నేపాల్‌తో మళ్లీ చెట్టపట్టాలు

17 Oct, 2020 00:43 IST|Sakshi

అయిదు నెలలక్రితం భారత్‌–నేపాల్‌ సంబంధాల్లో వినిపించిన చిటపటలు కొద్ది రోజులుగా సద్దు మణిగాయి. కారణమేమిటో తాజా పరిణామాలే చెబుతున్నాయి. మన సైనిక దళాల ప్రధానాధికారి ఎం.ఎం. నరవణే వచ్చే నెలలో ఆ దేశం పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా నేపాల్‌ అధ్యక్షు రాలు విద్యాదేవి భండారీ ఆయనకు నేపాల్‌ సైనిక గౌరవ జనరల్‌గా గౌరవ పురస్కారాన్ని అంద జేయబోతున్నారు. ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాల సైనిక చీఫ్‌లనూ పరస్పరం గౌరవించుకోవడమనే సంప్రదాయాన్ని కొనసాగించాలని నేపాల్‌ భావించగా, అందుకు మన దేశం కూడా అంగీకరించడం మంచి పరిణామం. వాస్తవానికి ఇది గత ఫిబ్రవరిలోనే జరగాలి. కానీ అప్పటికే కరోనా కలకలం మొదలుకావడంతో వాయిదాపడింది.

మన ఉత్తరాఖండ్‌లో భాగంగా వున్న లింపియాధుర, కాలా పానీ, లిపులేఖ్‌ ప్రాంతాలు తమవేనని మొన్న మే నెలలో నేపాల్‌ ప్రకటించడంతోపాటు అందుకు సంబంధించి ఒక మ్యాప్‌ను కూడా విడుదల చేసింది. భారత్‌ రాజముద్రలో ఉండే మూడు సింహాల ముందు ‘సత్యమేవ జయతే’ అని వుంటుందని... ఆ దేశం దానికి కట్టుబడి వుంటుందో, సింహమేవ జయతే అనుకుంటుందో చూడాలని నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు కూడా. దాంతో ఇటు మన దేశం నుంచి కూడా ఘాటు వ్యాఖ్యలే వెలువడ్డాయి. మ్యాప్‌ను విడుదల చేయడంద్వారా చర్చలకు నేపాల్‌ శాశ్వతంగా తలుపులు మూసిందని మన దేశం సూటిగా చెప్పింది. నేపాల్‌ తీసుకొచ్చిన ఈ కొత్త పేచీ వెనక ‘ఎవరో’ ఉన్నారని జనరల్‌ నరవణే చేసిన వ్యాఖ్యతో అక్కడి నేతలు మరింత రెచ్చిపోయారు.

తాము చైనా చెప్పినట్టల్లా ఆడుతున్నామని పరోక్షంగా అన్నారని వారికి అర్ధమైంది. కొత్త సరిహద్దులతో విడుదల చేసిన మ్యాప్‌లకు సంబంధించిన బిల్లుల్ని అక్కడి పార్లమెంటులో కూడా ప్రవేశపెట్టారు. ఇక రెండు దేశాల సంబంధాలూ చక్కదిద్దలేని స్థాయికి చేరు కున్నాయని అందరూ అనుకున్నారు. కానీ చాకచక్యంతో దౌత్యం నెరపితే, కాస్త సంయమనం పాటిస్తే అన్నీ సర్దుకుంటాయి. ఆ సంగతి తాజాగా నిరూపణ అయింది. ఇరుగు పొరుగు దేశాల మధ్య విభేదాలుండటం కొత్తేమీ కాదు. చారిత్రకంగా, సాంస్కృతికంగా శతాబ్దాల చరిత్ర వున్న రెండు దేశాలు ఏదో ఒక ఘటన కారణంగానో, ఎవరో చేసిన వ్యాఖ్య కారణం గానో శాశ్వతంగా దూరమవుతాయని, శత్రువులుగా మిగులుతాయని భావించవలసిన అవసరం లేదు.

