బ్రిటన్‌ కోర్టు తీర్పు చరిత్రాత్మకం

6 Jan, 2021 00:12 IST|Sakshi

ఎనిమిదిన్నరేళ్లుగా స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు దూరమైన వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజ్‌ను అమెరికాకు అప్పగించరాదంటూ బ్రిటన్‌ కోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు ఆయన విడుదల కోసం ఉద్యమిస్తున్నవారికీ, ప్రపంచవ్యాప్తంగా వున్న స్వేచ్ఛాప్రియులకూ ఊరట నిస్తుంది. అసాంజ్‌ను బెయిల్‌పై విడుదల చేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేయదల్చుకున్నట్టు ఆయన టీం ప్రకటించింది. ఎటూ ఈ తీర్పుపై అప్పీల్‌కి వెళ్లదల్చుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది గనుక ఆయనకు వెంటనే బందీఖానా నుంచి విముక్తి లభించే అవకాశాలు తక్కువే. తాము ప్రజా స్వామిక వాదులమని చెప్పుకునే పాశ్చాత్య ప్రపంచాన్ని బజారులో నిలబెట్టి, నిలదీసి అందరినీ నివ్వెరపరిచిన అసాంజ్‌ను అగ్రరాజ్యాలు వేటకుక్కల్లా వెంటాడుతున్నాయి.

ఆయన బట్టబయలు చేసిన రహస్యాలే ఇందుకు కారణమేమిటో చెబుతాయి. ఇరాక్‌లోని ఓ మారుమూల గ్రామంలో ఒక వీధిలో మాట్లాడు కుంటున్న సాధారణ పౌరులను, ఇద్దరు రాయిటర్‌ జర్నలిస్టులను  కేవలం సరదా కోసం బాంబులేసి హతమార్చిన అమెరికా సైనిక హెలికాప్టర్‌ దురంతాన్ని వెల్లడించటంతో మొదలు పెట్టి అసాంజ్‌ చేసిన సాహసకృత్యాలు అన్నీ ఇన్నీ కాదు. ఇరాక్‌లోనూ, అఫ్ఘాన్‌లోనూ ఉగ్రవాదాన్ని అంతం చేసే పేరిట అమెరికా, దాని కూటమి దేశాల సైనిక దళాలు ఎన్ని అఘాయిత్యాలకు పాల్ప డ్డాయో తెలిపే పత్రా లను ఆయన బట్టబయలు చేశాడు. వేర్వేరు దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు తమ ప్రభుత్వానికి పంపిన కోట్లాది సందేశాలన్నీ అసాంజ్‌ వల్లనే లోకానికి వెల్లడ య్యాయి. భిన్న దేశాల ప్రభుత్వాలు, వాటి సైనిక వ్యవస్థలపై అమెరికా అంచనాలు... తమ అక్రమా ర్జనను వేరే దేశాల బ్యాంకులకు తరలించే బడా సంపన్నుల గుట్టు వగైరాలు ఆయన చొరవ తీసుకో నట్టయితే ఎప్పటికీ బయటికొచ్చేవి కాదు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వుండగా 2006లో జరిగిన కేంద్ర కేబినెట్‌ విస్తరణలో ‘మన అనుకూలురు’ ఫలానా అంటూ అమెరికా సర్కారుకు వివరించిన సందేశం కూడా అందులో వుంది. 

బ్రిటన్‌ కోర్టు వెలువరించిన తాజా తీర్పు చరిత్రాత్మకమైనది. అమెరికా గూఢచర్య చట్టాన్ని విచ్చల విడిగా ప్రయోగించే ధోరణి ఇటీవలకాలంలో ఎక్కువైంది. నిజాలను నిర్భయంగా రాసే పాత్రికేయు లను భయభ్రాంతుల్ని చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. జర్నలిజం పేరిట నేరపూరిత చర్యలకు దిగితే,  దాన్నొక లైసెన్సుగా భావిస్తే చెల్లదని నిరుడు అమెరికా తరఫు న్యాయవాది బ్రిటన్‌ కోర్టులో వాదించాడు. అసాంజ్‌ను అమెరికాకు అప్పగిస్తే ఆ క్షణం నుంచి పాత్రికేయుల స్వేచ్ఛా స్వాతంత్య్రా లకు ముప్పు వాటిల్లుతుందని అక్కడి మీడియా తరఫు న్యాయవాదులు గట్టిగా చెప్పారు. ఆయన్ను అప్పగించటం బ్రిటన్‌ నమ్ముతున్న విలువలకు విరుద్ధమని తెలిపారు. అసాంజ్‌ చర్యల వల్ల వాస్తవా నికి అమెరికాకు కలిగిన ముప్పేమీ లేదు. ఆయన వెల్లడించిన అంశాలు కేవలం అక్కడి పాలకుల కపటత్వానికి అద్దం పట్టాయి. తన మిత్ర దేశాలనుకున్నవాటిపై కూడా అమెరికా నిఘా వేసిన తీరును వెల్లడించాయి. అవి అప్రజాస్వామికమైనవని, వందల సంవత్సరాలుగా అమెరికా సమాజం నమ్మే విలువలకు విరుద్ధమైనవని గ్రహించి సరిదిద్దుకుంటే అందువల్ల ఆ సమాజానికి అంతిమంగా మేలే తప్ప కీడు జరగదు. తాము ఇంతకాలం ప్రవర్తించిన తీరు సరికాదని గుర్తించి ప్రపంచ దేశాలకు క్షమాపణ చెబితే అందువల్ల అమెరికా ప్రతిష్ట మరింత పెరుగుతుంది. అది ప్రపంచానికే ఆదర్శనీయ మవుతుంది.

కానీ ఈ కేసులో మొదటినుంచీ  జరిగిందంతా అందుకు భిన్నం. అసాంజ్‌ను బంధించి అమెరికాకు అప్పగించి తమ స్వామిభక్తిని నిరూపించుకోవటానికి చాలా దేశాలు ప్రయత్నించాయి. స్వీడన్‌లో ఆయనపై అత్యాచారం ఆరోపణలతో తప్పుడు కేసు నమోదైంది. ఈ సాకుతో అసాంజ్‌ను అదుపులోనికి తీసుకుని స్వీడన్‌కు పంపాలని బ్రిటన్‌ పథక రచన చేసింది. ఈలోగా ఈక్వెడార్‌లో పాలకులు మారడంతో తమ రాయబార కార్యాలయం వదిలి వెళ్లాలంటూ ఆ దేశం అసాంజ్‌కు హుకుం జారీచేసింది. అంతవరకూ ఆయన్ను బంధించి, స్వీడన్‌కు అప్పగించి అటునుంచి అమెరికాకు తరలించాలని చూసిన బ్రిటన్‌ సర్కారు ఇదే అదనుగా అరెస్టు చేసింది. కానీ ఉద్యమకారుల సడలని పట్టుదల కారణంగా అమెరికాకు అప్పగించాలన్న దాని ప్రయత్నాలు మాత్రం నెరవేరలేదు. ఈలోగా స్వీడనే తగిన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో అత్యాచారం కేసును విరమించుకుంది. ఇప్పుడు అమెరికాకు అప్పగించే ప్రయత్నం సరికాదని బ్రిటన్‌ కోర్టు తేల్చటం ఉద్యమకారుల తాజా విజయం. 

అధికారం మెట్లు దిగబోతున్న డోనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల అనేకమందికి క్షమాభిక్షలు ప్రకటించారు. కొందరు నేరస్తుల జైలు శిక్షల కాలాన్ని గణనీయంగా తగ్గించారు. అసాంజ్‌కు సైతం ఇదేవిధంగా క్షమాభిక్ష మంజూరుచేసి ఆయనపై సాగుతున్న వేధింపులకు ముగింపు పలకాలని అనేకమంది డిమాండ్‌ చేశారు. కానీ ట్రంప్‌ వాటిని పట్టించుకోలేదు. ట్రంప్‌ స్థానంలో అధికారంలోకి రాబోయే జో బైడెన్‌ కూడా అసాంజ్‌ విషయంలో సానుకూలంగా వ్యవహరించకపోవచ్చు. ఎందుకంటే గతంలో ఉపాధ్యక్షుడిగా వున్న కాలంలో ఆయన అసాంజ్‌ను ‘హైటెక్‌ ఉగ్రవాది’గా అభివర్ణించారు. అసాంజ్‌ అప్పగింతకు అంగీకరిస్తే ఆయనపై అమెరికా మోపిన 17 అభియోగాలకు 175 ఏళ్ల శిక్ష పడే అవకాశం వుందని న్యాయవాదులు చెబుతున్నారు.

అంటే జీవితాంతం జైలు నిర్బంధంలోనే మగ్గిపోవలసి వుంటుంది. వేరే దేశాల్లో ప్రభుత్వాల వేధింపులను ఎదుర్కొనే అసమ్మతివాదులకు ఆశ్రయమిచ్చిన చరిత్ర అమెరికా, బ్రిటన్‌లకు వుంది. అలాగే తమ గూఢచారులుగా పనిచేసి, అనుకోకుండా దొరికి పోయినవారిని సైతం అవి కాపాడి, తమ పౌరసత్వం ఇచ్చి రక్షించాయి. కానీ అవే దేశాలు ఇప్పుడు ఆయనపట్ల అప్రజాస్వామికంగా వ్యవహరించటం దుర్మార్గం. సాధ్యమైనంత త్వరలో ఈ కేసుల నుంచి అసాంజ్‌కు విముక్తి లభించాలని, ఆయన మళ్లీ స్వేచ్ఛావాయువులు పీల్చుకోవాలని ప్రపంచ ప్రజాస్వామికవాదులంతా ఎంతగానో కోరుకుంటున్నారు.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు