పశ్చిమాసియా శాంతికి ముప్పు

1 Dec, 2020 00:44 IST|Sakshi

అమెరికాలో రిపబ్లికన్ల నుంచి డెమొక్రాటిక్‌ పార్టీకి అధికార మార్పిడి ఖాయమని తేలిన తరుణంలోనే ఇరాన్‌లో అత్యున్నతస్థాయి అణు శాస్త్రవేత్త మొహసెన్‌ ఫక్రిజాదేను శుక్రవారం దేశ రాజధాని టెహ రాన్‌లో కొందరు దుండగులు కాల్చి చంపారు. ఇరాన్‌ శాస్త్రవేత్తలపై దాడులు మొదటిసారి కాదు. పదేళ్లుగా అవి కొనసాగుతూనే వున్నాయి. ఫక్రిజాదేతోపాటు ఆయన సహచరులు గతంలో ఇదే తరహాలో దుండగులకు లక్ష్యంగా మారారు. ఈ దాడుల సూత్రధారులు ఒకరే అని సందేహం కలి గేలా అవన్నీ ఎప్పుడూ ఒకే తీరులో వుంటాయి. టెహరాన్‌లో శాస్త్రవేత్తలు తమ విధులు ముగిం చుకుని కారులో ఇంటికెళ్తుండగా హఠాత్తుగా విరుచుకుపడి దాడి చేయడం, అంతే వేగంతో మటు మాయం కావడం రివాజుగా వస్తోంది. నలుగురు శాస్త్రవేత్తలు ఆ దాడుల్లో మరణిస్తే ఫక్రిజాదే ఒక్కరే సురక్షితంగా బయటపడ్డారు.

కానీ ఈసారి మాత్రం ఆయన దుండగుల తూటాలను తప్పించు కోలేకపోయారు. ఆయన అత్యున్నత శ్రేణి శాస్త్రవేత్త మాత్రమే కాదు... కీలకమైన ఇరాన్‌ రివల్యూ షనరీ గార్డ్స్‌లో బ్రిగేడియర్‌ జనరల్‌ స్థాయి అధికారి కూడా. పరిశోధనలు మొదలుకొని క్షిపణుల్లో ఇమిడిపోయే అణ్వస్త్రాల రూపకల్పన వరకూ ఉన్న భిన్న ప్రక్రియలకు సంబంధించి వేర్వేరుచోట్ల జరిగే పనులను ఆయన సమన్వయం చేస్తున్నారు. అందుకే అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు చాన్నా ళ్లుగా ఆయనపై గురిపెట్టాయి. వాటి ఒత్తిడి వల్ల కావొచ్చు... ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పని చేసే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) కూడా ఫక్రిజాదేతో మాట్లాడటానికి అనుమతించమని చాలాసార్లు ఇరాన్‌ ప్రభుత్వాన్ని కోరింది. అందుకు ఇరాన్‌ అంగీకరించలేదు. 

చూడటానికి ఇరాన్‌లో నిఘా వ్యవస్థ గట్టిగానే పనిచేస్తున్నట్టు కనబడుతుంది. గూఢచారులన్న అనుమానంతో అడపా దడపా విదేశీయుల్ని, స్థానికుల్ని అరెస్టు చేయడం...విచారణ జరిపి శిక్షించడం జరుగుతూనే వుంటుంది.  కానీ పైకి కనబడేంత పటిష్టంగా ఆ వ్యవస్థ లేదని తరచు జరిగే దాడులు నిరూపిస్తున్నాయి. అణు కార్యక్రమాన్ని చాలా దగ్గరనుంచి పర్యవేక్షించేవారికి తప్ప అందులో పాలుపంచుకునే శాస్త్రవేత్తల పేర్లు, వారి ఇతర వివరాలు సాధారణ పౌరులకు తెలిసే అవకాశం లేదు. తరచుగా జరుగుతున్న దాడులు గమనిస్తే చాలా కీలకమైన స్థాయిలో వుండే వ్యక్తులే అవతలివారికి ఉప్పందిస్తున్నారని అర్థమవుతుంది. 

అమెరికా గూఢచార సంస్థ సీఐఏ 2007లో అనుమానిత ఇరాన్‌ శాస్త్రవేత్తల జాబితా రూపొందించింది. వారంతా విద్యావేత్తలుగా చెప్పుకుంటున్నా అణు కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారని తేల్చింది. అందులో ఫక్రిజాదా కూడా వున్నారు. ఇరాన్‌ ప్రభుత్వం ఇప్పుడు ఇజ్రాయెల్‌నే వేలెత్తి చూపుతోంది. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తోంది.
ఇరాన్‌ అణు కార్యక్రమం గురించి అమెరికా, ఇతర అగ్రరాజ్యాలకూ వున్న ఆందోళన ఈనాటిది కాదు. అది అణ్వస్త్ర దేశంగా మారితే మొదట పశ్చిమాసియా, ఆతర్వాత ప్రపంచం పెను విధ్వంసం చవిచూడాల్సి వస్తుందని అవి భావిస్తున్నాయి. కనుకనే కఠినమైన ఆంక్షలు విధించి ఇరాన్‌ను దాదాపు ఏకాకిని చేశాయి. 

దశాబ్దాల తరబడి సాగిన ఆ ఆంక్షలు ఇరాన్‌ను అన్నివిధాలా కుంగదీశాయి. ప్రాణావసరమైన మందులు దొరక్క, నిత్యావసరాలు లభించక కటకటలాడారు. అయినా అణ్వాయుధ శక్తిగా ఎదిగేందుకు ఇరాన్‌ చేసే ప్రయత్నాలను ఆ ఆంక్షలు అడ్డ గించలేకపోయాయి. ఈ క్రమంలో అమెరికా, యూరప్‌ దేశాలు బాగా నష్టపోయాయి. బాలిస్టిక్‌ క్షిపణులకు అణ్వస్త్రాన్ని జతచేయగల సత్తా ఇరాన్‌కి వుందని తేలిపోయింది. కనుకనే బెట్టు తగ్గించి ఆ దేశంతో బేరసారాలకు దిగాయి. అణ్వస్త్రం ఆలోచన మానుకుంటే ఆంక్షలు ఎత్తేస్తామని చెప్పాయి. 

ఏడెనిమిది నెలలపాటు సుదీర్ఘ చర్చలు జరిపి ఒప్పించాయి. 2015లో ఒప్పందంపై సంత కాలయ్యాయి. దాని ప్రకారం కేవలం 3.67 శాతంమాత్రమే శుద్ధి చేసిన ఇంధనం వుంచుకోవచ్చని, అది కూడా 300 కిలోలు దాటరాదని పరిమితి పెట్టారు. ఇరాన్‌ వద్ద అప్పటివరకూ 90 శాతం శుద్ధి చేసిన యురేనియం ఇంధనం  10,000 కిలోలమేర వుండేది. అయినా ఇరాన్‌ అంగీకరించింది. ఐఏఈఏ క్షుణ్ణంగా తనిఖీ చేసి అంతా సవ్యంగా వుందని ధ్రువీకరించడంతో ఆంక్షల్లో చాలా భాగం రద్దుచేశారు. తీరా డోనాల్డ్‌ ట్రంప్‌ ఆ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నామని నిరుడు ప్రకటించారు. మళ్లీ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. యూరప్‌ దేశాలు మాత్రం అమెరికాతో విభేదించి ఆ ఒప్పందంలో కొనసాగాయి.

ఇజ్రాయెల్‌ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇరాన్‌తోసహా అందరి అనుమానం ఇప్పుడు ఆ దేశంపైనే. పర్యవసానాలేమైనా ఇరాన్‌ను తీవ్రంగా నష్టపరచాలన్నదే దాని సంకల్పం. ట్రంప్‌ సైతం ఇరాన్‌పై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దాడికి దిగాలని ఇటీవలకాలంలో ఆలోచించారని... విదే శాంగమంత్రి పాంపియో, మిలిటరీ చీఫ్‌ మార్క్‌ మిల్లీ తదితరులు హెచ్చరించడంతో ఆయన వెనక్కితగ్గారని చెబుతారు. ఇప్పుడు జరిగిన దాడికి ఆయన మద్దతుందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనవరిలో అధ్యక్ష పదవి స్వీకరించబోయే జో బైడెన్‌కు పశ్చిమాసియా సంక్షోభం పెద్ద పరీక్షగానే మారొచ్చు. 

ట్రంప్‌ హయాంలో అణు ఒప్పందం నుంచి తప్పుకున్నాక ఇరాన్‌ అణ్వస్త్ర కార్యక్రమంలో చాలా ముందుకుపోయింది. దానికి మళ్లీ నచ్చజెప్పి ఒప్పించడం, భవిష్యత్తులో ఈ పరిస్థితి ఏర్పడదని నమ్మించడం అంత సులభమేమీ కాదు. ఏదేమైనా అణ్వస్త్ర కార్యక్రమంలో పాలుపంచుకునే శాస్త్రవేత్తలను మట్టుబెడితే అంతా చక్కబడుతుందని భావించడం... కిరాయి మూకలతో, దొంగ దాడులతో వేరే దేశాన్ని అదుపు చేయగలమనుకోవడం తెలివితక్కువతనం. అలాంటివారివల్ల ప్రపంచ శాంతికి ముప్పు కలుగుతుంది. ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దడానికి, అది మరింత ఉగ్రరూపం ధరించకుండా వుండేందుకు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మతిమాలిన చర్యలకు కారకులైనవారిని అభిశంసించాలి.

మరిన్ని వార్తలు