Delhi Case: ఆమెను చంపింది ఎవరు?

5 Jan, 2023 00:51 IST|Sakshi

కొన్ని ఘటనలు ఉలిక్కిపడేలా చేస్తాయి. విస్మరిస్తున్న వాస్తవాలను కటువుగా కళ్ళెదుట నిలిపి, జవా బివ్వమని ప్రశ్నిస్తాయి. కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్న క్షణాలలో ఢిల్లీలో జరిగిన దారుణ ఘటన అలాంటిదే. న్యూ ఇయర్‌ పార్టీ నుంచి స్కూటీ మీద ఇంటికి తిరిగి వెళుతున్న అంజలి అనే 20 ఏళ్ళ చిరుద్యోగిని ఎదురుగా కారులో అయిదుగురు యువకులు ఢీ కొట్టి, సుల్తాన్‌పురి నుంచి కంఝా వాలా వరకు 12 కి.మీ పైగా అలాగే రోడ్డుపై కారుతో ఈడ్చుకెళ్ళి ప్రాణం తీసిన ఘటన ఘోరం. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని తేల్చినా, తలకూ, వెన్నుకూ బలంగా దెబ్బలు తగిలాయనీ, పక్కటెముకలు బయటకొచ్చాయనీ, మెదడు మిస్సయిందనీ చెబుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది

కారు ముందు భాగంలో ఎడమవైపు చక్రం కింద ఇరుక్కొని, రక్షించమని కేకలు పెడుతున్నా పట్టించుకోని వాహనదారుల మదోన్మత్తత వల్ల ఒంటి నిండా 40కి పైగా గాయాలతో బాధితురాలు ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తుంది. కాపాడమని ఆమె అరుస్తున్నా, ప్రత్యక్షసాక్షి ఒకరు కారును వెంబడిస్తూ పదే పదే ఫోన్‌ చేసినా పట్టించుకోని గస్తీ పోలీసుల లోపం కోపం తెప్పిస్తుంది. ఇది అరుదైన ప్రమాదం కాదు, అమానవీయ హత్య అనిపిస్తుంది. మంచు కమ్మేసిన శీతకాలంలో... దారి కనిపించని చిమ్మచీకటిలో... ఢిల్లీలో వెలగని వీధి దీపాలు, లోపభూయిష్ఠ పాలనా వ్యవస్థ, అలక్ష్యం చూపిన పోలీసులు, ఒంటరి స్త్రీని చూస్తే చెలరేగే వంకర బుద్ధులు – ఇలా అందరూ కలసి చేసిన హత్య ఇది. దీంతో, అమృతోత్సవ భారతంలోనూ బయట ఎంత సురక్షితమనే ప్రశ్న ఉదయిస్తుంది.

కేంద్ర హోమ్‌శాఖ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి, నివేదిక కోరడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం కాక తప్పలేదు. హంతక వాహనం తమ ముందు నుంచే పోతున్నా పట్టించుకోని పోలీస్‌ గస్తీ వ్యాన్‌ సహా అనేక లోపాలు జరిగాయని ఒప్పుకోక తప్పలేదు. మృతురాలితో కలసి ఆ రాత్రి స్కూటీపై ప్రయాణించి, ప్రమాదం జరిగాక ఎవరికీ ఏమీ చెప్పకుండా పోయిన రెండో యువతి నిధి మాటలు, చేష్టలు అనుమానాస్పదమే. కారు కింద యువతి ఉందని తెలీక బండి నడిపామంటున్న నిందితుల మాటలూ నమ్మశక్యం కానివి. వారు అక్కడక్కడే అనేక యూ టర్న్‌లు తీసుకుంటూ బండి నడిపిన విధానం కారు కింది బాధితురాలి శరీరాన్ని వదిలించుకోవాలని చేసిన ప్రయత్నమే. అందరి దృష్టితో ఇప్పుడిప్పుడే వేగవంతమవుతున్న దర్యాప్తులో పోనూపోనూ మరిన్ని బయటపడవచ్చు. 

నేరం జరగకుండా నిరోధించాలి, ఒకవేళ జరిగితే త్వరితిగతిన సాక్ష్యాధారాలు సేకరించాలి. ఈ రెంటిలోనూ ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారు. ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో పనిచేస్తూ, తండ్రి లేని కుటుంబానికి తానే ఆధారమైన అమ్మాయి ప్రాణాలు కోల్పోయిన ఈ కంఝావాలా ఘటన అనేక చేదు నిజాలు చెబుతోంది. ఘటనవేళ ప్రత్యక్షసాక్షి పదే పదే ఫోన్‌ చేసినా, పోలీస్‌ స్పందన అమితాలస్యమైంది. ప్రమాదం జరిగినా కారును వేగంగా ముందుకూ వెనకకూ దూకిస్తూ, కిలోమీటర్ల దూరం పోనిచ్చిన యువకుల తీరు చట్టమంటే భయం లేనితనానికి ప్రతీక. అలాగే, పోలీసులకూ, పౌరవ్యవస్థలకూ మధ్య సమన్వయమూ కొరవడింది. ‘పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌’ వ్యాన్‌ తమ దోవలో ఎదురుపడ్డా హంతక వాహనాన్ని ఆపకపోవడం మరీ దారుణం. పోలీస్‌ స్పందనలో పెరగాల్సిన వేగం సహా ఇది అనేక పాఠాలు నేర్పుతోంది.  

అయితే, ఈ ఘటన పాలకులు చేపట్టాల్సిన చర్యలకు బదులు ఢిల్లీని పాలిస్తున్న ఆప్, దేశాన్ని పాలిస్తున్న బీజేపీల మధ్య ఆరోపణల పర్వానికి దారితీసింది. అరెస్టయిన నిందితుల్లో ఒకరు బీజేపీ సభ్యుడు కావడం అగ్నికి ఆజ్యం పోసింది. రాజకీయాలు పక్కనపెడితే, ఢిల్లీ లాంటి చోట కొన్నేళ్ళ క్రితం దాకా కేంద్రీయ పోలీసు స్పందనా వ్యవస్థ ఉండేది. ఎక్కడ నుంచి సహాయం కోరుతూ ఏ కాల్‌ వచ్చినా యంత్రాంగం అప్రమత్తమై, దగ్గరలోని సిబ్బందిని హుటాహుటిన పంపే వీలుండేది. ఆ వ్యవస్థను మార్చేయడం పెద్ద పొరపాటు. ఆ కేంద్రీయ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలి. మహిళా పోలీస్‌ స్టేషన్లతో పాటు మహిళా గస్తీ సిబ్బంది అవసరం. దాని వల్ల సామాన్య మహిళలకు భరోసా పెరుగుతుంది. 24 గంటల పోలీస్‌ పోస్ట్‌ల సమర్థ నిర్వహణ, గస్తీ, ఎలక్ట్రానిక్‌ నిఘా చట్టాన్ని అతిక్రమించాలనుకొనేవారికి బెదురు పుట్టిస్తాయి.

దేశంలో రోజూ 415 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని లెక్క. పైగా, 2021లో రోడ్డు ప్రమాద మరణాల్లో సగం మంది ద్విచక్ర వాహనదారులే. ఈ పరిస్థితుల్లో ఆఫీసు పని ముగిసి, రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చేవారి భద్రత ఎలా? ఇక, క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ ప్రాణాలతో  బయట పడ్డ ఘోర రోడ్డు ప్రమాదఘటన లాంటివి రహదారి భద్రతపై దృష్టి పెంచాలని గుర్తు చేస్తున్నాయి.

ఒకపక్క అధిక వేగం, తప్పుడు లేన్లలో డ్రైవింగ్, సిగ్నల్స్‌ ఉల్లంఘన, రోడ్డుపైనే పార్కింగ్, అధిక శబ్దంతో హారన్‌ కొట్టడం లాంటి అనేక తప్పులు, మరోపక్క మత్తులో అమాయకుల ప్రాణం తీస్తున్న తాజా కంఝావాలా ఘటన లాంటివి జరుగుతుంటే గుడ్లప్పగించి చూస్తే ఎలా? ఒకరు చేసే తప్పుకు వేరెవరికో శిక్ష పడే ఈ రహదారి ఘటనల్లో దోషులు భయపడేలా కఠిన శిక్షలు విధించాలి.

అమెరికా లాగా లెక్క దాటి తప్పులు చేస్తే డ్రైవింగ్‌లైసెన్స్‌ రద్దు లాంటివి మన దగ్గరా ప్రవేశపెట్టాలి. ‘నిర్భయ’ అత్యాచార – హత్యోదంతం జరిగి పదేళ్ళయినా, పాలకులు చట్టాలు చేయడమే తప్ప ప్రాథమిక చర్యలు విస్మరిస్తున్నారు. ఇలాగైతే... అర్ధరాత్రి సైతం స్త్రీ స్వేచ్ఛగా సంచరించగలిగిననాడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు అన్న గాంధీ మాటల్లో మనకు స్వాతంత్య్రం ఎప్పటికి వచ్చేటట్టు?  

మరిన్ని వార్తలు