మార్పు ఎందుకు మహాశయా?

16 Feb, 2022 01:05 IST|Sakshi

దేనికైనా సమయం, సందర్భం ఉండాలి. అదీ కాకుంటే, అత్యవసరమైనా ఉండాలి. అవేవీ లేకుండా సాధారణ అంశాలలో అవసరం లేని మార్పులు చేసి, వాటిని అసాధారణ చర్చనీయాంశాలుగా మార్చడం ఇటీవల ప్రబలుతున్న పాలకుల, పాలనా సంస్థల వైఖరి. దానికి తాజా ఉదాహరణ – పట్టభద్రులయ్యాక వృత్తి బాధ్యతలు చేపట్టే ముందు వైద్యులు చేసే శపథాన్ని మార్చాలంటూ జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) చేసిన సూచన. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా వైద్యవృత్తిలోకి వచ్చేవారందరూ ఆనవాయితీగా చేసే హిప్పోక్రేట్స్‌ శపథాన్ని మన దేశంలో ఆయుర్వేద వైద్య శిఖామణి చరకుడు పేర్కొన్న మాటలతో మార్చాలన్న హఠాత్‌ సూచన వివాదాస్పదమైంది. 

ఇకపై కళాశాలల్లో తెల్లకోటు వేసుకొని వృత్తిలోకి వచ్చే వైద్య విద్యార్థులు సర్వసాధారణ ‘హిప్పోక్రేట్స్‌ ప్రమాణా’నికి బదులుగా ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లోని ‘మహర్షి చరకుడి శపథం’ చేయాల్సి ఉంటుంది. దేశంలోని వైద్య కళాశాలలతో ఈ ఫిబ్రవరి 7 నాటి సమావేశంలో ఎన్‌ఎంసీ ఈ సంగతి చెప్పడంతో తేనెతుట్టె కదిలినట్టయింది. వైద్య విద్య, విధానాలను నియంత్రించడానికి దేశంలోని ‘భారతీయ వైద్య మండలి’ స్థానంలో రెండేళ్ళ క్రితం 2020లో ఎన్‌ఎంసీని పెట్టారు. పాలకుల ఆశీస్సులతో పుట్టుకొచ్చిన ఈ కొత్త నియంత్రణ వ్యవస్థ వారి భావధారను ప్రవచిస్తూ, ప్రచారంలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ శపథంలో మార్పు కూడా భాగమని విమర్శలు వస్తున్నాయి. 

3 లక్షలకు పైగా సభ్యులున్న ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఈ మార్పును వ్యతిరేకించింది. ఇది వైద్యవిద్యను సైతం కాషాయీకరించే ప్రయత్నమని రాజకీయ వాదులు ఆరోపిస్తున్నారు. నిజానికి, ప్రస్తుతం ప్రపంచమంతటా వైద్యులు చేస్తున్న శపథానికీ ఓ చరిత్ర ఉంది. అది ప్రపంచ వైద్యచరిత్రలో ప్రముఖుడిగా భావించే క్రీస్తుపూర్వం 4 – 5 శతాబ్దాలకు చెందిన గ్రీకు వైద్యశిఖామణి హిప్పోక్రేట్స్‌ తన వైద్యగ్రంథంలో పేర్కొన్న మాటలని భావన. అయితే, అది ఆయన వ్యక్తిగతంగా రాసినది కాకపోవచ్చనే వాదనా ఉంది. ఎవరిదైనప్పటికీ వైద్యంలో నైతిక విలువలపై ప్రాచీన భావవ్యక్తీకరణ అదేననీ, నేటికీ దానికి ప్రాధాన్యం ఉందనీ పాశ్చాత్య ప్రపంచం భావిస్తుంటుంది. రోగి గోప్యతను కాపాడడం, చెడు చేయకపోవడం లాంటి విలువలను ప్రస్తావించే ప్రమాణం అది. 

‘రోగి స్వస్థత కోసమే తప్ప, అతనికి నష్టం కలిగించడానికి వైద్యాన్ని వాడను. అడిగినా సరే ఎవరికీ విషమివ్వను. ఎవరి గడపతొక్కినా, అస్వస్థులకు సాయపడేందుకే ప్రయత్నిస్తాను. ఉద్దేశ పూర్వకంగా ఎవరికీ హాని చేయను. ఏ రోగిని కలిసినా, ఆ వ్యక్తి గోప్యతకు భిన్నంగా వివరాలు బయటపెట్టను’ అని సాగుతుంది ఆ శపథం. నైతికత రీత్యా ఆ భావనలన్నీ ఎవరికైనా, ఎప్పటికైనా అనుసరణీయాలే. ఇంకా చెప్పాలంటే, ప్రతిపాదిత ‘చరక శపథం’లోనూ ఇలాంటి మాటలే ఉన్నాయి. ప్రాచీన భారతీయ వైద్యానికి ప్రాతిపదిక ‘చరక సంహిత’లో ఔషధ చికిత్స చరకుడు చెబితే, క్రీ.శ. 4వ శతాబ్దపు శుశ్రుతుడు శస్త్రచికిత్సా విధానాన్ని వివరించాడు. గ్రీకు విధానాల కన్నా మన ఆయుర్వేద పద్ధతులే మెరుగైనవనీ ఓ వాదన. ఆ తులనాత్మక చర్చలోకి వెళ్ళకుండా, చరక సంహితలో భావాలు చూస్తే – వాటికీ, హిప్పోక్రేట్స్‌ మాటలకూ సారంలో ఆట్టే తేడా లేదు. మంచి మాటలు పేర్కొన్నది హిప్పోక్రేట్స్‌ అయితేనేం? చరకుడు అయితేనేం? అది గ్రహించకుండా, అందులో ఏం తప్పుందని ఇప్పుడీ మార్పు చేస్తున్నట్టు? ఏ సంకేతాలివ్వడానికి చేస్తున్నట్టు? 

ప్రపంచమంతటా అక్షరమక్షరం ఒకేలా వైద్య శపథం లేకున్నా, స్ఫూర్తి మాత్రం రోగి గోప్యత, ఆరోగ్య పరిరక్షణే! అమెరికన్, బ్రిటీష్‌ మెడికల్‌ అసోసియేషన్లకూ హిప్పోక్రేట్స్‌ మాటలే ప్రాతిపదిక. ప్రపంచ మెడికల్‌ అసోసియేషన్‌ సైతం 1949లో అంతర్జాతీయ వైద్య నైతిక సూత్రావళిని చేపట్టింది. కాలగతిలో మార్పులు చేసుకుంటూ, నిరుడు మే నెలలో వైద్య ప్రపంచంతో పాటు మొత్తం సమాజానికి ఆధునిక అంతర్జాతీయ సూత్రావళి ప్రతిపాదననూ ప్రచురించింది. మన దగ్గర వైద్యకళాశాలల్లో చేయించే శపథంలోని మాటల్లో ఎడనెడ మార్పులున్నా ‘వైద్యో నారాయణో హరిః’ అనే భావనలో మార్పు లేదు. సాక్షాత్తూ దైవంగా భావించే ఆ ప్రాణదాతల నైతికతలో మార్పు లేదు. వరుస కరోనా వేవ్‌లలో పోరాడుతున్న వైద్యప్రపంచంలో ఇప్పుడీ కొత్త రచ్చ అవసరమా? వైద్య శపథాన్ని మారిస్తే వచ్చే ప్రత్యేక లాభమేమిటో అర్థం కాదు. ప్రభువుల మనసెరిగి ప్రవర్తించడానికో, మనసు చూరగొనడానికో మార్చాలనుకొంటే అంత కన్నా అవివేకమూ లేదు. 

అయితే, పాలకవర్గాలు సాగిస్తున్న పచ్చి కాషాయీకరణకు ఇది పరాకాష్ఠ అనేది ఆధార రహిత ఆరోపణ అని సంప్రదాయవాదుల మాట. ‘ఎయిమ్స్‌’ లాంటిచోట వార్షిక స్నాతకోత్సవంలో అనేక ఏళ్ళుగా చరక శపథమే చేస్తున్నారంటున్నారు. అలాగే అనుకున్నా, ఊరంతా ఒక దారి అయితే, ఉలిపికట్టెది ఒక దారిగా ప్రపంచ పోకడకు భిన్నంగా తీసుకుంటున్న హఠాన్నిర్ణయానికి సహేతుకత ఏమిటో అర్థం కాదు. ఆర్థిక సరళీకరణతో ప్రపంచమంతా కుగ్రామంగా మారిన రోజుల్లో ఈ వైద్య శపథంలో మాత్రం అందరి బాట కాదనే అత్యవసరం ఏమొచ్చింది? ఆ మాటకొస్తే ఏ ప్రమాణం చేశామన్నదాని కన్నా, దాన్ని ఏ మేరకు పాటిస్తున్నాం, అలాంటి వైద్య, ఆరోగ్య రంగానికి బడ్జెట్లలో ఏ మాత్రం తోడ్పాటునిస్తున్నాం అన్నది కీలకం. పాలకులు చూడాల్సింది ఆ ప్రజా సంక్షేమం. అవి చేస్తామని శపథాలు చేసి గద్దెనెక్కి, తీరా ఆ చేతలు వదిలేసి, ఈ చిన్న మాటలు పట్టు కొంటే ఎలా? ఈ కరోనా కష్టకాలంలో పట్టించుకోవాల్సింది – ఆ శపథాలనే కానీ, ఈ శపథాలను కాదు! 

మరిన్ని వార్తలు