పండుగ అందరిదీ కావాలి

14 Jan, 2021 00:48 IST|Sakshi

ఒకరూ ఇద్దరూ కాదు... ఎటుచూసినా బాధాసర్పదష్టులే కనిపిస్తున్నప్పుడు, జీవితంపై ఒక రకమైన అనిశ్చితి అలుముకున్నప్పుడు, చుట్టూ చీకట్లు ఆవరించినప్పుడు సమష్టిలో సేద తీరాలనుకోవటం మనిషి లక్షణం. అందుకు పండుగను మించిన శుభ సందర్భం మరేముంటుంది? అందునా సంక్రాంతి తెలుగింట పెద్ద పండుగ. పట్టణమంతా పల్లెకు తరలే సందర్భం. సరిగ్గా పంటలు చేతికందే సమయం కనుక ఇతర పండుగల కన్నా ఎప్పుడూ ఇది రెట్టింపు కాంతులీనుతుంది. పల్లె పల్లెనా పంటల పరిమళాలు, ప్రతి ముంగిటా రంగవల్లుల సొబగులు, వాటిల్లో గొబ్బెమ్మలు, తెల్లార కుండా రంగురంగుల వస్త్రధారణతో ముస్తాబై సూర్యుడితోపాటే అందరినీ పలకరించటానికొచ్చే గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు అందరినీ సమ్మోహనపరుస్తాయి.

ఇంట్లో అమ్మ చేసే పిండివంటలు, నాన్న కొనిపెట్టిన కొత్త బట్టలు, దూరప్రాంతాలనుంచి తరలివచ్చే బంధుగణం పిల్లలకు ప్రీతిపాత్రమైతే...ఈ పెద్ద పండుగనాడు రకరకాల దానాలతో తరించాలని పెద్దలు భావి స్తుంటారు. మకరరాశిలో వుండే శ్రవణ నక్షత్రానికి శని అధిపతి గనుక అతణ్ణి శాంతింపజేయడానికి నువ్వులు దానమిస్తారు. ధనుర్మాసంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించి క్రమేపీ ఉత్తరాభిముఖుడై కదులుతూ కర్కాటక రాశికి చేరతాడు. ఈ ఆరునెలలకాలాన్ని ఉత్తరాయణమంటారు. ఈ ఆర్నెల్లూ దేవతలకు పగలు కనుక ఆ సమయంలో వారు మేల్కొనివుండి కోర్కెలు నెరవేరుస్తారన్న విశ్వాసం సనాతన సంప్రదాయం పాటించేవారికుంటుంది. అందుకే దీన్ని దేవయానం అని, పుణ్యకాలమని కూడా అంటారు. భీష్ముడు కూడా ఉత్తరాయణ పుణ్య ఘడియల కోసమే అంపశయ్యపై వేచి చూశాడు.  దక్షిణాయనం పితృదేవతలు సంచరించే కాలం.

ఇది నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ నింపు తుందని... సంక్రాంతితో ఈ పితృయానం ముగిసి వారు తమ తమ స్థానాలకు వెళ్తారని భావిస్తారు. అందుకే వారినుద్దేశించి కృతజ్ఞతాపూర్వక తర్పణాలు వదులుతారు. అందుకే ఇది ‘పెద్దల పండుగ’ కూడా. సంక్రాంతితో మొదలయ్యే ఉత్తరాయణంలో సూర్యుడు తేజోమయమూర్తిగా రూపుదిద్దుకోవ టంతో ప్రకృతి ఉత్సాహం, ఉల్లాసం నింపుకుంటుందంటారు. తమ సంపదకూ, సుఖసంతోషాలకూ కారణమైన భూమికి, తోటి రైతులకూ, పాలేర్లకూ, కూలీలకూ, పశుపక్ష్యాదులకూ రైతులు కృతజ్ఞ తలు చెప్పుకునేదీ ఈ సంక్రాంతినాడే. ఇంకా నింగితో సయ్యాటలాడే గాలిపటాల సందడి, కోడి పందేలు, ఎడ్ల పరుగుల పోటీ, గొర్రెపొటేళ్ల పోటీలు... అన్నిటికీ సంక్రాంతే సందర్భం. ఇతర పండగ లన్నీ చాంద్రమానం ప్రకారం జరుపుకుంటే, సంక్రాంతిని సూర్యగమనం ఆధారంగా జరుపుకోవటం మరో విశిష్టత. 

మానవాళికి స్థిర వ్యవసాయం అలవాటైన కాలం నుంచే సూర్యుణ్ణి ఆరాధించే సంప్రదాయం అన్నిచోట్లా అలవడింది. ఇది ఇప్పటి అర్థంలో ఒక దేశానికో, ప్రాంతానికో పరిమితమైనది కాదు... భూగోళం నలుచెరగులా విస్తరించిన అఖండ విశ్వాసమే. సూర్యుణ్ణి జగత్సాక్షిగా, కర్మసాక్షిగా భావిం చటం అన్నిచోట్లా మనిషికి పరంపరగా వస్తున్న సంప్రదాయం. ఈ జగత్తుకంతటికీ ఆదిత్యుడే మూల కారకుడని ఆదిత్యహృదయం అంటుంది. భూమ్మీద వుండే సమస్త జీవజాలం, భూ లోపలి పొరల్లో లభ్యమయ్యే రకరకాల ఖనిజాలు, ఇంధనాలు... అన్నీ సూర్యుడులో సంభవించే వివిధ మార్పుల పర్యవసానంగా ఏర్పడినవే. సూర్యుడి గమనంలో ఏర్పడే మార్పులు వేడిమిని, శీతగాలుల్ని, వర్షపా తాన్ని నిర్ణయిస్తాయి. అందువల్లే పర్షియన్లు, గ్రీకులు, యూరొపియన్లు, ఈజిప్షియన్లు, మెక్సికన్లు కూడా సూర్యారాధన చేసేవారు. వారూ తొలి పంటను సూర్యుడికి నివేదించేవారు. అన్ని ఖండాల్లోని ప్రాచీన సమాజాల్లోనూ ఇప్పుడు మనం జరుపుకునే సంక్రాంతి తరహాలోనే రకరకాల వేడుకలతో పండగ జరిపేవారు. గాలి పటాలను ఎగరేయటమూ ఇంతే. సూర్యుడి సుముఖానికి వెళ్లి ప్రణమి ల్లడానికి ఇదొక ప్రతీక. ఇవన్నీ మానవాళిలో వుండే విశ్వాసాల అఖండతనూ, వారి మధ్య సాంస్కృ తిక సారూప్యతనూ వెల్లడిస్తాయి. 

ఉగ్రరూపంతో విరుచుకుపడిన కరోనా మహమ్మారితో భూగోళమంతా ఏడాదికాలంగా తలపడుతోంది. ఈ పోరు ముగిసిట్టేనా లేక ఇది మరింత తీవ్రమయ్యే ప్రమాదముందా అనేది తేల డానికింకా సమయం పడుతుంది. ఉన్న కొలువులు పోయినవారూ, కొలువులున్నా వేతనాల కోతతో విలవిల్లాడేవారూ, తమ బంధువులో, మిత్రులో కరోనా కాటుతో కనుమరుగయ్యారన్న వేదనతో విషాదంలో మునిగినవారూ, వ్యాపారాలు సజావుగా నడవని వారూ, అనుకున్నవన్నీ తలకిందు లయ్యాయని బాధపడేవారూ... ఇలా ఎటుచూసినా ఈ కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. అగ్రరాజ్యమైనా, పడుతూ లేస్తూ సాగే బడుగు దేశమైనా కాస్త హెచ్చుతగ్గులతో ప్రపంచ పౌరుల బాధలన్నీ ఒక్కటే. ప్రకృతి పగబట్టి కరువు విలయతాండవం చేయటమో, అకాలవర్షాలు ముంచెత్తి పంట నష్టానికి దారితీయడమో రివాజుగా సాగుతోంది. దానికితోడు ప్రభు త్వాల విధానాలతో విత్తనాలు మొదలుకొని పురుగుమందుల వరకూ అన్నిటి ధరలూ ఆకాశాన్నంటి వ్యవసాయం భారమవుతోంది.

ఇవన్నీ రైతులను అప్పుల ఊబిలోకి దించుతున్నాయి. కొత్తగా వచ్చిన సాగు చట్టాల వల్ల తమకు మరింత ముప్పు ముంచుకురాబోతున్నదని శంకించిన వేలాది మంది రైతులు దేశ రాజధాని సరిహద్దుల్లో రెండు నెలలుగా బైఠాయించారు. ఆ చట్టాల రద్దు తప్ప తమకేదీ సమ్మతం కాదంటున్నారు. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా చూస్తే ఒక విధమైన నిరాశానిస్పృ హలే వ్యాపించాయి. బతుకుబండి మళ్లీ ఎప్పుడు పట్టాలెక్కుతుందోనన్న ఆందోళన అందరిలోనూ వుంది. ఇలాంటి సమయంలో ఒక పలకరింపు, ఒక ఓదార్పు సాంత్వననిస్తాయి. అందరిలోనూ మనం ఒంటరికామన్న భరోసానిస్తాయి. సంక్రాంతి వంటి పెద్ద పండుగ ఇందుకొక సందర్భం కావాలని, అందరిలోనూ కొత్త ఉత్తేజాన్నీ, ఉత్సాహాన్నీ నింపాలని మనసారా కోరుకుందాం. 

మరిన్ని వార్తలు