వాన కురవాల్సిందే!

4 Jul, 2022 00:19 IST|Sakshi

కాలచక్ర భ్రమణంలో రుతువులు మారడం ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మంలో భాగంగా రుతుపవ నాలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు చండప్రచండంగా ఎండలతో చెలరేగిపోయిన సూర్యు డికి అడ్డుగా మబ్బుతెరలు వచ్చి చేరుకున్నాయి. దేశంలో దాదాపు ప్రతిచోటా చినుకుల చిటపట సందడి మొదలైంది. అక్కడక్కడా అడపాదడపా జడివానలూ కురుస్తున్నాయి. మొత్తానికి తొలకరి జల్లులతో వర్షాకాలం వచ్చేసింది. ఉక్కపోతతో ఊపిరి సలపనివ్వకుండా ఉడుకెత్తించిన వాతా వరణం చల్లబడింది. వానల రాకడతో ప్రకృతి కొత్త ఊపిరి పోసుకుంటోంది.

వర్షాకాలం చాలామందికి హర్షకాలం. ఆకాశంలో దట్టంగా ముసురుకునే మేఘతతులు వర్షా గమనానికి నాందీప్రస్తావనలు. నింగి నుంచి వానధార నేల మీదకు జలజలా జారుతుంటే వ్యాపించే మట్టి పరిమళంతో కలిగే ఆనందమే వేరు! ‘చిటపటమంటా ఎండుటాకులో/ చినుకొక్కటి పడి చిటిలి రాలితే/ కోరికలే గుది గుచ్చుకొన్న ఒక/ హారమె తెగినట్లదురు పుడతది’ అంటూ పడుచు మనసులోని వాన గిలిగింతలను కొనకళ్ల వెంకటరత్నం ‘మబ్బులు మబ్బులు మబ్బులొచ్చినై’ పాటలో కమనీయంగా వర్ణించారు. వర్షాలు సకాలంలో సజావుగా కురిస్తే, అందరికీ హర్షదాయకమే! కురవాల్సిన సమయంలో వానలు కురవకున్నా, కురవరాని సమయంలో తెరిపి లేకుండా కురిసినా, కన్నీళ్లు తప్పవు.

వర్షాల వల్ల కలిగే హర్షాతిరేకాలకు, వర్షాల వల్ల కలిగే విషాదాలకు అందరి కంటే ఎక్కువగా స్పందించేది రైతులే! ప్రకృతినే నమ్ముకుని బతికే కష్టజీవులు వాళ్లు. వర్షాలు సకాలంలో కురిస్తే పొంగిపోతారు. అకాలంలో కురిస్తే అల్లాడిపోతారు. వర్షాలు తెచ్చే ఆనంద విషాదాలను కవులు, రచయితలు కళ్లకు కట్టిన దాఖలాలున్నాయి. వర్ష బీభత్సాన్ని, విపత్కర పరిస్థితుల్లో మానవ స్వభావాన్ని అద్భుతంగా చిత్రించిన పాలగుమ్మి పద్మరాజు రాసిన ‘గాలివాన’ తెలుగు కథను అంతర్జాతీయ స్థాయిలో నిలిపింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకుని, జోరుగాలి వీస్తుండగా కురిసే వర్షధారను ‘విరిసెను మేఘపరంపర/ మెరసెను శాంపేయలతలు మిన్నులు మొరసెన్‌...’ అంటూ శేషేంద్ర తన ‘ఋతు ఘోష’లో వర్షసౌందర్యాన్ని కళ్లకు కట్టారు. వాన కురిసే ముందు ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడు తూనీగలు గుంపులు గుంపులుగా ఎగురుతూ తిరగడం కద్దు. పొలాలు, తోటలు ఉండేచోట ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.

వాన చినుకుల చిటపట తాళానికి భేకరాజాల బెకబెకల సంగీతమూ తోడవుతుంది. ‘వానతూనీగ లాకాశ పథమునందు/ సరస ఝంకార రవములు సలుపుచుండె...’ అంటూ తన ‘కృషీవలుడు’ కావ్యంలో వర్ణించారు దువ్వూరి రామిరెడ్డి. అంతేకాదు, ‘తటములకు నాకసమున కంతరము లేక/ నీలనీరద మాలలు వ్రేలుచుంట/ నేలపై మిన్ను పడనీక నిలుపు చుండు/ స్తంభము లనంగ గిరులు దృశ్యంబులయ్యె’ అంటూ మంటికి మింటికి ఏకధారగా కురిసే కుంభవృష్టి కోలాహలాన్ని వర్ణించారాయన. 

