చన్నీ మంత్రం ఫలించేనా?

8 Feb, 2022 00:54 IST|Sakshi

అందరి దృష్టీ ఉత్తర ప్రదేశ్‌ (యూపీ), పంజాబ్‌ల మీదే నెలకొన్న వేళ... కాంగ్రెస్‌ పార్టీ తన సాధారణ పద్ధతికి భిన్నంగా పంజాబ్‌లో ముందుగానే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. రకరకాల ఊహాగానాలొస్తున్న నేపథ్యంలో మరో తడవ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న దళిత ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీనే సీఎంగా కొనసాగించనున్నట్టు ఆ పార్టీ ఎట్టకేలకు ఆదివారం ప్రకటించింది. సొంత పార్టీలోనే సీఎం పీఠాన్ని ఆశిస్తున్న మిగతా పోటీదారుల సమక్షంలో కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్‌ గాంధీ ఈ ప్రకటనతో తాంబూలాలు ఇచ్చేశారు. దీంతో పార్టీలో కుమ్ములాటలు ఏ మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. 

‘టీమ్‌ పంజాబ్‌ కాంగ్రెస్‌’ సమష్టిగా ఎన్నికల పోరాటం చేస్తుందని పైకి చెబుతున్నా, పార్టీలో ప్రకంపనలు ఆగడం లేదు. అభ్యర్థిగా చన్నీని ప్రకటించిన కాసేపటికే, రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు – సీఎం కావాలని తపిస్తున్న మరో ఆశావహుడు సునీల్‌ జాఖడ్‌ క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై కొడుతున్నానన్నారు. అయిదు నెలల క్రితమే సీఎం మార్పు వేళ కూడా తన పేరును పరిశీలించ లేదని అలిగిన జాఖడ్‌ మళ్ళీ అలకపాన్పు ఎక్కేశారు. పార్టీ ఇచ్చిన పని చేస్తానంటూనే, పంజాబ్‌లో సీఎం కాగల సత్తా ఉన్న నేతలు చాలామంది ఉన్నారంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తన మనసులోని ఇదే బాధ సిద్ధూకు కూడా ఉంటుందంటూ, ఆయననూ గిల్లే ప్రయత్నం చేస్తున్నారు. 

నిజానికి, అధిష్ఠానానికి కావాల్సిందల్లా ఢిల్లీ నుంచి తాము చెప్పినట్టల్లా ఆడే బలహీన ముఖ్యమంత్రి మాత్రమేనంటూ పంజాబ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సిద్ధూ శనివారమే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కానీ, ఆదివారం నాటి సభలో మాత్రం రాహుల్‌ ముందు కాస్తంత తగ్గి, తనకు కావాల్సింది పదవి కాదు, పంజాబ్‌ ప్రజల జీవితాల బాగు అని ప్లేటు తిప్పారు. ఆయన ఈ మాటకు కట్టుబడి ఎన్నాళ్ళు సొంత పార్టీ, సొంత సీఎంపై బాణాలు సంధించకుండా ఉంటారో ఎవరూ చెప్పలేరు. ఆ మాటకొస్తే ప్రతిక్షణం పాదరసంలా జారిపోయే సిద్ధూ కూడా చెప్పలేరు. కాకపోతే, ఈ సరిహద్దు రాష్ట్రంలోని దాదాపు ప్రధాన పార్టీలన్నిటితోనూ ఖటీఫ్‌ చెప్పి, కాంగ్రెస్‌కు వచ్చిన సిద్ధూకు ఇప్పటికిప్పుడు పెద్దగా ప్రత్యామ్నాయాలు లేవు. ప్రస్తుతానికి తాను పోటీ చేస్తున్న అమృత్‌సర్‌ తూర్పు స్థానంలో గెలిచి, సమయం కోసం వేచి చూడడమే కీలకమని ఆయనకూ తెలుసు. 

పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ అయిన సునీల్‌ జాఖడ్‌ కారులోనే చన్నీ, సిద్ధూలతో కలిసొచ్చి మరీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం ద్వారా అందరూ కలిసే ఉన్నారని సంకేతించాలని రాహుల్‌ శ్రమించారు. అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్నా, దళిత సీఎం చన్నీని కాదని మరొకరి పేరు ప్రకటిస్తే, మొదటికే మోసం వస్తుందని ఈ గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీకి బాగా తెలుసు. అధికారంలో ఉన్న కాసిన్ని రాష్ట్రాలనూ కాపాడుకోవడానికీ శతవిధాల ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు ఓ అగ్నిపరీక్ష. మునుపటి దామోదరం సంజీవయ్య, భోలా పాశ్వాన్, జగన్నాథ్‌ పహాడియా, సుశీల్‌ కుమార్‌ షిండేల వరసలో చన్నీతో దళిత బాంధవ పార్టీగా నిలవాలనీ, పంజాబ్‌లోని 31 శాతం ఉన్న దళిత ఓటర్ల మనసు గెలవాలనీ కాంగ్రెస్‌ ఆలోచన. ఇక, గత ఏడాది సెప్టెంబర్‌ 20న పంజాబ్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 58 ఏళ్ళ చన్నీకేమో ఇది ఊహించని అవకాశం. షెడ్యూల్డ్‌ కులాల వర్గం నుంచి పంజాబ్‌ పీఠమెక్కిన తొలి వ్యక్తిగా ఆయనకు రికారై్డతే దక్కింది. కానీ, రామ్‌దాసియా, రవిదాసియా అని పంజాబీ దళితుల్లో రెండు వర్గాలున్నాయి. తొలి వర్గానికి చెందిన చన్నీ అందరినీ ఆకట్టుకొని, అయిదు నెలలైనా కాక ముందే పార్టీని గెలిపించడం అత్యవసరమైంది. 

గ్రామీణ పంజాబ్‌లోని పేద కుటుంబం నుంచి పైకొచ్చిన ఈ మృదుభాషికీ కాంగ్రెస్‌ సంస్కృతిలో భాగమైన అసమ్మతి సహజగుణమే. మునుపటి కాంగ్రెస్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌పై ధ్వజమెత్తినవారిలో చన్నీ కూడా ఉన్నారు. తీరా అమరీందర్‌ స్థానంలో తనకే సీఎం పీఠం వస్తుందని ఆయన ఊహించలేదు. గద్దెనెక్కాక ఇంటిపోరు ఆయనకూ అనుభవంలోకి వచ్చింది. ఒకే విడతలో ఫిబ్రవరి 20న జరిగే పంజాబ్‌ ఎన్నికల ప్రధాన ప్రచారకర్తల జాబితాలో తన పేరు మినహాయించడం లోక్‌సభ కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ మల్హోత్రాకు కినుక తెప్పించింది. ప్రధాని మోదీ పంజాబ్‌ పర్యటన వేళ ఏర్పడ్డ భద్రతా వైఫల్యంపై మనీశ్‌ చేసిన వ్యాఖ్యలు బీజేపీ కథనానికి దగ్గరగా ఉండడమే అందుకు కారణమని కథనం. ఆయనా ఇప్పుడు తిరుగుబాటు జెండా పట్టే పనిలో ఉన్నారు. 

ఈ అనైక్యతా రాగం చన్నీ మాటెలా ఉన్నా పార్టీని ఇరుకున పెడుతోంది. దీనివల్ల విజయావకాశాలు దెబ్బ తింటే చన్నీకి పెద్దగా పోయేదేమీ లేదేమో కానీ, పార్టీకే నష్టం. అనైక్యతను భరిస్తూ, ఎన్నికల్లో గెలుపు చన్నీకి సవాలే. మరోపక్క చన్నీ సన్నిహితగణంపై కేంద్ర దర్యాప్తు సంస్థల తాకిడీ మొదలైపోయింది. చన్నీ మేనల్లుణ్ణి ఇసుక అక్రమ తవ్వకాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. వీటన్నిటి మధ్య ఆమ్‌ ఆద్మీ పార్టీ, కొందరు రైతుల కొత్త జెండా ఎస్‌ఎస్‌ఎం, బీజేపీ– అమరీందర్‌ సింగ్‌ల పీఎల్‌సీ, అకాలీదళ్‌ – బీఎస్పీలతో బహుముఖ పోరులో చన్నీ విజేతగా బయట పడగలరా? దారిద్య్రం నుంచి పైకొచ్చిన చన్నీకి ప్రజల కష్టాలు తెలుసన్నారు రాహుల్‌. ప్రజలదే కాదు... ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షానికే పరిమితమైన కాంగ్రెస్‌ని బాధిస్తున్న అధికార దారిద్య్రం కూడా ఆయనకు తెలుసు. పంజాబ్‌లో పార్టీని మరోసారి గెలిపించి, ఆ దారిద్య్రాన్ని ఆయన పోగొట్టగలరా అన్నదే శేషప్రశ్న.

మరిన్ని వార్తలు