Covid Alert: మళ్ళీ ప్రమాదఘంటికలు

22 Dec, 2022 00:16 IST|Sakshi

ఒకరికి తెద్దునా... ఇద్దరికి తెద్దునా... అందరికీ తెద్దునా అని జనవ్యవహారం. చైనా తప్పిదాలతో కరోనా మళ్ళీ దేశదేశాల్లో కోరలు సాచే ప్రమాదం కనిపిస్తోంది. నిన్నటి దాకా కఠిన నిబంధనలు, లాక్‌డౌన్లు, సామూహిక పరీక్షలతో జీరో–కోవిడ్‌ విధానాన్ని అనుసరించిన చైనా గత నెలలో జనా గ్రహంతో హఠాత్తుగా ఆంక్షలు సడలించేసరికి పరిస్థితి అతలాకుతలమైంది. కేసులు, మరణాలు ఒక్కసారిగా పెరిగి, ఆస్పత్రులు చేతులెత్తేశాయి. ఫార్మసీల్లో మందులు ఖాళీ. శవాల గుట్టలతో శ్మశా నాల్లో తీరిక లేని పని.

జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్‌లోనూ కేసులు ఉన్నట్టుండి పెరుగుతుండ డంతో, భారత్‌ అప్రమత్తమైంది. కరోనా పాజిటివ్‌ నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ జరిపి, కొత్త వేరియంట్లపై కన్నేయాలని భారత సర్కార్‌ ఆదేశించడం సరైన చర్య. ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి సమీక్షాసమావేశంతో అప్రమత్తత బావుంది. కాకపోతే, 80 కోట్ల చైనీయులకు కొత్తగా కరోనా సోకే ముప్పు, లక్షలాది మరణాల అంచనా, భారత్‌లో కరోనా చాటు రాజకీయాలే ఆందోళనకరం. 

కరోనా విషయంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సురక్షితం కానంత వరకు, ఏ ఒక్కరూ సురక్షితం కానట్టే. ఏ ఒక్కరు అజాగ్రత్తగా ఉన్నా, ఇట్టే వ్యాపించే ఈ మహమ్మారితో ప్రతి ఒక్కరికీ ముప్పే. ఇది రెండేళ్ళుగా వైద్యనిపుణులు ఘోషిస్తున్న మాట. కానీ, చైనా మూర్ఖత్వం ఇవాళ మిగతా ప్రపంచానికి శాపమైంది. కరోనా నియంత్రణలో పాశ్చాత్య ప్రపంచం కన్నా తామే గొప్ప అని చైనా చెప్పుకుంటూ వచ్చింది. పొరుగున భారత్‌ సహా ప్రజాస్వామ్య ప్రపంచమంతా అనుసరిస్తున్న పద్ధతులకు భిన్నంగా లోపభూయిష్ఠ ‘జీరో–కోవిడ్‌’ విధానాన్ని చైనీయులపై బలవంతాన రుద్దింది.

తొలినాళ్ళలో అది ఫలితమిచ్చినా, టీకాలతో, లాక్‌డౌన్లు ఎత్తేసి జీవనం సాగించడమే ప్రత్యామ్నా యమని ప్రజలకు వివరించడం నిరంకుశ సర్కారుకు కష్టమైపోయింది. తీరా ప్రత్యామ్నాయ వ్యూహం కానీ, క్రమంగా సాధారణ పరిస్థితి తేవడం కానీ చేయక ఒక్కసారిగా ఆంక్షల గేట్లు ఎత్తేయడం ఘోర తప్పిదమైంది. ఒక్క నెలలో 10 లక్షల పైగా కేసులు బయటపడ్డాయి.  మూడేళ్ళ క్రితం ప్రపంచానికి కరోనాను అంటించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న చైనా నేటికీ ఆ మహమ్మారి నుంచి బయటకు రాలేకపోవడం విధి వైచిత్రి.

ఈ దుఃస్థితికి స్వయంకృతాపరాధాలే కారణం. అతి జాతీయవాదంతో దేశీయంగా తయారైన టీకాలనే చైనా వాడడం, తీరా అవి సమర్థంగా పనిచేయకపోవడం, ఇప్పటికీ చైనా జనాభాలో అధిక శాతం మందికి టీకాకరణ జరగకపోవడం, వాస్తవాలను బయట పెట్టకపోవడం – ఇలా చైనా చేసిన తప్పులు అన్నీ ఇన్నీ కావు. మూడేళ్ళలో మూడు ప్రధాన కరోనా వేవ్‌లు చూసిన పొరుగు దేశం భారత్‌ ఈ విషయంలో మెరుగ్గా వ్యవహరించింది. శాస్త్రీయ శోధనకు ప్రభుత్వ సహకారం, దేశీయ టీకాల పనితనం, దేశవ్యాప్తంగా ఉద్యమస్థాయిలో టీకాకరణ, పలు విమర్శ లున్నా కోవాగ్జిన్‌ను ప్రోత్సహించడం కలిసొచ్చాయి. 

అయితే, మన దగ్గర కరోనా రాజకీయాలకూ కొదవ లేదు. తాజా కరోనా భయాన్ని సైతం అధికారపక్షమైన బీజేపీ రాజకీయాలకు వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ 100 రోజుల పైగా చేస్తున్న ‘భారత్‌ జోడో యాత్ర’కు బాణం గురి పెట్టింది. విమానయానాలు సహా దేశమంతటా కరోనా నిబంధనలపై మాట్లాడని కేంద్ర వైద్య మంత్రి తీరా త్వరలో దేశ రాజధానికి చేరనున్న ప్రతిపక్ష నేత పాదయాత్రకు కోవిడ్‌ ప్రోటోకాల్‌ సాకుతో లేఖ రాయడం చిత్రమే. ‘టీకాలు వేసుకున్నవారే రాహుల్‌తో యాత్ర చేయాలి, యాత్ర చేసినవారు ఐసొలేషన్‌లో ఉండా’లంటున్న పెద్దలు రాజస్థాన్, కర్ణాటకల్లో బీజేపీ యాత్రలను మాత్రం విస్మరించడమేమిటి? కేంద్రం కరోనా మార్గదర్శకాలివ్వాల్సింది యావత్‌ భారత్‌కే తప్ప ఒక్క భారత్‌ జోడో యాత్రకు కాదు. 

చైనాలో విస్తృతంగా వ్యాపిస్తూ, సంక్షోభం సృష్టిస్తున్న బీఎఫ్‌.7 కరోనా వేరియంట్‌ ఇప్పటికే గుజరాత్‌లో బయటపడింది. అలాగే, టీకా వేసుకున్నా ఈ ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ సోకడం ఆగట్లేదట. ఈ మాటలు ఆందోళనకరమే. అయితే, 2021 మధ్యలో మన దేశంలో సంక్షోభం రేపిన డెల్టా వేరియంట్‌తో పోలిస్తే, ఈ ఏడాది మొదటి నుంచి మన దగ్గరున్న ఒమిక్రాన్‌ ఆ స్థాయి కల్లోలం రేపలేదు.

ఆ మాటకొస్తే ఈ ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ బీఎఫ్‌.7 భారత్‌లో సెప్టెంబర్‌ నుంచే ఉందని కథనం. మనకు సహజ వ్యాధినిరోధకతా వచ్చింది. దేశంలో పెరిగిన కరోనా వైద్య వసతుల రీత్యా మనం మరీ బెంబేలెత్తాల్సిన పని లేదు. కానీ మాస్క్‌ధారణ, గుంపులకు దూరంగా ఉండడం, భౌతిక దూరం, చేతులకు శానిటైజర్‌ లాంటి ప్రాథమిక జాగ్రత్తలను మళ్ళీ ఆశ్రయించక తప్పదు. 

చైనా దెబ్బతో కొత్త వేరియంట్లు తలెత్తే ముప్పుంది. గతంలో చైనాలో కరోనా మొదలైనప్పుడు అలక్ష్యం చేసి, మనతో సహా ప్రపంచం పీకల మీదకు తెచ్చుకుంది. ప్రస్తుతానికి మన పరిస్థితి బాగున్నా రానున్న సెలవులు, పెరగనున్న పర్యటనలతో అప్రమత్తత కీలకం. కరోనా పరీక్షలు పెంచి, కొత్త వేరియంట్లపై కన్నేసి ఉంచాలి. కరోనా టెస్టింగ్, కేసుల ట్రేసింగ్, ట్రీటింగే ఇప్పటికీ మహా మంత్రం.

దేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరే బూస్టర్‌ డోస్‌ వేయించుకున్నందున ప్రభుత్వం ప్రజల్ని చైతన్యపరిచి, ప్రోత్సహించడం అవసరం. ఏమైనా, ఒక విషయం తప్పక గుర్తుంచు కోవాలి... కరోనా కథ ఇంకా కంచికి చేరలేదు. మన జాగ్రత్తే మనకు రక్ష. ప్రమాదఘంటికలు మోగుతున్న వేళ అవసరానికి మించి సంసిద్ధంగా ఉన్నా తప్పు లేదు కానీ... అత్యవసరమైనదాని కన్నా తక్కువ సిద్ధపడితేనే తిప్పలు – అది ప్రభుత్వానికైనా, ప్రజలకైనా! 

మరిన్ని వార్తలు