అడుగడుగునా వివక్ష

15 Oct, 2020 00:47 IST|Sakshi

లైంగిక వేధింపులకు సంబంధించిన ఉదంతాలు వెల్లడైనప్పుడు సమాజంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి. కారకులపై చర్యకు అందరూ డిమాండ్‌ చేస్తారు. కానీ లింగ వివక్ష అలా కాదు. చాలా సందర్భాల్లో అది బాధితులకు తప్ప కనబడదు. వారు ఫిర్యాదు చేస్తే తప్ప ఎవరి దృష్టీ పడదు. ఒక్కోసారి ఫిర్యాదు చేసినా చివరకు అది వివక్షగా పరిగణనలోకి రాకపోవచ్చు. బాధితులు దాన్ని సరిగా చెప్పలేకపోవచ్చు. లింగ వివక్ష బాహాటంగా కనబడినప్పుడు సైతం బాధితులకు అండగా నిలిచే ధోరణి అన్నిచోట్లా వుండదు. అసలది పెద్దగా చర్చకు రాదు. మంగళవారం జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సులో ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్యా స్వామినాథన్‌ చాలా నిర్మొహమాటంగా మాట్లాడి మంచి పనిచేశారు.

కెరీర్‌ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న అవమా నాలనూ, అవరోధాలనూ చెప్పారు. అడుగు ముందుకు పడుతున్నా, ఆధునికత విస్తరిస్తున్నా, అభివృద్ధి సాధిస్తున్నామని అనుకుంటున్నా మారనిది ఈ లింగ వివక్ష. పిండ దశతో మొదలుపెట్టి అన్ని స్థాయిల్లో, అన్ని రంగాల్లో ఇది తప్పడం లేదు. సౌమ్యా స్వామినాథన్‌ వంటివారు మాట్లాడటం వల్ల ఇలాంటి వివక్ష ఎదుర్కొంటున్నవారు ఆ విషయాన్ని సూటిగా చెప్పగలిగే, గట్టిగా ప్రశ్నించగలిగే స్థైర్యాన్ని, ధైర్యాన్ని తెచ్చుకుంటారు. ఆమె చెప్పిన విషయాలు వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తాయి. భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌)లో పనిచేసినప్పుడు తాను ఎదు ర్కొన్న వివక్ష గురించి ఆమె చెప్పారు. ఐసీఎంఆర్‌ మన దేశంలో జీవ వైద్య పరిశోధనలో సర్వో న్నతమైన సంస్థ.

1911లో భారతీయ పరిశోధనా నిధి సంఘం(ఐఆర్‌ఎఫ్‌ఏ)గా ఆవిర్భవించిన ఆ సంస్థ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949లో ఐసీఎంఆర్‌గా రూపుదిద్దుకుంది. అది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య పరిశోధనా విభాగం సారథ్యంలో పనిచేస్తుంది. గర్భధారణ, తల్లీబిడ్డల ఆరోగ్యం, అంటురోగాలు, పౌష్టికాహార లోపాలు, కేన్సర్, గుండె సంబంధ వ్యాధులు, మధుమేహం, మానసిక ఆరోగ్యం, ఔషధాలు వగైరాల్లో ఐసీఎంఆర్‌ పరిశోధనలు చేస్తుంది. సమాజ ఆరోగ్య పరిరక్షణకు అవలంబించాల్సిన ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందిస్తుంది. సగటు మనుషుల్లో కనబడే కుల, మత, ప్రాంత, జెండర్‌ వివక్షలవంటివి ఇలాంటిచోట తావుండదని అందరూ అను కుంటారు. ఆశిస్తారు. విద్యాపరంగా, మేధోపరంగా ఇక్కడివారు ఉన్నతంగా వుంటారని భావిస్తారు. అయితే సౌమ్య వెల్లడించిన అంశాలు ఇందుకు విరుద్ధంగా వున్నాయి. కమిటీ సమావేశాల్లో ఎప్పుడూ పురుషాధిక్యత రాజ్యమేలుతుందని, పరిశోధనకు సంబంధించి చెప్పేవి పూర్తిగా వినకుండానే కొట్టిపారేయడం లేదా ఆ ఆలోచనను హేళన చేయడం తనకు తరచు ఎదురయ్యేదని ఆమె చెప్పిన మాటలు విషాదం కలిగిస్తాయి.

ఇందువల్ల రెండోసారి ఏదైనా ప్రతిపాదించదల్చుకున్నప్పుడు, ఒక అభిప్రాయం చెప్పదల్చుకున్నప్పుడు  సంకోచం ఏర్పడేదని కూడా ఆమె చెప్పారు. ఇలాంటిచోట కొత్త ఆలోచనలకూ, సృజనకూ తావుంటుందా? స్వాతంత్య్ర వచ్చి ఏడు పదులు దాటుతున్నా మన దేశంలో అక్షరాస్యతలో బాలికల శాతం తక్కువే. పాఠశాల విద్యలో చేరిన ఆడపిల్లల్లో ఎక్కువ శాతం అనేకానేక అవాంతరాల వల్ల మధ్యలోనే చదువు చాలించుకుంటారు. ఉన్నత చదువులకు వెళ్లేసరికి అది మరింతగా తగ్గుతుంది. గతంతో పోలిస్తే శాస్త్ర పరిశోధనా రంగంలో ఇప్పుడు మహిళల శాతం బాగా పెరిగినా అదింకా ఉండవలసినంతగా లేదు. ఇప్పుడే ఇలావుంటే ఆమె కెరీర్‌లో అడుగుపెట్టేనాటికి ఎలాంటి స్థితి వుండేదో సులభంగానే అంచనా వేసుకోవచ్చు. మన సమాజంలో కుటుంబం సహాయసహకారాలు, ప్రోత్సాహం లేకపోతే ఆడపిల్లలు అన్నివిధాలా ఎదగటం చాలా కష్టం. భారత హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన ఎంఎస్‌ స్వామినాథన్‌ కుమార్తెగా మాత్రమే కాదు... సాయుధ దళాల వైద్య కళాశాలలో, ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్‌లో ఉన్నత చదువులు చదివిన ఆమెకు సైతం పనిచేసేచోట వివక్ష తప్పలేదంటే బాధాకరమే. చదువుకునే రోజుల్లో ఎదురుకాని పరిస్థితులు పనిచేసేచోట వున్నాయని ఆమె అంటున్నారు. మహిళా పరిశోధకులు తమ పరిశోధనాంశాలకు గ్రాంట్లు తెచ్చుకోవాలన్నా, వారి పరిశోధనా ఫలితాలు ప్రతిష్టాత్మక పత్రికల్లో ప్రచురింపజేసుకోవాలన్నా సమస్యలెదురవుతుంటా యన్నది ఆమె మరో ఆరోపణ. ఇవి ఇప్పుడు ఏమాత్రం తగ్గలేదు సరిగదా... మరింతగా పెరిగా యంటున్నారామె.

ప్రపంచ ఆరోగ్య రంగంలో పనిచేసే కిందిస్థాయి సిబ్బందిలో 70 శాతం వరకూ మహిళలే. కానీ  ఆ రంగం తీరుతెన్నులను నిర్ణయించాల్సిన సారథ్య బాధ్యతల్లో వారు 25 శాతం మించరని ఈమధ్య బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనడానికి ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌లో కేవలం ఇద్దరు మాత్రమే మహిళలు వున్నారని ఆ అధ్యయనం తెలిపింది. అచ్చం సౌమ్యా స్వామినాథన్‌ తరహాలోనే అమెరికాలోని ఎంఐటీలో సైన్స్‌ చరిత్రను బోధించే మహిళా శాస్త్రవేత్త అభా సూర్‌ కొన్నేళ్లక్రితం భారత్‌లోనూ, ఇతరచోట్లా అమల వుతున్న లింగ వివక్షపై ఒక పుస్తకమే రాశారు. 60వ దశకంలో లేజర్‌ కిరణాల గురించి పరిశో ధించేటపుడు లింగ వివక్షతోపాటు, కుల వివక్ష కూడా వుండేదని ఆమె అన్నారు. మన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, నోబెల్‌ గ్రహీత సర్‌ సీవీ రామన్‌ బెంగళూరు ఐఐఎస్‌సీ సారథిగా వున్నప్పుడు మహిళా శాస్త్రవేత్తలకు ఎదురైన ఇబ్బందుల్ని తెలిపారు. తరతమ భేదాలతో దాదాపు అన్ని రంగాల్లో పనిచేసే మహిళలకూ ఇలాంటి వివక్ష ఏదో ఒక దశలో ఎదురవుతోందన్నది వాస్తవం. కనుకనే ఇప్పుడు సౌమ్య ప్రస్తావించిన అంశాలను ఐసీఎంఆర్‌ మాత్రమే కాదు...అన్ని సంస్థలూ సీరియస్‌గా తీసుకుని తమ నిర్వహణా పద్ధతులనూ, విధానాలనూ సమీక్షించి సరిదిద్దుకోవాలి. వివక్ష ఏ రూపంలో వున్నా రూపుమాపాలి. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు