జన ప్రమేయంలేని చర్చ!

13 Aug, 2022 00:11 IST|Sakshi

ఎప్పటిలాగే ఉచిత పథకాలపై మళ్లీ జోరుగా చర్చ జరుగుతోంది. సహజంగానే ప్రజల కోసం అమలయ్యే ఉచిత పథకాల చుట్టూనే ఇదంతా తిరుగుతోంది. బడా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల మేర ఎగ్గొట్టిన బ్యాంకు  రుణాలు రద్దవుతున్న వైనం గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. బహుశా ఇలా రద్దు చేయడం ఉచితాలకిందకు రాదన్న అభిప్రాయం చర్చిస్తున్నవారికి ఉన్నట్టుంది. గత నెలలో ఒక సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఉచిత పథకాలు ప్రకటించడాన్ని ‘మిఠాయిల సంస్కృతి’గా అభివర్ణించారు. ఈ సంస్కృతికి అడ్డదారి రాజకీయంగా కూడా ఆయన పేరుపెట్టారు. ఉచితపథకాల వల్ల ఆర్థికాభివృద్ధి నాశనమవుతుందన్నారు. ఆయన దీన్ని ప్రత్యేకించి ఎందుకు లేవనెత్తారో తెలియంది కాదు.

వచ్చే డిసెంబర్‌లో జరగబోతున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. మహిళలకు ప్రతి నెలా వేయి రూపాయలు ఇవ్వడంతోసహా బోలెడు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నారు. ఇక తన ముందు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేస్తున్న వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. మధ్య తరగతి, ఆ పై తరగతులవారికి అన్ని రకాల ఉచిత పథకాలపైనా ఎప్పటినుంచో అభ్యంతరం ఉంటోంది. వారి ఉద్దేశం ప్రకారం ఉచిత రేషన్‌ మొదలుకొని ఉపాధి హామీ పథకం వరకూ అన్నీ వ్యర్థమైనవే. తాము కట్టే పన్నుల ద్వారా సమకూడే రాబడిని ప్రభుత్వాలు ఉచిత పథకాలకింద ప్రజలకు ఇస్తూ వారిని సోమరులను చేస్తున్నాయన్న అభిప్రాయం వారిది.

దేశంలో 90వ దశకం మొదట్లో ఆర్థిక సంస్కరణల అమలు మొదలయ్యాక సమాజంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగాయి. కొన్ని అట్టడుగు కులాలకు మాత్రమే పరిమితమై ఉండే వృత్తుల్లోకి సైతం సంపన్నవర్గాలు భారీ పెట్టుబడులతో ప్రవేశించి లాభార్జన మొదలుపెట్టాయి. వారితో సరితూగలేక అట్టడుగు కులాలు మరింత పేదరికంలోకి జారుకున్నాయి. సంస్కరణల అనంతరం వచ్చిన సేవారంగం చూస్తుండగానే విస్తరిస్తూ పోతున్నా అందులో ఉద్యోగావకాశాలు బాగా నైపుణ్యం ఉన్నవారికి మాత్రమే పరిమితమయ్యాయి. నైపుణ్యం అవసరంలేని ఉద్యోగాల్లో కుదురుకున్నవారు సైతం ఆ ఉద్యోగాల స్వభావరీత్యా ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయారు. పైగా అవి ఎప్పుడు ఉంటాయో, పోతాయో తెలియని కొలువులుగా మిగిలిపోయాయి.

ఇవి చాలదన్నట్టు చంద్రబాబువంటి నేతలు అంతవరకూ నిరుపేదలకు ప్రభుత్వాసుపత్రుల్లో దొరికే ఉచిత వైద్యానికి కూడా యూజర్‌ చార్జీలు విధించారు. రైతులు మొదలుకొని అట్టడుగు కులాల వరకూ అనేకులు బతకడానికి దోవలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంక్షోభంలో కూరుకుపోయిన రైతాంగానికి చేయూతనివ్వడం కోసం అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వ్యతిరేకతను కూడా అధిగమించి ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేశారు. అంతవరకూ నామమాత్రంగా ఉండే వృద్ధాప్య పింఛన్‌ను పెంచారు. ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ప్రాణావసర చికిత్సలు అవసరమయ్యే నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యం దక్కేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్‌కు ముందు కూడా సంక్షేమ పథకాలు అమలు చేసినవారున్నారు. కానీ ఏ పథకాలు దారిద్య్ర నిర్మూలనకు తోడ్పడతాయో, భిన్న వర్గాల ఎదుగుదలకు ఉపయోగపడతాయో నిర్దిష్టంగా ఆలోచించి నిర్ణయించింది మాత్రం ఆయనే. అందుకే సంక్షేమ పథకాల ప్రస్తావన వచ్చిన ప్రతి సందర్భంలోనూ అందరికీ ఆయన పేరే గుర్తుకొస్తుంది.

సుప్రీంకోర్టులో దాఖలైన పిల్‌ విచారణ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ‘అహేతుక ఉచిత పథకాలు’ అవినీతితో సమానమన్న పిటిషనర్‌ వాదనను సమర్థించారు. కానీ ఒక పథకం అహేతుకతమైనదో, సహేతుకతమైనదో నిర్ణయించేదెవరు? సుప్రీంకోర్టు ప్రతిపాదించిన నిపుణుల కమిటీ వంటివి ఆ అంశాన్ని నిర్ణయించగలవా? నిపుణులు తటస్థులనీ, అన్ని అంశాలపైనా వారికి సమగ్ర అవగాహన ఉంటుందని, వారి అభిప్రాయాలు శిరోధార్యమని భావించడం ఈ ప్రతిపాదన వెనకున్న భావన కావొచ్చు. కానీ నిపుణుల్లో ఉచితాలు సంపూర్ణంగా రద్దు చేయాలని వాదించేవారున్నట్టే, వాటిని కొనసాగించటం అవసరమని కుండబద్దలు కొట్టేవారున్నారు.

అసలు ఉచిత పథకాలపై ఏ పార్టీకైనా నిర్దిష్టమైన అభిప్రాయం ఉందా? అనుమానమే. ఎందుకంటే ఉచిత పథకాలను మిఠాయి సంస్కృతిగా అభివర్ణించిన మోదీయే పలు సందర్భాల్లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉచిత పథకాల గురించి ఏకరువుపెట్టిన ఉదంతాలున్నాయి. అంతెందుకు? విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని రప్పించి, ప్రతి ఒక్కరి జేబులో రూ. 15 లక్షలు వేస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన ప్రకటన దేనికిందికొస్తుంది? అసలు ప్రజల ప్రమేయం లేకుండా ఉచిత పథకాల గురించి చర్చించడం దండగ. అన్ని పార్టీలూ ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటిస్తున్నప్పుడు వారిలో ఎవరో ఒకరినే జనం ఎందుకు విశ్వసిస్తున్నారు? వారినే ఎందుకు గెలిపిస్తున్నారు? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అలవిమాలిన హామీలిచ్చి అధికారం అందుకున్న చంద్రబాబును, వాగ్దానాల అమలులో చతికిలబడ్డాక 2019 ఎన్నికల్లో అదే జనం ఓడించలేదా? ప్రజాక్షేత్రాన్ని విస్మరించి, ప్రజలు ఎన్నుకున్న చట్టసభలను పరిగణనలోకి తీసుకోకుండా ఉచితాల గురించి చర్చించడం వృథా ప్రయాస.

మరిన్ని వార్తలు