సాకర్‌ దిగ్గజం

27 Nov, 2020 00:34 IST|Sakshi

అర్జెంటీనా మురికివాడలోని నిరుపేద కుటుంబంలో పుట్టిన అతి సామాన్యుడు అనన్య సామాన్యుడిగా ఎదగడం... పసి ప్రాయంలోనే తాను మనసు పారేసుకున్న సాకర్‌ క్రీడకు తన సర్వసాన్నీ అంకితం చేసి ఆ రంగంలో ఆకాశపుటంచుల్ని తాకడం ఊహించలేం. రెప్పపాటులో చేసిన ఒకే ఒక్క గోల్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని మంత్రముగ్ధుల్ని చేసి, వారి హృద యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవటం నమ్మశక్యం అనిపించదు. కానీ బుధవారం కన్ను మూసిన సాకర్‌ దిగ్గజం డీగో మారడోనా తన జీవితకాలంలో అన్నీ చేసి చూపాడు. 

నాలుగేళ్ల కొకసారి వచ్చే సాకర్‌ సంగ్రామం కోసం ప్రపంచం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తుంది. ఆ రంగంలో మారడోనాకు ముందు, తర్వాత దిగ్గజాలనిపించుకున్న క్రీడాకారులు చాలామందే వచ్చారు. వారు కూడా చెరగని ముద్రేశారు. పీలే, లియోనల్‌ మెసీ, పీటర్‌ షిల్టన్, గెర్డ్‌ ముల్లర్, జస్ట్‌ ఫాంటెయిన్, గెర్డ్‌ ముల్లర్, జిదాన్‌... ఇలా ఎందరెందరో తమ తమ జట్టుల్ని గెలిపించడంలో, మంచి ఆటతో మెరిపించడంలో, స్టేడియంలోని ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేయడంలో సిద్ధహస్తులే. కానీ వీరెవరిలోనూ లేని మార్మికత ఏదో మారడోనాలో దాగుంది. అందుకే ప్రపంచం అతని ప్రతిభకు మోకరిల్లింది. మురికివాడలో చిల్లులుపడిన ఇరుకిరుకు రేకుల షెడ్‌లాంటి కొంపలో ఎనిమిదిమంది సంతానం వున్న ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినవాడు ఒకనాడు సాకర్‌ సామ్రాజ్యాన్ని ఏలుతాడని ఎవరూ అనుకోలేదు. 

అసలు అతగాడి ఆటను గుర్తించిన ఘనులెవ్వరూ లేరు. తమలో ఒకడిగా వున్నవాడి చతురతను ముందుగా సామాన్యులే కనిపెట్టారు. తాను పుట్టిన బ్యూనస్‌ ఎయిర్స్‌లో ఎక్కడ ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ జరిగితే అక్కడల్లా ప్రత్యక్షమై దాని వెలుపల విన్యాసాలు చేసే ఏడెనిమిదేళ్ల మారడోనాలో మొదటగా భవిష్యత్తు దిగ్గజాన్ని దర్శించినవారు సాధారణ ప్రేక్షకులే. మ్యాచ్‌ జరిగే ప్రతిచోటా గ్రౌండ్‌ వెలుపల బంతిని కిందపడనీయకుండా కాలితో విన్యాసాలు చేసే కుర్ర మారడోనా వారికి ప్రత్యేక ఆకర్షణ. స్టేడియంలో ఆట విసుగు పుట్టించినప్పుడు బయటికొచ్చి మారడోనా చుట్టూ చేరడం వారికి అలవాటైంది. అది కాస్తా అతనిపై ప్రేమగా మారింది. 

ఆ తర్వాత వారే ఫుట్‌బాల్‌ నిర్వాహకులపై ఒత్తిళ్లు తెచ్చారు. ఎంతసేపూ స్టేడియంలోనేనా...దాని వెలుపల ప్రతిభావంతులు మీకు కనబడరా? అంటూ నిలదీశారు. అలా స్టేడియంలోకి అడుగుపెట్టినవాడు మారడోనా. ఆ తర్వాత అతను ఆడే లిటిల్‌ ఆనియన్స్‌ టీం పేరు మార్మోగింది. అతగాడు కొట్టే ప్రతి షాటూ గోల్‌ అవుతుంటే అందరూ బిత్తరపోయి చూసేవారు. ఆ టీం వరసగా 140 మ్యాచ్‌లు గెలుచుకుని చరిత్ర సృష్టిస్తే అందుకు ఏకైక కారణం మారడోనాయే కావడం యాదృచ్ఛికం కాదు.   

మెక్సికోలో 1986లో జరిగిన ప్రపంచ కప్‌ సాకర్‌లో ఇంగ్లండ్‌ టీంపై వేసిన రెండో గోల్‌తో ఆ టీంను మట్టికరిపించడమే కాదు... ప్రపంచం మొత్తాన్ని పాదాక్రాంతం చేసుకున్న మారడోనాకు రాజకీయంగా కొన్ని దృఢమైన విశ్వాసాలున్నాయి. నిజానికి అలాంటి విశ్వాసమే ఆనాడు తనతో గోల్‌ చేయించిందని ఒక సందర్భంలో మారడోనా చెప్పాడు. ప్రపంచ కప్‌ సాకర్‌కు సరిగ్గా నాలుగేళ్ల ముందు తమ ఫాక్‌లాండ్‌ దీవుల్ని బ్రిటన్‌ దురాక్రమించిన వైనాన్ని, ఆ దీవుల్ని వల్లకాడుగా మార్చిన వైనాన్ని మారడోనా మరిచిపోలేదు. ఇంగ్లండ్‌ టీంపై ఆడేటపుడు ఆ యుద్ధం తాలూకు చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకోవద్దని, ఆటను ఆటలాగే చూసి గెలిచినా, ఓడినా హుందాగా వుండాలని అర్జెంటీనా సాకర్‌ బాధ్యులు తమ క్రీడాకారులకు నూరిపోశారు. 

యుద్ధం చేసింది బ్రిటన్‌ సైనికులే తప్ప, అక్కడి ఆటగాళ్లు కాదని కూడా చెప్పారు. కానీ మారడోనా అంతరాంతరాల్లో అది సరికాదనిపించింది. ‘మైదానంలో ఆడేటపుడు నేను ఒక దేశాన్ని జయించాలనుకున్నాను తప్ప, ఫుట్‌బాల్‌ టీంని కాదు. అందుకే ప్రతీకారేచ్ఛతో ఆడాను. గెలుపు సొంతం చేసుకున్నాను’ అని అనంతరకాలంలో మారడోనా అన్నాడు. అప్పటికల్లా అతను ఇంగ్లండ్‌ సాకర్‌ ప్రేమికుల హృద యాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నాడు. అందుకే తమ దేశం గురించి కటువుగా వ్యాఖ్యా నించిన మారడోనాను వారు పల్లెత్తు మాట అనలేదు. ఆనాటి మ్యాచ్‌లో ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’గా నిచిపోయిన గోల్‌ విషయంలో అది ఫుట్‌బాల్‌ క్రీడా చరిత్రలోనే పెద్ద మోసంగా ఒక సర్వేలో ఓటేసిన ఇంగ్లండ్‌ జనమే... మారడోనా వేసిన ఆ రెండో గోల్‌ సాకర్‌ చరిత్రలో అతి విశిష్టమైనదని తీర్పునిచ్చారు. 

ఆ రెండు గోల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ ద్రవ్య విధానానికి దారి చూపించాయని ఆ బ్యాంక్‌ చైర్మన్‌ మెర్విన్‌ కింగ్‌ చెప్పారంటే మారడోనా ఎంతటి ఆటగాడో అర్థమవుతుంది.  విప్లవ కారుడు చేగువేరాను పచ్చబొట్టుగా చేసుకున్నా... అమెరికా సామ్రాజ్యవాదానికి ఆజన్మాంతం సవా లుగా నిలిచిన క్యూబా అధినేత ఫైడల్‌ కాస్ట్రోను గుండె నిండా శ్వాసించినా అందుకు మారడోనా లోని సోషలిస్టు భావజాలమే కారణం. లక్షల డాలర్లు ముంచెత్తినా అతనిలోని అతి సామాన్యుడు కనుమరుగుకాలేదు. తొలినాటి వినమ్రత చెక్కుచెదరలేదు.   

ఏ ఆరంభానికైనా ముగింపు తప్పదు. కానీ క్రీడాకారుడిగా మారడోనా ముగింపు ఎవరూ ఊహించనిది. ఆ విశిష్ట క్రీడాకారుడు ఎక్కడో మాదకద్రవ్యాల అగాధాల్లోకి జారిపోయాడు. పిచ్‌పై అరివీర భయంకరంగా ఆడి ప్రత్యర్థుల్ని హడలెత్తించినవాడే, పిచ్‌ వెలుపల మాయదారి కొకైన్‌కు లొంగిపోయాడు. ఇరవయ్యో యేట దాపురించిన ఆ అలవాటు ఇరౖÐð  ఏళ్లపాటు మారడోనాను పీడించింది. రెండుసార్లు శస్త్ర చికిత్సలు అవసరమయ్యాయి. అనంతరకాలంలో ఫుట్‌బాల్‌ కోచ్‌గా, మేనేజర్‌గా వ్యవహరించినా మునుపటి మెరుపులు కనుమరుగయ్యాయి. వ్యాధులు చుట్టు ముట్టాయి. ఆరుపదులు దాటకుండానే అవి పొట్టనబెట్టుకున్నాయి. అయితే మెస్సీ అన్నట్టు ‘అతను మనల్ని వదిలివెళ్లాడన్న మాటేగానీ... ఎప్పటికీ మనలోనే వున్నాడు. ఉంటాడు’.

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా