మన చేతుల్లోనే... చేతల్లోనే...

25 Jan, 2022 00:20 IST|Sakshi

ఒక దుర్వార్త... ఆ వెంటనే ఓ శుభవార్త. కరోనాపై దేశంలో తాజాగా వినిపిస్తున్న విషయాలివి. విజృంభిస్తున్న కరోనా మూడోవేవ్‌కు కారణమైన ఒమిక్రాన్‌ ఇప్పుడు సామాజిక వ్యాప్తి దశలో ఉందని ‘ఇన్సాకాగ్‌’ (ఇండియన్‌ సార్స్‌–కోవ్‌2 జీనోమిక్స్‌ సీక్వెన్సింగ్‌ కన్సార్టియమ్‌) ఆదివారం హెచ్చరించింది. కరోనా ప్రమాద స్థాయి ఇప్పటికీ అలానే ఉందనీ అప్రమత్తం చేస్తోంది. ఇది ఎవరూ ఇష్టపడని వార్త. కాగా, భయపెడుతున్న ఈ థర్డ్‌ వేవ్‌కు ఫిబ్రవరి మధ్యకల్లా తెరపడుతుందని ప్రభుత్వ వర్గాల తాజా మాట. ప్రతి ఇంటా ఒకరికి ఇద్దరు జ్వరం, జలుబు లాంటి కరోనా లక్షణా లతో బాధ పడుతున్న వేళ ఇది చెవికి ఇంపైన మాట. రానున్న పక్షం రోజుల్లో ఈ వేవ్‌ తారస్థాయికి చేరుతుందనే ఐఐటీ మద్రాసు ప్రాథమిక అంచనాతో అప్రమత్తత తప్పనిసరి అని అర్థమవుతోంది. 

గత తొమ్మిదివారాల్లో ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది ఒమిక్రాన్‌ బారినపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) లెక్క. 170కి పైగా దేశాలకు పాకిన ఈ వేరియంట్, వేవ్‌ విస్తృతికి ఇదే ఉదాహరణ. అలాగే, ఒమిక్రాన్‌ పోతే ఇక ప్రపంచానికి కరోనా పీడ విరగడ అయినట్టేనని అందరిలో నెలకొంటున్న ఉదాసీనత పెద్ద పొరపాటు. ఒమిక్రాన్‌ తర్వాత మరిన్ని కొత్త వేరియంట్లు రావ చ్చంటూ డబ్యూహెచ్‌ఓ చేసిన తాజా ప్రకటన ఓ పారాహుషార్‌.

మన దేశంలో ఇప్పటికీ రోజుకు 3 లక్షల కేసుల పైనే వస్తున్నాయి. పాజిటివిటీ రేటు 20కి పైనే ఉంది. ఢిల్లీ, ముంబయ్‌ లాంటి నగరాల్లో ముందుగానే తడాఖా చూపిన థర్డ్‌ వేవ్‌ అక్కడ కాస్తంత తగ్గుముఖం పట్టినా, దేశంలోని పలుచోట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు విస్తరిస్తూ ఉండడం ఆందోళనకరం. వేర్వేరు భౌగోళిక పరిస్థితులున్న విశాల భారతావనిలో అంతటా ఒకేసారి కరోనా ఉద్ధృతి కనిపించి, ఒకేసారి తగ్గి పోదనే విషయం గమనంలో ఉంచుకోవడం అవసరం.  

పెరుగుతున్న కేసులతో వైద్యం మొదలు అన్ని రంగాల్లో సిబ్బంది తగ్గి, పని ఒత్తిడి పెరుగు తుండడం మరో పెద్ద చిక్కు. ఒక పక్క డెల్టా ప్రభావం పూర్తిగా పోలేదనీ, నూటికి 10 – 20 కేసులు ఆ వేరియంట్‌వీ ఉన్నాయనీ ఓ అంచనా. డెల్టా ఉండగానే ఒమిక్రాన్‌ విరుచుకుపడుతోంది గనక రెండిందాలా జాగ్రత్త తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ దేశంలో ఇప్పటికి 162 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు వేయడం సంతోషకరం. దేశంలో 15 ఏళ్ళ పైబడినవారిలో ఇప్పటికి 67.2 శాతం మందికి పూర్తిగా, 91.3 శాతం మందికి కనీసం ఒక డోసు వేసినట్టు లెక్క. కానీ, దురదృష్టవశాత్తూ లోటుపాట్లూ లేకపోలేదు. తొలి డోసే వేస్తున్నా, రెండో డోసు టీకా వేస్తున్నట్టు సర్టిఫికెట్లలో నమోదు చేయడం లాంటి వార్తలు రాజధానుల్లో సైతం రావడం నివ్వెరపరుస్తోంది. చిత్తశుద్ధి లేకుండా లెక్క ల్లోనే టీకా డోసులు చూపించడమనే తప్పిదానికి పాల్పడితే, అది మొదటికే మోసం తెస్తుంది. ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకుంటే తప్ప, ఏ ఒక్కరూ సురక్షితం కాదని ప్రపంచమే ఘోషిస్తున్న వేళ కాకి లెక్కలకు దిగితే కష్టం. జనాన్ని మోసం చేయచ్చేమో కానీ, జాలి లేని మహమ్మారిని మోసం చేయలేం.  

జీవనం దెబ్బతినకుండా ప్రజల్లో, ఆర్థిక వ్యవస్థలో ధైర్యం కలిగించాల్సింది పాలకులైతే, మహమ్మారిని సైతం జయించగలమని ఆత్మవిశ్వాసం ప్రోది చేయాల్సింది వైద్యనిపుణులు. రోజుకో మాట, పూటకో రకం ప్రోటోకాల్‌... సందేహాలకు దారి తీస్తున్నాయి. మోల్నుపిరావర్‌ లాంటి ఔష ధాల వాడకంపై వచ్చిన పరస్పర భిన్నమైన ఆదేశాలే అందుకు నిదర్శనం. కోట్ల జనాభా కారణంగా రోగానికి సత్వర చికిత్సపై పరిశోధకులపై ఒత్తిడి ఉండడం సహజమే కానీ, పరిశోధనా ఫలితాలు మన అవసరాలకు తగ్గట్టుగానే ఉండాలని ఒత్తిడి పెడితే సరి కాదు.

సెకండ్‌ వేవ్‌లో లాగా థర్డ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ అవసరం రాకపోవడం సంతోషించాల్సిందే. కానీ, ఒమిక్రాన్‌ సాధారణ జ్వరం – జలుబు లాంటిదేననీ, మహమ్మారి కాస్తా మామూలు జలుబులా మారిపోతోందనీ అతి ప్రచారం నిర్లక్ష్యానికి బాటలు వేస్తోంది. పాక్షిక నిజమైన ఆ ప్రచారాన్ని పట్టుకొని, అశ్రద్ధ చూపితే అది ప్రమాదమని నిపుణుల మాట. మరి, ఈ సీరియస్‌ విషయం జనంలోకి మొదటి ప్రచారమంత బలంగా వెళుతోందా అన్నది ప్రశ్న. తొందరపడి ముందే కూసిన కోయిలలా చేస్తే కష్టం, నష్టం మనకే! 

మన దేశంలో కరోనా మొదటి వేవ్‌కు కారణమైన ఆల్ఫా వేరియంట్‌ కన్నా, రెండో వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్‌ తీవ్రత ఎక్కువ చూపింది. 18 ఉత్పరివర్తనాలున్న డెల్టాతో పోలిస్తే, 50 మ్యుటేషన్లున్న ఒమిక్రాన్‌ 70 రెట్లు అధికంగా వ్యాపిస్తోంది. ఇప్పుడు ఒమిక్రాన్‌తో ప్రాణహాని లేదని నిర్లక్ష్యంగా తిరిగి, వ్యాప్తిని పెరగనిస్తే చిక్కే. ఒమిక్రాన్‌ నుంచి కొత్త వేరియంట్లు తలెత్తే ప్రమాదం ఉంది. టీకా వేసుకున్నా సరే దెబ్బ కొడుతున్న ఒమిక్రాన్‌తో పోలిస్తే, ఆ కొత్తవి మునుపటి డెల్టాలా తీవ్రమైనవి కావచ్చని వైద్యుల హెచ్చరిక. అందుకే, థర్డ్‌ వేవ్‌ విజృంభణ వేళ అలకు ఎదురెళ్ళ కుండా, తల వంచుకొని తప్పించుకోవాలి.

చేజేతులా కొత్త వేరియంట్‌కు కారణం కారాదు. కరోనా అనంతర దీర్ఘకాలిక కోవిడ్‌ ఇబ్బందులుంటాయనీ విస్మరించరాదు. కరోనా లెక్కల్లో మనం ఒక అంకె మాత్రమే. కానీ, మన కుటుంబానికి... మనమే సర్వస్వం. తోటివారి పట్ల కూడా బాధ్యతతో కరోనా జాగ్రత్తలు పాటించడమే ప్రస్తుత కర్తవ్యం. ఆఫ్రికాలోని కెన్యా, నైజీరియా లాంటి మధ్యాదాయ దేశాల్లో సైతం టీకాకరణ 10 శాతం లోపలే అయింది. ఈ ఏడాది మధ్యకల్లా ప్రతి దేశంలో కనీసం 70 శాతం జనాభాకు టీకాలేయడం పూర్తయితేనే, ప్రపంచ ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ సురక్షితం!

మరిన్ని వార్తలు