శశికళతో ఎవరికి చేటు?

12 Feb, 2021 00:17 IST|Sakshi

రాజకీయ పార్టీ స్థాపిస్తానన్న సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వెనకడుగేయటంతో రెట్టింపు ఉత్సాహంతో వున్న డీఎంకేకు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత సహచరురాలు శశికళ ఆగమనం ఇబ్బంది కలిగించివుండాలి. తమిళనాడు అసెంబ్లీకి మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయిదు దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల సీజన్‌లోనూ జనాకర్షణ వున్న నేతలనూ, వారి సమ్మోహన ప్రసంగాలనూ వింటూ, మంత్రించినట్టు వారిని అనుసరిస్తూ వెళ్లటమే అలవాటైన తమిళనాడు... తొలిసారి ఆ స్థాయి నాయకులెవరూ లేని ఎన్నికల రణరంగాన్ని చూడబోతోంది. ఉన్నంతలో డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్‌కే ఈసారి అవకాశం వుండొచ్చని రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయి. కానీ నాలుగేళ్ల జైలు జీవితం తర్వాత రాష్ట్రంలో అడుగుపెట్టిన శశికళకు వచ్చిన స్పందన చూశాక అలా చెప్పినవారిలో పునరాలోచన కలిగే అవకాశం వుంది. తమిళనాట ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రభుత్వమే కొనసాగుతోంది.

ముఖ్యమంత్రి పళని స్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం అందరి అంచనాలకూ భిన్నంగా సమష్టిగా పనిచేస్తున్నారు. బీజేపీ అధినేతల ఆశీస్సులతోనే ఇదంతా సాగుతున్నదన్న విమర్శలొస్తున్న మాట వాస్తవమే అయినా పాలనాపరంగా ఆ ప్రభుత్వంపై పెద్దగా ఫిర్యాదులేమీ లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షం డీఎంకే కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్, ఎంఎంకే వంటి పక్షాలతో కలిసి కూటమి కట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకేతో వున్న పీఎంకే, ఎంజేకేలు కూడా త్వరలో డీఎంకే కూటమివైపు రావొచ్చునన్న అభిప్రాయం  వుంది. అసలు ఇన్ని పార్టీలను కూటమిలో చేర్చుకుని, సీట్ల పంపకాల్లో అందరినీ సంతృప్తిపరచటం డీఎంకేకు సాధ్యమేనా అన్న సంగతలావుంచితే... ఆ పరిస్థితి నిజంగా ఎదురైతే కేవలం భారతీయ జనతాపార్టీ తోడుతో అన్నాడీఎంకే ఆ కూటమిని ఎంతవరకూ ఎదుర్కొన గలదన్న ప్రశ్న కూడా వుంది. ఇలాంటì  సమయంలో శశికళ రంగప్రవేశం చేసి ఈ సంక్లిష్టతను మరింత పెంచారు. 

శశికళకు ఘన స్వాగతం లభించిందనడంలో సందేహం లేదు. అయితే ఆ వచ్చినవారంతా ఆమె మద్దతుదార్లేనని చెప్పటం తొందరపాటే అవుతుంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆమెలో మునుపటి ఆత్మవిశ్వాసం వుందా లేదా అని స్వయంగా చూడటం కోసం కూడా వారిలో చాలామంది వచ్చివుండొచ్చు. జయలలిత మరణానంతరం శశికళ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. ఆమె జీవించివుండగా తాత్కాలికంగా సీఎం బాధ్యతలు చూడటానికి నియమించిన పన్నీరుసెల్వం శశికళకు ఎదురుతిరిగారు.

ఆమెను జయలలిత వారసురాలిగా ప్రకటించి, సీఎంగా రావాలంటూ తీర్మానించిన అన్నాడీఎంకే లెజిస్లేచర్‌ పార్టీతో గొంతు కలిపిన కొన్ని గంటలకే ఆయన ధోరణి మారింది. ఆ తర్వాతైనా సీఎం కావాలనుకున్న శశికళకు అవాంతారాలు ఎదురై చివరకు పళని స్వామికి ఆ పదవి కట్టబెట్టక తప్పలేదు. తీరా ఆమె జైలుకెళ్లాక పళనిస్వామి కూడా ఎదురుతిరిగి ఆమెను పార్టీ సెక్రటరీ జనరల్‌ పదవినుంచి తొలగించటంతోపాటు... పార్టీనుంచే బహిష్కరించారు. ఇదంతా చాలదన్నట్టు ఆయన పన్నీరు సెల్వంతో చేతులు కలిపారు. తనను పదవినుంచి తొల గించటం, పార్టీ నుంచి బహిష్కరించటం చెల్లదని శశికళ ఇప్పటికే కోర్టుకెక్కారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు శశికళ వంటి నేత లేకపోతే డీఎంకేకు దీటైన పోటీ ఇవ్వటం సాధ్యం కాదని ఆమె సమీప బంధువు టీటీవీ దినకరన్‌ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. మరోపక్క ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్తగా పేరున్న గురుమూర్తి ఆమెతో అన్నా డీఎంకే రాజీపడి, సముచిత స్థానం కల్పిస్తే మరోసారి ఆ  పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ఇటీవల చెప్పటం గమనించదగ్గది.

అవినీతి కేసులో శిక్ష పడిన శశికళకు వుండే ఆదరణ విషయంలో ఇన్నాళ్లూ అన్నాడీఎంకే శ్రేణుల్లో సంశయం వుండేది. మొన్న ఆమెకు లభించిన స్వాగతం చూశాక అలాంటివారిలో పునరాలోచనైతే ఏర్పడు తుంది. అలాగని పళనిస్వామి, పన్నీరుసెల్వంలకు శశికళను ఆహ్వానించటం ప్రాణాంతకం. ఆమె రావడమంటూ జరిగితే పార్టీలో వారికి చోటుండే అవకాశం వుండదు. ఆమె చేరాక పార్టీ నెగ్గినా వారిద్దరినీ కాదని దినకరన్‌నో, మరొకరినో ఆమె తెరపైకి తీసుకొస్తారు. 

తమిళనాడును పాలించిన వారిపై అవినీతి ఆరోపణలు రావటం కొత్తగాదు. గతంలో కరుణా నిధి ప్రభుత్వాన్ని ఆ కారణం చూపే కేంద్రంలో అధికారంలో వున్న అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం బర్తరఫ్‌ చేసింది. ఆ తర్వాత జయలలితపైనా అటువంటి ఆరోపణలే వచ్చాయి. కింది కోర్టుల్లో శిక్షపడిన సందర్భాలు రెండుసార్లున్నా ఉన్నత న్యాయస్థానాలు ఆమెను నిర్దోషిగా తేల్చాయి. అటు తర్వాత ఆమె భారీ మెజారిటీతో అధికారంలోకొచ్చారు. తమిళనాడు రాజకీయాలు విలక్షణ మైనవి. అక్కడ ద్రవిడ పార్టీలకు మాత్రమే జనం పెద్ద పీట వేస్తారు. ద్రవిడ పార్టీలైనా కూటములుగా వస్తేనే వారి ఆదరణ లభిస్తుంది.

జాతీయ పార్టీలకు కొద్దో గొప్పో అక్కడ చోటు దొరకాలంటే ద్రవిడ పార్టీలతో చెలిమి చేయాల్సిందే. డీఎంకే లెక్కలు ఫలించి అత్యధిక ద్రవిడ పార్టీలు దాని ఆధ్వర్యం లోని కూటమి వెనక చేరితే అన్నాడీఎంకే దాన్ని ఎదుర్కొనగలదా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఏతావాతా ఇంతవరకూ ప్రధాన పక్షాలుగా వుంటున్న డీఎంకే, అన్నాడీఎంకేల భవితవ్యాన్ని రాబోయే ఎన్నికలు తేల్చేయబోతున్నాయి. ఆ పార్టీల్లో ఎవరు మిగులుతారో, ఎవరు కనుమరుగవు తారో నిర్ణయించబోతున్నాయి.

మరిన్ని వార్తలు