‘సర్వోన్నత’ వ్యాఖ్యలు

7 Jan, 2023 00:32 IST|Sakshi

సంక్లిష్ట సమస్యలెదురైనప్పుడు యాంత్రికంగా వ్యవహరించటంకాక మనసుపెట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం కూడా ఉన్నప్పుడే ఏ వ్యవస్థయినా అందరిచేత ప్రశంసలందుకుంటుంది. ఇతర వ్యవస్థల మాటెలావున్నా నిత్యం ప్రభుత్వాల నిర్ణయాల్లో, పౌరుల వ్యవహార శైలిలో తప్పొప్పులనెంచే పనిలో నిమగ్నమైవుండే న్యాయవ్యవస్థకు ఈ గుణం మరింత అవసరం. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ నగరంలో రైల్వే శాఖ అధీనంలోనిదని చెబుతున్న 29 ఎకరాల భూమిలో ఆక్రమణదారులను వెంటనే తొలగించాలంటూ గత డిసెంబర్‌లో అక్కడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాజాగా సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలను ఈ కోణంలో చూడాలి.

సమస్య అన్నిచోట్లా ఉంటున్నదే. పేద, ధనిక తేడా లేకుండా అందరూ చేస్తున్నదే. పట్టణ, నగర ప్రాంతాల్లోని విలువైన భూములు అన్యాక్రాంతం కావడం దశాబ్దాలుగా కనబడుతున్నదే. పల్లెల్లో జరుగుబాటు నానాటికీ కష్టమై ఏదో ఒక పని దొరక్కపోతుందా అన్న ఆశతో నిత్యం వేలాదిమంది సమీపంలోని పట్టణా లకూ, నగరాలకూ లేదా సుదూరతీరాల్లోని నగరాలకూ వలసపోతుంటారు. ఇలా వెళ్తున్నవారు ఆయా ప్రాంతాల్లో తలదాచుకుందుకు అనివార్యంగా కొద్దిపాటి జాగా వెతుక్కోక తప్పదు. సరిగ్గా ఇక్కడే స్థానిక పెత్తందార్లు, మాఫియా ముఠాల వ్యక్తులు రంగప్రవేశం చేస్తారు.

తమను ఆశ్ర యించిన దిక్కూ మొక్కూలేని జనం నుంచి ఎంతో కొంత లాక్కొని వృధాగా పడుండే సర్కారీ భూముల్లో లేదా స్థానిక సంస్థల భూముల్లో గుడిసెలు వేసుకొనేందుకు ‘అనుమతిస్తారు’. నగరాల్లోని ఏ మురికివాడల చరిత్ర చూసినా ఇంతే. సంపన్న వర్గాలది వేరే కథ. నగరంలో చాలా ముఖ్యమైన ప్రాంతంగా పేరుబడిన చోట ఉండే మురికివాడపైనో లేదా అంతవరకూ ఎవరి దృష్టీ పడని సర్కారీ భూమిపైనో కన్నేసి నకిలీ పత్రాలు సృష్టించి వాటి ఆధారంగా ఆక్రమణలకు పూనుకుంటారు. వాటిని చట్టబద్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు.

అందుకోసం రాజకీయ పార్టీల్లో చేరి కాలక్రమంలో బడా నేతలుగా ఎదుగుతారు. బాధాకరమైన విషయమేమంటే ఆక్రమణదారులందరినీ వ్యవస్థలు ఒకేలా చూడవు. సమ న్యాయం పాటించవు. ఇతర వ్యవస్థల మాట అటుంచి న్యాయ స్థానాలు సైతం ఇటీవల ఇలాంటి ధోరణినే ప్రదర్శిస్తుండటం ఆందోళనకరమైన పరిణామం. నిరు పేదలను వెళ్లగొట్టడంలో అత్యుత్సాహం చూపే వ్యవస్థలే ఆక్రమణదారులైన బడా నేతల విషయంలో ఎక్కడలేని ఉదారతనూ ఒలక బోస్తున్నాయి.

