బైడెన్‌ తెలివైన నిర్ణయం

14 Aug, 2020 00:30 IST|Sakshi

అమెరికా అధ్యక్ష పీఠం రేసులో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ తొలి అడుగే తెలివిగా వేసి మంచి వ్యూహకర్తనని నిరూపించుకున్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత మూలాలున్న మహిళ,కాలిఫోర్నియా సెనెటర్‌ కమలా హారిస్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆమె తల్లి భారతీయురాలైతే, తండ్రి జమైకా దేశానికి చెందిన నల్లజాతీయుడు. కనుక కమల ఎంపిక ద్వారా అటు భారతీయుల ఓట్లకూ, ఇటు నల్లజాతీయుల ఓట్లకూ బైడెన్‌ గాలం వేశారనుకోవాలి. ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా ఉన్నత పదవులకు మహిళలను ఎంపిక చేయడంలో అమెరికా వెనకబాటుతనాన్ని ప్రదర్శిస్తూనే వుంది. ఉపాధ్యక్ష స్థానానికి గతంలో మహిళలు పోటీ పడిన సందర్భాలున్నా అధ్యక్ష స్థానానికి  గత ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్‌ పోటీచేసి ఓడిపోయారు. వలస వచ్చిన పౌరులకు అమెరికా సమాజం ఎన్ని అవకాశాలు కల్పిస్తుందో, ఎదగడానికి ఎంతగా తోడ్పడుతుందో చెప్పడానికి కమలా హారిస్‌ ప్రస్థానాన్నే ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ సందర్భంగా అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్‌ చెప్పిన మాటను గుర్తుకుతెచ్చుకోవాలి. ‘ఏ దేశస్తులన్నదాంతో నిమిత్తం లేకుండా ఈ గడ్డ ప్రతి ఒక్కరికీ  సురక్షితమైన ప్రాంతంగా... సన్మార్గులైన, వేధింపులకు గురవుతున్నవారందరికీ ఆశ్రయం కల్పించే తావుగా విలసిల్లాలని కోరుకుంటున్నాన’ని ఆయన ఆకాంక్షించారు. కమలాహారిస్‌ తల్లిదండ్రుల నేపథ్యం చూస్తే ఆయన ఆకాంక్ష నెరవేరిందనుకోవాలి. కమల తల్లి శ్యామలా గోపాలన్‌ తమిళనాడులో జన్మించి, ఉన్నత చదువుల కోసం, మెరుగైన అవకాశాల కోసం అమెరికా చేరితే తండ్రి డేవిడ్‌ ఎక్కడో ఆఫ్రికా ఖండంలోని దేశం నుంచి అలాంటి ఆశలతోనే ఆ దేశంలో అడుగుపెట్టాడు. అనంతరకాలంలో తల్లిదండ్రులు స్పర్థలతో విడిపోగా కమల తల్లి సంరక్షణలోనే పెరిగి అంచెలం చెలుగా ఉన్నతస్థాయికి ఎదిగారు.

డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని చేజిక్కించుకోవాలని ఆమె బైడెన్‌తో పోటీపడ్డారు. కానీ విజయం సాధించలేకపోయారు. పోటీపడే సందర్భంలో ఆమె బైడెన్‌పై తీవ్ర విమర్శలే చేశారు. ఆయనను జాతి విద్వేషి అన్నారు. అయితే ఆయన దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. దేశం నలు మూలలా అందరికీ తెలిసిన అభ్యర్థిని, తరచుగా వార్తల్లో ఉండే అభ్యర్థిని ఎంపిక చేసుకోవడమే ఉత్తమమని బైడెన్‌ భావించారు. 2008లో డెమొక్రాటిక్‌ పార్టీ తరఫున అధ్యక్షుడిగా బరాక్‌ ఒబామా పోటీచేసినప్పుడు ఆయనకు ప్రత్యర్థిగా రిపబ్లికన్‌ పార్టీ నుంచి జాన్‌ మెకెయిన్‌ బరిలో వున్నారు. అప్పట్లో మెకెయిన్‌ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా అలస్కా గవర్నర్‌ సారా పాలిన్‌ను ఎంపిక చేసుకున్నారు. అంతవరకూ పెద్దగా పరిచయంలేని పాలిన్‌ నేపథ్యంపై మీడియా నిశితంగా ఆరా తీయడం మొద లెట్టింది. ఆ క్రమంలో ఉన్నవీ లేనివీ ప్రచారంలోకొచ్చాయి. మీడియాతో వ్యవహరించడంలో పాలిన్‌ విఫలం కావడంతో మెకెయిన్‌కు ఆమె పెద్ద మైనస్‌ పాయింట్‌గా మిగిలిపోయారు. అందుకే అందరికీ తెలిసిన కమలా హారిస్‌ వుంటేనే  మేలని డెమొక్రాటిక్‌ పెద్దలు,  బైడెన్‌ అనుకుని వుండొచ్చు. క్రితం సారి ట్రంప్‌ విజయంలో భారతీయ ఓటర్ల పాత్ర చెప్పుకోదగ్గదని అంటారు. అలాగే కమలాహారిస్‌ పౌరహక్కుల రంగంలో ఎన్నదగిన కృషి చేసినందువల్ల, ఆమెకు నల్లజాతి మూలాలు కూడా ఉన్నందువల్ల అటు భారతీయ ఓటర్లకూ, ఇటు నల్లజాతీయులకూ దగ్గరకావొచ్చని బైడెన్‌ భావించి వుండొచ్చు. 

 కమలాహారిస్‌ తల్లిదండ్రులు అరవైయ్యేళ్లక్రితం ఉన్నత చదువుల కోసం అడుగుపెట్టేనాటికి అమెరికాలో జాతి విద్వేషాలు ఎక్కువే. సహజంగానే వారిద్దరూ అప్పట్లో జోరుగా సాగిన పౌరహక్కుల ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఇద్దరూ పరిశోధనలు సాగించి పీహెచ్‌డీ పట్టా తీసుకున్నారు. తల్లి లారెన్స్‌ బర్కెలీ నేషనల్‌ ల్యాబొరేటరీలో శాస్త్రవేత్తగా, తండ్రి ప్రతిష్టాత్మకమైన స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ఆచార్యుడిగా స్థిరపడ్డారు. అమెరికా సమాజంలో ఎన్నో వైరుధ్యాలున్నమాట నిజమే. ఇప్పటికీ నల్లజాతీయులను వర్ణ వివక్ష వెంటాడుతున్న మాట వాస్తవమే.  చాలాచోట్ల వారు ద్వితీయ శ్రేణి పౌరులుగా వుండాల్సివస్తున్న సంగతి కూడా కాదన లేనిది. అదే సమయంలో ఆ వివక్షను ప్రశ్నిస్తూ, దాన్ని అధిగమిస్తూ ఎదుగుతున్న నల్లజాతీయులు ఎందరో వున్నారు. పౌరుల్లో వుండే శక్తిసామర్థ్యాలను సంపూర్ణంగా వెలికితీసి, వారి అభ్యున్నతికి తోడ్పడటంతోపాటు తాను అన్నివిధాలా ఎదగటం ఎలాగో అమెరికా సమాజానికి తెలుసు. అలాంటి చోట ఉన్నతస్థాయిలో స్థిరపడిన తల్లిదండ్రుల ప్రభావం కమలాహారిస్‌పై పడింది. 2016లో డోనాల్డ్‌ ట్రంప్‌ దేశాధ్యక్షుడైనప్పటినుంచీ జాతి విద్వేషాలు తలెత్తుతున్నాయి.

వలసలను రెండు చేతులా ఆహ్వానించిన దేశంలోనే వలసదారులను తమ అవకాశాలను కొల్లగొట్టడానికొచ్చిన దోపిడీదార్లుగా చూసే ధోరణులు ట్రంప్‌ పుణ్యమా అని బాగా పెరిగాయి. అనేకానేక సాకులు చూపి వీసా నిబం ధనల్ని ఆయన కఠినతరం చేశారు. పైపెచ్చు కరోనా మహమ్మారి ముప్పు గురించి శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఎంతగా హెచ్చరించినా ఆయన పెడచెవిన పెట్టి దేశాన్ని ప్రమాదంలోకి నెట్టారు. ఆర్థిక సంక్షోభం కూడా తీవ్రంగానే వుంది. ఇలాంటి పరిస్థితుల్లో వివేకంతో, హేతుబద్ధంగా వ్యవహరించ గల నాయకత్వం దేశానికి అవసరమన్న అభిప్రాయం అందరిలో వుంది. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయం ఖాయమని సర్వేలంటున్నాయి. ఈ దశలో కమలాహారిస్‌ ఉపాధ్యక్ష అభ్యర్థి కావడం ఆమెకు వరమని చెప్పాలి. అదే జరిగి కమల ఉపాధ్యక్షురాలై నాయకత్వ పటిమ నిరూ పించుకుంటే భవిష్యత్తులో ఆమె అధ్యక్ష పీఠాన్ని కూడా అధిష్టించడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే భార తీయ మూలాలున్నంత మాత్రాన ఆమెవల్ల మన దేశానికి ప్రత్యేకంగా కలిగే మేలు ఉండదు. ఆ విషయంలో ఆమె నూరుశాతం అమెరికనే. కమల ఎంపిక అమెరికాలోని వలసదారులకు ఎంతో స్ఫూర్తిదాయకమవుతుంది

మరిన్ని వార్తలు