ఫ్రాన్స్‌కు పరీక్షా సమయం

9 Apr, 2022 01:09 IST|Sakshi

యూరప్‌ ఖండమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ఆది వారం జరగబోతోంది. ఈనెల 24న జరగబోయే మలి దశకు ప్రధానంగా ఎవరు పోటీలో ఉంటారో ఈ పోలింగ్‌  ఫలితం తేల్చేస్తుంది. ప్రస్తుత అధ్యక్షుడు, మధ్యేవాద పక్ష నాయకుడు ఇమ్మానియేల్‌ మేక్రాన్‌ సునాయాసంగా గెలుస్తారని గత నెలలో వెలువడిన సర్వేలు చెప్పినా... ఇటీవల ఆయన ప్రత్యర్థి, తీవ్ర మితవాద పక్షనేత మెరైన్‌ లీ పెన్‌ తన స్థానాన్ని మెరుగుపర్చుకున్నారని తేలింది. తాను విజయం సాధిస్తే ప్రళయం ఖాయమని స్టాక్‌ మార్కెట్‌లు ప్రజల్లో అనవసర భయాలు సృష్టిస్తున్నాయని లీపెన్‌ అంటున్నారు.

నిజానికి మేక్రాన్‌కు ఎన్నడూ లేనంత అనుకూల పరిస్థితులు న్నాయి. కానీ ఆయన ఎన్నికల ప్రచారం ఆలస్యంగా మొదలుకావడమే లీ పెన్‌కు వరమైందని నిపు ణుల భావన. అయిదేళ్ల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రెండో దశ ఎన్ని కల్లో 66 శాతం ఓట్లు సాధించినప్పుడు మేక్రాన్‌ వయసు 39 ఏళ్లు. నెపోలియన్‌ బోనపార్ట్‌ తర్వాత అంత చిన్న వయసులో ఫ్రాన్స్‌ అధ్యక్ష పీఠం దక్కించుకున్నవారు మరెవరూ లేరు. అయితే అప్పటి పరిస్థితులు వేరు. ఇరవై రెండేళ్ల తర్వాత 2012లో విజయకేతనం ఎగరేసిన సోషలిస్టు పార్టీ పాలనలో పూర్తిగా విఫలమై అప్రదిష్టపాలైంది.

అధ్యక్షుడిగా పాలించిన హొలాండ్‌ అసమర్థుడిగా ముద్రపడి, చివరి సమయంలో బెనోయిట్‌ హమాన్‌కు పీఠం అప్పగించారు. ఆయన కూడా ప్రజలను ఆకట్టు కోలేకపోయారు. అటు లీ పెన్‌ తీవ్ర మితవాద భావాలతో జనాన్ని హడలెత్తించారు. తాను అధ్యక్షురాలిగా గెలిస్తే నాటో కూటమి నుంచి ఫ్రాన్స్‌ను తప్పిస్తానని, రష్యాతో సంబంధాలు మెరుగు పరుస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇవన్నీ మార్కెట్లను బెంబేలెత్తించాయి. ఆ పరిస్థితుల్లో మేక్రాన్‌ సునాయాసంగా గెలిచారు.

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తీవ్ర మిత భావాలు ఫ్రాన్స్‌ ప్రజానీకానికి రుచించడం లేదన్న నిజాన్ని లీ పెన్‌ గ్రహించారు. దానికితోడు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడంతో ఆ దేశం ప్రస్తావన, పుతిన్‌ ప్రస్తావన ఆమె మానుకున్నారు. అలాగే వలసల విషయంలోనూ ఉదారంగా ఉంటున్నారు. ఏ దేశంలో కల్లోలం ఏర్పడినా వేలాదిమంది ఫ్రాన్స్‌కు వచ్చిపడి స్థానికుల అవకాశాలను దెబ్బ తీస్తున్నారని, దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నారని 2017 ఎన్నికల్లో ఆమె విరుచుకుపడేవారు.

తాను వచ్చిన వెంటనే వలసల నిరోధానికి చట్టం చేస్తాననేవారు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఉక్రెయిన్‌ వాసులు మన సోదర సోదరీమణులేనని, వారిని ఆదుకోవడం మన కర్తవ్యమని లీ పెన్‌ చెబుతున్నారు. బ్రెగ్జిట్‌ అనంతరం బ్రిటన్‌ పడుతున్న అవస్థలు అందరికీ తెలియడంతో యూరొపియన్‌ యూనియన్‌(ఈయూ) నుంచి ఫ్రాన్స్‌ బయటకు రావాలన్న డిమాండ్‌ను ఈసారి ఆమె అటకెక్కించారు. ఆ మాటంటే ఓటమి ఖాయమని లీ పెన్‌కు అర్థమైంది. గతంతో పోలిస్తే ఆమె అభిప్రాయాలు సరళం కావడం ఓటర్లకు నచ్చి ఉండొచ్చు. అలాగని ఓటర్లలో ఆమె గురించిన భయాందోళనలు పూర్తిగా పోలేదు.

ఎందుకంటే ఇప్పటికీ ఆమె ఈయూ నిబంధనలను బేఖాతరు చేసి విదేశీ కార్మికుల స్థానంలో ఫ్రాన్స్‌ పౌరులకే ఉద్యోగాలు కట్టబెడతామని హామీ ఇస్తున్నారు. అలాగే ముస్లిం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా బురఖా వాడకుండా చర్యలు తీసుకుంటా నంటున్నారు. అయితే ఉక్రెయిన్‌పై దాడి తర్వాత పుతిన్‌పై జర్మనీ వగైరా దేశాల్లో ఏర్పడిన అభిప్రా యమే ఫ్రాన్స్‌లోనూ ఉంది. యూరప్‌ ఖండానికి ఆయన ముప్పుగా పరిణమిస్తాడన్న భయాందో ళనలున్నాయి.

లీపెన్‌ ఇప్పుడు పుతిన్‌ ప్రస్తావన మానుకుని ఉండొచ్చు. కానీ ఆమె గెలిస్తే ఫ్రాన్స్‌ సంక్షోభంలో కూరుకుపోతుందనీ, అది అంతిమంగా ఈయూ దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి పుతిన్‌కు పరోక్షంగా తోడ్పడుతుందనీ నమ్ముతున్నవారున్నారు. లీ పెన్‌ ధోరణులు పుతిన్‌కే ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అందువల్ల తొలి దశలో మేక్రాన్‌ కంటే ఆధిక్యత తెచ్చుకున్నా, రెండో దశలో ఆమె దెబ్బతినడం ఖాయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అధికారంలో ఉన్నవారు సమర్థవంతమైన పాలన అందిస్తేనే ప్రజలు వారికి మరోసారి అధి కారం కట్టబెడతారు. అంతేతప్ప ఏవో సాకులు వెదికి, ఎవరివల్లనో ముప్పు వస్తుందని భయపెట్టి ఓట్లడిగే రోజులు పోయాయి. కనీసం ఫ్రాన్స్‌ ప్రజానీకం అలాంటి అధినేతలను విశ్వసించరు. మేక్రాన్‌ను ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఆయన చెప్పినవన్నీ చేసి ఉండకపోవచ్చుగానీ ఆర్థికంగా ఫ్రాన్స్‌ను మెరుగ్గా నిలిపారు. దాదాపు పాతికేళ్ల తర్వాత ఈయూలో ఫ్రాన్స్‌ పలుకుబడిని పెంచారు. అటు కార్పొరేట్‌ సంస్థల పన్నులనూ తగ్గించారు.

ఇటు మధ్యాదాయ వర్గాలకూ పన్ను పోటు తగ్గించారు. నిరుద్యోగిత 7 శాతానికి పరిమితం చేస్తానన్న మేక్రాన్‌ 2017 నాటి వాగ్దానానికి కరోనా గండికొట్టింది. కానీ ఆయన అన్ని రకాల చర్యలూ తీసుకుని ఆ హామీని నెరవేర్చారు. వీటితోపాటు ఉగ్ర దాడుల తర్వాత మితవాద ఓటర్ల మనసు గెల్చుకోవడానికి దేశ ముస్లిం జనాభాను ‘విదేశీ ప్రభావం’ నుంచి తప్పించడానికంటూ  నిరుడు ఒక చట్టం తీసుకొచ్చారు.

ఫ్రాన్స్‌ శతాబ్దాలుగా నమ్ముతున్న ఉదారవాద విలువలకు ఈ చట్టం సమాధి కట్టిందని వామపక్ష, ఉదారవాద పక్ష నేతలు ఆరోపించగా... మత ఉగ్రవాదం కట్టడికి ఇది సరిపోదని మితవాదులు విమర్శించారు. మొత్తానికి మేక్రాన్, లీ పెన్‌ల మధ్య ఓట్ల శాతం వ్యత్యాసం తగ్గిందన్న తాజా సర్వేల జోస్యం ఫ్రాన్స్‌లో కలవరం రేపుతోంది. ఆదివారం పోలింగ్‌ మాటెలా ఉన్నా 24న జరిగే తుది ఎన్నికల నాటికైనా మేక్రాన్‌ పుంజుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.

మరిన్ని వార్తలు