ఉత్తరాఖండ్‌ హైకోర్టు నిరుడు డిసెంబర్‌లో ఇచ్చిన తీర్పు పూర్వాపరాలు పరిశీలిస్తే న్యాయ స్థానాల తీరుతెన్నులెలా ఉంటున్నాయో అర్థమవుతుంది. వివాదంలో ఉన్న 29 ఎకరాల భూమి 2 కిలోమీటర్ల నిడివిన ఉంది. ఈ కాలనీకి గఫూర్‌ బస్తీ అని పేరు. అందులో ‘ఆక్రమణదారుల’ ఆవాసాలు మాత్రమే కాదు... నాలుగు ప్రభుత్వ పాఠశాలలు, మంచినీటి ట్యాంకులు, మసీదులు, ఆలయాలు, దుకాణాలు ఉన్నాయి. ఈ బస్తీలోని 4,500కుపైగా ఆవాసాల్లో మొత్తంగా 50,000 మంది వరకూ నివసిస్తున్నారు.

వీరందరినీ ‘తక్షణం’ ఖాళీ చేయించాలనీ, ఇందుకోసం పారా మిలిటరీ దళాలను కూడా వినియోగించవచ్చనీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ స్థలానికి సమీపంలోని నదిలో అక్రమంగా ఇసుక తవ్వుకుపోతున్నారని 2013లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) పరిధిని హైకోర్టు తనకు తానుగా విస్తృతపరిచి, ఈ ఆక్రమణల సంగతి కూడా తేలుస్తామని ప్రకటించింది. ఆక్రమణలను క్రమబద్ధీకరించి తీరాలని ఎవరూ డిమాండ్‌ చేయరు. నిజానికి ఇదే ఉత్తరాఖండ్‌లో పర్యావరణానికి ముప్పు కలిగించేలా బడా పారిశ్రామికవేత్తలు అడవు లకూ, నదులకూ ప్రమాదం తెచ్చిపెడుతున్నారు.

వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సమీపంలో కాంక్రీట్‌ నిర్మాణాలు, విశాలమైన రహదారులు వెలుస్తున్నాయి. ఆఖరికి ఉత్తరాఖండ్‌ సర్కారు అక్కడున్న ఏకైక శివాలిక్‌ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సైతం 2020లో డీనోటిఫై చేసింది. డెహ్రాడూన్, హరిద్వార్, హల్ద్వానీ, తనక్‌పూర్, రాంనగర్‌ డివిజన్లను ఒరుసుకుని ఉన్న ఈ కేంద్రాన్ని డీనోటిఫై చేసిన తీరును కేంద్ర పర్యావరణ శాఖ కూడా తప్పుబట్టింది. ఇక చట్టవిరుద్ధంగా భారీ యంత్రాల సాయంతో సాగే ఇసుక తవ్వకాలవల్ల వంతెనలు కూలిన సందర్భాలు కూడా లేకపోలేదు.

2013లో అలా వంతెన కూలిన ఉదంతం తర్వాతే ఈ పిల్‌ దాఖలైంది. హిమానీ నదాలు పారే రాష్ట్రంలో ఇతరేతర పర్యావరణ ఉల్లంఘనలను పట్టించుకోని వ్యవస్థలు నిరుపేదల కాలనీపై విరుచుకు పడాలనుకోవటం ఎలాంటి న్యాయం? గఫూర్‌ కాలనీవాసుల్లో అత్యధికులు ముస్లింలు గనుకే వారిని వెళ్లగొట్టాలని బీజేపీ సర్కారు కుట్రలు పన్నుతున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో హైకోర్టు ధర్మాసనం కాస్తయినా సున్నితంగా ఆలోచించొద్దా?

హల్ద్వానీలో తలెత్తిన వివాదం 1907 నాటి ప్రభుత్వ రికార్డుల చుట్టూ తిరుగుతోంది. తమ పూర్వీకులు అయిదు దశాబ్దాల క్రితం ప్రభుత్వ వేలంలో సొంతం చేసుకున్నారని కొందరు దాఖలాలు చూపారు. మరికొందరు వేరేవారినుంచి కొన్నట్టు పత్రాలు దాఖలాలు చేశారు. ఇవన్నీ నిజం కాదని న్యాయస్థానాలు భావించినా ఖాళీ చేయించేముందు వారికి ప్రత్యామ్నాయం చూపాలన్న కనీస స్పృహ ఉండాలి. ఆ ప్రత్యామ్నాయం ఆచరణాత్మకంగా ఉండాలి. అన్నీ వదిలి వ్యవస్థలు బుల్‌డోజర్‌ న్యాయానికే మొగ్గితే పౌరులు ఎవరికి మొరపెట్టుకోవాలి? ఈ పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయస్థానం చేసిన సూచనలు విలువైనవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ పట్టించుకోవాల్సినవి. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు