చర్చలపైనే దృష్టి పెట్టాలి

16 Dec, 2020 01:39 IST|Sakshi

దాదాపు 20 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సాగుతున్న రైతుల ఆందోళన ఇప్పట్లో ముగిసే ఛాయలు కనుచూపు మేరలో కనబడని స్థితిలో ఆ సమస్యపై వ్యాపార, వాణిజ్య సంఘాలు తొలిసారి మాట్లాడాయి. ఈ ప్రతిష్టంభన భారీ నష్టానికి దారితీస్తుందని ఆందోళనపడ్డాయి. వాణిజ్య పారి శ్రామిక సంఘాల సమాఖ్య అసోచామ్‌ చెబుతున్న గణాంకాలనుబట్టి పంజాబ్, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్, జమ్మూ, కశ్మీర్‌లలో రోజుకు రూ. 3,500 కోట్ల మేర నష్టం జరుగుతోంది. రైతుల నిరసనతో పంపిణీ వ్యవస్థ దెబ్బతిని ఎక్కడి సరుకు అక్కడే నిలిచిందని, అసలే ఆర్థిక మాంద్యం అలుముకుని వున్న వర్తమానంలో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అసాధ్యమవుతుందని సీఐఐ హెచ్చరించింది. ఆ రెండు సంఘాలూ సాగు చట్టాలను సమర్థిస్తున్నాయి. కానీ ఈ ప్రతిష్టంభనకు త్వరగా పరిష్కారం లభించాలని కోరుకుంటున్నాయి. కేంద్రం కూడా ఈ విషయంలో ఆలోచన చేస్తున్నదని కొందరు రైతులతో మాట్లాడుతున్న తీరు చూస్తే అర్థమవుతుంది. గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతాన్ని మంగళవారం సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ సిక్కు రైతులు కొందరితో ఢిల్లీ నిరసనల గురించే మాట్లాడారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ను సోమవారం కొందరు రైతు నేతలు కలిసి సాగు చట్టాలకు అనుకూలమేనని చెప్పారు.

సమస్య తలెత్తినప్పుడు చర్చించడం, ఒక పరిష్కారాన్ని అన్వేషించడం మంచిదే. దేశంలోని రైతులంతా ఆ చట్టాలను సమర్థిస్తున్నారనో లేక పూర్తిగా వ్యతిరేకిస్తున్నారనో అభిప్రాయం కలగజేసే ప్రయత్నం వల్ల పెద్దగా ఫలితం సిద్ధించదు. వాస్తవంగా రైతుల భయాందోళనలేమిటో తెలుసుకుని, వాటిని తొలగించడంపైనే దృష్టి కేంద్రీకరించాలి. ఉద్యమం ప్రారంభమయ్యాక ఇప్పటికి అయిదు సార్లు చర్చలు జరిగాయి. ప్రస్తుతం అవి నిలిచిపోయాయి. చట్టాలు తీసుకొచ్చేముందే దేశంలోని రైతులతో, మరీ ముఖ్యంగా పంజాబ్, హరియాణా రైతులతో చర్చించాల్సింది. ఆ తర్వాతే ఆర్డి నెన్సులైనా, బిల్లులైనా తీసుకురావాల్సింది.  కనీసం పార్లమెంటులోనైనా చర్చ జరుగుతుందనుకుంటే తీవ్ర గందరగోళం మధ్య బిల్లుల్ని మూజువాణి ఓటుతో ఆమోదించారు. చట్టసభల్లో తగినంత బలం వుండొచ్చు. కోరుకున్న చట్టం తీసుకురావడానికి, నచ్చిన నిర్ణయం చేయడానికి అదొక్కటే సరిపోదు. ప్రజాస్వామ్యంలో ఏ నిర్ణయమైనా చర్చలతోనే ముడిపడి వుంటుంది.

ఆ చర్చలు ముందా వెనకా అనేది తేల్చుకోవాల్సింది ప్రభుత్వాలే. ముందే చర్చిస్తే ఆచరణలో అవరోధాలు పెద్దగా ఏర్పడవు. తర్వాత చర్చిద్దామనుకుంటే కొన్నిసార్లు అది అసాధ్యం కావొచ్చు. సాగు చట్టాలకు సంబంధించిన బిల్లులు తీసుకురావడానికి ముందు ఆన్‌లైన్‌ ద్వారా 90 లక్షలమంది రైతులతో మాట్లాడామని కేంద్రం చెబుతోంది. అది నిజమే అనుకున్నా... ఆ 90 లక్షలమంది మొత్తంగా రైతుల మనోగతాన్ని ప్రతిబింబించలేకపోయారని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే రైతుల ఆందోళన గమనించాక కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) వగైరాలపై లిఖితపూర్వక హామీని ఇస్తామని ఇప్పుడు కేంద్రం ముందుకొస్తోంది. ఆ 90 లక్షలమందిలో కొందరైనా ఎంఎస్‌పీ అంశం లేవనెత్తి వుంటే ముందే జాగ్రత్త పడటం వీలయ్యేది. పార్లమెంటులో సరిగా చర్చ జరిగినా ఆ సమస్యపై దృష్టి సారించడం తప్పనిసరని తెలిసేది. ఇప్పుడు రైతులు అటు లిఖితపూర్వక హామీగానీ, ఇటు చట్ట సవరణలుగానీ తమకు సమ్మతం కాదంటున్నారు. వాటి రద్దు ఒక్కటే తమ డిమాండని చెబు తున్నారు. అది కుదరని పని అని కేంద్రం అంటోంది. వాతావరణం ఉద్రిక్తంగా మారినప్పుడు ఇలాంటివన్నీ సహజమే.

కచ్‌లో మాట్లాడిన సందర్భంగా విపక్షం అధికారంలో వుండగా ఈ మాదిరి సంస్కరణలే తీసుకురావడానికి ప్రయత్నించిందని, వాటినే తాము తీసుకొస్తే వ్యతిరేకిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. అందులో వాస్తవముంది. ఇతర అంశాల్లో ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా సంస్కరణల విషయంలో కాంగ్రెస్, బీజేపీలది ఒకటే విధానం. అధికార పక్షంలో వుండగా ఒకలా, విపక్షంలో వుండగా మరొకలా మాట్లాడటంలోనూ ఇద్దరిదీ ఒకే తంతు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోయే మండీల వ్యవస్థను రద్దు చేస్తామని తెలిపింది. అయితే కేవలం విపక్షాల ప్రాపకంతోనే ప్రస్తుత ఆందోళన జరుగుతున్నదని భావించడం పొరపాటు. ఇంతక్రితం కేంద్రమంత్రి తోమర్‌ సైతం ఈ మాటే అన్నారు. 370 అధికరణనూ, రామమందిరాన్నీ, పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించినవారే రైతుల ఆందోళన వెనకున్నారని ఆరోపించారు. ఇతర మంత్రులు ఆ రైతుల వెనక ‘టుక్‌డే టుక్‌డే గ్యాంగ్‌’ ఉందని, మావోయిస్టులున్నారని, పాకిస్తాన్, చైనాల హస్తం వుందని... ఇలా రకరకాలుగా మాట్లాడు తున్నారు.

ఈ ఆరోపణల విషయంలో తగిన సమాచారముంటే ఆ రైతులకు దాన్ని అందజేయొచ్చు. అటువంటి వారిని దూరం పెట్టమని కోరవచ్చు. తామే చర్యలు తీసుకోవచ్చు. కానీ చర్చలు జరిగి మెరుగైన పరిష్కారం సాధించవలసిన సందర్భంలో ఇలా ఏకపక్షంగా ముద్రలు వేసే ప్రయత్నం సరైందేనా? అందువల్ల సమస్య మరింత జటిలం కాదా? ఇందిరాగాంధీ ప్రధానిగా వుండగా తన వ్యతిరేకుల్ని సీఐఏ ఏజెంట్లని ఆరోపించేవారు. వాస్తవానికి ఇలాంటి ఆరోపణలొస్తాయన్న ఉద్దేశం తోనే రైతులు రాజకీయ పక్షాలను దూరం పెట్టారు. పైగా సంస్కరణల విషయంలో ఎవరి అభిప్రా యాలేమిటో, ఇప్పుడు ఎవరేమి మాట్లాడుతున్నారో వారికి తెలియకపోలేదు. అందుకే విపక్షాల ప్రాపకం వుందన్న కోణం నుంచి సమస్యను చూడకపోవడం ఉత్తమం. ఢిల్లీ చుట్టుపట్ల ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. శీతగాలులతో అది వణుకుతోంది. అక్కడుండే కాలుష్య వాతా వరణానికి తోడు కరోనా మహమ్మారి ప్రమాదం ఇంకా పోలేదు. వీటిని కూడా దృష్టిలో వుంచు కోవాలి. ఇరు పక్షాల్లో ఎవరూ ప్రతిష్టకు పోకుండా చర్చలకు సిద్ధపడాలి. సాధ్యమైనంత త్వరగా అందరికీ ఆమోదయోగ్య మైన పరిష్కారం లభించేందుకు ప్రయత్నించాలి. 

మరిన్ని వార్తలు