సమయానికి దక్కిన సదవకాశం

10 Nov, 2022 00:33 IST|Sakshi

ఇప్పటికీ వెంటాడుతున్న కరోనా కష్టాలు... పెరుగుతున్న భౌగోళిక– రాజకీయ ఉద్రిక్తతలు... అంతూపొంతూ లేని రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం... పెరుగుతున్న చైనా దూకుడు... ప్రపంచం సంక్షోభాలతో నిండిన సంధికాలమిది. ఈ సమయంలో అందివచ్చిన అవకాశమంటే ఇదే. అంతర్జా తీయ ఆర్థిక సహకారంలో కీలకమైన 20 దేశాల కూటమి ‘జీ20’కి ఏడాది పాటు భారత్‌ పగ్గాలు చేపట్టనుంది. తొలిసారి దక్కిన పట్టం సంతోషదాయకమే కాక ప్రపంచపటంపై అవిస్మరణీయ నేతగా ఎదుగుతున్న మన సత్తాను చాటేందుకు సరైన సందర్భం. ఏడాదిగా ఇండోనేసియా, ఇప్పుడు ఇండియా, తర్వాత బ్రెజిల్‌ – మూడు ప్రవర్ధమాన ఆర్థిక వ్యవస్థలు 2022 నుంచి 2024 దాకా జీ20కి సారథ్యం వహిస్తుండడం విశేషం. గ్లోబల్‌ సౌత్‌ దేశాల ఆందోళనలను తీర్చడానికి ఇది సదవకాశం.

ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఈ 20 దేశాల కూటమి 1999లో ఏర్పడింది. భారత్‌తో పాటు చైనా, అమెరికా, రష్యా, బ్రిటన్, ఐరోపా సమాజం, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, సౌదీ అరేబియా, సౌతాఫ్రికా, టర్కీలు దీనిలో సభ్యదేశాలు. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది ఈ దేశాల ప్రజలే. ప్రపంచ భూభాగంలో 50 శాతం ఈ దేశాల కిందకే వస్తుంది. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 80 శాతానికి పైగా ఈ దేశాల వాటాయే. అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం వీటిదే. జీ20 కీలకమనేది అందుకే. 2008లో ఆర్థిక మాంద్యం తర్వాత నుంచి ఈ దేశాలు ఏటా సమావేశమవుతూ, వంతుల వారీగా అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్నాయి. చర్చల ద్వారా ప్రపంచ ఆర్థిక, అభివృద్ధి ప్రాధాన్యాలను తీర్చిదిద్దే పనిని శక్తిమంతమైన ఈ అంతర్జాతీయ వేదిక భుజానికి ఎత్తుకుంది. అలాగే, వర్తమాన సంక్షోభాలకు పరిష్కారాల దిశగా ప్రయత్నిస్తుంది. ఈ కీలక కూటమికి ఈ డిసెంబర్‌ 1 నుంచి ఏడాది పాటు భారత్‌ అధ్యక్షత వహించనుంది.

జీ20 భారత సారథ్యానికి సంబంధించి ప్రధాని మోదీ కమలం చిహ్నాన్నీ, ‘వసుధైవ కుటుం బకం’ అంటూ ‘ఒకే పుడమి, ఒకే కుటుంబం, ఒకటే భవిత’ అనే ఇతివృత్తాన్నీ, ప్రత్యేక వెబ్‌సైట్‌నూ మంగళవారం ఆవిష్కరించారు. బీజేపీ ఎన్నికల చిహ్నమైన కమలాన్ని పోలి ఉంటూ, అదే కాషాయ, హరిత వర్ణాలతో ఆ లోగో ఉండడం సహజంగానే ప్రతిపక్షాల విమర్శలకు గురవుతోంది. అది జాతీయ పుష్పమైన కమలమనీ, ఆశావహ దృక్పథానికి గుర్తుగా పెట్టామనీ పాలక వర్గాలు ఎంత సమర్థించుకోవాలని చూస్తున్నా, వాడిన రంగులతో సహా అనేక అంశాల్లో విమర్శలకు తావివ్వకుండా ఉండాల్సింది. కరోనా టీకా సర్టిఫికెట్లపై ఫోటో ప్రచారం, పార్లమెంట్‌పై ఉగ్రసింహాల చిహ్నం లాంటివి ఒక స్థాయికే పరిమితం. కానీ, ప్రపంచవేదికపై దేశ ప్రతిష్ఠను నిలపాల్సిన వేళ చిల్లర రాజకీయాలకు చోటివ్వకపోవడమే ఎవరికైనా శోభస్కరం. నిత్యం మాటల మార్కెటింగ్‌ కన్నా, నిజానికి జీ20 సారథిగా భారత్‌కు చేయడానికి చాలా పని ఉంది. స్వీయ అధ్యక్షతన దాదాపు 32 రంగాలపై జరిగే 200 సమావేశాలకు స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోవడం కీలకం.

ఈ డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది నవంబర్‌ 30 వరకు జీ20 సారథిగా దక్కిన అవకాశాన్ని భారత్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం జీ20కి నేతృత్వం వహిస్తున్న ఇండోనేసియా ప్రపంచ ఆరోగ్య నిర్మాణ వ్యవస్థ, డిజిటల్‌ రూపాంతరీకరణ, సుస్థిర ఇంధన మార్పు అనే మూడింటిని ప్రాధాన్యాలుగా ఎంచుకుంది. రేపు ఆ దేశం నుంచి పగ్గాలు అందుకొనే భారత్‌ ఆ ప్రాధాన్యాలను కొనసాగేలా చూడాలి. పర్యావరణ పరిరక్షణకు కార్యాచరణ, ఇంధన భద్రత, మరింత పటిష్ఠమైన ప్రజారోగ్య వ్యవస్థలు, ప్రజా శ్రేయానికి సాంకేతిక విజ్ఞానం, 2030 నాటికి నిర్దేశించుకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీల)పై దృష్టి పెట్టాలి. నిర్మాణాత్మకమైన నాయకత్వం అందించాలి. ముఖ్యంగా నవోదయ, పేద దేశాలకు అనుకూల అజెండాను నిర్ణయించేలా తన అధ్యక్ష హోదాను వినియోగించాలి. ప్రత్యేకించి, వ్యవసాయం, ఆహార సబ్సిడీల్లో వర్ధమాన దేశాలకు వ్యతిరేకంగా దీర్ఘకాలంగా ఉన్న వ్యత్యాసాలను సరిదిద్దడానికీ భారత్‌కు ఇదే సువర్ణావకాశం.

జీ20లోని అభివృద్ధి చెందిన దేశాలు సాధారణంగా సబ్సిడీ లాంటి అంశాలపై వర్ధమాన దేశాల్ని ఇరుకునపెడుతుంటాయి. భారత్‌ వాటికి తమ స్వస్వరూపం తెలిసేలా వాస్తవ దర్పణం చూపాలి. వాతావరణ మార్పు ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతున్న నేపథ్యంలో కర్బన ఉద్గారాలు, పునరుద్ధ రణీయ ఇంధనం విషయంలో పెట్టుకున్న లక్ష్యాలకు కట్టుబడి ఉండేలా, వర్ధమాన ప్రపంచానికి ఇచ్చిన హామీలను నెరవేర్చేలా అభివృద్ధి చెందిన దేశాలపై భారత్‌ ఒత్తిడి తేవాలి.

అలాగే, రష్యా, ఉక్రెయిన్‌ల యుద్ధం ముగిసేలా మధ్యవర్తిత్వ పాత్ర పోషించవచ్చు. ‘నాటో’లో ఉక్రెయిన్‌ సభ్యత్వ అంశాన్ని ప్రస్తుతానికి ఆపమంటూ పాశ్చాత్య ప్రపంచాన్ని కోరాలి. సేనల్ని ఉప సంహరించుకొని, దౌత్యమార్గంలో సమస్యల్ని పరిష్కరించుకొనేలా రష్యాను అభ్యర్థించాలి. ఇటు రష్యాతో, అటు పాశ్చాత్య ప్రపంచంతో బలమైన సంబంధాలున్న మన దేశం అలా ప్రస్తుత ప్రతిష్టం భనను తొలగించేందుకు తోడ్పడాలి. తాజాగా తన రష్యా సహచరుడితో భేటీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ అన్నట్టు ప్రపంచం ఇప్పుడు బహుళ ధ్రువమవుతూ, కొత్త సమతూకం సాధించే దిశగా నడుస్తోంది. ఈ కీలకవేళ జీ20తో పాటు వచ్చే ఏడాది షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) సారథ్యమూ చేపట్టనున్న భారత్‌ ప్రపంచపటంపై కొత్త చరిత్ర లిఖిస్తే అంతకన్నా ఇంకేం కావాలి!

మరిన్ని వార్తలు