నోళ్లు తెరిచిన జైళ్లు

15 Feb, 2022 00:46 IST|Sakshi

క్రిమినల్‌ కేసుల్లో అసలైన దోషులను గుర్తించి శిక్షించడానికీ, అమాయకులకు న్యాయం అందించేం దుకూ న్యాయస్థానాలు సాగించే సుదీర్ఘ విచారణల పర్యవసానంగా జైళ్లు కిక్కిరిసి ఉంటున్నాయని మానవ హక్కుల సంఘాలు మాత్రమే కాదు... సుప్రీంకోర్టు సైతం అనేక సందర్భాల్లో చెప్పింది. కానీ ఈ పోకడ ఉన్నకొద్దీ ఉగ్రరూపం దాలుస్తున్నదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

పదేళ్లక్రితం వరకూ మొత్తం ఖైదీల్లో విచారణ ఖైదీల శాతం సగటున అత్యధికంగా 65 వరకూ ఉండగా, ఇప్పుడది 76 శాతానికి పెరిగిందని ఆ గణాంకాలు వివరిస్తున్నాయి. లెక్కకుమించి ఖైదీలను జైళ్లలో కుక్కితే సంస్కరణాలయాలు కావలసిన ఆ కారాగారాలు కాస్తా పశువుల కొట్టాలుగా మారతాయనీ, సరికొత్త నేరగాళ్లు పుట్టుకొచ్చేందుకు అవి దోహదపడతాయనీ పాలకులు గుర్తించకపోవడం విచారకరం.

ఒకపక్క కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా విలయం సృష్టిస్తోంది. పర్యవసానంగా అన్ని విభాగాల పనితీరూ కుంటుబడింది. అవి పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి అనువైన పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. న్యాయవ్యవస్థ సైతం అనివార్యంగా సమస్యలను ఎదుర్కొనక తప్పడం లేదు. సహజం గానే జైళ్లపై దీని ప్రభావం పడుతోంది. శిక్ష పూర్తయి జైలు నుంచి విడుదలయ్యేవారితో పోలిస్తే కొత్తగా కేసుల్లో ఇరుక్కుని జైలుపాలవుతున్న వారి సంఖ్య 2020 తర్వాత తీవ్రంగా పెరిగిందని జాతీయ క్రైమ్‌ రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ)లోని గణాంకాల ఆధారంగా ‘ఇండియా జస్టిస్‌ రిపోర్టు’ నివేదిక నిర్ధారించింది.

దాని ప్రకారం ఢిల్లీ జైళ్లలో 2019లో విచారణ ఖైదీలు 82 శాతం ఉండగా, మరుసటి సంవత్సరానికి అది 90.7 శాతమైంది. జమ్మూ కశ్మీర్‌లో 83.4 శాతం నుంచి 90.5 శాతానికి పెరిగింది. అంతక్రితం ఎంతో కొంత మెరుగ్గా ఉన్న పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్‌ లలో విచారణలో ఉన్న ఖైదీల శాతం గణనీయంగా పెరిగింది. పంజాబ్‌లో 2019లో విచారణ ఖైదీలు 66 శాతం ఉండగా, అది కాస్తా 85 శాతమైంది. హరియాణాలో 64.4 నుంచి 82 శాతానికి, మధ్యప్రదేశ్‌లో 54.2 నుంచి 70 శాతానికి పెరిగింది. నిజానికి ఈ గణాంకాలన్నీ 2020 నాటి లెక్కలు. ఆ సంవత్సరం న్యాయస్థానాలు సైతం సరిగా పనిచేసే పరిస్థితులు లేకపోవడం వల్ల విచారణలు మందగించాయి. ఆ తర్వాతైనా పెద్దగా మెరుగుపడింది లేదు గనుక ఈ సంఖ్య ఇంకా పెరిగి ఉండొచ్చు.

కొన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ విచారణలు జరపడం వల్ల కొంత ప్రయోజనం కనబడిన మాట వాస్తవమే. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 188 అమలు చేయడంతో కేసుల సంఖ్య అపారంగా పెరిగింది. 2019తో పోలిస్తే 2020లో అదనంగా 16,43,690 కేసులు నమోదయ్యాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వాస్తవంగా శిక్షార్హమైన వారెందరో, అమాయకులెవరో తేల్చడం న్యాయ వ్యవస్థకు తలకుమించిన పని.

పరిమితికి మించి ఖైదీలుండటం వల్ల సాధారణ పరిస్థితుల్లోనే జైళ్లలో ఎన్నో సమస్యలేర్పడ తాయి. కరోనా వంటి మహమ్మారి విరుచుకుపడినప్పుడు ఆ సమస్యలు మరింత ఉగ్రరూపం దాల్చడంలో ఆశ్చర్యంలేదు. ఏళ్ల తరబడి విచారణలు కొనసాగుతుండటం వల్ల 200 శాతానికి మించి ఖైదీలున్న జైళ్లు కూడా ఎన్నో ఉన్నాయి.  అలాంటిచోట కరోనాను అరికట్టేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం సాధ్యమేనా? కారాగారాల్లో కరోనా విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నా మని ప్రభుత్వాలు చెబుతూనే వచ్చాయి. క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి, కొత్తగా వచ్చిన ఖైదీలను కొన్ని రోజులపాటు అక్కడ ఉంచటం, జైలు మాన్యువల్‌ అమలును ఆపి, విజిటర్స్‌ రాకుండా కట్టడి చేయడం అందులో కొన్ని.

కానీ ఖైదీల మానవ హక్కులు ఆవిరికావడం మినహా వీటి వల్ల కలిగే ప్రయోజనం శూన్యం. న్యాయవాదులుగానీ, వారి బంధువులుగానీ నేరుగా ఖైదీలను కలిసే అవకాశాలు తగ్గిపోయాయి. లాకప్‌ డెత్‌లు, అసహజ మరణాల విషయంలో అంతకుముం దున్న జవాబుదారీతనం కూడా అడుగంటింది. కనుకనే 2020లో లాకప్‌ డెత్‌లు ఏడు శాతం పెరగ్గా, ఆత్మహత్యలు, ప్రమాదాలు, హత్యలు వంటి అసహజ మరణాలు 18.1 శాతం హెచ్చయ్యాయి. తగినన్ని అధికారాలున్న స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆరా తీస్తే మన జైళ్లలో ఎంతటి దారుణమైన పరిస్థితులున్నాయో వెల్లడవుతుంది.

దేశమంతా లాక్‌డౌన్‌ అమలైన కాలంలో సర్వోన్నత న్యాయస్థానం ఒక ముఖ్యమైన సూచన చేసింది. రాష్ట్రాల్లో అత్యున్నత స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి, ఖైదీల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నది దాని సారాంశం. అందువల్ల విడుదలైనవారి శాతం అంతకుముందుతో పోలిస్తే మెరుగైంది. కానీ ఆరోగ్యపరమైన కారణాలు, పెద్ద వయసు, జండర్‌ వంటి ప్రాతిపదికలు కాక, ఖైదీల విడుదలను పాలనాపరమైన వ్యవహారంగా కమిటీలు పరిగణించడంవల్ల పెద్దగా ప్రయోజనం కలగలేదు. పరిమితికి మించి ఖైదీలుండటం, అదే సమయంలో తగినంతగా సిబ్బంది లేకపోవడం జైళ్లలో అవినీతికి, అమానవీయతకు, ఇతర వైపరీత్యాలకూ దారితీస్తోంది.

జైళ్లు సంస్కర ణాలయాలని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నా అందులో చిత్రహింసలు విడదీయరాని భాగమని ‘డిసిప్లిన్‌ అండ్‌ పనిష్‌: ద బర్త్‌ ఆఫ్‌ ద ప్రిజన్‌’ పుస్తకంలో మైఖేల్‌ ఫాకల్ట్‌ అంటాడు. మనిషిలో అమానవీయతను పెంచి, నేర ప్రవృత్తికి అలవాటు చేసే జైళ్ల స్థితిగతులను చక్కదిద్దడానికి సిబ్బందిని పెంచడం, పటిష్టమైన పర్యవేక్షణ ఉండేలా చూడటం, జవాబుదారీతనాన్ని పునఃప్రతిష్టించడం కీలకం. వీటిపై న్యాయస్థానాలు, ప్రభుత్వాలు దృష్టి సారించడం తక్షణావసరం.

మరిన్ని వార్తలు