ఆజాద్‌ నిష్క్రమణ చెప్పేదేమిటి?

27 Aug, 2022 01:07 IST|Sakshi

ఎన్నికల్లో ఓటమి పొందినప్పుడూ, జీ–23 నేతలు లేఖలు రాసినప్పుడూ మాత్రమే ఉనికి చాటుకునే కాంగ్రెస్‌ ఈమధ్యకాలంలో నేతలు పార్టీనుంచి తప్పుకున్నప్పుడు సైతం వార్తల్లోకెక్కుతోంది. తాజాగా శుక్రవారం ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ నిష్క్రమించారు. ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన ప్రముఖుల్లో కేంద్ర మాజీ మంత్రులు కపిల్‌ సిబల్, అశ్వినీకుమార్‌ లతోపాటు జైవీర్‌ షేర్గిల్, హార్దిక్‌ పటేల్, సునీల్‌ జాఖడ్‌లున్నారు. మరో నేత ఆనంద్‌ శర్మ పార్టీ నుంచి తప్పుకోనంటూనే అధినేతలపై విమర్శలు చేశారు. హిమాచల్‌ ప్రచార సారథ్యం బాధ్యతలు తీసుకోదల్చుకోలేదని ప్రకటించారు.

పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీపైనా, ఆయన్ను పల్లెత్తు మాట అనని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపైనా ఆజాద్‌ పోతూ పోతూ పదునైన విమర్శలే చేశారు. అయితే ఇందులో  కొత్తదనం ఏమీ లేదు. అవన్నీ గత పది పన్నెండేళ్లుగా పార్టీని వీడి పోతున్నవారంతా చెబుతున్నవే. వానాకాలం వచ్చిందంటే జనావాస ప్రాంతాల్లో శిథిల భవంతు లపై స్థానిక సంస్థల అధికారులు ఆరా తీస్తారు. అక్కడ ఎవరైనా నివసిస్తుంటే ఖాళీ చేయిస్తారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అలాంటి శిథిలావస్థలోనే ఉంది. అందులో ఉండటం రాజకీయంగా ముప్పు కలిగిస్తుందన్న భయంతో కొందరు నిష్క్రమిస్తుంటే... వేరేచోట అవకాశం దొరక్క తప్పనిసరై ఉండి పోతున్నవారు మరికొందరు. నిష్క్రమిస్తున్నవారు అధికార వ్యామోహంతోనే ఆ పని చేస్తున్నారని రాహుల్, సోనియా విధేయులు చెప్పే మాటల్లో వాస్తవం లేదు. జనాగ్రహం సెగ తగిలి అధికారానికి దూరం కావటం పార్టీకి కొత్తేమీ కాదు. ఎన్నో  క్లిష్ట పరిస్థితులను అధిగమించిన చరిత్ర ఆ పార్టీకుంది. కానీ ఇప్పటి స్థితి వేరు.

కాంగ్రెస్‌ జవసత్వాలతో ఉన్నదనీ, చిత్తశుద్ధితో, కలిసికట్టుగా ప్రయత్నిస్తే గత వైభవం ఖాయమనీ పార్టీ శ్రేణులు నమ్మడానికి తగిన పరిస్థితులు లేవు. కోటరీలే అక్కడ కొలువు దీరాయి. భజన బృందాలదే అక్కడ పైచేయి అయింది. జనాదరణ ఉన్న నేతలపై చాడీలు చెప్పేవారే ఎక్కువయ్యారు. వారికే పార్టీలో పెద్ద పీట. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటమి తప్పకపోవటం, నెగ్గిన చోట్ల సైతం అధికార భ్రష్ఠత సంప్రాప్తించటం స్వీయ వైఫల్యాలు, ముఠా కుమ్ములాటల పర్యవ సానమే. కనీసం వీటిపై సక్రమంగా సమీక్షలు జరిగితే, ఏం చేయాలన్న అంశంలో అందరి అభి ప్రాయాలూ తెలుసుకుంటే మున్ముందు నష్టాలు రాకుండా చూసుకునే వీలుండేది. కానీ ఆ సమీక్షల జాడ లేదు. ఇలాంటి దుస్థితిలో ఆజాద్‌ పార్టీని వీడారంటే ఆశ్చర్యపడాల్సిందేముంది?

అయితే పార్టీ వర్తమాన దుస్థితికి తనను మినహాయించుకుని కారణాలు వెదకటం ఆజాద్‌కు తగదు. పలుమార్లు కేంద్రమంత్రిగా పనిచేయడంతోపాటు సంతోష, సంక్షోభ సమయాల్లో అధిష్ఠాన వర్గం దూతగా, పార్టీ పరిశీలకుడిగా, రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఎన్నో అవతారాలెత్తి పెత్తనం చెలాయించిన ఆజాద్‌కు ఇన్ని దశాబ్దాలుగా పార్టీలో పైనుంచి కిందివరకూ ఏం జరుగు తున్నదో తెలియలేదని ఎవరైనా అనుకుంటే వారి అమాయకత్వం. కాంగ్రెస్‌ సంస్కృతిగా స్థిరపడిన అనేక అవలక్షణాలకు ఆజాద్‌ కూడా బాధ్యుడే. అందులో తనకు కర్తృత్వం లేదని ఆయన వాదించ వచ్చు. అలా చూసినా సీనియర్‌ నేతగా ఆ అవలక్షణాలను అడ్డుకున్నదెక్కడ? రాహుల్‌ పార్టీలోకి ప్రవేశించాక, ముఖ్యంగా 2013లో పార్టీ ఉపాధ్యక్షుడయ్యాక సంస్థాగత సలహాసంప్రదింపుల వ్యవస్థ ధ్వంసమైందన్న ఆయన ఆరోపణలో అబద్ధమేమీ లేదు.

కానీ అంతక్రితం ఏమంత సవ్యంగా ఉన్నదని! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చని పోయాక ఆయన కుమారుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై సోనియా గాంధీ కక్షగట్టి అక్రమ కేసులతో ఆయన్ను ఇబ్బందులపాలు చేసినప్పుడు ఆజాద్‌ సీనియర్‌ నేతగా నిర్వహించిన పాత్రేమిటి? అదేమీ లేకపోగా హైదరాబాద్‌కొచ్చినప్పుడు ‘మా మాట వింటే జగన్‌ కేంద్ర మంత్రి అయ్యేవారు, ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు...’ అంటూ వ్యాఖ్యానించిన సంగతి మరిచారా? అధికారంలో ఉండగా అధినేతలకు పరమ విధేయత నటించడం, అది కోల్పోయాక రాళ్లు రువ్వడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. తప్పును తప్పని సూటిగా చెప్పలేకపోతే ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. కనీసం అలా చెప్పేవారికైనా అండగా నిలవాలనీ, వారు లేవనెత్తే అంశాల్లో హేతుబద్ధత ఉన్నదనీ అధిష్ఠానానికి చెప్పాలని అనిపించని సీనియారిటీకి విలువేముంటుంది?  

ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌ ఏలుబడి సాగుతోంది. తమిళనాడు, జార్ఖండ్‌లలో అధికార కూటముల్లో భాగస్వామిగా ఉంది. మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోయే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలో కాంగ్రెస్‌కు అధికారయోగం అసాధ్యం. అక్కడ కాంగ్రెస్‌ స్థానాన్ని ఆప్‌ భర్తీ చేసిందని సర్వేలు చెబుతున్నాయి. మరో రాష్ట్రం మేఘాలయాలో మహా అయితే అధికార కూటమిలో మైనారిటీ పక్షంగా కొనసాగే చాన్సుంది. దేశంలో మరెక్కడా ఆ పార్టీకి ఆశాజనకమైన స్థితి లేదు. అంతర్గతంగా చూస్తే నాయకత్వం నిస్తేజంగా మారింది. పార్టీ అధ్యక్ష పదవికి వచ్చే నెలలో జరగాల్సిన ఎన్నికలు కాస్తా వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు. మంచి రోజుల్లేకే ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ వర్గాలు అంటున్నాయి. సుముహూర్తాలు చూసుకుంటే సరిపోదు. ఎదురయ్యే వైఫల్యాలపై ఆత్మవిమర్శ ఉండాలి. స్వీయలోపాలపై దృష్టి సారించాలి. పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు విలువివ్వాలి. ముఠా సంస్కృతిని ప్రోత్సహించడం ఆపాలి. అంతవరకూ కాంగ్రెస్‌కు మంచి రోజులు రావు. ఉండవు. 

మరిన్ని వార్తలు