పౌర స్వేచ్ఛకు పట్టం

16 Jan, 2021 00:11 IST|Sakshi

యుక్త వయసొచ్చిన జంట కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు అందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదంటూ బుధవారం అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షించదగ్గది. ఈ తీర్పు ద్వారా పౌర స్వేచ్ఛకు మరోసారి ఉన్నత న్యాయస్థానం పట్టం కట్టింది. ప్రత్యేక వివాహ చట్టంలోని 30 రోజుల నోటీసు గడువు నిబంధన తప్పనిసరి కాదని, ఐచ్ఛికం మాత్రమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమకిచ్చే నోటీసును ప్రచురించటం అవసరమో కాదో ఆ జంట తెలిపితే దాని ప్రకారం వ్యవహరించాలని వివరించింది. నోటీసు బహిరంగపరచటం వల్ల పెళ్లాడే జంట విష యంలో అన్యుల జోక్యం ఎక్కువైందని ధర్మాసనం భావించింది. మన దేశంలో వివిధ మతాలవారికి వేర్వేరు వివాహ చట్టాలున్నాయి. అయితే కుల, మతాల్లో విశ్వాసం లేనివారికీ లేదా వేర్వేరు మతా లకు చెందిన జంటలకు, తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లాడదల్చుకున్నవారికి వర్తించే విధంగా 1954లో ప్రత్యేక వివాహ చట్టం అమల్లోకొచ్చింది.

ద్రవిడ ఉద్యమం జోరుగా వున్న సమ యంలో వివాహ సంబంధమైన ఆచారాలు, సంప్రదాయాలు పాటించకుండా బహిరంగ వేదికలపై కేవలం దండలు మార్చుకుని అనేక జంటలు ఒక్కటయ్యాయి. అలాంటి దంపతుల మధ్య కాలం గడిచాక విభేదాలు రావటం, మహిళ జీవితం అనిశ్చితిలో పడటం పర్యవసానంగా ఇలాంటి చట్టం వుండటం అవసరమని ప్రభుత్వం భావించింది. అయితే ప్రత్యేక వివాహ చట్టం నిస్సహాయులైన మహిళలకు తోడ్పడినా, దానివల్ల కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. పెళ్లాడదల్చుకున్నవారు దర ఖాస్తు ఇచ్చాక వివాహ నమోదు అధికారి 30 రోజుల నోటీసు ఇవ్వాలని, ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే వాటిని పరిగణనలోకి తీసుకున్నాక మాత్రమే వివాహాన్ని నమోదు చేసుకుని జంటకు ధ్రువీకరణ పత్రం అందజేయాలని ఆ నిబంధన నిర్దేశిస్తోంది.

ఆచరణలో ఇది అనేక సమస్యల్ని సృష్టిస్తోంది. అంతవరకూ తమ తమ తల్లిదండ్రుల వద్ద వుండే జంట సహజంగానే నోటీసు పంప టానికి ఆ చిరునామాలు ఇవ్వాల్సివుంటుంది. దాని కాపీ నోటీసు బోర్డులో కూడా పెడతారు. ఇంటి కొచ్చే నోటీసును తల్లిదండ్రుల కంటబడకుండా చేయటం సాధ్యమవుతున్నా, రిజిస్ట్రేషన్‌ ఆఫీసు వద్ద ప్రదర్శించే నోటీసుతో జంటకు తిప్పలొచ్చిపడుతున్నాయి. ఛాందసవాదులు ఆ నోటీసుల్లో వున్న చిరునామాలు చూసి నేరుగా అక్కడికి పోయి సమాచారం ఇవ్వటం లేదా ఫోన్‌ చేసి చెప్పటం రివాజ వుతోంది. దాంతో ఇరు కుటుంబాలవారూ యువతీయువకుల్ని నిర్బంధంలో వుంచుతున్నారు. ఛాందసవాదుల వేధింపులు సరేసరి. పైగా నిబంధన ప్రకారం పెళ్లికి ముగ్గురు సాక్షులుండాలి. వివా హంపై 30 రోజుల్లో అభ్యంతరాలు వ్యక్తమైన పక్షంలో వారొచ్చి వాంగ్మూలం ఇవ్వాలి. దీంతో సాక్షు లుగా వుండటానికి అనేకులు సంశయిస్తారు. హైకోర్టు తీర్పు పర్యవసానంగా నోటీసు నిబంధన తమకు సమ్మతం కాదని తెలియజేస్తే వివాహ నమోదు అధికారి ఇతరత్రా గుర్తింపు పత్రాల ఆధా రంగా వారి వివాహాన్ని నమోదు చేయాల్సివుంటుంది.

అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో విలువైనది. నిరుడు నవంబర్‌ 24న ఇదే కోర్టు యుక్తవయసొచ్చినవారికి తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ వుంటుందని, అందులో జోక్యం చేసుకోవటం రాజ్యాంగంలోని 21వ అధికరణను ఉల్లంఘించటమే నని స్పష్టం చేసింది. సరిగ్గా అదే రోజు ‘పెళ్లి కోసం మతం మార్చుకోవటాన్ని’ నిరోధిస్తూ యూపీ ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకొచ్చింది. భిన్న మతాలకు చెందిన జంటలో ఎవరో ఒకరు అవతలివారి మతానికి మారుతున్నట్టు ప్రకటించటం, అందుకు అనుగుణంగా తమ పేరు మార్చుకోవటం రివాజు అవుతున్నందున ఆర్డినెన్సు అవసరమైందని ప్రభుత్వం తెలిపింది. మతాంతర వివాహాలను నిరో ధించే ఉద్దేశంతోనే దాన్ని తీసుకొచ్చారని స్పష్టమవుతూనే వుంది. ఇప్పుడు ప్రత్యేక వివాహ చట్టం విషయంలో ఇచ్చిన తీర్పు ప్రేమికుల జంటకుండే రాజ్యాంగపరమైన హక్కును మరోసారి తేటతెల్లం చేసింది. ఆర్డినెన్సు వచ్చాక యూపీలో మతాంతర వివాహం చేసుకునే జంటలకు వేధింపులు ఎక్కు వయ్యాయి. మూడేళ్లక్రితం పెళ్లి చేసుకున్న జంటలను సైతం పోలీసులు అరెస్టు చేసి జైళ్లకు పంపారు. ఆర్డినెన్సు ప్రకారం నేరం రుజువైతే పదేళ్లవరకూ జైలు శిక్ష పడుతుంది.

వాస్తవానికి మతాంతర, కులాంతర వివాహాలు చేసుకునే జంటలు మన దేశంలో చాలా స్వల్పం. ఆ కొద్దిమందికీ కూడా ప్రత్యేక వివాహ చట్టం నిబంధనలు అవరోధంగా వున్నాయని, వాటి కార ణంగా ఆ జంటలు వేధింపులు ఎదుర్కొనవలసి వస్తున్నదని 2012లో లా కమిషన్‌ నివేదిక తెలి పింది. వివాహంతో ఒక్కటవుదామనుకునే వారిపై ఎటూ కుటుంబాల ఒత్తిడి వుంటుంది. తల్లిదండ్రుల్లో అత్యధికులు  తాము ఎంపిక చేసినవారినే పిల్లలు జీవిత భాగస్వాములుగా అంగీకరించాలని ఆశిస్తారు. అందుకు అంగీకరించని పిల్లలపై వారి ఆగ్రహావేశాలూ సర్వసాధారణమే. కానీ బల వంతంగా తాము అనుకున్నవారితో పెళ్లి జరిపించటానికి ప్రయత్నించటం... కక్షలకు పోయి హతమార్చేందుకు వెనకాడకపోవటం ఇటీవల పెరిగింది. పిల్లల చర్యతో తమ పరువు పోయిందని ఆ తల్లిదండ్రులు భావించటమే కారణం.

ఇది ఆందోళక కలిగించే ధోరణి. ఇది చాలదన్నట్టు అందులో తలదూర్చాలని యూపీ సర్కారుతోపాటు మరికొన్ని బీజేపీ ప్రభుత్వాలు  నిర్ణయించటం దారుణం. యూపీ, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాల ఆర్డినెన్సులపై ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో యుక్తవయసొచ్చిన జంట వివాహ నిర్ణయంలో రాజ్యం లేదా రాజ్యేతర శక్తుల జోక్యం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇవ్వటం మెచ్చదగ్గది. రెండేళ్లక్రితం కేరళకు చెందిన హదియా కేసులో సుప్రీంకోర్టు సైతం ఇటువంటి తీర్పే ఇచ్చింది. ఒక అంశంలో న్యాయస్థానాలు పదే పదే íß తబోధ చేయాల్సిరావటం, బాధ్యతగల ప్రభుత్వాలే వాటిని పెడచెవిన పెడుతుండటం విచారకరం.

మరిన్ని వార్తలు