అక్కడక్కడా శ్రుతిమించి మితిమీరిన వానలు వరదలతో ముంచెత్తుతుంటాయి. అంతమాత్రాన వర్షాలను వద్దనుకోలేం. వర్షాలే లేకపోతే ఈ భూమ్మీద జీవమే ఉండదు. ప్రకృతిలోని మిగిలిన రుతువులన్నీ ఒక ఎత్తయితే, వర్షరుతువు ఒక ఎత్తు. రుతువులన్నింటిలోనూ అత్యంత అనిశ్చితమైన రుతువు వర్షరుతువు! వేసవిలో చలి వణికించదు, చలికాలంలో ఉక్కపోత ఉండదు. అయితే, వర్షాకాలంలో ఒక్కోసారి ఆకాశంలో మబ్బుతునక మచ్చుకైనా కనిపించక ఎండలు కాయవచ్చు.

చినుకు కోసం ఎదురుచూపులతో నేల గొంతెండిపోయి నెర్రెలువారే పరిస్థితులు దాపురించవచ్చు. అలాంటి అనావృష్టి వల్లనే కరవు కాటకాలు పీడిస్తాయి. మన పురాణాల ప్రకారం వానలకు వరు ణుడు అధిదేవుడు. రోజుల తరబడి ఎదురుచూపులు చూస్తున్నా, వానలు కురవకపోతే ఒకప్పుడు యజ్ఞాలు చేసేవాళ్లు. అలాగే వానల కోసం కప్పల పెళ్లిళ్లు చేయడం ఆచారం. కప్పల పెళ్లిళ్ల వల్ల కచ్చితంగా వానలు కురుస్తాయనే భరోసా ఏదీ లేకపోయినా, అదో నమ్మకం. మాయదారి లోకంలో మనుషులను ముందుకు నడిపేవి నమ్మకాలే! నమ్మకాలే లేకపోతే జీవితాలు బీడువారి పోవూ!

వర్షరుతువులో వానల అనిశ్చితి కారణంగానే ‘వాన రాకడ ప్రాణం పోకడ ఎవరికీ తెలీదు’ అనే నానుడి పుట్టింది. పాశ్చాత్య ప్రపంచంలో కూడా వానకు సంబంధించిన నానుడులు అనేకం వాడుకలో ఉన్నాయి. వానలు కురిసేటప్పుడు అప్పుడప్పుడు ఆకాశంలో అందాల హరివిల్లులు కనిపిస్తుంటాయి. వాననీటిలో సూర్యకాంతి ప్రతిఫలనం వల్ల ఏర్పడే అద్భుత దృశ్యం ఏడురంగుల హరివిల్లు. చాలా తక్కువసేపు మాత్రమే కనిపించి, కనువిందు చేస్తుంది.

‘మగువల సౌందర్యం, అడవిలోని ప్రతిధ్వని, ఆకాశంలోని హరివిల్లు అతి త్వరగానే అంతరించి పోతాయి’ అని ఇంగ్లిష్‌ సామెత. ఇది జీవితంలోని క్షణభంగురతకు అద్దం పడుతుంది. ‘దరిద్రుడు తల కడిగితే వడగళ్ల వాన’అని మనకో సామెత ఉంది. ఇంచుమించు ఇలాంటి సామెతే ఒకటి ఇంగ్లిష్‌లోనూ ఉంది. అది: ‘నేను ఉప్పు అమ్మడానికి పోతే వాన కురుస్తుంది, పిండి అమ్మడానికి పోతే పెనుగాలి వీస్తుంది.’ జీవితంలో దురదృష్టం వెంటాడేటప్పుడు ప్రతికూల పరిస్థితులు అకాల వర్షంలాగానే ముంచుకొ స్తాయి. అయితే,‘దై ఫేట్‌ ఈజ్‌ ది కామన్‌ ఆఫ్‌ ఆల్‌/ ఇన్‌టు ఈచ్‌ లైఫ్‌ సమ్‌ రెయిన్‌ మస్ట్‌ ఫాల్‌’ అంటాడు అమెరికన్‌ కవి హెన్నీ వాడ్స్‌వర్త్‌ లాంగ్‌ఫెలో. అందరి తలరాతలూ ఒకేలా తగలడినప్పుడు, ప్రతి జీవితంలోనూ కాసింత వాన కురవాలనేది ఆయన ఆకాంక్ష పాపం. మనసుల్లో ఆశలు మొలకెత్తాలంటే, జీవితాల్లో కాసింత వాన కురవాల్సిందే కదా! 

మరిన్ని వార్తలు