Translator: తోడుదొంగ?

28 Nov, 2022 00:46 IST|Sakshi

‘‘అనువాదకుడనేవాడు మూలరచయితకి తోడుదొంగ!’’ అన్నాడు హొర్హే గాంజాలిజ్‌ మోర్‌. అనువాదాలు చదువుకునేవాళ్ళలో చాలామందికి తెలిసిన విషయమే ఈ బహుముఖ ప్రజ్ఞావంతుడు చెప్తున్నాడు! అతను చెప్పని మాటొకటి వుంది– ఈ తోడుదొంగలు ఉమ్మడిగా దోచుకునేది పాఠకుల హృదయాలను!! అవును మరి, రచయితలన్నాకా అన్ని విషయాలూ విప్పిచెప్పేస్తారా? కాస్తా అర చాటుగానో, తెరచాటుగానో వాళ్ళు చెప్పే మాటల్లోని సారాంశాన్ని గ్రహించాల్సిన రసజ్ఞత వినే వాడిది. పోతే, రచయితలు – అనువాదకుల గురించి మోర్‌ చెప్పిన విషయం తెలుగుజాతికి బాగా తెలుసు. ఎందుకంటే, మన ‘‘ప్రామాణిక సాహిత్యం మొదలయిందే ఓ అనువాదంతో. వ్యాసుడనే కృష్ణ ద్వైపాయనుడు సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని ‘కవిత్రయం’ అనే నన్నయ, తిక్కన, ఎర్రన తెలిగించడంతోనే ప్రామాణిక సాహిత్య సృజన మొదలయిందని మన పెద్దలు చెప్పారుగా! కాకపోతే, భారతానువాదం పూర్తయ్యేసరికి పాఠకులకు దక్కేది మూలపాఠంలోని 21.5 శాతమేనని వాళ్లు చెప్పలేదు. తర్వాతి రోజుల్లో మరో పెద్దాయన ఆ లెక్కతీశాడు!

అయినా, అనువాదమంటే ఆషామాషీ వ్యవహారమా? శ్రీనాథుడు ఆరేడువందల సంవత్సరాల కిందట అదేమాట అన్నాడు కదా! శబ్దాన్ని అనుసరించి–భావాన్ని ఉపలక్షించి – అభిప్రాయాన్ని గ్రహించి – రసాన్ని పోషించి–అలంకారాన్ని భూషించి – ఔచిత్యాన్ని ఆదరించి – అనౌచిత్యాన్ని పరి హరించి మరీ తాను అనువాదం సాగించానన్నాడా పండిత కవి. మనలో మనమాట – విద్వదౌషధం అనిపించుకున్న నైషధాన్ని తెనిగిస్తూ, ‘‘గమికర్మీకృత నైకనీవృతుడనై’’ అంటూ పదబంధాలకు పద బంధాలను ఎత్తుకొచ్చి మెత్తేసిన శ్రీనాథుడు చెప్పినట్లే చేసివుంటే, ‘‘మీ ‘డుమువులు’ మీరు తీసేసు కుని, మా నైషధం మాకు ఇచ్చెయ్యం’’డని సంస్కృత విద్వాంసులు ఎందుకంటారు? అయితే, కవిగా ఏం చేసినా, పండితుడిగా శ్రీనాథుడికి అనువాదం కేవలం భాషాంతరీకరణం మాత్రమే కాదని బాగా తెలుసు! ‘‘అనువాదం మాటలకే పరిమితమయిన వ్యవహారం కాదు సుమా! ఒకానొక సంస్కృతిని సంపూర్ణంగా బోధపరచడమే అనువాదమవుతుం’’దని మనకాలపు బహుముఖ ప్రజ్ఞావంతుడు యాంటనీ బర్జెస్‌ అదే మాట మనకర్థమయ్యేలా – ఆంగ్లంలో– అన్నాడు!

‘అనువాదమనే ప్రక్రియే లేకపోతే, మనం సరిహద్దులకే పరిమితమైపోతాం! అంచేత అను వాదకుడే నా కీలక సహచరుడు. అతగాడే, నన్ను విశాల విశ్వానికి పరిచయం చేస్తా’’డన్నాడు ఇటాలో కాల్వినో – పశ్చిమాంధ్ర భాషలో. (అనగా, ‘‘ఇటాలియన్లో’’ అని వివరించాలంటారా?) ప్రపంచానికి ఈ కొసన ఉన్న దక్షిణాంధ్ర ప్రాంతంలో, ఏడెనిమిది వందల సంవత్సరాల కిందట పుట్టిన ధూర్జటి రాసిన ‘‘శ్రీకాళహస్తీశ్వర శతకం’’ ఆంగ్లంలోకి అనువాదమయి, అనేక విదేశ భాషలకు పరిచయం కావడం చూస్తే కాల్వినో మాటలు ఎంత వాస్తవాలో బోధపడుతుంది! ఎక్కడో ఐరోపా ఖండం ఉత్తరాంచలంలో పొడుగ్గా వ్యాపించి వుండే దేశం నార్వే. అక్కడ పుట్టిన హెన్రిక్‌ ఇబ్సెన్, పందొమ్మిదో శతాబ్దిలోనే ప్రపంచమంతటా ఆధునిక నాటక కళను వ్యాపింపచేశాడంటే, అది అనువాదకుల సహాయంతోనే సాధ్యమయింది. అలాగే, పందొమ్మిదో శతాబ్దిలోనే ప్రపంచాన్నం తటినీ ప్రభావితం చేసిన మార్క్స్‌–ఎంగెల్స్‌ లాంటి అసాధారణ మేధావులనే ప్రభావితులను చేసినవాడు ఫ్రెంచ్‌ నవలారచయిత, నాటకకర్త ఆనరే ద బాల్జాక్‌. బాల్జాక్‌ రచనలు కూడా అను వాదకుల పుణ్య మానే అన్ని దేశాల్లోనూ భావవిప్లవాన్ని రగిలించగలిగాయి. ‘‘మాటలు ప్రపంచ మంతా పర్యటిస్తాయి; వాటికి అనువాదకులే చోదకు’’లంది ఆనా రుస్కోనీ. అది అక్షర సత్యం!! ఆమె స్వయంగా ఓ అనువాదకురాలు కావడం వల్లనే అంత చక్కగా చెప్పగలిగిందనిపిస్తుంది.

ఇరవయ్యో శతాబ్దం ఉత్తరార్ధంలో చాలా దేశాల గురించిన సమాచారం దూరదేశాలకు సైతం వ్యాపించినందువల్ల ఉన్నదున్నట్లుగా అనువాదాలు చేసినా పాఠకుల ఆదరణకు పాత్రం కాగలుగు తున్నాయి. కానీ, అంతకుముందు – ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధానికి ముందు – చాలామంది అనువాదకులు అనువాదాలను అనుసృజనల రూపంలో చేయవలసివచ్చింది. కానీ, రచయితలు ఈ తరహా అనుసృజనలను మెచ్చలేదు. ‘‘మూలంలోని ఏ విషయమూ మార్చకుండానే, ఆ భాషలో చెప్పిందాన్ని అంతటినీ మరో భాషలోకి మార్చడమే అనువాద’’మని గ్యుంథర్‌ గ్రాస్‌ అన్నమాట రచయితలకు అనువాదకుల మీద ఉన్న ఫిర్యాదును ప్రతిధ్వనిస్తోంది. ఉదాహరణకు, ఆలివర్‌ గోల్డ్‌స్మిత్‌ నవల ‘‘ద వికార్‌ ఆఫ్‌ వేక్‌ఫీల్డ్‌’’ను, కందుకూరి వీరేశలింగం కొంతవరకూ అనువాదమే చేశారు. కానీ, తన ప్రయత్నం సఫలం కాదనిపించి, ‘రాజశేఖర చరిత్రము’ పేరిట అనుసృజనగా వెలువరించారు. అది పాఠకుల సౌకర్యార్థం చేస్తున్న పనేనని ఆయన త్రికరణశుద్ధిగా నమ్మారు. ఆయన అనుసృజన ‘ద ఫార్చ్యూన్‌ వీల్‌’ పేరిట యథామూలంగా ఆంగ్లంలోకి అనువాదం కావడం ఓ విశేషం! సృజనాత్మక సాహిత్యం విషయంలో అనుసృజనలను –ఒక మేరకు– కవిత్వంలో ఏమైనా సహిస్తున్నారేమో కానీ, ఇతరత్రా ఈ ఆచారం అంతరించిందనే చెప్పాలి.

చివరిగా ఒక్కమాట– ‘విద్వత్వంచ నృపత్వంచ న ఏవతుల్యే కదాచన– స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్‌ సర్వత్ర పూజ్యతే!’ అని చిన్నప్పుడు మనమందరం చదువుకున్న ఓ సుభాషితం చెబుతోంది. ఈ ఏడాది శతజయంతి జరుపుకొంటున్న రాచమల్లు రామచంద్రారెడ్డి అలా అన్నిచోట్లా ఆరతు లందుకున్న విద్వాంసుడు. ఆయనకి మనమూ అర్పిద్దాం నీరాజనం! 

మరిన్ని వార్తలు