌కైనా రెండు లాభాలున్నాయి. ప్రపంచ ఆర్థిక రంగంలో అమెరికా తిరుగులేని ఆధిపత్యం క్రమేపీ కొడి గట్టడానికి మూలం తమ పాలకుల అసమర్థ విధానాల్లోకాక... చైనా అనుసరిస్తున్న తప్పుడు విధా నాల్లో వున్నదని జనం అనుకుంటారు. అలాగే చైనాను గట్టిగా హెచ్చరించి, దాన్ని వణికి స్తున్నారన్న అభిప్రాయం ఏ అధ్యక్షుడిపైన అయినా ఆరాధనాభావం ఏర్పడేలా చేస్తుంది. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థికి ఇవి మంచి పెట్టుబడి అవుతాయి. సెనేట్‌ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ జిమ్‌ రిష్‌ ఇప్పటికే బైడెన్‌ కోసం ఒక నివేదిక సిద్ధం చేశారు.

ప్రపంచం నలుమూలలా సంపదనూ, భద్రతనూ, సుపరిపాలనను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్న చైనా విధానాలకు వ్యతిరేకంగా యూరప్‌ దేశాలనూ, ఇతర దేశాలనూ సమీకరించాలని ఆ నివేదిక సారాంశం. చైనా వల్ల రాజకీయ, ఆర్థిక, భద్రతా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం వున్నదని యూరప్‌ దేశాలూ, అమెరికా కూడా భావిస్తున్నాయని ఆ నివేదిక ఎత్తి చూపింది. చైనాకు వ్యతిరేకంగా సమష్టిగా పనిచేయడానికి కుదిరే ఆరు అంశాలను కూడా అది గుర్తించింది. చైనా రూపొందించి, అమలు చేయదల్చుకున్న బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌(బీఆర్‌ఐ) వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లేమిటో తెలిపింది.

ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో దాని దుందుడుకు పోకడలు... దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్ర ప్రాంతాల్లోని దీవులు తమవేనంటూ అది పేచీకి దిగడం వంటివి ఆ దేశం వైఖరికి అద్దం పడతాయని ఆ నివేదిక విశ్లేషించింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో 13 లక్షల చదరపు మైళ్ల ప్రాంతంపై తమకే సార్వభౌమాధికారం వున్నదని చైనా గట్టిగా వాదిస్తోంది. అలాగే కృత్రిమ దీవులు నిర్మించి బ్రూనై, మలేసియా, ఫిలిప్పీన్స్, తైవాన్, వియత్నాంలతో పేచీలకు దిగింది. తాజా నివేదిక చూశాక బైడెన్‌ 90వ దశకంలోని డెమాక్రాటిక్‌ పార్టీకి చెందిన అధ్యక్షుల తరహాలోనే చైనాతో మెరుగైన సంబంధాల కోసం అర్రులు చాస్తారని ఎవరూ అనుకోరు. 

అయితే చైనాతో సఖ్యతే మేలని బైడెన్‌కు సూచిస్తున్నవారు లేకపోలేదు. ట్రంప్‌ అనుసరించిన విధానాన్ని తిరగదోడాలని పార్టీలోనే కాదు... గతంలో విదేశాంగమంత్రిగా పనిచేసిన హెన్రీ కిసింజర్‌ వంటి కురువృద్ధులు కూడా చెబుతున్నారు. చైనాతో కయ్యానికి కాలుదువ్వితే మొదటి ప్రపంచ యుద్ధంనాటి పరిణామాలు పునరావృతమవుతాయని కిసింజర్‌ ఈమధ్యే బైడెన్‌ను హెచ్చరించారు. సుస్థిర సంబంధాలు ఏర్పర్చుకోవాలన్న ఉబలాటం తగ్గించి, ఎప్పటి అవసరానికి తగినట్టుగా అప్పుడు వుండాలని... అందుకు అనుగుణమైన విధానం రూపొందించుకోవాలని బైడెన్‌కు మరి కొందరు సూచిస్తున్నారు. ఇది పూర్తిగా ట్రంప్‌ పాటించిన విధానం. అందువల్ల మేలుకన్నా కీడే అధికం. వర్తమాన ప్రపంచంలో ఎవరినైనా లొంగదీయడం అంత సులభమేమీ కాదు. ఇచ్చి పుచ్చుకునే ధోరణి, పరస్పర విశ్వాసం వంటివి దేశాల మధ్య సత్సంబంధాలకు దోహదపడతాయి. అదే సమయంలో దుందుడుకు పోకడలనూ, దురాక్రమణ విధానాలనూ ప్రశ్నించడం, నిలువరిం చడం తప్పనిసరవుతుంది. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా