రాజకీయ మహా థ్రిల్లర్‌

1 Jul, 2022 00:29 IST|Sakshi

పది రోజుల పైచిలుకు మహా రాజకీయ నాటకం క్లైమాక్స్‌లోనూ ఆశ్చర్యకరమైన మలుపులు తిరిగింది. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాకరేపై ఏక్‌నాథ్‌ శిందే సారథ్యంలో ఎమ్మెల్యేల తిరుగుబాటు, సూరత్‌ మీదుగా గౌహతి దాకా క్యాంపు రాజకీయాలు, అసెంబ్లీలో బలపరీక్షకు గవర్నర్‌ ఆదేశాలు, సుప్రీమ్‌ కోర్టుకెక్కిన వివాదం – ఇలా ఇన్ని రోజుల పొలిటికల్‌ థ్రిల్లర్‌కు ఆఖరి ఘట్టం అక్షరాలా అనూహ్యమైనది.

మెజార్టీ కోల్పోయినా ‘మహా వికాస్‌ అఘాడీ’ (ఎంవీఏ) కూటమి సర్కారుకు సారథ్యం వహిస్తున్న ఉద్ధవ్‌ ఠాకరే ఎట్టకేలకు ఓటమి అంగీకరించి, బుధవారం రాత్రి పొద్దుపోయాక జోరున వర్షంలో రాజ్‌భవన్‌కు వెళ్ళి రాజీనామా సమర్పించారు. ఇన్నాళ్ళుగా తెర వెనుక నుంచే కథ నడిపిన బీజేపీ రాజకీయ మహా వ్యూహంతో గురువారం సాయంత్రం ఆఖరి నిమిషంలో శిందేను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. అంతటితో ఆగకుండా, శిందే సర్కారుకు బయట నుంచే మద్దతు నిస్తానని ప్రకటించిన సొంత బీజేపీ నేత – మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉప ముఖ్యమంత్రిగా పని చేయమంటూ రెండు గంటల తేడాలో ఆదేశించి, అవాక్కయ్యేలా చేసింది.

గతంలో ఫడ్నవీస్‌ ప్రభుత్వంలో శిందే మంత్రిగా పనిచేస్తే, ఇప్పుడు శిందే కొత్త సర్కారులో ఆయన కింద ఫడ్నవీస్‌ బాధ్యతలు నిర్వహించనుండడం అనూహ్యమే. కొద్ది గంటల్లోనే బీజేపీ ఇన్ని మార్పులు చేయడానికి దారితీసిన కారణాలేమిటో రాగల రోజుల్లో బయటకు రావచ్చు. ఇప్పటికైతే, బీజేపీ తన గుగ్లీలతో ప్రత్యర్థులను క్లీన్‌బౌల్డ్‌ చేసింది. ఇటు చట్టపరంగానూ, అటు రాజకీయంగానూ లబ్ధి కలిగేలా శిందేను సీఎం చేసింది. చట్టపరంగా చూస్తే – నిన్నటి దాకా శివసేన శాసనసభా నేత అయిన శిందే అదే హోదాను నిలబెట్టుకొని, తన వర్గమే అసలైన శివసేనగా గుర్తింపు పొందే అవకాశం పెరిగింది.

మిగతా రెబల్‌ ఎమ్మెల్యేలేమో పార్టీ ఫిరాయింపు లాంటి చట్టపరమైన వేటు నుంచి తప్పించుకుంటారు. రాజకీయంగా చూస్తే – ఉద్ధవ్‌నూ, అతని వెంట మిగిలిన కొద్దిమంది ఎమ్మెల్యేలనూ నిస్సహాయుల్ని చేయగల ఎత్తు ఇది. పార్టీ జెండా, అజెండా శిందే వశమయ్యే శివ సేనను బీజేపీ తన చంకలో పిల్లాణ్ణి చేసుకోగలుగుతుంది. సీఎం పీఠం బీజేపీ దయాధర్మం గనక శిందే కృతజ్ఞతాభారంతో బీజేపీకి శాశ్వత అనుచరుడవుతారు. అన్నిటికీ మించి భవిష్యత్తులో మహా రాష్ట్రలో హిందూత్వ రాజకీయ పునాదిపై తానొక్కటే బలంగా నిలిచేలా బీజేపీ ఈ చర్య చేపట్టింది. 

కొద్దినెలల్లో రానున్న ప్రతిష్ఠాత్మక ముంబయ్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సైతం తాజా చర్య బీజేపీకి కలిసి రావచ్చు. శిందేను సీఎంను చేయడం ద్వారా బాలాసాహెబ్‌ ఠాకరే భావజాలానికి నివాళి సమర్పించామంటున్న కమలం పార్టీ అలా మంచి పేరు కొట్టేస్తుంది. నిన్నటి దాకా భావోద్వేగ ప్రసంగాలతో శివసైనికుల సానుభూతి సంపాదించిన ఉద్ధవ్‌ పట్ల ఏ కొద్ది సానుకూలత మిగిలి ఉన్నా దాన్ని దూరం చేయగలుగుతుంది. హిందూత్వానికి నిలబడింది తామేనని చెప్పుకోగలుగుతుంది. ఈ మొత్తంలో ఇటు పదవీ, అటు దాదాపుగా పార్టీ కూడా చేజారి నష్టపోయింది – ఉద్ధవ్‌ ఠాకరే. మొదటి నుంచి మహారాష్ట్రలో కింగ్‌ మేకర్‌ గానే తప్ప సీఎం పీఠంపై కింగ్‌గా ఉండని సంప్రదాయం ఆయన తండ్రి బాలాసాహెబ్‌ ఠాకరేది. దానికి భిన్నంగా నడిచి, ఉద్ధవ్‌ పెద్ద తప్పే చేసినట్టున్నారు. సీఎం పదవికి రాజీనామాతో ఆయనిక కింగ్‌ కాదు. అంతకన్నా ముఖ్యంగా ఇకపై కింగ్‌ మేకరూ కాలేరు. ఏకంగా ఆయన రాజకీయ భవితవ్యమే ప్రశ్నార్థకమైంది. 

రెండున్నరేళ్ళ క్రితం బీజేపీతో ఎన్నికల ముందు ఒప్పందంతో పోటీ చేసుకొని, తీరా ఎన్నికల్లో గెలిచాక బీజేపీని కాదని కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఉద్ధవ్‌. సహజ మిత్రపక్షమైన బీజేపీని కాదని, దానికి పూర్తి విరుద్ధమైన లౌకికవాద పార్టీలతో అసహజ మైత్రి చేసుకున్నారు. రాజకీయం మాటెలా ఉన్నా నైతికంగా అది ఆయన చేసిన తప్పు. ఆ లెక్కన ఇప్పుడు సొంతపార్టీలో తిరుగుబాటు తెచ్చిన శిందేదీ, శివసేనలోని అంతర్గత అసమ్మతిని ఆసరాగా చేసుకొని, ఎంవీఏ ప్రభుత్వ పతనానికి దోహదపడి పగ తీర్చుకున్న బీజేపీదీ అంతే తప్పు. రాజకీయ రణంలో చెల్లుకు చెల్లు అయిందనుకొంటే, ఇక నైతిక ప్రశ్నలు, ధర్మాధర్మ విచక్షణలకు తావు లేదు. 

డబ్బు, అధికారం, ఈడీ కేసుల భయం –  ఏ కారణమైతేనేం కనీసం డజనుకు పైగా ఎమ్మెల్యేలు ఉద్ధవ్‌ను వదిలి, బీజేపి ఆశీస్సులున్న శిందే వైపు వచ్చారని ఆరోపణ. శివసేన సుప్రీమ్‌కు ఒకప్పుడు కుడిభుజంలా మెలిగి, పార్టీ సమస్యల పరిష్కర్తగా వెలిగిన శిందే ఇవాళ అదే అధినేతకు సంక్షోభ కారకుడు కావడం రాజకీయ వైచిత్రి. కొత్త సర్కారుతో శిందే, ఫడ్నవీస్‌లను తెర ముందు నిలబెట్టి, రిమోట్‌ కంట్రోల్‌ను చేతిలో పెట్టుకున్న బీజేపీ ఒకే దెబ్బకు అనేక పిట్టలను కొట్టిందనుకోవాలి. మహారాష్ట్రలో ఠాకరేల ప్రాబల్యానికి తెర దించడానికి ఇది ఉపకరిస్తుంది.

అలాగే, యూపీ తర్వాత అత్యధిక లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలో శివసేన ఓటర్లను కూడా తన వెంటే తిప్పుకోగలుగు తుంది. ఆ రాష్ట్రంలో శాశ్వతంగా జెండా పాతడానికి ఇది మంచి అవకాశం. మరి, కొద్దిమంది ఎమ్మెల్యేలతోనే సీఎం అయిన శిందే చివరకు బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మిగిలిపోతారా? లేక శివసేనను నిలబెట్టి, తనకంటూ బలమైన కార్యకర్తలను నిర్మించుకుంటారా? 2014లో పూర్తికాలం పాటు, 2019లో కొద్దిరోజులే సీఎంగా పనిచేసి, ఇప్పుడు అధిష్ఠానం ఆదేశం మేరకు అనాసక్తంగానే డిప్యూటీ సీఎం అయిన ఫడ్నవీస్‌ మనస్ఫూర్తిగా జూనియర్‌ కింద పనిచేస్తారా? రాజకీయ చతురుడు శరద్‌ పవార్‌ ఏం చేయనున్నారు? మహా రాజకీయ థ్రిల్లర్‌ సిరీస్‌లో తరువాతి అధ్యాయం అదే! 

మరిన్ని వార్తలు