క్రీడలపై క్రీనీడ!

20 Aug, 2022 00:16 IST|Sakshi

క్రీడా మైదానాల్లో సమవుజ్జీలైన రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడుతూ అభిమానుల్లో ఉత్కంఠ రేపాలి. తమ ప్రతిభా పాటవాలతో స్టేడియంలను హోరెత్తించాలి. కానీ అందుకు భిన్నంగా ఈ ఆటలు నిర్వహించాల్సిన సంఘాల్లోని పెద్దలే ముఠాలు కట్టి పరస్పరం తలపడుతూ, క్రీడలను గాలికొదిలితే దేశం నగుబాటు పాలవుతుంది. అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య(ఏఐఎఫ్‌ఎఫ్‌)పై అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘాల సమాఖ్య(ఫిఫా) నిషేధాస్త్రం సంధించిన నేపథ్యంలో మన క్రీడా సంఘాల పనితీరు మరోసారి చర్చకొచ్చింది. 2012లో భారత్‌ ఒలింపిక్‌ సంఘం(ఐఓఏ) కూడా ఈ మాదిరే వివాదాల్లో చిక్కుకోవడంతో అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం(ఐఓసీ) దాన్ని సస్పెండ్‌ చేయాల్సివచ్చింది.

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌(బీసీసీఐ) వ్యవహారాలు సైతం గతంలో ఇలాగే బజారుకెక్కడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రక్షాళనకు పూను కుంది. అయినా మన క్రీడాసంఘాల్లో చెప్పుకోదగ్గ మార్పు రాలేదు. పర్యవసానంగా భారత ఫుట్‌  బాల్‌ సమాఖ్య దోషిగా నిలబడింది. క్రీడలతో పెద్దగా సంబంధం లేని రాజకీయ నాయకులు ఈ సంఘాల్లోకి  జొరబడి వాటిని నియంత్రించడం, ఆ రంగంలో సుదీర్ఘానుభవం ఉన్నవారిని తృణీక రించడం మన దేశంలో రివాజుగా మారింది. ఇందువల్ల సంఘాల్లో నిధులు దుర్వినియోగం కావడం, నిబంధనలు గాలికొదిలి ఇష్టానుసారం వ్యవహరించడం పెరిగింది.

దాంతో అసలైన ఔత్సాహిక క్రీడాకారులకు ప్రోత్సాహం కరువవుతోంది. మహిళా క్రీడాకారిణులకు లైంగిక వేధిం పులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు సరేసరి. ఎన్ని సమస్యలున్నా ఈమధ్య జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో మనవాళ్లు మంచి ప్రతిభ కనబరిచి పతకాల సాధనలో నాలుగో స్థానంలో నిలిచారు. 22 బంగారు పతకాలు, 16 వెండి పతకాలు, 23 కాంస్య పతకాలు–మొత్తంగా 61 పతకాలు తీసు కొచ్చారు. 2010లో ఇంతకన్నా ఎక్కువ పతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచిన సంగతి నిజమే అయినా ఆ తర్వాత నిరాశ తప్పలేదు. ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటోంది. ఈ ఉత్సాహాన్ని నీరుగార్చేలా ఏఐఎఫ్‌ఎఫ్‌పై నిషేధం వేటుపడింది. 

అంతర్జాతీయంగా 211 దేశాలకు సభ్యత్వం ఉన్న ఫిఫా కొంతకాలంగా మన సమాఖ్య పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేకపోయాడు. మా నిబంధనావళిని బేఖాతరు చేస్తున్నారంటూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తున్నా వినేవారే లేకుండా పోయారు. సమాఖ్యకు కొత్త కార్యవర్గం ఎన్నికై, దాని అధీనంలో రోజువారీ కార్యకలాపాలుండాలని ఫిఫా సూచిస్తోంది. సాధారణంగా క్రీడాసంఘాలకు అధికారంలో ఉండే పెద్దలవల్ల సమస్యలెదురవు తాయి.

