అమెరికా ‘వ్యూహాత్మక’ చెలిమి

13 Oct, 2020 01:13 IST|Sakshi

చైనాతో ఆసియా ప్రాంత దేశాలకూ, ప్రత్యేకించి భారత్‌కూ రాగల ముప్పు గురించి ఇటీవలకాలంలో అమెరికా ఒకటికి రెండుసార్లు హెచ్చరించింది. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనా 60,000మంది సైనికులను మోహరించిందని, అందువల్ల తక్షణం భారత్‌కూ, ఆ తర్వాత ఈ ప్రాంతంలోని ఇతర దేశాలకూ సమస్యలు ఉత్పన్నమవుతాయని అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో ఈమధ్యే క్వాడ్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా హెచ్చరించారు. ఆయన మాత్రమే కాదు... అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రియాన్‌ సైతం ఇలాగే ధ్వనించారు. మన దేశంలో మూడురోజుల పర్యటన కోసం సోమవారం వచ్చిన అమెరికా విదేశాంగ శాఖ ఉపమంత్రి స్టీఫెన్‌ బీగన్‌ ఉద్దేశం కూడా ఇదే. అయిదు నెలలనుంచి చైనా ఎల్‌ఏసీ వద్ద పేచీ పెడుతోంది.

మే 5న ఇరు దేశాల సైనికుల మధ్యా ఘర్షణ చోటుచేసుకుంది. చైనా సైనికులు మన జవాన్లు 20మందిని కొట్టిచంపారు. అప్పటినుంచి ఇరు దేశాల మధ్యా కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు మొదలుకొని రక్షణ మంత్రులు, విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశాల వరకూ సాగుతున్నా ప్రతిష్టంభన మాత్రం ముగియలేదు. శతఘ్నులు, క్షిపణులు, తుపాకులతో ఇరు దేశాల సేనలూ అక్కడ సర్వసన్నద్ధంగా వున్న వైనం చూస్తుంటే అది ఏ క్షణమైనా ఘర్షణలకు దారితీయొచ్చునన్న సందేహం కలుగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా చేస్తున్న హెచ్చరికలు కొట్టిపడేయనవసరం లేదు. అయితే మన దేశం మొదటినుంచీ సరిహద్దు తగాదాల విషయంలో వ్యూహాత్మకమైన స్వయంప్రతిపత్తిని పాటిస్తోంది. అటు పాకిస్తాన్‌తో వున్న వివాదాన్నయినా, ఇటు చైనాతో వున్న వివాదాన్నయినా ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవడంపైనే ఆసక్తి చూపుతోంది. మూడో దేశం మధ్యవర్తిత్వం ప్రతిపాదనను మన దేశం పలుమార్లు ఖండించింది. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి– చారిత్రకంగా ఆసియా ఖండ దేశాల మధ్య వున్న సంబంధాలు, రెండు–ఆ వివాదం మాటున వేరే రాజ్యాల పెత్తనం నచ్చక పోవడం.

కనుకనే అటు పాకిస్తాన్‌ నుంచి, ఇటు చైనా నుంచి ఎన్ని సమస్యలున్నా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న దృక్పథాన్నే ప్రకటిస్తోంది. మన దేశంతో యుద్ధం వచ్చినప్పుడు గతంలో ఎదురైన చేదు అనుభవాలరీత్యా పాకిస్తాన్‌ దొంగ దెబ్బ తీయడంపైనే దృష్టి పెడుతోంది. సరిహద్దుల్లో చొరబాట్లను ప్రోత్సహించి, భారత్‌లో... ముఖ్యంగా కశ్మీర్‌లో కల్లోలం సృష్టించాలని పన్నాగాలు పన్నుతోంది. చైనా ఆ దేశానికి మద్దతుగా నిలవడమే కాక, ఇటీవలకాలంలో ఎల్‌ఏసీ పొడవునా కుంపటి రాజేయడం మొదలు పెట్టింది.

ఈ నేపథ్యంలో స్టీఫెన్‌ బీగన్‌ మన దేశానికి రావడం, భారత్‌–అమెరికాల మధ్య ఈ నెలాఖరున జరిగే 2+2 వ్యూహాత్మక సమావేశానికి సంబంధించిన అంశాలు ఖరారు చేసుకోవడం చైనాకు కంటగింపుగానే వుంటుంది. ఈ నెల మొదట్లో మైక్‌ పాంపియో సైతం ఈ సమావేశం గురించే చర్చించారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలోనూ, ఇతరచోట్లా సమష్టిగా పనిచేయడానికి, శాంతి సాధ నకు, పటిష్టమైన భద్రత కల్పించడానికి రెండు దేశాల భాగస్వామ్యం అవసరమవుతుందని అమెరికా ఎప్పటినుంచో పట్టుబడుతోంది. చైనాతో అమెరికాకున్న విభేదాలు తక్కువేం కాదు. వాణిజ్య రంగం మొదలుకొని సాంకేతికత, కరెన్సీ, హాంకాంగ్‌ తదితర అంశాల్లో అవి పరస్పరం సంఘర్షిస్తున్నాయి. అదే సమయంలో చైనా విషయంలో అమెరికా ఊగిసలాట ధోరణినే ప్రదర్శిస్తోంది. చైనాను బెది రించి, ఏదోమేరకు తనకు సానుకూలమైన నిర్ణయం తీసుకునేలా చేయడానికి అది శాయశక్తులా ప్రయత్నించి కొన్నిసార్లు సఫలమవుతోంది. ముఖ్యంగా డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక ఈ ఊగిసలాట మరింత పెరిగింది. ఆయన ఎప్పుడు చైనాను ప్రశంసిస్తారో, ఎప్పుడు దూషించి విరుచుకుపడతారో అనూహ్యం. 

చైనాతో భారత్‌కు ముప్పు వుందని, తమ సాయం లేనిదే భారత్‌ నెగ్గుకురాలేదని ఇప్పుడంటే మైక్‌ పాంపియో చెబుతున్నారుగానీ... ఇటీవలకాలంలో ఒకటికి రెండుసార్లు భారత్‌–చైనాలు సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవడానికి వీలుగా మధ్యవర్తిత్వం నెరపుతానని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం నెరపడానికి మన దేశానికి గతంతో పోలిస్తే ఇప్పుడు పెద్దగా అభ్యంతరాలు లేవు. ఈ అంశంలో ఇప్పటికే పలు దఫాలు ఇరు దేశాలూ చర్చించు కున్నాయి. కానీ ప్రతిసారీ అమెరికాలో కనబడే ఊగిసలాట ధోరణే మన దేశాన్ని అయోమయంలో పడేస్తోంది. వ్యూహాత్మక ఒప్పందం తర్వాత రక్షణ కొనుగోళ్లు, సమష్టి ఉత్పత్తి తదితర అంశాలతో సహా అన్నింటిలోనూ భారత్‌ తమతో కలిసి నడవాల్సివుంటుందని పాంపియో నిరుడు నేరుగానే చెప్పారు. అమెరికా–చైనా సంబంధాలు మాత్రమే కాదు...

అమెరికా–రష్యా సంబంధాలు కూడా ఇటీ వలకాలంలో క్షీణిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు నెరపడం మన ప్రయోజనాలకు ఎంతవరకూ ఉపయోగమో మనం తేల్చుకోవాల్సి వుంటుంది. నాటో సభ్యదేశంగా వున్న టర్కీ నిరుడు రష్యాతో కుదుర్చుకున్న ఎస్‌–400 క్షిపణి ఒప్పందం, జర్మన్‌ సంస్థలకు రష్యాతో నార్డ్‌ స్ట్రీమ్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టుపై కుదిరిన ఒప్పందంవంటి అంశాల్లో అమెరికా స్పందన ఎంత తీవ్రంగా వుందో అందరికీ తెలుసు. టర్కీపై అది ఆంక్షలు కూడా విధించింది. చైనాతో మనకు సమస్యలున్నమాట వాస్తవం. అందుకు అమెరికా సహాయసహకారాలు కూడా మనకు అవసరం. కానీ ఇతరులతో మనం స్వతంత్రంగా, మన అవసరాలకు తగ్గట్టు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆటంకమయ్యేలా ఆ సహాయసహకారాలు ఉండకూడదు. పైగా అమెరికా తన అవసరాలరీత్యా ఎప్పటికప్పుడు భిన్నమైన వైఖరులు ప్రదర్శిస్తూపోతుంటే అందుకు అనుగుణంగా మనం మారలేం. ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న స్టీఫెన్‌ బీగన్‌కు ఈ సంగతే స్పష్టం చేయాలి.  

మరిన్ని వార్తలు