భారత్‌–నేపాల్‌ సంబంధాలు మళ్లీ చివురిస్తున్న వైనం రెండు నెలలుగా కనబడుతూనే వుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌ ప్రధాని శర్మ ఓలితో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం మన ప్రభుత్వం నేపాల్‌లో చేపట్టి అమలు చేస్తున్న ప్రాజెక్టులపై కఠ్మాండులో ఆగస్టు 17న సమావేశం జరిగింది. అధికారుల స్థాయిలో జరిగిన ఆ చర్చల తర్వాత పరిస్థితి మళ్లీ మెరుగుపడటం మొదలైంది. అంతమాత్రాన కొత్త మ్యాప్‌ల వ్యవహారం సమసినట్టు కాదు. ఆ అంశంపై చర్చలు ఇంకా జరగాల్సేవుంది. నేపాల్‌తో మన దేశం సంబంధాలు ఎప్పుడూ ఉండాల్సిన విధంగా లేవు. ఇందుకు ఎమర్జెన్సీ అనంతరం జరిగిన 1977 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అప్పటి జనతా పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో నియంతృత్వ పోకడలను అమలు చేయడమే కాక, దక్షిణాసియాలో ఆధిపత్య ధోరణులను ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించారు.

తాము అధికారంలోకొచ్చాక ఇరుగుపొరుగుతో మంచి సంబంధాలు నెల కొల్పుతామని చెప్పారు. ఆ తర్వాత జనతాపార్టీ అధికారంలోకొచ్చి మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా, వాజపేయి విదే శాంగమంత్రిగా వ్యవహరించినప్పుడు విదేశాంగ విధానంలో కీలకమైన మార్పులే చేశారు. కానీ కొద్దికాలంలోనే వారు సైతం ఇందిర బాటలో పయనిస్తున్నారన్న విమర్శలొచ్చాయి. నెహ్రూ ఏలుబడిలో కూడా దక్షిణాసియా దేశాలతో సంబంధాల విషయంలో మన విధానం సరిగాలేదని నిపుణులు విమర్శించేవారు. ఏ దేశమైనా ఆర్థికాభివృద్ధి సాధించడానికి, ప్రపంచంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రాంతీయ దేశాలతో సఖ్యతే కీలకం. అందువల్ల మన సర్వశక్తులూ అభివృద్ధిపై కేంద్రీ కరించడానికి అవకాశం వుంటుంది. అవతలి దేశాలు మన స్నేహ హస్తాన్ని అందుకోవడంలో విఫలం కావొచ్చు... కావాలని మనతో పేచీలకు దిగొచ్చు... మన భద్రతకు ముప్పు తెచ్చే విధానాలు అను సరించొచ్చు. అటువంటప్పుడు దృఢంగా వుండాల్సిందే. మన రక్షణకు అవసరమైన చర్యలు తీసు కోవాల్సిందే. అదే సమయంలో వృధా వివాదాల వల్ల కలిగే అనర్థాలను అవి గ్రహించేలా చేయాలి. మనవైపుగా లోటుపాట్లు లేకుండా చూడాలి. మనం పెత్తనం చలాయిస్తున్నామని, వారి ప్రయోజనాలకు హాని కలిగిస్తున్నామని చిన్న దేశాలు అభిప్రాయపడేలా ఉండకూడదు.

నేపాల్‌ విషయంలో మన పాలకులు మొదటినుంచీ నిర్లక్ష్యంగానే వున్నారు. 1997లో అప్పటి మన ప్రధాని ఐకె గుజ్రాల్‌ నేపాల్‌లో పర్యటించాక, మళ్లీ మోదీ ప్రధాని అయ్యేవరకూ ఏ ప్రధానీ ఆ దేశం వెళ్లలేదు. మంత్రుల స్థాయి పర్యటనలు, అధికారుల స్థాయి పర్యటనల తీరూ అంతే. చైనా దీన్ని ఆసరా చేసుకుని నేపాల్‌ను సన్నిహితం చేసుకోవడానికి ఎడతెగని ప్రయత్నం చేసింది. నేపాల్‌లో మనపై విద్వేషభావం ఏర్పడేలా ప్రచారం చేసింది. ఆ దేశంతో అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒక్క నేపాల్‌తో మాత్రమే కాదు... బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు, భూటాన్, మయన్మార్‌ వగైరాలతో కూడా చైనా వ్యూహాత్మకంగా చెలిమి చేస్తోంది. దీన్ని మన దేశం గమనంలోకి తీసుకోవాలి. భారత్‌–నేపాల్‌ మధ్య వాణిజ్య విస్తరణ జరిగితే అది ఇరు దేశాలకూ ఎంతో మేలు చేస్తుంది. అక్కడ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో మన దేశం మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి అవకాశం వుంటుంది. ఇప్పుడు జరగబోయే జనరల్‌ నరవణే పర్యటన వల్ల ఏదో ఒరుగుతుందని చెప్పలేం. కానీ మెరుగైన సంబంధాల దిశగా అడుగులేయడానికి అది ఎంతో కొంత తోడ్పడుతుంది.  

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు