‘సుప్రీం’ స్ఫూర్తికి విరుద్ధం

19 Mar, 2021 00:54 IST|Sakshi

ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులకూ, చట్టసభలకూ ఎనలేని ప్రాధాన్యత వుంటుంది. దేశ రాజధాని కావటం వల్ల కావొచ్చు... ఢిల్లీకి సంబంధించినంతవరకూ అక్కడి అసెంబ్లీకి మొదటి నుంచీ పరిమితమైన అధికారాలే వున్నాయి. పేరుకు ముఖ్యమంత్రి, మంత్రులు వున్నా, దానికి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి లేదు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ గత కొన్నేళ్లుగా ప్రశ్నిస్తూనే వున్నారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ)గా వున్నవారితో ఆయనకు భిన్న సందర్భాల్లో ఘర్షణలు కూడా తలెత్తాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు మరింత కోతపెడుతూ కేంద్ర ప్రభుత్వం మొన్న సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుపై సహజంగానే ఆగ్రహావేశాలు రగుల్కొ న్నాయి. దీనిపై పాలక ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఉద్యమం ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వ జాతీయ రాజధాని ప్రాంత చట్టం,1991ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు ప్రకారం ఇకపై అక్కడ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్‌ గవర్నరే. పాలనాపరమైన ఏ చర్య తీసుకోవటానికైనా అక్కడి ప్రభుత్వం ఎల్‌జీని సంప్రదించాలి. ఈ బిల్లు చట్టమైతే అసెంబ్లీ, దానికి సంబంధించిన కమిటీలు రాజధాని ప్రాంతంలో రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన లేదా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం సాధ్య పడదు. 

మూడేళ్లక్రితం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కూ, ఎల్‌జీకీ మధ్య వివాదం తలెత్తినప్పుడు అధికారాల విభజనకు సంబంధించి సమగ్ర చట్టం తీసుకురావాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఆ ప్రకారమే తాము తాజా సవరణలు తెస్తున్నామని బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. అయితే ఈ బిల్లు సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి అనుగుణంగా వుందని చెప్పటానికి లేదు. 1992లో ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తూ 69వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఆ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన 239ఏఏ అధికరణ ప్రకారం తనకు సర్వాధికారాలూ వున్నాయని ఎల్‌జీ వాదన. ఢిల్లీ హైకోర్టు ఆయన వాదనను అంగీకరించింది. తాము తీసుకుంటున్న వివిధ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై ఎల్‌జీ ఎటూ తేల్చకుండా అవరోధాలు సృష్టిస్తున్నారని కేజ్రీవాల్‌ సర్కారు వాదించగా, పాలనాపరంగా ఆయనే సర్వాధికారి అని, ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆయన సమ్మతి అవసరమని ఢిల్లీ హైకోర్టు చెప్పింది.

కానీ సుప్రీంకోర్టు ఇందుకు భిన్నమైన తీర్పునిచ్చింది. ఎల్‌జీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసు కోవటానికి లేదని, ఆయన మంత్రి మండలి సలహాలు, సూచనలమేరకు పనిచేయాలని స్పష్టం చేసింది. అయితే ఇందుకొక మెలిక పెట్టింది. ఏ నిర్ణయాన్నయినా రాజ్యాంగదత్తమైన అధికారాలతో వ్యతిరేకించేందుకు ఎల్‌జీకి హక్కుందని, తుది నిర్ణయం కోసం ఆయన రాష్ట్రపతికి నివే దించవచ్చునని తెలిపింది. అదే సమయంలో ఈ నిర్ణయాధికారాన్ని యాంత్రికంగా ఉపయో గించరాదని వివరించింది. 239ఏఏ అధికరణ ప్రకారం ప్రజా భద్రత, పోలీసు, భూ సంబంధ అంశాలు మినహా మిగిలిన విషయాల్లో చట్టాలు చేసేందుకు ఢిల్లీ అసెంబ్లీకి అధికారాలున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సున్నితమైన అంశాలు ఇమిడివున్నవీ, ప్రభుత్వ స్తోమతకు మించి ఆర్థిక భారం పడేవీ, కేంద్రంతో లేదా పొరుగు రాష్ట్రాలతో రాజకీయ సమస్యలకు తావిచ్చేవీ ఎల్‌జీ రాష్ట్రపతికి నివేదించవచ్చు. కానీ ఆ తీర్పు ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి లభించిన పరిమిత ఉపశ మనాన్ని కాస్తా తాజా సవరణ బిల్లు హరిస్తోంది. కొందరు విశ్లేషకులు చెబుతున్నట్టు అది చట్టమైతే ఢిల్లీ ప్రతిపత్తి మున్సిపాలిటీకన్నా మిన్నగా ఏమీ వుండదు. 

ఢిల్లీకి 1956కు ముందు పనిచేసిన ఇద్దరు ముఖ్యమంత్రుల మాటేమోగానీ... 1993లో అక్కడ మళ్లీ అసెంబ్లీని పునరుద్ధరించినప్పటినుంచీ తగినన్ని అధికారాలివ్వాలన్న డిమాండ్‌ పదే పదే వస్తూనేవుంది. బీజేపీ సీనియర్‌ నేత మదన్‌లాల్‌ ఖురానా, ఆ తర్వాత అదే పార్టీకి చెందిన సాహిబ్‌ సింగ్‌ వర్మ, సుష్మా స్వరాజ్‌ వంటివారు సీఎంలుగా పనిచేసినప్పుడు మాత్రమే కాదు...కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షీలా దీక్షిత్‌ సైతం ఎన్నికైన ప్రజా ప్రతినిధులను చిన్నచూపు చూస్తున్నారని, తాము నామమాత్రం అవుతున్నామని ఆరోపించేవారు. అయితే తమ పార్టీకి చెందిన ప్రభుత్వాలే కేంద్రంలో అధికారంలో వుండటం వల్ల చివరకు ఎప్పుడూ వారిదే పైచేయి అయ్యేది. కానీ ప్రస్తుత ముఖ్య మంత్రి కేజ్రీవాల్‌ పరిస్థితి వేరు. ఆయనకు వర్తమానంలో సరేసరి... యూపీఏ పాలనాకాలంలోనూ కష్టాలు తప్పలేదు.

బస్తీల్లో క్లినిక్‌ల ఏర్పాటు మొదలుకొని టీచర్‌ పోస్టుల భర్తీ, వారి పదోన్నతులు, కాంట్రాక్టు టీచర్ల క్రమబద్ధీకరణ వరకూ అనేక అంశాలు ఎల్‌జీ వద్ద దీర్ఘకాలం పెండింగ్‌లో పడ్డాయి. ఢిల్లీకున్న ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని అధికారాలు కేంద్రం వద్దనే వుండాలనుకోవటంలో తప్పేమీ లేదు. కానీ టీచర్ల నియామకం, బస్తీ క్లినిక్‌ల వంటి ప్రజానుకూల అంశాల్లో సైతం ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోరాదనటం... అందుకు తమ ఆమోదముద్ర అవసరమనటం అప్రజా స్వామికం. తమను గెలిపిస్తే ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని బీజేపీ గతంలో వాగ్దానం చేసింది. అది నెరవేర్చకపోగా వున్న అధికారాలను కూడా హరించటం సరైంది కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి తగిన అధికారాలివ్వాలి. ఆ నిర్ణయాల్లో తప్పొప్పులుంటే ఎటూ జనం ప్రశ్ని స్తారు. వాటి రాజ్యాంగబద్ధతను న్యాయస్థానాలు తేలుస్తాయి. అంతేతప్ప ఆ ప్రభుత్వాలను నామ మాత్రావశిష్టం చేయటం ఎంతమాత్రం భావ్యం కాదు.

మరిన్ని వార్తలు