జపాన్‌లో అస్థిరత

7 Sep, 2021 00:51 IST|Sakshi

వెనకవుండి సలహాలు, సూచనలు అందిస్తూ అధినేత విజయపథంలో పయనించడానికి తోడ్పడటం వేరు...తానే నాయకుడై పాలించడం వేరు. నిరుడు సెప్టెంబర్‌ 16న జపాన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన యొషిహిడే సుగా తొందరలోనే ఈ తత్వాన్ని బోధపరుచుకుని ఆ పదవికి గుడ్‌ బై చెప్పారు. పర్యవసానంగా పట్టుమని ఏడాది కాకముందే ఆయన వారసుడి ఎంపిక కోసం అధికార లిబరల్‌ డెమొక్రాటిక్‌ పార్టీ(ఎల్‌డీపీ) అన్వేషణ ప్రారంభించక తప్పలేదు. జపాన్‌కు రాజకీయ అస్థిరత కొత్తగాదు. 2006–12 మధ్య ఆ దేశం ఆరుగురు ప్రధానులను చూసింది. అందులో షింజో అబే కూడా ఒకరు. కానీ 2012లో రెండోసారి  అధికారంలోకొచ్చాక అబే తీరు మారింది.

అయిదేళ్లపాటు సుస్థిర పాలన అందించడమేకాక, 2017లో మరోసారి మంచి మెజారిటీతో అధికారంలోకొచ్చి మూడేళ్లు పాలించారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో నిరుడు తప్పుకున్నారు. ఆయన వారసు డిగా వచ్చిన సుగాపై అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే, తెరవెనకుండి షింజో అబేను విజయపథంలో నడిపించింది ఆయనే. అబే తీసుకున్న ప్రతి విధాన నిర్ణయం వెనకా ఆయ నదే కీలకపాత్ర. కేబినెట్‌ రూపురేఖలు నిర్ణయించటంలో, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటంలో, విదేశాంగ విధానం రూపకల్పనలో, పర్యాటక రంగాన్ని పరుగులెత్తించడంలో సుగా ప్రమేయ ముంది. అస్థిర ప్రభుత్వాలతో, ఆర్థిక ఒడిదుడుకులతో, వరస విపత్తులతో  కుంగిపోయిన జపాన్‌కు ఈ నిర్ణయాలు జవసత్వాలిచ్చాయి.

సమస్యలు ముంచుకొచ్చినప్పుడు ప్రజాదరణ దండిగా ఉన్న రాజకీయ నేత స్పందించే తీరుకూ, ఒక ఉన్నతాధికారి ఆలోచించే తీరుకూ వ్యత్యాసముంటుంది. అది తన సొంత ఆలోచనైనా, ఎవరి సలహాల పర్యవసానమైనా దాన్ని అందరితో ఒప్పించడంలో, ముందుకు నడిపించడంలో, ఆ నిర్ణయం సమర్థవంతంగా అమలు చేయడంలో, మెరుగైన ఫలితాలు రాబట్టడంలో రాజకీయ నాయ కుడి శైలి భిన్నంగా ఉంటుంది. ఉన్నతాధికారిగా అబే తరఫున అన్నీ చక్కబెట్టి, ఆయనకు పేరుప్రఖ్యా తులు రావడంలో ప్రధాన పాత్ర పోషించిన సుగా నేరుగా పాలనా పగ్గాలు చేపట్టాక వైఫల్యాలను మూటగట్టుకోవడంలోని సూక్ష్మం ఇదే. వాస్తవానికి రెండు శిబిరాలుగా చీలిన పాలక పార్టీలో సుగా అందరివాడుగా నిరూపించుకోగలిగారు.

పార్టీ ఎంపీలు 151 మందిలో అబే వర్గానికి చెందిన 96 మంది, ఆర్థికమంత్రి తారో అసో అనుకూలురైన 55 మంది ఆయనకు  అండదండలందించారు. ఈ రెండు వర్గాలకూ సుగా తన కేబినెట్‌లో సమాన ప్రాతినిధ్యమిచ్చి, అన్నిటా వారి సలహాలు తీసుకు న్నారు. ఎవరినీ నొప్పించకుండా పనిచేశారు. ప్రధాని పదవికి తామే అర్హులమని భావించే నేతలు ఎల్‌డీపీలో అరడజనుమంది వరకూ ఉన్నారు. కానీ కరోనా విలయంతోపాటు, ఒలింపిక్స్‌ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వక తప్పని పరిస్థితులు ముంచుకొస్తుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాజకీ యంగా దెబ్బతింటామేమోనన్న భయాందోళనలు వారందరిలోనూ ఉన్నాయి. అందుకే అబేను విజయపథంలో నిలిపిన సుగావైపే ఇరుపక్షాలూ అప్పట్లో మొగ్గుచూపాయి.

ప్రధానిగా వచ్చిన సుగా తనకంటూ సొంత ఎజెండా ఉన్నదని నిరూపించుకోలేకపోయారు. అంతక్రితం అబే అమలు చేసిన విధానాలు తనవే కావొచ్చుగానీ, వాటి లోటుపాట్లను సరిదిద్దకుండా కొనసాగిస్తుండటం, కరోనా కట్టడిలో వైఫల్యాలు ఎదుర్కొనడం, వ్యాక్సిన్‌లు అందరికీ అందించలేక పోవడం సుగా ప్రతిష్టను బాగా దెబ్బతీశాయి. లాక్‌డౌన్‌ల కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తినా, సాధారణ ప్రజానీకాన్ని ఆదుకొనడానికి పకడ్బందీ ప్రణాళికలు కొరవడ్డాయి. ఇప్పటికీ కొన్ని నగ రాలు కొవిడ్‌ ఎమర్జెన్సీలో కాలం గడుపుతున్నాయి. కరోనా రోగులను చేర్చుకునేది లేదంటూ ఆసు పత్రులు వెనక్కి పంపిన ఉదంతాలు జనంలో ఆగ్రహాన్ని రగిల్చాయి.

ఇలాంటి స్థితిలో ఒలింపిక్స్‌ నిర్వహించడమేమిటన్న ప్రశ్నలు అందరిలో తలెత్తాయి. ఏతావాతా అధికార పగ్గాలు చేపట్టేనాటికి 70 శాతం రేటింగ్‌ ఉన్న సుగా ప్రస్తుతం 26 శాతానికి దిగజారారు. ఒకప్పుడు తెరవెనక సలహాలిచ్చిన అనుభవమున్న నేత... ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందోనన్న సందేహంలో పడ్డారు. తీసుకున్న నిర్ణయంలోని మంచిచెడ్డలను ప్రజలకు సమర్థవంతంగా చెప్పి ఒప్పించే నేర్పు ఆయనకు లేదు. దాని కితోడు వచ్చే నెలతో ప్రస్తుత సభ కాలపరిమితి ముగుస్తోంది. నవంబర్‌లోగా ఎన్నికల నిర్వహణ తప్పనిసరి.అటు ఎన్నికల్లో పార్టీకి సారథ్యం వహించటం, ఇటు పాలనాపరంగా లోటుపాట్లు సరి దిద్దటం తనకు కత్తి మీద సాము అవుతుందని సుగా సరిగానే గ్రహించారు. 

దాదాపు 13 కోట్ల జనాభాగల జపాన్‌లో జనం నిరాశానిస్పృహలకు లోనయ్యారు. ఎల్‌డీపీ జాతీయవాద పార్టీయే అయినా వారిని సమ్మోహన పరిచి, ఒప్పించి మెప్పించగల మంత్రదండమేదీ దాని దగ్గర లేదు. విపక్షం బలహీనంగా ఉండటమే ప్రస్తుతానికి ఆ పార్టీకున్న ఏకైక బలం. ఈ నెలా ఖరులోగా కొత్త సారథిని ఎన్నుకోవటం, వారి సారథ్యంలో ఎన్నికలకు వెళ్లటం ఒకరకంగా ఎల్‌డీపీకి అగ్ని పరీక్ష.

చైనా, దక్షిణ కొరియాలతో సంబంధాలు, రక్షణ రంగాన్ని పటిష్టం చేయడం, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్ది, నిరుద్యోగిత తగ్గించటం వంటి అంశాల్లో ఏమేం చేయదల్చుకున్నదీ కొత్త ప్రధాని ప్రజలకు వివరించాల్సి వుంటుంది. పరిణత ప్రజాస్వామ్యం ఉన్న జపాన్‌లో జాగ్రత్తగా అడుగులేయకపోతే ఎంతటి నేత అయినా, పార్టీ అయినా పల్టీలు కొట్టడం ఖాయమని సుగా ఉదంతం నిరూపించింది. కొత్తగా వచ్చే నేత ఎలాంటివారైనా దీన్ని విస్మరించటం అంత తేలిక కాదు.


 

మరిన్ని వార్తలు