స్వాతికిరణం సిండ్రోమ్‌

25 Apr, 2022 01:49 IST|Sakshi

మజ్రూ సుల్తాన్‌పురి అప్పుడప్పుడే కవిత్వం రాసి పేరు సంపాదిస్తున్నాడు. సుల్తాన్‌పూర్‌లో ఇది కొందరికి కడుపులో గులామ్‌ బులామ్‌ రేపింది. ఆ ఊళ్లోనే ఉండే మసియుద్దీన్‌ మసీ అనే కవిని రెచ్చగొడితే అతను మజ్రూ వెంటబడ్డాడు. మజ్రూ ఏం రాసినా వెక్కిరిస్తూ రాసేవాడు. మజ్రూ బాగా క్షోభ పడ్డాడు. ఇబ్బంది పడ్డాడు. కొన్నాళ్లకు భవిష్యత్తును వెతుక్కుంటూ సుల్తాన్‌పూర్‌ నుంచి బాంబే వెళ్లాడు. సినీ గేయరచయిత అయ్యాడు. సూపర్‌ హిట్‌ పాటలు రాశాడు. సర్వోన్నత ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ పురస్కారం అందుకున్నాడు. ఇవాళ్టికీ మనం రోజూ మజ్రూని వింటూనే ఉన్నాం. మరి మసియుద్దీన్‌ మసి సంగతి? మంట వెలిగినట్టు మసి వెలుగునా?

మనం కూడా తక్కువ తిన్లేదు. మహా పండితుడు చిన్నయసూరి ఎంతో శ్రమించి, మేధను కరిగించి ‘బాల వ్యాకరణం’ రాస్తే, ఫస్ట్‌ ఎడిషన్‌ వచ్చి రికార్డు స్థాయిలో అమ్ముడు పోతుంటే శిష్టు కృష్ణమూర్తి అనే కవి దానిని ‘కాపీ’ అని గగ్గోలు లేవదీశాడు. (అబ్రాహ్మణుడైన) చిన్నయ సూరికి అంత సామర్థ్యం ఎక్కడ చచ్చింది అన్నాడు. ఆ కాలంలోని ఒకరిద్దరు గట్టి పండితులు ఈ విమర్శకు వత్తాసు పలికితే చిన్నయసూరి మౌనంగా ఉండిపోయాడు. సత్యాన్ని ఎంత అణుచుదామని చూసినా అది పొట్ట మీదే నేలక్కరుచుకుంటుంది తప్పితే వీపు మీద కాదు. తెలుగు భాషాకాశంలో భాస్కరుడు చిన్నయసూరి. గగ్గోలుదారులు ఆ మార్తాండ తేజానికి నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలిపోయారు.

పి.శ్రీదేవి రాసిన ‘కాలాతీత వ్యక్తులు’ నవల సంచలనం. ఒక పరిణీత తప్ప దానిని మరొకరు రాయలేరని చదువరులు గ్రహిస్తారు. ‘అబ్బే... ఆ నవలను గోరా శాస్త్రి రాశాడండీ’ అని ఆయన అకౌంట్‌లో వేయడానికి చూసే పెద్దమనుషులు ఉన్నారు. గోరా శాస్త్రి తెచ్చిన ‘తెలుగు స్వతంత్ర’లోనే ఆరుద్ర ‘త్వమేవాహం’, ఆలూరి బైరాగి ‘నూతిలో గొంతుకలు’ వచ్చాయి. అయితే వాటిని గోరా శాస్త్రి రాయలేదట. ‘తెలుగు స్వతంత్ర’లోనే వచ్చిన పి.శ్రీదేవి ‘కాలాతీత వ్యక్తులు’ మాత్రం గోరా శాస్త్రి రాశాడట. ఇంతా చేసి గోరా శాస్త్రి శబ్ద నాటికలు తప్ప ఒక్క గొప్ప నవలను అటెంప్ట్‌ చేయలేదు. ఆయనకు నవల రాసే ఆసక్తి ఉంటే రాసే చేయి ఊరకే ఉండేది కాదు. కళాకారుల లోకంలో కీర్తి అనే వెలుతురుతో పాటు కల్మషం అనే నీడ కూడా ఉంటుంది. సృజన లోకంలో రాణించాలనుకున్నవారు, రాణించేవారు, వెలిగినవారు, వెలగలేక ఆరిపోయిన, స్టేక్‌హోల్డర్స్‌ అయిన పాఠకులతో సహా ఈ వెలుగు నీడల ప్రభావానికి ఏదో ఒక సందర్భంలో గురి కాకుండా పోలేదు. శ్రీశ్రీని తగ్గించి శ్రీరంగం నారాయణబాబును నిలబెట్టాలని ఒక వర్గం ఎంత ప్రయత్నించినా శ్రీశ్రీయే మిగిలాడు. చలంను తెలుగు సరిహద్దుల నుంచి తరిమి కొట్టగలిగారుగానీ తెలుగు హృదయాల నుంచి కాదు. చిన్నబుచ్చేకొద్దీ జాషువా పద్యం ఎదిగి పండింది. అయినా సరే మనం గత పాఠాల నుంచి ఏమీ నేర్చుకోలేదు.

‘సాగర సంగమం’లో తన కళా వికాసానికి వీలు దొరకని కమలహాసన్‌ తన ఫెయిల్యూర్‌కి  కుంగిపోతాడు. ఎవరినీ నిందించడు. కానీ ‘స్వాతికిరణం’లో మమ్ముట్టి అలా కాదు. ఆస్తిపాస్తి, పేరు, కీర్తి అన్నీ ఉన్నా తన సమ కళాకారులనే కాదు ఎక్కువ–తక్కువ ప్రతిభ ఉన్నవారిని చూసి కూడా ఓర్వలేకపోతాడు. అతడి ఈర్ష్య ఎంత తీవ్రమైనదంటే బంగారు భవిష్యత్తు ఉన్న ఒక బాలకళాకారుడు ఆత్మహత్య చేసుకుని మరణిస్తాడు. ఎదుటివారి ప్రాణాలు తీసేంత, పిచ్చివాళ్లను చేసేంత, జడిసి సాధన విరమింపజేసుకునేంత, వగచి ఒంటరితనంలోకి వెళ్లేంత ఈర్షా్య ద్వేషాన్ని కలిగి ఉండటం నుంచి కళాలోకం– ఆ అసూయాపరుల సంఖ్య ఎంత తక్కువైనా కానీ– ఎదగలేక పోతున్నది. సోషల్‌ మీడియా వచ్చాక ఈ వెర్రి శ్రుతి మించిపోతోంది. నాలుగు వ్యూస్‌ కోసం ‘తేనెమనసులు రామ్మోహన్‌ని సూపర్‌స్టార్‌ కృష్ణ ఎలా తొక్కేశాడో తెలుసా?’ అనే థంబ్‌నెయిల్‌ పెడితే ‘అవునవును... మాకు తెలుసు’ అని  డయపర్ల వయసు దాటని వారు కూడా కామెంట్లు పెడుతుంటారు. ఇద్దరూ ఒకే సినిమాతో బయలుదేరినా కృష్ణ పద్మాలయ చేరడానికీ, రామ్మోహన్‌ మాసిన గడ్డంతో రాక్‌ క్యాజిల్‌లో తారసపడటానికీ కారణం ఎవరికి వారే! మనమే మన గమ్యం. మన ఫలితం.

విషాదం ఏమంటే ఈ ‘స్వాతికిరణం సిండ్రోమ్‌’ ఇప్పుడు అన్ని సామాజిక దొంతరల్లోనూ నిండి కనపడటం! గతంలో ‘నువ్వు బాగుపడితే చూడాలని ఉంది’ అని వీధిలో వాళ్లు కూడా అనేవారు. ఇప్పుడు ‘నువ్వెలా బాగుపడతావో చూస్తాను’ అని ఆత్మీయులే అనుకుంటున్నారు. ఏదో లాటరీ తగిలి రాత్రికి రాత్రి బాగుపడితే ఈర్ష్య పడటం సరే. కానీ కష్టపడి పిల్లాడు ర్యాంకు తెచ్చుకున్నా, అమ్మాయికి మంచి సంబంధం కుదిరినా, లోన్‌ పెట్టి ఫ్లాట్‌ కొనుక్కున్నా, అప్పోసప్పో చేసి కారు ఇంటికి తెచ్చుకున్నా, మొగుడూ పెళ్లాలు కొట్లాడుకోకుండా ఉన్నా, పిల్లలు బుద్ధిగా మాట వింటూ ఉన్నా, ఆఖరికి మన ఇంట్లో మొక్కలు బాగా పెరుగుతూ ఉన్నా కుతకుతలాడిపోయేవారు, లోలోపల కీడు కోరుకునేవారు, బంధాలను అనుబంధాలను తెంపుకుపోయేవారు, చెడు ప్రచారానికి పూనుకునేవారు, చేతలతో కాకపోయినా మాటలతో హాని చేద్దాం అనుకునేవారు ఉంటే ఇది ఏమి సంస్కారం? ఇది ఏమి సమాజం? ఈర్ష్యతో ఒకరి చెడుకు చేసే ‘అసత్య వాదన మహాపాపం’ అన్నది వేదం. ‘గీబత్‌’ (చాడీలు), ‘తొహమత్‌’ (లేనివి కల్పించడం) చేసేవారికి నిష్కృతి లేదు అంది ఇస్లాం. ‘ఈర్ష్య పడువాని ఎముకలు కుళ్లును’ అన్నది బైబిల్‌. ప్రేమించేంత ఐశ్వర్యం లేనప్పుడు హాని చేయలేనంత పేదరికంలో ఉందాం! లోకం అదే బతుకుతుంది. 

మరిన్ని వార్తలు