కానీ ఫుట్‌బాల్‌ సమాఖ్యకు విపక్ష ఎన్‌సీపీ నేత ప్రఫుల్‌ పటేల్‌ గుదిబండగా మారారు. వరసగా మూడుమార్లు ఎన్నికైన ఆయన పదవీకాలం 2020లోనే ముగిసినా న్యాయస్థానాలను ఆశ్రయించి ఆ పదవి పట్టుకుని వేలాడారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ఫుట్‌బాల్‌ సమాఖ్యకు ఆయన్నుంచి విముక్తి కలిగినా కొత్త సమస్యలొచ్చి పడ్డాయి. పటేల్‌ను తప్పించినప్పుడే ఫిఫా నిబంధనావళికి అనుగుణంగా చర్యలు తీసుకోమని ఆదేశాలిస్తే వేరుగా ఉండేది. కానీ సమాఖ్య కార్యకలాపాల నిర్వహణకంటూ ఒక పరిపాలక సంఘాన్ని(సీఓఏ) ఏర్పాటుచేయడం, ఆ సంఘం వెనువెంటనే మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారులతో ఓటర్ల జాబితా తయారుచేసి, ఎన్నికైన 36 సంఘాల ప్రతినిధులను బేఖాతరు చేయడం, ఎన్నికలకు సిద్ధం కావడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. సీఓఏను ఫిఫా గుర్తించడానికి నిరాకరించి, మన ఫుట్‌బాల్‌ సమాఖ్యను నిషేధించడంతో కేంద్రం కూడా రంగంలోకి దిగక తప్పలేదు.

నిజానికి బీసీసీఐ కేసు తనముందుకు వచ్చినప్పుడే క్రీడాసంఘాలకు రాజకీయ నాయకులు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు హితవు చెప్పింది. కానీ ఆ తర్వాత కూడా ఏమీ మారనందువల్లే 85 ఏళ్ల మన ఫుట్‌బాల్‌ సమాఖ్య తొలిసారి వీధిన పడాల్సి వచ్చింది. ఫిఫాతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దాలని సుప్రీంకోర్టు కేంద్రానికి చేసిన సూచనవల్ల ఈ భంగపాటు నుంచి సమాఖ్య బయటపడొచ్చు. కానీ ఎన్నాళ్లిలా? క్రీడా సంఘాలు అంకితభావంతో, స్వయంప్రతిపత్తితో పనిచేయలేవా? కొరడా ఝళిపించినప్పుడు మాత్రమే దారికొస్తాయా? 

క్రీడాసంఘాల తీరువల్ల ఆటగాళ్లలో నిరాశానిస్పృహలు అలుముకోవడం, దేశానికి తలవం పులు తప్పకపోవడం మాత్రమే కాదు... ఫిఫా తాజా నిర్ణయం పర్యవసానంగా ఏటా రావాల్సిన రూ. 4 కోట్ల నిధులు ఆగిపోతాయి. ఫుట్‌బాల్‌ క్రీడకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కుంటుపడుతుంది. పైగా వచ్చే అక్టోబర్‌లో భారత్‌లో జరగాల్సిన మహిళల అండర్‌–17 ప్రపంచ కప్‌ సందిగ్ధంలో పడింది. నిషేధం ఎత్తేసేవరకూ అన్ని దేశాల ఫుట్‌బాల్‌ సమాఖ్యలూ మన దేశాన్ని దూరం పెడతాయి. ఈ నెలాఖరులో ఇరాన్‌లో జరగాల్సిన మ్యాచ్‌లలో... వచ్చే నెలలో వియత్నాం, సింగపూర్‌లలో జరిగే మ్యాచ్‌లలో మన క్రీడాకారులు పాల్గొనలేరు.

అందుకే మన క్రీడాసంఘాలు కళ్లు తెరవాలి. క్రీడలపట్ల నిబద్ధత, నిమగ్నతా ఉన్నవారు మాత్రమే సారథ్యం వహించే స్థితి రావాలి. దిగ్గజ క్రీడాకారులూ, క్రీడాభిమానులూ సమష్టిగా నిలబడితే ఇదేమంత అసాధ్యం కాదు. క్రీడా సంఘాలు సర్వస్వతంత్ర సంఘాలుగా రూపొంది దేశంలో క్రీడాభివృద్ధికి కృషిచేస్తేనే మెరికల్లాంటి క్రీడాకారులు రూపొందుతారు. అందుకు భిన్నంగా నిర్ణయరాహిత్యమో, తప్పుడు నిర్ణయాలో రివాజుగా మారితే దేశం తీవ్రంగా నష్టపోతుంది.

మరిన్ని వార్తలు